Previous Page Next Page 
నీరు పల్లమెరుగు పేజి 10


    ధనలక్ష్మి కళ్ళు తుడుచుకుని "వెళ్ళరా! ఈ నౌకరు ఉద్యోగంలో నువ్వు ఉండవులే! బాగా చదువుకొని తప్పకుండా పెద్ద ఆఫీసర్ వి అవుతావు" అంది.
    సూర్యం అక్కని జాలిగా చూసి తలవంచుకొని వెళ్ళిపోతూ_ కష్టపడి డబ్బు సంపాదించి అక్కకి రాజాలాంటి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలనుకున్నాడు.
    జగన్నాధం పంతులు ధనలక్ష్మికి ఒక లక్షాధికారుల సంబంధం తీసుకొచ్చాడు. ఆ సంబంధం అక్షరాలా లక్షాధికారుల సంబంధమే! పెళ్ళికొడుకు పేర రెండు లక్షలపైగానే ఉంది బ్యాంక్ లో. అతనికి కొడుకులూ, కోడళ్ళూ, కూతుళ్ళూ, అల్లుళ్ళూ, మనవలూ, మనవరాళ్ళూ అందరూ ఉన్నారు. అతనికి పెళ్ళిమీద ఆపేక్ష అయితే లేదు కాని, పెళ్ళిచేసుకోక తప్పనిసరి పరిస్థితి వచ్చి పడింది. అతనికి పక్షవాతం. మంచంమీంచి లేవలేకపోతున్నాడు. మల మూత్రాదులు కూడా మంచంలోనే! ఏ పనివాళ్ళని పెట్టినా నమ్మకంగా చెయ్యటంలేదు. తాళి కట్టిన పెళ్లామయితే, అందులోనూ వెనకా, ముందూ ఎవరూలేని ధనలక్ష్మిలాంటి వాళ్ళయితే నమ్మకంగా పడిఉంటారు. అయితే ఆ ఆసామీ తదనంతరం ఆయన పేరుమీద ఉన్న రెండు లక్షలూ ధనలక్ష్మికి వచ్చే ప్రమాదం లేదా అంటారేమో, అలాంటిదేం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే, ఈ పెళ్ళి ఏర్పాట్లు. ప్రస్తుతం ఆయన పూర్తి తెలివిలోనే ఉన్నాడు. వీలునామా అదీ రాసేశాడు. ధనలక్ష్మి విశ్వాసంగా భర్తను కనిపెట్టుకుని ఉంటే ఆవిడ పేరుమీద ఎంతో కొంత పెడతాడు. అంత మరీ అన్యాయం చేసే మనుషులు కారు వాళ్ళు.
    ఈ సంబంధం కుదిర్చిపెడితే జగన్నాధం పెద్దకూతురు సుమతి పెళ్ళి తను కుదిర్చి పెడతానంది, మావగారికి చాకిరీ చెయ్యలేక అవస్థ పడుతున్న పెద్దకోడలు.... వాళ్ళకు ధనలక్ష్మి విషయం ఇటీవలే ఎవరి ద్వారానో తెలిసింది. ఇంత మంచి సంబంధం చెయ్యిదాటి పోకుండా చూసుకోవాలని తాపత్రయ పడుతున్నారు.
    జగన్నాధం పంతులు ఈ వివరాలన్నీ చెప్పి, "నీ అదృష్టం ధనలక్ష్మీ! బంగారంలాంటి సంబంధం." అని సంబరంగా అంటుంటే, ఏం మాట్లాడాలో తెలీక దీనంగా జానకిని చూసింది ధనలక్ష్మి. ఆ చూపుకు జానకి కడుపు తరుక్కుపోయింది. కాని, అవతలివాళ్ళు సుమతికి సంబంధం కుదిర్చిపెడతామని ఆశ పెడుతున్నారు. సుమతి చదువులో అంత శ్రద్ధ చూపించలేదు. ఆడపిల్లకు చదువెందుకనే ధోరణిలో జానకి కాని, జగన్నాధం పంతులు కాని ఆ అమ్మాయిని చదువుకోమని ప్రోత్సహించలేదు. సుమతి పెళ్ళి ఒక పెద్ద సమస్యగా తయారయింది జానకికి. స్వార్థం ముందు సహృదయత నోరు మూసుకోగా ధనలక్ష్మి చూపుల్ని ధైర్యంగా ఎదుర్కోలేక ముఖం తిప్పుకుంది.
