6
కమిటీ ఛైర్మన్ హరిప్రసాదరావు కొడుకు కృష్ణారావు, అతడికి పదిహేనేళ్ళున్నా ఇంకా థర్డ్ ఫాంలోనే ఉన్నాడు. తన కొడుక్కి ట్యూషన్ చెప్పమని జగన్నాధం పంతులికి అప్పగించాడు హరిప్రసాదరావు. జీతం భత్యం లేని ట్యూషన్. తన కొడుక్కి ట్యూషన్ ఫీజు ఇచ్చి, ట్యూషన్ చెప్పించగలిగే శక్తి హరిప్రసాదరావుకి ఉంది. కానీ, బేవార్సుగా ఏదేది ఎంతవరకూ పొందే అవకాశం ఉందో, అదంతా జుర్రుకోవటం అతనిలోని వ్యాపార లక్షణం. తన చేతిక్రింద పనిచేసే, అగ్గగ్గలాడే పంతులుండగా, వేరే డబ్బు దండగపెట్టి ట్యూషన్ మాష్టారు దేనికి? అదీగాక పంతుల్నయితే తన కొడుకు ఒకవేళ ఫెయిలయితే గట్టిగా సంజాయితీ అడగవచ్చు....
కృష్ణారావు గుమ్మంలో అడుగుపెట్టగానే జగన్నాథం పంతులు నిలువెల్లా వణుకుతూ, అనవసరంగా నవ్వుతూ "రా బాబూ! రా!" అన్నాడు. ఒక్కక్షణంలో కృష్ణారావుకి తన విలువ అర్థమైపోయింది. ఇలాంటి విషయాల్లో అతను చాలా సూక్ష్మగ్రాహి. వణుకుతున్న పంతుల్ని చూస్తే సరదావేసి ముఖం చిట్లించి "అబ్బా! నేనిక్కడ ఎక్కడ కూచోను మాష్టారూ!" అన్నాడు. జగన్నాధం పంతులు మరింత కంగారుపడుతూ, ఇంట్లో వున్న ఒకే ఒక కుర్చీ తన పంచెతో శుభ్రంగా దులిపి "ఇక్కడ కూచో బాబూ!" అన్నాడు.
ఇదంతా చూస్తోన్న తులసికి కృష్ణారావు మీద పట్టరాని కోపం వచ్చింది. ఆ క్షణంలో అతడి ముందుకు వచ్చి అతడి లెంపలు టపటప వాయించెయ్యాలనిపించింది. వయసు పెద్దదయినా, చిన్న క్లాసులోనే ఉండటం, సిగరెట్లు త్రాగటం_ఇలాంటి కారణాల వల్ల తులసికి కృష్ణారావు మీద ఏమాత్రం సదభిప్రాయం లేదు. తన తండ్రి ఆ కృష్ణారావును చూస్తూనే ఎందుకలా వణికిపోతాడో మాత్రమే తులసికి అర్థంకాదు. పంతులు తన పంచెతో తుడిచిన కుర్చీలో దర్జాగా కూచోబోతున్న కృష్ణారావు చూపులు తులసి చూపులతో కలుసుకున్నాయి. ఆ చూపులలో ఉన్న ఏవగింపుకీ, తిరస్కారానికీ అతనికి తెలియకుండానే అతని మనసు జంకింది. అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు. "కూచో బాబూ! కూచో!" అన్నాడు జగన్నాథం పంతులు కంగారుగా. ఆ మాటలతో మైకంలోంచి తెప్పరిల్లినట్లయి, మరింత పొగరుగా, మరింత పెంకెతనంగా కుర్చీలో కూచోవడమే గాక, తులసిని చూసి వెటకారంగా నవ్వాడు కృష్ణారావు. ముఖం తిప్పుకుని అక్కడ్నుంచి వెళ్ళపోయింది తులసి.
