Previous Page Next Page 
కాలానికి నిలిచిన కథ పేజి 11


    అప్పటికే అక్కడికి చేరి వీణ సాధన చేస్తున్న నేను చివ్వున లేచి వినమ్రురాలై పెద్దియజ్జ్వకు నమస్కరించింది. "తల్లీ, నీవు భూరిగుణవంతురాలవై, యశోద్ధారకురాలివి కావాలి" అంటూ ఆశీర్వదించారాయన.
    "మహాశయా! మీ ఆశీస్సులే మాకు రక్ష" అంటూ స్వీకరించిందామె.
    "మోటుపల్లి సమస్యను ఎలా పరిష్కరించాలని మీ అభిప్రాయం?" అంటూ ప్రారంభించాడు చినకోమటి వేముడు.
    పెద్దియజ్జ్వ రవ్వంతసేపు ఆలోచనామగ్నులై వుండిపోయి అన్నారు. "ఈ సమస్య వేమాంబిక వల్ల తేలుతుంది" వేమాంబిక విస్ఫూరితమయిన కళ్ళతో గురుదేవుని చూడసాగింది. పెద్దయజ్జ్వ చిరునవ్వుతో తమ అభిప్రాయాన్ని విశదీకరించటం ప్రారంభించారు.
    మోటుపల్లి కోల్పోయిన తరువాత కొండవీటి సామ్రాజ్యాన్ని వూహించటం అసాధ్యం నాయనా! అందువల్ల అది ప్రముఖంగా నిలబెట్టుకోవలసిన అవసరం వున్నది. విజయనగర రాజులతో మనకు ప్రత్యేకంగా వైరమేమీ లేకపోయినప్పటికీ కాటయవేమునితో వారికిగల బంధుత్వమే మనకు వారిని విరోధుల్ని చేసింది. అది అవాంఛనీయము! కాని, తప్పనిసరి పరిస్థితి ఎదురయింది. ఏమి చేయగలం. ఇప్పుడీ విపత్కరమయిన పరిస్థితిని ఎదుర్కొనగలగాలంటే ఒక పని చేయాలి.
    చినకోమటి వేముడు ఆసక్తిగా గురుదేవుల మాటలు ఆలకించాడు. ముందుకువంగి మరీ వింటున్నాడు. వేమాంబిక తన ప్రస్థావన ఏమిటో, తను చేయవలసినదేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో మునిగివున్నది. యజ్జ్వ ప్రారంభించారు. "అమ్మాయీ! దక్షిణాపధాన అభిమన్యుడై జన్మించిన సోముదేవుని యుద్ధ రంగానికి పంపాలి" అన్నారాయన. వేమాంబిక లేత చెక్కిళ్ళు ఎర్ర వారాయి. "నిజం తల్లీ" అంటూ కొనసాగింఛా రాయన.
    ఈ సమస్యను మామిడి సింగన్న కాని, శ్రీనాథకవి రాజుని కాని, నరసింహకవి కాని తేల్చలేరు. ఇది ఒక్క సోమదేవునివల్ల తేలవలసిన సమస్య కాని అతడు వేమాంబిక తప్ప మరెవరు చెప్పినా ఈ పరిస్థితిలో వినడు" అంటూ చిరునవ్వు నవ్వారు.
    వేమాంబిక ముఖమంతా సిగ్గుతో ముడుచుకుపోయింది. చినకోమటి వేముడు గాఢంగా నిట్టూర్చి విధిలేక "అమ్మా, నీ అభిప్రాయమేమిటి" అన్నారు. "నాన్నగారూ! నేను వీర పుత్రికను. కొండవీటి రాజ్యరమ సలక్షణంగా వర్థిల్లటానికి నేను ఏ త్యాగమయినా చేస్తాను. యువరాజు ప్రవర్తనతో కొంత అసంతృప్తులై వున్న సోమదేవులు అలుక వహించారు. వారిని నేను శాంత పరుస్తాననే విశ్వాసంతో మీకు మాట ఇస్తున్నారు. వారు మోటుపల్లి యుద్ధంలో విజయులై తిరిగిరాగలరు!" అంటూ ముఖం త్రిప్పుకుందామె.
    రానున్న వసంతోత్సవాలకు ముందుగానే శ్రావణమాసంలో వారికి వివాహం జరిపించాలని సూరమాంబ సంకల్పించారు. ఆ విషయం అక్కడున్న వారందరికీ తెలుసు. కొద్దిరోజులలో పెండ్లికుమారుడు కానున్న సోమదేవుడు ఇప్పుడు శిరస్త్రాణ ధరించి యుద్ధరంగానికి బయలుదేరాలి.
    పెద్దయజ్జ్వ ఆలోచనా తరంగాలలో తేలిపోతున్నారు. చినకోమటి వేముడు విపత్కర పరిస్థితి నుండి బైటపడినందుకు యత్నించుతు సంతోషించినా, పెండ్లి ముస్తాబుకు సిద్ధమౌతున్న కుమార్తెను బాధపెట్టవలసి వచ్చినందుకు చింతిల్లాడు. వేమాంబ తండ్రివద్ద శలవు తీసుకుని, పెద్దియజ్జ్వకు ప్రణమిల్లి వెళ్ళిపోయింది.
    అంతఃపురంలో ప్రవేశించగానే ఆమె వాలకం చూచి ఏదో అవాంఛితమే జరిగిందని విద్యాధికురాలైన రాణి వూహించింది. ఆమె వూహాచతుర. "అమ్మా! నాన్నగారు మోటుపల్లి నుండి అందుకున్న వార్తలేమైనా తెలిశాయా?" అని ప్రశ్నించింది. "అమ్మా! కంచి నుండి రామగిరి వరకు సింహాచలం నుండి ఉదయగిరి వరకు వ్యాపించి వున్న యీ కొండవీటి మహా సామ్రాజ్యంలో వార్తలకేమి కొదువ. పక్క రాజ్యాలవారు దురాక్రమణ ప్రారంభించారా?" అన్నదామె. ఆ మాటలో రాజ్యనిర్వహణలోని లోపాలు ఎత్తిచూపే ధ్వని వున్నది. ఆ విషయం వేమాంబ చిన్నారి వూహలకు అందలేదు.
    "యుద్ధానికి మరికొందరి సహాయం కూడ అవసరమన్న విషయం తేలిపోయింది. యక్కటి వాండ్రు పనిచేసే పటాలం కదలవలసి వచ్చింది" అన్నది వేమాంబ. 'యిక్కటి వాండ్రు పటాలమంటే మరే యితరుల సహాయం లేకుండా యుద్ధరంగంలో ఒంటరిగా నిలిచిపోరాడే వీరులు. వారికి సేనాధి సోమదేవుడు.
    ఈ మాట అనగానే రాణి గుండెలో గాలం పడింది. సోమదేవుడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చిందని ఆమె బాధతో సాగింది. అసలే అతడు దుందుడుకు వీరుడు.
    కూతురును ఓదార్చి కార్యోన్ముఖురాలిని చేయకన్న ఇప్పుడు చేయగల కార్యాంతరమేదీ ఆమెకు తోడు లేదు. అందుకే ఉద్యుక్తురాలైందామె.

 Previous Page Next Page