    తనకిక ఏ ఆశాలేదని అర్థం చేసుకున్న ధనలక్ష్మి మొండిగా "నేనీ పెళ్ళి చేసుకోను" అంది.
    జగన్నాధం పంతులు కళ్ళెర్రజేసి "చేసుకోవూ? ఆడపిల్లవి, పెళ్ళి చేసుకోకుండా ఎంతకాలం ఉంటావు? 'దానికి పెళ్ళి చెయ్యకుండా ఇంట్లో పెట్టుకుని వ్యాపారం చేసి డబ్బులు గడిస్తావా?' అని నన్ను నలుగురూ నానారకాలుగా మాటలని గడ్డిపెడుతున్నారు. నేను పరువుగా బ్రతకాలా? వద్దా? ఈ పెళ్ళి చేసుకోకపోతే, ఈ ఇంట్లోంచి పో! ఇంక నేను భరించలేను" అన్నాడు.
    ధనలక్ష్మికి పూర్తిగా అర్థమయిపోయింది. "ఇంట్లో పెట్టుకుని వ్యాపారం చేస్తావా?" అని నలుగురూ ఆడిపోసుకుంటారని, తన కూతురికి లక్షణమయిన సంబంధం కుదిరేలాగ ఈ పెళ్ళి చేసేసి తన 'పరువు ప్రతిష్టలు' కాపాడుకోవాలనుకుంటున్నాడు. తనకు సంరక్షకూడనబడే ఈ వ్యక్తి..... ఇంచుమించు పదేళ్ళుగా ఈ కుటుంబానికి గొడ్డుచాకిరీ చేసినా, ఈ కుటుంబ వ్యక్తులలో ఒక్కరికయినా తనమీద నిజమయిన సానుభూతి లేదు.
    ఆ రాత్రి నిద్రపోతున్న సూర్యాన్ని తట్టిలేపింది ధనలక్ష్మి. ఆవులిస్తూ లేచి కూచుని "ఏమిటక్కా!" అన్నాడు. "రాత్రి కాలేజీలో చదువుకుంటాను అని అన్ని కబుర్లు చెప్పి ఇలా నిద్రపోతున్నావేంరా?"
    "ఏం చేయమంటావక్కా! నన్ను ఒక్క నిముషమయినా స్థిమితంగా కూచోనివ్వరు. ఆ పనిమీదా, ఈ పనిమీదా సైకిల్ మీద తిరిగి తిరిగి కాళ్ళు పచ్చిపుండులా ఉన్నాయి."
    "పోనీలే! ఇకముందయినా చదువుకుంటావా?"
    "చదువుకుంటాను"
    "బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తానని నా చేతిలో చెయ్యివేసి మాటియ్యి."
    సూర్యం ఇప్పుడు మరీ పసిపిల్లవాడు కాదు. అతనికి పరిస్థితులు అర్థమవుతున్నాయి. చాపిన అక్క చేతిలో తన చెయ్యివేసి ఫకాలున నవ్వాడు. తమ్ముడి చెయ్యి ఆప్యాయంగా పట్టుకుని తనూ గట్టిగా నవ్వింది ధనలక్ష్మి.
    సూర్యం తెల్లబోయి "నువ్వెందుకు నవ్వుతున్నావు?" అన్నాడు.
    ధనలక్ష్మి తమ్ముడి జుట్టు అభిమానంగా నిమిరింది. "నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు అర్థమయింది సూర్యం. కానీ, నేనెందుకు నవ్వుతున్నానో ఇప్పుడు నీకు అర్థంకాదు. ఏదో ఒకనాటికి అర్థం చేసుకోగలవేమో!"
    ఆ రాత్రి తెల్లవారేసరికి ధనలక్ష్మి జగన్నాధంపంతులు ఇంట్లోంచి మాయమయిపోయింది.

 Previous Page Next Page