ధనలక్ష్మి వెళ్ళిపోయాక సూర్యం పరిస్థితి ఆ ఇంట్లో మరింత నికృష్టమయింది. ధనలక్ష్మి చాకిరీకి బాగా అలవాటుపడిన ఆ కుటుంబం ఆ పనులన్నీ సూర్యానికి పురమాయించేది. కానీ సూర్యం ఏ పనీ చేసేవాడు కాదు. తన అక్క ఏమూల నుండో "బాబో౧ సూర్యం! బాగా చదువుకో! చదువుకుంటానని మాటియ్యి" అంటున్నట్లే ఉండేది. అంచేత మొండిగా కదలకుండా బుడ్డి దీపం ముందు కూచుని చదువుకునేవాడు. "వెధవా! దొరబాబులా అలా కూచుంటే నీకు తిండెవరు పెడతార్రా?" అని అరిచేవాడు జగన్నాథం పంతులు. పంతులు అరుపులంటే ఏమాత్రం భయంలేదు సూర్యానికి. "నాకు మీరు తిండి ఊరికినే పెడుతున్నారా? నా జీతం నూరురూపాయలు ఇంట్లో ఇస్తున్నాను. జగన్నాధం పంతులు మండిపోయి "ఈ వెధవకి అన్నం పెట్టకండి. డొక్క మాడితేగాని బుద్ధిరాదు. పందికొక్కులా మూడు పూటలా ఇంట్లోబడి తింటుంటే వెధవకి పొగరు ఎక్కువవుతోంది" అన్నాడు ఒకనాడు.
ఆ మాటలకు ఏ మాత్రమూ చలించలేదు సూర్యం. మరింత పట్టుదలగా చదువుకోసాగాడు. బిడ్డల తల్లి జానకి మాత్రం సూర్యాన్ని అలా కడుపుమాడ్చి కూచోబెట్టలేక పోయింది.
"సరేలే! అన్నానికి రా! నాకు ఏది తప్పుతుందీ?" అంది విసుక్కుంటూ.
అలా విసుక్కుంటున్న జానకిని ఒక్కసారి రోషంగా చూసి "నాకు అక్కర్లేదు" అన్నాడు సూర్యం.
సూర్యం అలా తినకుండా ఉంటే చూడలేక తులసి, "అన్నానికి రా సూర్యం!" అంది.
"నోరు మూసుకో! వెధవని బ్రతిమాలి బామాలి, తినిపించాలా? శనిలా తగులుకున్నాడు. పొమ్మన్నా పోడు!" అని కూతుర్ని కసిరాడు పంతులు.
తులసి తండ్రి కేకలకు భయపడదు కాని, మరొకరితో మాట పడాలంటే తగని అభిమానం ఆ పిల్లకి. అంచేత మళ్ళీ మాట్లాడలేదు. కాని, అందరూ నిద్రపోయాక అప్పటికింకా చదువుకుంటోన్న సూర్యం దగ్గరకొచ్చి తను తినకుండా దాచుకొన్న చపాతీ అతనికిచ్చి "తిను" అంది.
"నాకు అక్కర్లేదు" కసురుకున్నట్లు అన్నాడు సూర్యం.
"ఇది నాది!"
"నీ కెక్కడిది? మీ నాన్నది!"
తులసి ఆలోచించింది.
"మా నాన్నదే! కానీ, నాకిచ్చాక నాదేగా! తిను! నువ్వు తీసుకోకపోతే మళ్ళీ నువ్వెప్పుడయినా నీవేదయినా యిస్తే నేను తీసుకోను."
ఈ చివరి మాటలు చాలా హాయిగా వినిపించాయి సూర్యం మనసుకి. అదీగాక చిన్న వయసులో పగలంతా గొడ్డు చాకిరీ చేసిన అతను ఆకలికి తట్టుకోలేకపోతున్నాడు. తులసి ఇచ్చిన చపాతీ చింతకాయ పచ్చడినంజుకుని తినేసి అయిదారుగ్లాసుల నీళ్ళు తాగాడు. ఆకలి చంపుకోవటానికి అతడన్ని నీళ్లు తాగుతుంటే తులసికి చాలా జాలేసింది.
"ఇవాళ సరే! మరి, రేపు? రేపయినా అన్నం తినవలసిందేగా!" అంది.
"రేపు కూడా తినను!"
"అన్నం తినకుండా ఎలా?"
"ఆకలికి అన్నమే తినాలా? డబుల్ రొట్టె తిని ఛాయ్ తాగినా ఆకలి చస్తుంది."
"ఇక్కడ అన్నం కూడా తిననప్పుడు ఈ మాటలన్నీ పడుతూ ఇక్కడే ఉండటం దేనికి?"
ఈ ప్రశ్నకు సూర్యం వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి చొక్కాతో తుడుచుకొంటూ "మా అక్క నన్ను మర్చిపోదు. ఎక్కడున్నా నాకు ఉత్తరం రాయటమో, ఏదో చేస్తుంది. నేను ఈ ఇల్లు వదిలిపోతే నేనెక్కడున్నానో, అక్కకేం తెలుస్తుంది?" అన్నాడు.