సిద్ధాంతి: చిత్తం! అది తమతో మనవి చేయకుండా నేను చూశానండి. రేపు వైశాఖమాసంలోనే ఉంది. సర్వోత్కృష్టమైన ముహూర్తం. సప్తమ శుద్ధి, గురుశుక్రబలం బాగుంది. కుజుడు ఏవిధంగాను దోషకారిగా లేడు. అన్ని బలాలు బాగున్నాయండి! చాలా జయప్రదంగా వివాహం జరుగుతుంది. దాంపత్యం దివ్యంగా ఉంటుంది.
ఆనంద: తమది పెద్ద పూర్ణయ్యగారి మతమా, చిన్న పూర్ణయ్యగారి మతమా అండి?
సిద్ధాంతి: అయ్యా! నేను మాత్రం చిన్న పూర్ణయ్య గారిని పూర్తిగా అనుసరిస్తాను. ఏమంటారా, శాస్త్రంలో ఏమన్నా దృక్సిద్ధం లేకపోతే నిజమైన ఉపయోగం లేదండి.
మృత్యుంజయ రావను నొక రాజమహేంద్రవరపు న్యాయవాది: అయ్యా దృక్సిద్ధం అనేది పాశ్చాత్యులు దూరదర్శినీయంత్రాలు చూసి వ్రాసిన వ్రాతల్ని బట్టేకదా! ఇప్పటికింకా 'హైపీరియా' నని 'ప్లూటో' అనీ కొత్త కొత్త గ్రహాల్ని కనిపెడుతున్నామంటారు. కొన్ని కొన్ని మార్పులకు శాస్త్రీయమైన జవాబు కన్పించదాయెను. మనవాళ్లు, అంటే మహాఋషులు అతీంద్రియ దృష్టితో చూచి ఏర్పరచిన లెక్కలన్నీ మార్చి, ఇప్పుడు దృక్సిద్ధాంతం కావాలి అంటారు. చివరికి ఈ దృక్సిద్దాంతం నిలవకుండా ఎగిరిపోయేరోజు వచ్చిందాకా ఈ సిద్ధాంతాన్ని విడవరు కాబోలు.
తహసీల్: అది కాదండీ. నేను కాస్త ఈ మధ్య జ్యోతిష్యం నేర్చుకోవడం ప్రారంభించాను. మనవాళ్ళు ఏర్పరచిన లెక్కలున్నాయి చూశారూ, దృక్సిద్దాంతం రూపకంగా సరిచూడమనే సెలవిచ్చారు. అలా చేయకుండా ఆచారం అనీ సంప్రదాయం. ఆ మాటలకు నిజమైన అర్ధం గ్రహించకుండా ఒకటే పంథా, మరీ గుడ్డెద్దు చేలో బడ్డట్టు.
మృత్యుం: చిత్తం. తమరు సెలవిచ్చినది నిజమే మరి. కాలాన్ని బట్టి మనం ఆకాశపటంలో ఏమి గమనించాలో, భూమిమీద వాటిని బట్టి ఏమి మార్పులు వస్తున్నాయో అన్నీ చూసుకుంటూ ఉండనక్కర లేకుండా, గానుక యెద్దులాగ తిరగాలి అని సిద్ధాంత శాస్త్రాలు ఘోషించవండి. పాశ్చాత్య సిద్ధాంతాలు రోజుకోమారు మారుతూ ఉంటాయి ఎందుచేత? అసలు సిద్ధాంత జనానికి ప్రాతిపదికమైన నిజం గోచరం చేసుకోకుండా ప్రత్యక్ష ప్రమాణమనే మాయావాదానికి దాసులై నిజాన్ని రోజుకోసారి, నిమిషానికోసారి మార్చుకోవడం వున్నదే, అది తప్పని నా మనవి. మనవాళ్లు ఆ అసలు నిజమైన తత్వం పారలౌకికదృష్టి చేత తెలిసికొని, మార్గములు మనకు ఏర్పరిచారు. వాటిలో మనకు కావలసినవి తీసుకొని తక్కిన వానిని తీసివేస్తే ఎట్లాగండీ?
శ్రీని: మీరంతా సిద్ధాంతులు. మేము కొన్ని సంగతులు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు గ్రహాలకి కారకత్వాలు కొన్ని ఇచ్చారు. రాశులకు వేరు వేరు భావాలు నిరూపించారు. అలా ఇవ్వడానికి తగిన ఆధారం ఏమిటి? శుక్రుడు స్త్రీ గ్రహం అని అంటారు. పురాణాల్లో శుక్రుడు పురుషుడు కదా. చంద్రుడు అంతే. మరేమిటంటే, ఇది అంతా నాకో విచిత్రం క్రింద ఉంటుందండి.
డిప్యూటీ కలెక్టరు: అయ్యా శ్రీనివాసరావు గారూ! వచ్చిన పని పూర్తిచేసి మీ సిద్ధాంత చర్చలు ప్రారంభిస్తే బాగుంటుందేమో?
ఆనం: అదే నా మనవి.
సుబ్బా: మా సిద్ధాంతి గారికి కబురు పంపాను.
శ్రీరా: భోజనానికి ఇంటికి వస్తారట. గోపాలపురం వెళ్లారట.
సుబ్బా: సరి, ఇకనేమి తమందరూ ఈ పూట నా ఆతిథ్యం స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చేయాలి. ఎన్నడూ రానివారు ఈ నిమిత్తాన దయచేశారు.
డి.త.: నేనందరికి ప్రయత్నం చేయించాను. క్షమించండి' అనుటయు సుబ్బారాయుడుగారి కడ వారందరూ సెలవు తీసుకొని డిప్యూటీ తహసీల్దారు గారింటికి వెడలిపోయినారు.
