Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 11


                                    సుమనోంజలి

    ఆయన హృదయంలో ప్రేమ పెల్లుబుకుతుంది. కరుణ వెల్లి విరుస్తుంది. ఆయన పలకరింపులో ప్రగతి తొలకరిస్తుంది జగతి పులకరిస్తుంది.
    ఆయన వాణి చల్లని పాలవెల్లి; ఆయన పాణి పల్లవించిన కల్పవల్లి.
    ఆయన సందేశం సత్యసనాతనం. నిత్యనూతనం. శాంతినికేతనం. జాతికి జ్యోతిర్మయ చైతన్యకేతనం.
    ప్రజలు ఆయన్ని "విశ్వంజీ"గా, "విశ్వయోగి"గా, స్థితప్రజ్ఞునిగా, సిద్ధపురుషునిగా గురుదేవునిగా భావిస్తారు. ఆశ్రయిస్తారు. ఆనందిస్తారు. విశ్వంజీ - స్మితభాషి, మితభాషి, హితభాషి, సత్యాన్వేషి, విశ్వశ్రేయోభిలాషి అయిన మహామనిషి.
    శాంతి, సహనం, సమానత్వం, సహజీవనం, విశ్వంజీ జీవితలక్ష్యాలు. సత్యం, శీలం, సమైక్యత, సమాజసేవ, ఆయన సందేశాలు. ఆయన దృష్టిలో "దేహమే దేవాలయం" "హృదయమే దైవపీఠం". "మానవసేవే మాధవసేవ".
    విశ్వంజీ సన్నిధి ఆబాలగోపాలానికీ "పెన్నిధి". "విశ్వమందిరం"లో కుల మత వర్గ వివక్షకు చోటు లేదు ఆప్యాయతకు లోటు లేదు. ఆయన ఆశ్రితులకు అభయమిస్తాడు. ఆర్తుల కన్నీళ్లు తుడుస్తాడు. విశ్వంజీ సర్వాంగసుందరంగా నిర్వహిస్తున్న శాంతియజ్ఞాలూ, దత్తజయంతి హనుమజ్జయంతి ఇత్యాది సాంస్కృతిక కార్యక్రమాలూ అశేషప్రజానీకాన్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఆకర్షిస్తున్నాయి. అభ్యుదయాన్ని అందిస్తున్నాయి.
    శ్రీ విశ్వయోగి సాధుసత్తములనూ, సద్గురూత్తములనూ, మహాకవులనూ, మధుర గాయకులనూ, నాట్యకళావిదులనూ, ప్రజాప్రతినిధులనూ, ఎందరినో ఎందరెందరినో - విశ్వమందిరానికి ఆహ్వానిస్తారు. గౌరవిస్తారు. సర్వతోముఖమైన సమాజాభ్యుదయానికి మేధావులను ప్రోత్సహిస్తారు.
    సిద్ధపురుషులైన శ్రీవిశ్వంజీ గుంటూరు పట్టణంలో విశ్వమందిరాన్ని నెలకొల్పి ఐదారు సంవత్సరాలనుంచీ ప్రజలలో ధర్మానురక్తినీ, దైవభక్తినీ, ఆధ్యాత్మిక శక్తినీ, సేవాసక్తినీ పెంపొందిస్తున్నారు. కొలదికాలంలోనే విశ్వంజీ ఊహలోని "విశ్వమానవసమైక్యతాస్తూపం" రూపుదిద్దుకోబోతున్నది.విశ్వంజీ విశ్వమందిరంలో వందలకొలదీ శ్రోతలకు అందించే దివ్య సందేశాలకు కరుణశ్రీ సంతరించిన కవితా స్వరూపమే ఈ "విశ్వసందేశలహరి".

        విశ్వక్షేమంకరియైన ఈ "విశ్వసందేశలహరి"ని
        విశ్వయోగి విశ్వంజీకి అంకితం ఇస్తున్నాను.

                                           కరుణశ్రీ

                                                       విశ్వసందేశ లహరి

    విశ్వయోగి దీక్ష విశ్వమానవ రక్ష
    విశ్వయోగి దృష్టి విజయ వృష్టి
    విశ్వయోగి బోధ విజ్ఞానమయ గాథ
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    నిండు చందమామ వెండివెన్నెల తేట
    పొంగి పులకరించు పూలతోట
    ముద్దులొలుకు మంచి ముత్తియమ్ముల మూట
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    అమృతధార లొలుకు అనురాగములు చిల్కు
    దిగులు తీర్చు దివ్యదీప్తి గూర్చు
    మానవతలు చిందు మకరందముల విందు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    అన్నదమ్ములట్లు అక్కచెల్లెండ్రట్లు
    కలిసి మెలసి జనులు మెలగవలయు
    మనుజులెల్ల విశ్వమందిర సభ్యులే
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    గొప్పతనము రాదు కులగోత్రముల వల్ల;
    మమత సమత వలయు మానవులకు;
    జీవులెల్ల దేవదేవుని బిడ్డలే
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    ఆత్మలోని జ్యోతి ఆ జగజ్జ్యోతిలో
    కలుపవలయు మనసు నిలుపవలయు
    విశ్వమందిరమును వెలిగింప వలయును
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    పరిహసింపబోకు నిరుపేదలను గాంచి
    పరితపింపబోకు పరుల సిరికి
    పరిగణింపబోకు ఒరుల దోషమ్ములు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    కోరబోకు మెపుడు మేర మీరిన కోర్కె
    మీరబోకు గురువుగారి ఆజ్ఞ
    దూరబోకు మెపుడు ధూర్తవర్తనులలో
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    రిత్తభావములను చిత్తాన జొరనీకు
    చెత్తబరువు నెత్తి కెత్తుకోకు
    క్రొత్త వేషగాండ్ర పొత్తు గైకొనబోకు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    తల్లి తండ్రి గురువు దైవస్వరూపులు
    అతిథి గూడ దైవమని వచించె
    భారతీయ ధర్మపథ మెంత గొప్పదో!
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    "లెండు" "మేలుకొండు" "నిండుగా వరముల
    నంది ప్రత్యభిజ్ఞ నందు" డంచు
    హెచ్చరించె వేద ముచ్చైస్వరంబుతో
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    ఈ జగత్తు సర్వ మీశ్వరాధీనంబు
    సకలమున కతండె స్వామి గాన
    త్యాగమతివి కమ్ము తాక కన్యుల సొమ్ము
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    "నడుపు మీవు నన్ను చెడు నుండి మంచికి"
    "తమము నుండి కాంతిదరికి" మృత్యు
    ముఖము నుండి మోక్షమున" కంచు శ్రుతి పల్కె
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    అందరాని దానికై చేయి చాపకు
    అందలే దటంచు కుందబోకు
    అందుకొనుము డెంద మందున్న జ్యోతిని
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    అసలు స్వర్గమన్న ఆకాశమున లేదు
    అందరాని మబ్బులందు లేదు
    స్వచ్చజీవనంబె సత్యమౌ స్వర్గంబు
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    పూలతీగ కంటె పువ్వు మిక్కిలి ముద్దు
    పువ్వు కంటె పాపనవ్వు ముద్దు
    పాపనవ్వు కంటె పరమాత్మ ముద్దురా!
    విశ్వయోగి మాట వెలుగుబాట.

    కలడు చర్చిలోన! కలడు మసీదులో
    కలడు గుడిని! చూడ కన్నులున్న;
    కణకణమ్మునందు కలడురా పరమాత్మ;
    విశ్వయోగి మాట వెలుగుబాట.

 Previous Page Next Page