లక్ష్మీ: పిన్నిగారూ! అక్కడకు వెళ్ళి లోక ప్రఖ్యాతి సముపార్జించటానికి నోచుకున్నాడు, మా తమ్ముడు!
భీమ: (భార్య దుఃఖం వల్ల ఎక్కడ లేని ధైర్యము గలిగి) సరే, మీటింగు ముందరి మాటలూ ధైర్యమూ, కష్టం కలిగినప్పుడే అక్కరకు రావాలి. ఎందుకు ఏడ్పు? ధైర్యంతో వెళ్ళాడు. శౌర్యంతో వస్తాడు.
రామచంద్రరావు తల్లి దుర్గమాంబ గారు లేచి 'నాయనా నారాయణ రావు, బాబూ లక్ష్మీపతీ! ఏం చెయ్యను. ఒక్కడే కొడుకు, ఒక్కటే కాన్పు. ఆడదాన్ని కబుర్లకయినా అక్కరకు రాను. నా శక్తి స్వభావం అంతే! ఏం చెయ్యను? నాతో రెండు నెలలనుంచి వాదిస్తున్నాడు. నేనన్నాను. చదువు కోసము పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలా! గాంధీగారు 'పాశ్చాత్య విద్య ఆత్మ వికాసాన్ని చంపుతుంది. రామ్మోహనరాయ్ వంటివాడు పాశ్చాత్య విద్య లేకపోతే ఇంకను వేయి రెట్లు మహాఋషి అవును' అని చెప్పలేదా? అని నేను వాదించాను. వాడు 'నువ్వు చెప్పిందంతా నిజం, అమ్మా! కాని మనం శాస్త్ర పరిశోధనలలో నూతన విషయం కనిపెడితే, ఇంగ్లీషు విద్యలో పెద్ద పట్టా పొందితే గాని, ఆ సంగతి లోకం ఒప్పుకోదు. కాబట్టి నేను జర్మనీకి లేక అమెరికాకో వెళతాను' అంటూ వుండేవాడు.
భీమ: ముందు కర్తవ్యం ఆలోచించకుండా ఇలా అన్నాను, అలా అన్నాను అని కూర్చుంటే ఏమి లాభం?
అందఱు కలిసి వారి మేడ ఇంట్లో మధ్య హాలులో కూర్చుండినారు.
బుద్ధవరపు భీమరాజు గారు పూర్వకాలము నుండియు కాకినాడలో వర్తకము చేసి ధనికులైన పెద్ద కుటుంబముల వారిలో నొక కుటుంబమునకు పెద్ద. ఆయన వర్తకమునకు, లౌకికమునకు వీలయిన చదువు మాత్రమే చదువుకొన్నారు. కానీ కుబేరునకు వన్నెదిద్దు వ్యాపారపు సరళి, సులువులు, చాకచక్యము, వ్యాపార యుద్ధనీతి సంపూర్ణముగా నెగిన బ్రాహ్మణ శ్రేష్ఠి. పట్టణములోని వారెల్ల వారి కుటుంబమును బ్రాహ్మణ శ్రేష్ఠులనే పిలుచుచుందురు.
ఆయనకు లేక లేక రామచంద్రరావు విపరీత మేధాసంపదతో జన్మించినాడు. అతనికి వర్తకమున వైముఖ్యము. దానికి తగినట్లు భీమరాజు గారికి వ్యాపారములో నష్టము తర్వాత నష్టము వచ్చి, మూడులక్షలన్నర రూపాయలు మట్టిపాలయినవి. అప్పటినుండియు, మంచి గడసరియైన భీమరాజుగారు వర్తకం, ఎగుమతి దిగుమతులు మానివేసి, చేతికందినంత మట్టుకు ధనము సేకరించుకొని ఇంపీరియల్ బ్యాంకులో రెండులక్షల ఇరువదివేలు నిలువచేసి, ఆ వల్ల వచ్చిన ధనముతో సుఖముగా గాలక్షేపము చేయుచున్నారు. ఆయనకు భూములన్న నమ్మకము లేదు. స్వసౌఖ్యము కొఱకు, కంపెనీ దొరలకు 'సప్లయ్' కొఱకు, మామిడి మున్నగు ఫలవృక్షములు గల తోట నొకటి పిఠాపురం దగ్గర సంపాదించినారు.
