14 వ. సర్గ
అశోక వన వర్ణన
1. చంపక వకుళ సు | వర్ణ చందన
శింశుప అశోక - దేవ కాంచన |
నారికేళ, చూత నాగకేసర
సాల, రసాల, ఖ | ర్జూర, కర వీర |
వివిధ పుష్ప ఫల - జాతులతో
విరిసిన వసంత - శోభలతో |
సుందరమైన అ | శోక వనమున
మారుతి వెదకెను | సీతను కనుగొన ..... ||శ్రీ||
2. విరి తేనియలు - గ్రోలు భృంగములు
విందారగ జేయు - ఝుంకారములు |
లే జిపురాకుల - మెసవు కోయిలలు
పంచమ స్వరముల - పలికే పాటలు |
పురులు విప్పి నా | ట్యమాడు నెమళులు
కిలకిలలాడే - పక్షుల గుంపులు |
సుందరమైన అ | శోక వనమున
మారుతి వెదకెను | సీతను కనుగొన .... ||శ్రీ||
3. కపికిశోరుడు - కొమ్మ కొమ్మను
ఊపుచు ఊగుచు - దూక సాగెను |
పూవులు రాలెను - తీవెలు తెగెను
ఆకులు కొమ్మలు - నేలపై బడెను |
పూలు పై రాల - పవన కుమారుడు
పుష్ప రధమువలె - వనమున దోచెడు |
సుందరమైన అ | శోక వనమున
మారుతి వెదకెను | సీతను కనుగొన .... ||శ్రీ||
4. ముక్తామణిమయ - సోపానములు
కలువలు నిండిన - నడబావులు
భరత శారిక - హంస మయూర
పారావతాది - పక్షుల కూతలు |
కుసుమలతావృత - కుంజవాటికలు
స్వాదు జలములు ఉ | ద్యాన వనములు |
సుందరమైన అ | శోక వనమున
మారుతి వెదకెను | సీతను కనుగొన .... ||శ్రీ||
5. నానా పుష్ప సు | గంధములు విరియ
కుంజ కుటీర - క్రీడలు వెలయ |
కాంచన శిఖర - కాంతులు మెరయ
పులకిత, పయో | ధరమై వెలయ |
వినోదార్ధము - వన మధ్యమున
క్రీదాచలము - నిర్మితమైన |
సుందరమైన అ | శోక వనమున
మారుతి వెదకెను | సీతను కనుగొన .... ||శ్రీ||
6. మగనిపై అలిగి - తరలెడు స్త్రీ వలె
నగము వీడి వడి - సెలయేరు వెడలె |
హితము గొలుపు ప్రియ | బాంధవులవలె
ఎటినీట తరు - శాఖలు వ్రాలె |
తెలివిగ పతిజేర - మరలెడు సతివలె
శిలలను డాకిన - వాహిని మరలె |
సుందరమైన అ | శోక వనమున
మారుతి వెదకెను | సీతను కనుగొన .... ||శ్రీ||
7. చివురులు మెరాసే - రెమ్మలతో
పూవులు విరిసే - కొమ్మలతో |
అమరిన బంగరు - చిరుగంటలతో
కదలిన శాఖల - గణ గణ ధ్వనులతో |
ఫల పుష్పముల - పరిమళాలతో
అందమయిన అ | లంకరణలతో |
| శోభిల్లు శింశుపా - తరుశాఖల పై
మారుతి కూర్చొని | కలయ జూచెను ..... ||శ్రీ||
8. పూవులనిస పూ | తీవియ లనిన
జానకి కెంతో - మనసౌసని |
పద్మ పత్రముల - పద్మాక్షుని గన
పద్మాకరముల - పొంతజేరునని
అన్ని రీతుల - అనువైనదని
అశోకవని - సీత యుండునని |
| శోభిల్లు శింశుపా - తరుశాఖలపై
మారుతి కూర్చొని | కలయ జూచెను.... ||శ్రీ||
9. మృగములు పక్షులు - వనచరములనిన
జానకి కెంతో - ప్రాణప్రదమని |
సంధ్యా సమయ - ప్రార్ధన కేని
నదీతీరము - డాయునని |
మంగళకరమౌ - అశోకవని
మంగళకారిణి - సీతయుండునని |
| శోభిల్లు శింశుపా - తరుశాఖలపై
మారుతి కూర్చొని | కలయ జూచెను.... ||శ్రీ||
__: 14 వ. స. సంపూర్ణము :__