"మరి , ఎవరి నవల కొట్టారు?" అడిగారు జడ్జి.
"ఎవ్వరిదీ కొట్టలేదు. నేనసలు ఎప్పుడూ నవలలు కాపీ కొట్టను!"
"మరి! కాపీ కొట్టకుండా సినిమా పద్దతి నవల ఎలా రాయగలరు?" ఆశ్చర్యంగా అడిగాడు జడ్జి.
"ఇతర భాషల సినిమాలనే సాధారణంగా నవలలకు వాడుతుంటాను" అందామె.
"మరి ఈ నవలకు ఏ భాషా చిత్రం వాడారు?"
"ఒరుకప్పు కాఫీ" అనే తమిళ చిత్రం అందామె.
"ఆ! దొరికారు! అయితే ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత మీదా, రచయిత మీదా కూడా కేసు పెడుతున్నాను" అన్నాడు రచయిత.
మర్నాడు బోనులో "ఒరు కప్పు కాఫీ" నిర్మాత ఉన్నిసామి మొదలియార్ నిలబడ్డాడు.
"బాబోయ్! నన్నుదా రక్షించండిమీ! నేను నిండా కొత్తవాడిని ఫీల్డుకి. అందుకని ఏ నవలనూ కాపీ కొట్టలేదు. నేను "దోఠో కాఫీ" అనే బెంగాలీ సినిమాదా సూస్తిని. నిండా సౌఖ్యంగా ఉండునని అదిదా కాపీ కొట్టితిని" అన్నాడు జడ్జిని చూసి కన్నీళ్లు తుడిచేసుకుంటూ.
ఈలోగా ఈవార్త పేపర్లో చూసిన బెంగాలీ బాబులిద్దరూ కార్లో వచ్చి అదే కోర్టులో అక్కడ కనబడ్డ వారందరి మీద తమ సినిమా వాడుకున్నందుకు గాను కేసులు పెట్టేశారు. వీళ్ళు కేసులు పెడుతూండగానే కోర్టు మీద హెలికాప్టర్ ఆగడం, అందులో నుంచి ప్రముఖ హిందీ చిత్ర రచయితలు 'అలీమ్ - మజీద్' కిందకు దూకారు.
"అసలు వీటన్నిటికీ మూలం మేము జంటగా రాసిన "జబ్ ప్యార్ కాఫీ సే హోతాహై" అన్న హిందీ నవల. కనుక వీరందరూ కలిసి మాకు పరిహారం చెల్లించాల్సిందే" అంటూ పట్టుబట్టారు. అంతేకాక తాము ఎక్కి వచ్చిన హెలికాప్టర్ చార్జీలు వారే చెల్లించాలని కూడా పేచీ పెట్టసాగారు.
ఈలోగా ఓ ఎయిర్ కండిషన్డ్ కార్లో పంజాబీ పెద్ద మనిషోకతను దిగి సరాసరి కోర్టులో కొచ్చి "జబ్ ప్యార్ కాఫీ సే హోతాహై" అన్న హిందీ చిత్రం సర్వ హక్కులూ తనుకొన్నాడనీ, దాన్ని పదకొండు ప్రాంతీయ భాషల్లో చిత్రంగా నిర్మిస్తున్నాడనీ , కనుక అ పరిహారమేదో తనకే చెందాలని వాదించడం ప్రారంభించాడు.
ఈలోగా ఊరు పేరే లేని ఓ ఆకతాయి తను కొద్ది సంవత్సరాల కిందట రాసిన "తాగవోయి భారతీయుడా ! "టీ" తాగవోయి వీరయోధుడా" అనే గేయం ఈ కధలూ, నవలలూ , సినిమాలకు ఆధారం. కాబట్టి ఎవరు గెలిచినా తనకూ అందులో వాటా ఉండాలని మొండి కేశాడు.
మరోపక్క అదే సినిమా కధను ఓ గుజరాతీ సినిమా ప్రొడ్యుసర్ తను కొనుక్కున్నాడనీ కనుక ఆ కేసులో గెలిచిన పరిహారం తనకే చెల్లించాలని బొంబాయి నుంచే నోటీసులు పంపించాడు.
జడ్జికి ఏం చేయాలో తెలీక రెండు చేతుల్తో తల పట్టుకుని కూర్చున్నాడు. వారం రోజులు నిద్రాహారాలు లేకుండా ఆలోచించాక ఓ రోజు హటాత్తుగా అతనికి తను ఇంగ్లండు లో "లా" చదవడానికి గడిపిన రోజులు గుర్తు కొచ్చాయ్. దాంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికి పోయిందతనికి. అందరినీ ఓ గదిలో సమావేశపరచి తను ఆ కేసు ఎలా ముగించదల్చుకుందీ చెప్పేసరికి అందరూ కిక్కురుమనకుండా కోర్టు నుంచి తమతమ కేసులు ఉపసంహరించుకుని ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు...."
ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది.
"నిర్మాతా! జడ్జీగారికి తట్టిన ఉపాయం ఏమిటి? వాళ్ళందరితో ఏమని చెప్పాడు? తను ఇంగ్లాండు లో గడిపిన రోజులకూ, ఆ ఉపాయానికీ ఏమిటి సంబంధం? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పక పోయావో నీ సినిమా కూడా ఇన్ని సమస్యల్లో ఇరుక్కు పోతుంది జాగ్రత్త."
నిర్మాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు -
"నీయవ్వ! దీనికంత ఇదేముందీ? మన దేశంలో నిర్మించబడే చిత్రాల్లో నూటికి తొంభయ్ తొమ్మిది ఇంగ్లీష్ సినిమాలకు గానీ, నవలలకు గానీ కాపీలే! ఈ విషయం అందరికీ తెలుసు కదా! జడ్జిగారికి తను ఇంగ్లండులో చదువుకొనేప్పుడు చూసిన "కాఫీ విత్ లవ్" అనే ఇంగ్లీష్ చిత్రం గుర్తు కొచ్చింది. ఈ కేస్ లోని సినిమా కధ చూస్తుంటే దానికీ, వీటికీ పెద్ద తేడా ఏమీ లేదనిపించిందాయనకు. అందుకే వాళ్ళందరినీ సమావేశపరచి వాళ్ళందరి కధలకూ, నవలలకూ, గేయాలకూ, సినిమాలకు మూలధారమయినా ఇంగ్లీష్ సినిమా తనకు తెలుసనీ, వాళ్ళు గనుక వెంటనే కేసులు ఉపసంహరించుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళకపొతే తను ఆ ఇంగ్లీష్ చిత్రం నిర్మాతను పిలిపించి వీళ్ళందరి మీదా కేసులు పెట్టించి పరిహారం అతనికే ఇచ్చేలా చేస్తాననీ చెప్పి ఉంటాడు. అందుకే వాళ్ళు తుపాకీ బులెట్స్ లాగా పారిపోయారు...."
ఈ విధంగా నిర్మాతకు మౌనభంగం కాగానే సెన్సార్ కాఫీ కప్పుతోనూ బాక్స్ తో సహా మళ్ళీ సెన్సార్ ఆఫీస్ వైపు ఎగిరిపోయింది.
***