9. మదవతి యొకతె మృ | దంగము పై గొని
మధుర స్వప్నమున - మాణిత మాడును |
సుందరాంగి యొక - పణవము జేకొని
శయనించుచు తన - ప్రియుని అంకమని |
స్వహస్తముల - స్తనములబూని
కిల కిల లాడును - కోమలి కలగని |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||
10. అందొక వంక ప | ర్యంకము జేరి
నిదురించుచుండె - దివ్యమనోహరి |
నవరత్న ఖచిత - భూషణ ధారిణి
నలువంకలను కాంతి ప్రసారిణి |
స్వర్ణ దేహిని - చారురూపిణి
రాణులకు రాణి - పట్టపు రాణి
లంకేశ్వరుని - హృదయేశ్వరి
మండోదరి లో | కోత్తర సుందరి .... ||శ్రీ||
11. మండోదరిని - జానకి యనుకొని
ఆడుచు పాడుచు - గంతులు పెట్టి
వాలము బట్టి - ముద్దులు పెట్టి
నేలను గొట్టి - భుజములు తట్టి |
స్తంభము లెగసి - క్రిందకు దుమికి
పల్లటీలు గొట్టి - చెంగున జుట్టి |
చంచలమౌ క | పి స్వభావమును
పవన తనయుడు ప్ర | దర్శన జేసెను ..... ||శ్రీ||
__: 10 వ. స. సంపూర్ణము :_
11 వ. సర్గ
1. "రాముని సీత | ఇటులుండునా?
రావణు జేరి | శయనించునా ?
రాముని బాసి | నిదిరించునా ?
| భుజియించునా భూ | షణములు దాల్చునా ?
పరమపురుషుని - రాముని మరచునా ?
పరపురుషునితో - కాపురముండునా ?
సీతకాదు కా | దు కానే కాద" ని
మారుతి వగచుచు - వెదక సాగెను .... ||శ్రీ||
2. "పోవగరాని - తావుల బోతి
చూడగరానివి - ఎన్నో జూచితి |
నగ్నముగా ప | రున్న పరకాంతల
పరిశీలనగా - పరికించితిని |
రతికేళి సలిపి - సోలిన రమణుల
ఎందెందరినో - పొడగాంచితిని |
ధర్మము గానని - పాపినైతి" నని |
పరితాపముతో - మారుతి కృంగెను .... ||శ్రీ||
3. "సుదతుల తోడ - సీత యుండగ
వారల జూడక - వెదకుటేలాగ ?
మనసున ఏమి వి | కారము నొందక
నిష్కామముగ వి | వేకము వీడక |
సీతను వెదకుచు - చూచితి గాని
మనసున ఏమి - పాప మెరుగ" నని |
స్వామి సేవ పర | మార్ధముగా గొని
మారుతి సాగెను - సీతకోసమని .... ||శ్రీ||
__: 11 వ. స. సంపూర్ణము :__
12 వ. సర్గ
1. భూమీ గృహములు - నిశాగృహములు
క్రీడా గృహములు - లతాగృహములు |
ఆరామములు - చిత్రశాలలు
బావులు తిన్నెలు - రచ్చ వీధులు |
మేడలు మిద్దెలు - ఇళ్ళు కోనేళ్ళు
సందులు గొందులు - బాటలు తోటలు |
ఆగి ఆగి ఆడు | గడుగున వెదకుచు
సీతను గానక - మారుతి వగచె .... ||శ్రీ||
2. "సీతామాత - బ్రతికి యుండునో
క్రూర రాక్షసుల - పాల్పడి యుండునో |
తాను పొందని - సీత యెందుకని
రావణుడే హత | మార్చి యుండునో |"
అని యోచించుచు - అంతట వెదకుచు
తిరిగిన తావుల - తిరిగి తిరుగుచు |
ఆగి ఆగి అడు | గడుగున వెదకుచు
సీతను గానక - మారుతి వగచె .... ||శ్రీ||
__: 12 వ. స. సంపూర్ణము :__