అట్టి భీమరాజు గారి ఏక పుత్రునకు నాల్గువేల రూపాయల కట్నము, రెండువేల రూపాయల లాంఛనములతో నారాయణరావు నాల్గవ చెల్లెలి నిచ్చి వివాహ మొనర్చినారు. సుబ్బారాయుడుగారన్న భీమరాజు గారికి గౌరవము, భీమరాజుగారన్న సుబ్బారాయుడు గారికి గౌరవము.
నారాయణరావు, లక్ష్మీపతి, భీమరాజుగారలాలోచించి రంగూనులో భీమరాజు గారి స్నేహితున కొకనికి తంతి వార్త నిచ్చిరి.
తన కుమారుడు పాశ్చాత్య దేశములకు వెళ్ళి ప్రఖ్యాతి గడించుట భీమరాజు గారికి సంతోషము. కాని తనకు కావలసినంత యున్నది. వట్టి పేరు ప్రతిష్ఠల వలన కలుగు లాభమేమి? ఒకడే కుమారుడు, కాని దేశాల నుండుట, అక్కడ బాలుని కనిపెట్టి చూచు దిక్కెవరు లేకపోవుట, కొంచెము జబ్బు చేసిన తల్లిదండ్రులరచేత ప్రాణములుంచుకొను వారే. ఆ దూరదేశములు కుర్రవానికి పడునా? ఎట్టి చదువో? వాడు ఎన్ని ఇబ్బందులు పడునో? చలి ఎక్కువ. తిండి వేరు. అన్నిటికన్నా పాశ్చాత్యదేశ వనితలు పాల్పడని వైపరీత్యమేది కలదు? భీమరాజుగారీ భయములు తన బావమరుదుల జెవిలో కంఠాన గద్గదికతో నేకరువు పెట్టినారు.
నారాయణరావునాకు గుండె గుభిల్లుమన్నది. పాశ్చాత్య దేశముల కేగిన యువకులెందరో తెల్లని మేనులకు వలచి, దిగ్ర్భమనొంది, హృదయములు ఆ శ్వేతకాంతల పాదముల కాడ ధారవోసికొనినారు. అట్టివారికి ఇంటికాడ భార్య బానిసవలె రాక్షసి వలె కన్పించును. ఎంతమంది భారతీయులు దీపము కడ శలభములవలె నరించి పోయినారు కాదు? రామచంద్రుడు చిన్నవాడు, డబ్బుకలవాడు.
సంస్కారహీనులు, పురుషుల వలపింప నేర్చిన మాయలాడులు నగు తుచ్చవనితలు వేలకు వేలు పాశ్చాత్యదేశమున గలరని యతని నమ్మకము. వారి వలలో భారతీయ యువకులెందరో చిక్కినారు. భగవంతుడెట్టి విపరీతముల నొసరింపనున్నాడో యని లక్ష్మీపతి చెవిలో ఊదినాడు.
ఆ రాత్రియంతయు బావమరుదు లిరువురు గాఢాలోచనలో నిదుర నెఱుగరు.
లక్ష్మీ: నీకు చాలా భయమురా బావా! మానవ ప్రకృతి యెల్లప్పుడు కుటిలముగా సంచరిస్తుందనా నీ భావము?
నారా: కాదోయి! స్థానబలము మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం. స్థానబలిమి వంటిదే స్థానవైపరీత్యమునూ.
లక్ష్మీ: సరి, నువ్వు ఒక్కడవు మదరాసులో ఉంటున్నావు కదా, మదరాసులో కుర్రవాళ్ళు పాడవ్వాలంటే ఎన్ని మార్గాలు లేవు? మన వారెవ్వరూ అక్కడ లేరు. అయినా ఎందుకు నువ్వు తగలబడిపోలేదురా మఱి?
నారా: నీ వాదన నాకు అర్థమైందోయి. ఒకటిచూడు. భరతదేశంలో ప్రతి వ్యాపారంలో ముఖ్య జీవితాదర్శమైన సత్యమును సాధ్యమైనంత వరకు మరచిపోకుండా గమనించేటట్టుగా మనల్ని మనం పూర్వ నాగరికత తయారుచేసింది. ఆ నాగరికతయే ఈ నాటికినీ ఏదోరకంగా ఏదో రూపంగా సర్వత్రా వ్యాపించి ఉంది. అట్టి సంప్రదాయబలమే మనల్ని ఇక్కడ కాపాడుతోంది.