దేశాంతర్గతుడు
రామచంద్రరావు కాకినాడ నుండి రంగూను వెళ్ళినాడని తెలిసి, సుబ్బారాయుడి గారి ఇంట్లో అందరూ కంగారుపడిరి. సూర్యకాంతమ్మయు, జానకమ్మ గారును కళ్లనీరు నిన్పుకొనుచు వాపోవజొచ్చిరి. సుబ్బారాయుడు గారు లోనికి వెళ్లి నాలుగు చీవాట్లు పెట్టిరి. ఆరోజుననే బయలుదేరి లక్ష్మీపతియు, నారాయణరావును కాకినాడ వెళ్లినారు.
కాకినాడలో రామచంద్రరావు సంగతి యంతయు దేట తెల్లమయ్యెను. రామచంద్రరావు సూర్యకాంతము భర్త. ఇంటరు పరీక్షలో గృతార్దుడు కాలేకపోయినట్లు వార్తాపత్రికలలో బ్రచురింపబడుటతో, రామచంద్రునకు మతిపోయినది. రామచంద్రుడు భౌతిక శాస్త్రాదులలో నుద్ధండుడు. అతనికి ఇంగ్లీష్ భాష మాత్రం కొంచెం దూరపుచుట్టమైనది. పదార్థవిజ్ఞాన, రసాయన, వృక్ష శాస్త్రములలో గ్రమముగా దొంబది, యెనుబదియాఱు, నెనుబది యొక్క గుణము లాతడు సంపాదించెను. ఇంగ్లీషులో నూటికి ముప్పది మాత్రమే వచ్చినవట. తెలుగంతయ న్యాయముగా లేదు. నలుబదియైదు గుణములు వచ్చినవి. కాబట్టి తప్పిపోయినను, మొదటితరగతి గుణములు వచ్చినవి. ఒక భాగముననే కృతార్థుడైనాడు.
నారాయణరావు కొత్తపేటలో వినినప్పుడే శాస్త్రపాఠములలో మొదటి గుణములు సముపార్జించి ఇంగ్లీషు బాషలో దప్పిపోవునని యనుమానించి లక్ష్మీపతి కది వెల్లడించినాడు. తుదకట్లే అయినది.
రామచంద్రరావు తండ్రికొక యుత్తరము వ్రాసిపెట్టి యోడ నెక్కినాడు.
'శ్రీ బాబయ్యగారి పాదాలకు వందనాలు. మనదేశంలో నిజమైన విద్యాదీక్షకు తావులేదు. మనదేశంలో చదువు అంతా గుమాస్తాలను తయారుచేసే చదువు. దానికి తగిన విషయ ప్రణాళికే ఏర్పరచారు పరీక్షలకు. ఇంగ్లీషులో మార్కులు వచ్చి తీరాలి అని నిబంధన ఉండడం యొక్క ఉద్దేశం అది. నేను ఇంగ్లీషు పరీక్షలో నెగ్గవలసి వస్తే శాస్త్ర జ్ఞానానికి నీళ్ళు వదులుకోవాలి. ఈ మీ తనయుని పరిశ్రమకు పాశ్చాత్య దేశాల్లో వచ్చిన ఖ్యాతి మీరెరిగే ఉన్నారు. మీకు నన్ను పాశ్చాత్య దేశం పంపడానికి ఇష్టం లేదాయెను. కనుక మీ పెట్టె మారుతాళంతో తీసి, అందులో ఉన్న అయిదు వందల రూపాయల నోట్లు తీసికొని ఓడ నెక్కాను. ఈ దొంగతనానికి క్షమించండి. నేను ఎలాగో ఆలాగు అమెరికా చేరుకుంటాను. అమెరికా హార్వర్డులో చదువుతాను. అక్కడకు తాము ధనము పంపిస్తే అదృష్టవంతుణ్ణి. లేకపోతే అక్కడ కాయకష్టపడి ఎలాగో సంపాదించుకొని చదువు పూర్తిచేసుకుంటా. ఈ జరిగిన విషయం అంతా నేను జాగ్రత్తగా ఆలోచించి చేసినదే. శ్రీ అమ్మగారి పాదాలకు ఆమె నిద్రపోతుండగా నిన్న రాత్రే నమస్కరించాను. మీ ఇరువురి ఆశీర్వచనం నాకుంటే లోకాలు జయించగల్ను.
నమస్కారం,
విధేయుడు మీ కుమారుడు,
రామచంద్రం.
ఈ యుత్తరం చదువుకొనునప్పుడు మరల కనులలో నీరు తిరిగినది భీమరాజు గారికి. తల్లి మూల బండుకొని యతికరుణముగా నేడ్చుచునే యున్నది.
అప్పుడు నారాయణరావు, లక్ష్మీపతి, భీమరాజు గారు లోనికి బోయి యామె నోదార్పబూనిరి.
నారా: అత్తయ్య గారూ! ఏమిటి మీరలా అధైర్యపడతారు! పట్నవాసంలో ఉన్నారు. ప్రపంచం సంగతి చూస్తున్నారు. సరోజినీదేవిగారి వంటి ఉత్తమ స్త్రీల ఉపన్యాసాలకు వెళ్ళి వింటున్నారు. ఆంధ్రమహిళా సంఘంలో మీరు పేరుపొందిన సభ్యురాలుగా ఉన్నారు. ఎంతమంది మనదేశములో ఈనాడు పాశ్చాత్య దేశాలకి పోయి అత్యుత్తమ విద్యల నేర్చుకోవడం లేదు! మీరు వీరమాతలు. మీ అంతట మీరే 'నాయనా పాశ్చాత్య దేశాలకు వెళ్ళవలసివుంటే వెళ్ళిరా' అనవలసింది.