Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 11

                                 


                                 

    పట్టు విడువని నిర్మాత మళ్ళీ సెన్సార్ ఆఫీస్ చేరుకొని తన ఫిలిం బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు.
     అప్పుడు ఆ బాక్స్ లోని సెన్సార్ ఇలా అంది.
    "నిర్మాతా! మధ్యలో కాఫీ బ్రేక్ కూడా లేకుండా పాపం ఇంతదూరం ఈ బాక్స్ తో నువ్వు పడుతోన్న బాధ చూస్తోంటే నాకు చేదు డికాషన్ తాగినట్లుంది. కాఫీ అంటే "కాఫీ" అన్న మాట గుర్తుకొస్తోంది. టైం పాస్ కోసం నీకు "కాఫీ ' కధ చెప్తాను విను.
    "అనగనగా మద్రాసులో "మావయ్య" అనే డైరక్టరుండేవాడు. అతగాడికి కాఫీ అంటే చాలా ఇష్టం. అలాగీ కాపీ కొట్టడమన్నా కూడా ఇంకెంతో ఇష్టం. అయిదేళ్ళ వయసు నుంచీ కూడా కాపీలను నమ్ముకునే పరీక్షలు పాసవుతూ వచ్చాడు. ఆ తరువాత ఓరోజు వాళ్ళ మామయ్య ఇంటి లైబ్రరీలో ఏవో పుస్తకాలు చదువుతుంటే హటాత్తుగా అతనికి జ్ఞానోదయమయింది. కాపీ కొట్టడమనేది పరీక్షలకే పరిమితం కాదనీ, కాపీ కొట్టాల్సిన రంగాలు ఇంకా చాలా ఉన్నాయనీ తెలిసొచ్చింది. ఆరోజు నుంచీ అతని జీవితమే ఓ కాపీ జీవితంగా మారిపోయింది. "కాపీ" ల మీద బతికేవాళ్లకు సినిమా ఫీల్డ్ గోల్డ్ ఫీల్డ్ లాంటిదని ఎవరో చెప్పిన కాపీ డైలాగ్ విని వెంటనే మద్రాస్ చేరుకొని అక్కడ ఆర్నెల్లు ఓ మహా డైరెక్టర్ దగ్గర పనిచేశాడు. "ఆర్నెల్ల సహవాసంలో వారు వీరవుతారు" అన్న సూత్రం కూడా ఏనాడో కాపీ కొట్టడం వల్ల ఆ మహా డైరక్టర్ ని పూర్తిగా కాపీ కొట్టి తనూ మహా డైరక్టర్ అయిపోయాడు. తను దర్శకత్వం చేసే సినిమాలకు ఎవరిదో ఒకరిది ఒక మంచి నవలను కాపీకొట్టి తనే కధ తయారుచేయడం ప్రారంభించాడు. ఇలా చాలా కాలం సుఖంగానే జరిగింది కానీ "కాఫీ - డికాషన్" అనే సినిమా విషయంలో మాత్రం టైటిల్స్ ఎదుర్తిరిగినాయ్. ఆ సినిమా మొదటి రోజున కధ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం - మావయ్య అన్న అక్షరాలూ తెర మీదకు రావడానికి సిగ్గుపడి పారిపోయినాయ్.కారణం ఏమిటా అని హాలంతా టార్చిలైట్ వేసి వెతికితే ఓ సీట్లో అతను ఈ సినిమా కోసం కాపీ కొట్టిన నవల తాలూకు రచయిత్రి పీపాదేవి కూర్చుని కనిపించింది. పీపాదేవికి ఆ సినీమా చూస్తుంటే మతిపోయినట్లయింది. అంతా తన నవలే అది. తనకు తెలీకుండా కాపీ కొట్టేశాడు డైరెక్టరు. సినిమా పూర్తయ్యేసరికి ఆవిడకు స్పృహ తప్పింది. మేనేజరు ఖంగారుగా వచ్చి ఆమె మొఖం మీద నీళ్ళు చల్లాడు. వెంటనే లేచి "నేనెక్కడున్నాను" అనడిగింది ఆవిడ తన నవలలోని డైలాగు గుర్తు తెచ్చుకుని." "సినిమాహాల్లో" అన్నాడు మేనేజరు. "ఆ! ఇంకా ఇక్కడే ఉన్నానా!" అయ్యో! ఈపాటికి కోర్టులో ఉంటాననుకున్నాను. త్వరగా టాక్సీ పిలవండి. ఈ "కాఫీ - డికాషన్- అనే సినిమా  నా నవల "టీ- డికాషన్ " కు కాపీ. ఈ సినిమా తీసిన వాళ్ళనీ, రాసినవాళ్ళనీ, చూసినవాళ్ళనీ, హల్లో వేసిన వాళ్ళనీ అందరినీ జుట్టు పట్టుకుని కోర్టు కీడ్చేస్తాను" అంటూ అరచి టాక్సీ ఎక్కిందామె. తరువాత టాక్సీ దిగి కోర్టుకెక్కింది.
    మావయ్యా, ఆ సినిమా ప్రోడ్యూసరూ కామయ్యా ఇద్దరూ బోనులో నిలబడ్డారు. మావయ్యా ససేమిరా అది ఆమె కధ కాదని మొండి కేశాడు. తను చిన్నప్పుడు బందర్లో గునపంగారి హోటల్లో కాఫీ డికాషన్ తాగుతుంటే మెరుపులా ఆ కధ తట్టిందనీ, కనుక దాని కాపీ రైట్స్ తనదేననీ వాదించాడు.
    "అంతా వట్టిది. నా పెళ్ళయిన కొత్తలో నాకు పుట్టబోయే పాప కోసం ఈ సెట్టర్ అల్లుతుంటే దాంతో పాటు ఈ కధ కూడా ఆల్లాను. కావాలంటే ఆ స్వెట్టర్ మీద "టీ - డికాషన్" అన్న అక్షరాలు కూడా అల్లాను చూడండి." అంది పీపాదేవి. వీళ్ళీద్దరూ ఇలా వాదించుకుంటుంటే ఓ బక్క చిక్కిన రచయిత ఓ లావుపాటి నవల పట్టుకుని కోర్టు కొచ్చాడు.
    "అయ్యా! అసలు ఈ కధ వారిద్దరి సొంతమూ కాదు. నాది. "సగం  టీ- సగం కాఫీ " అన్న నా నవలను వీరిద్దరూ కూడా కాపీ కొట్టారు. ఇదిగో నా నవల పబ్లిష్ అయిన తేదీ చూడండి. పీపాదేవి నవల కంటే ఆరునెలల ముందు పబ్లిష్ అయింది" అన్నాడు జడ్జితో వినయంగా.
    "అన్యాయం , అక్రమం" అంటూ అరచింది పీపాదేవి.
    జడ్జీగారికి ఆమె ఎందుకలా అరచిందో అర్ధం కాలేదు.
    "ఎదన్యాయం? ఏది అక్రమం?" అనడిగారు అయోమయంగా.
    వెంటనే మావయ్య తన కాపీలు కొట్టే పుస్తకంలో తన నెక్ట్స్ పిక్చర్ పేరు కోసం "ఎదన్యాయం? ఎదక్రమం?' అని కాపీ చేసుకున్నాడు ఆనందంగా.
    "అదేనండీ! నేనసలు ఈయన నవలను కాపీ కొట్టనే లేదు" అంది పీపాదేవి.

 Previous Page Next Page