లక్ష్మీ: సరే అదీ ఒప్పుకుంటాను. అయితే, నువ్వు పాశ్చాత్య దేశం వెళ్ళే వాళ్ళసంగతి జాగ్రత్తగా ఆలోచించు. వాళ్ళలో మూడురకాల మనుష్యులు. డబ్బుండి, పాశ్చాత్య నాగరికత అనుభవిద్దామని, చదువు పనిమీదో ఆరోగ్యం వంక మీదో లేకపోతే స్వతంత్ర ప్రభువులైన మహారాజులలాగ సరదాగానో వెళ్ళేవాళ్ళు మొదటిరకం.
నారా: అవును బావా! అటువంటివాళ్ళు వెళ్ళి చేసేపని ఏముంది? మనదేశంలో ధనం తీసుకునివెళ్ళి అక్కడ తగలబెట్టడమే! మనదేశం బీదదేశం, పాశ్చాత్య దేశాలు భాగ్యవంతములైనవి. అందులో ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికాలు మరీను. వారికి విషయ సౌఖ్యమే ఆదర్శం. అందుకోసం ఎన్ని చిత్రాలో సృజించుకొన్నారు. వాటికోసం పది ఖర్చు చేసే చోట వేయి ఖర్చు. కాని పాశ్చాత్యులు మనదేశం వస్తే మనదేశంలో అన్నీ వెఱ్ఱి చవుక. వారికి మనదేశంలో ఖర్చు పంటికింద పోక చెక్క.
లక్ష్మీ: ఇంక రెండోరకం. ఉద్యోగం కోరి వీలయిన చదువు కొఱకు వెళ్ళేవాళ్ళు. ఇంగ్లాండులో చదువులన్నీ అట్లాంటివే. మూడోరకం వాళ్ళు పూర్ణమైన జ్ఞాన సముపార్జన మాత్రం కారణంగా పెట్టుకొని వెళ్తారు.
నారా: అలాంటి వాళ్ళు ఆ వ్యామోహంలో పడి పాడయిపోయి జ్ఞాన సముపార్జనోద్దేశం మఱిచిపోవరటోయి మఱి? ఆ హాని ఎదురుగా అమ్మవారిలా నోరు తెరచుకొని లేదూ?
లక్ష్మీ: అలా పాడయ్యేవాడికి నిజమయిన విద్యా వ్యసనం లేదన్నమాట!
నారా: నువ్వు చెప్పిన కారణాలు గ్రహించక అనటము కాదు నిజమే! శాస్త్రజ్ఞానం పూర్ణముగా సంగ్రహించుటే వ్రతంగా పెట్టుకొని వెళ్ళినవాడు ఉత్కృష్టజీవే! మన రామచంద్రుడు ఆ విధమైన తన్మయత్వంలోనే ప్రయాణం సాగించాడు. పాశ్చాత్య దేశాలు వెళ్ళవలసివస్తే చిన్నతనంలో వెళ్ళడమే మంచిదని ఎరుగుదును. కామశక్తి మాంచి యౌవనంలోనే మనుష్యజీవితాన్ని కదల్చి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో కామపరమైన మాయలకు మనుష్యుడు నిముషంలో లోబడిపోతాడు. చిన్నతనంలో కుర్రవాడు వాని దీక్షలోనే ఐక్యమై యుంటాడు. కాబట్టి వాడికి వాడి విద్యతప్ప వేరాలోచన కించితైనా పుట్టనిమాట నిశ్చయం. పైగా పరిపక్వమగుటకు సిద్ధమవుతూన్న అతని హృదయానికి అపరిచితమైన విషయాలన్నీ భయంకల్పించే నీడలు. వాటిని నిరోధించటానికి అతడు చేసే ప్రయత్నం కృత్రిమము లేని సత్యహ్రుదయమతో చేసేదే. అందుకనే చిన్నతనమే చాలా ఉత్తమం. కాని ఎంత చెప్పినా చెల్లాయి బాధపడుతుందని భయం నన్ను కదల్చివేస్తూంది బావా!
లక్ష్మీ: ఓయి వెఱ్ఱివాడా! యీ భయాలు నీబోటి ఉత్కృష్ట మానవునికి తగవురా!