13వ. సర్గ
1. "దశకంఠునింట - సీత యుండునని
పక్షిరాజు సం | పాతి మాటవిని |
లంకాపురమున - ప్రతి అంగుళమును
పరిపరి విధముల - పరికించితిని |
లంకేశ్వరుని - భవనములన్ని
తిరిగి తిరిగి పలు | మారు వెదకితిని |"
అని చింతించుచు - రాముని దలచుచు
మారుతి సాగెను - సీతను వెదకుచు .... ||శ్రీ||
2. "రాక్షస మాయకు - సీత లొంగెనో
రావణాసురుని - వశమై యుండునో |
సవతి యగునని - రావణు సతులు
సీతను ద్వేషించి - చంపి యుందురో |
"హా రామా | హా - లక్షణా" యని
కృంగి కృశించి వై | దేహి వోరిగెనో |"
అని చింతించుచు - రాముని దలచుచు
మారుతి సాగెను - సీతను వెదకుచు .... ||శ్రీ||
3. "పంజరమందున - శారిక రీతిని
లంకాపురమున - సీత యుండెనో |
అంధకార బం | ధురమౌ శాలల
సీత నిరాశతో - చెరలందుండేనో |
రామ వియోగపు - దుఃఖ భారమున
తనకు తానుగా - మరణమొందెనో |"
అని చింతించుచు - పుష్పకము వీడి
మారుతి చేరె ప్రా | కారము పైకి ..... ||శ్రీ||
4. "సీత జాడ కన | లేదను వార్తను
తెలిపిన క్రూరం | లేకున్న ద్రోహం |
హృదయతాపకర - ఘోర భయంకర
దుర్వార్త విని - రాముడుండునా ?
అన్నయే తన - సర్వమనుకొనే
లక్ష్మణుడా పై - బ్రతికి యుండునా ?"
అని మారుతి వి | రుద్ధ భావనల
కలతగ నిలచె | కన్నీటి ధారల ....
5. "రామ లక్ష్మణులు | గతించిరనిన
భరత శతృఘ్నులు - బ్రతుక జాలరు |
కౌసల్యా సు | మిత్రా కైకలు
పుత్ర శోకమున - మరణించెదరు |
ఇంతటి ఘోరము - గాంచినంతనే
సుగ్రీవాదులు - మడియక మానరు |"
అని మారుతి వి | రుద్ధ భావనల
కలతగ నిలచె | కన్నీటి ధారల .... ||శ్రీ||
6. "అటుపై రుమ సు | గ్రీవు భార్యయు
భర్త వియోగము | న అసువులుబాయు |
వాలి భార్య తార - ఒరిమి జార
బ్రతుకలేక పర | లోకము జేరు |
అంగదుడాదిగ - వానరులందరు
శోకాబ్ది మునిగి - మృతి జెందెదరు |"
అని మారుతి వి | రుద్ధ భావనల
కలతగ నిలచె | కన్నీటి ధారల .... ||శ్రీ||
7. "ఇంత వినాశము - నావల్లనేను
నే కిష్కింధకు - పోనే పోను
వాన ప్రస్తా | శ్రమవాసుడనై
నియమ విష్టలతో - బ్రతుకువాడనై
సీతామాతను - చూచి తీరేదను
లేకున్న నేను - అగ్ని దూకేదను |"
అని హనుమంతుడు - కృత నిశ్చయుడై
నలుదెసలగనె - సాహసవంతుడై ..... ||శ్రీ||
8. చూడమరచిన అ | శోక వనమును
చూపుమేరలో - మారుతి గాంచెను |
సీతారామ - లక్ష్మణాదులకు
ఏకాదశ రు | ద్రాది దేవులకు
ఇంద్రాది యమ - వాయు దేవులకు
సూర్యచంద్ర మ | రుద్గణములకు |
వాయునందనుడు - వందనములిడి
అశోకవని - చేరెను వడి వడి ..... ||శ్రీ||
9. ఎల్లవేళల అ | శోక వనమున
చల్లని గాలి - వీచెడు మెల్లన |
ఎటు చూచిన - రాక్షసవీరులు
కావలి యుందురు - రేయింబవలు |
రామకార్యమును - నెరవేర్చుటకై
రావణాదులు - చూడకుండుటకై |
వామన రూపము - మారుతి దాలిచి
వనమున సాగె - పెద్దల తలచి .... ||శ్రీ||
__: 13 వ. స. సంపూర్ణము :__