తులసి సమాధానం చెప్పలేదు. మంచి చెడ్డల విషయంలో తులసికి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా ఇంట్లోంచి లేచిపోయిన ధనలక్ష్మి మంచిదెలాగ అవుతుందో తులసికి అంతుపట్టలేదు.
జగన్నాధం పంతులు కృష్ణారావుకి నానాయాతన పడి లెక్కలు చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రియశిష్యుడు మత్తుగా ఆవులించి "నాకు నిద్రొస్తూంది మాష్టారు? సిగరెట్లు తీసుకురండి!" అని ఆజ్ఞాపించాడు. జగన్నాధం పంతులు ఒక్క క్షణం నిర్ఘాంతపోయి, చక చక తేరుకొని శ్రద్ధగా చదువుకొంటున్న సూర్యాన్ని, ఒరేయ్! సూర్యం! వెళ్ళి చినబాబుగారికి సిగరెట్లు తేరా?" అని కసురుకుంటున్నట్లు ఆజ్ఞాపించాడు. సూర్యం కదలకుండా, "నేను తేను" అన్నాడు. కృష్ణారావుకి లెక్కలు బోధపరచలేక ఉడికిపోతున్న జగన్నాధం పంతులు సూర్యం వీపుమీద ఒక్కటి చరిచి, "తేవు! వెధవా! ఈ ఇంట్లోంచి పో!" అని అరిచాడు. సూర్యం మాట్లాడలేదు. కదలలేదు. నమిలి మింగేసేలా జగన్నాధం పంతుల్ని చూసి మళ్ళీ తల దించుకున్నాడు. అంతవరకూ వినోదంగా వింత చూస్తోన్న కృష్ణారావు, సూర్యం వంటిమీద దెబ్బ పడగానే అదిరిపడ్డాడు. నిస్సహాయంగా రోషంగా చూసే సూర్యం చూపులు చూసి "శభాష్" అనుకున్నాడు.
"మాష్టారూ! నాకు సిగరెట్లు మీరెళ్ళి తెచ్చిపెట్టండి!" అన్నాడు దర్జాగా.
"చినబాబూ! నేను నీకు లెక్కలు చెప్పాలి!" జాలిగా అన్నాడు పంతులు.
"పరవాలేదులెండి. మీరెళ్ళి సిగరెట్లు తెండి. నాకు సూర్యం లెక్కలు చెపుతాడులెండి, మీకంటే బాగానే చెపుతాడు."
"అలాగే! అలాగే!"
కృష్ణమూర్తి చేతిలో డబ్బులందుకొని ఊగిసలాడుకొంటూ బయటికి నడిచాడు జగన్నాధం పంతులు. కృష్ణమూర్తి పక పక నవ్వేశాడు. సూర్యంకూడా నవ్వాడు. తన కళ్ళముందు తండ్రి అలా అవమానింపబడుతోంటే భరించలేకపోయింది తులసి.
"ఛీ! ఛీ! సిగ్గులేదు!" అంది ఉక్రోషంగా.....
సూర్యం ముఖం తిప్పుకొన్నాడు. కృష్ణారావు మాత్రం సూటిగా తులసిని ఎదుర్కొంటూ "మీ నాన్న ఏ తప్పు చెయ్యని సూర్యాన్ని లోకువకట్టి, చావబాదినపుడు నువ్వేమాత్రం సిగ్గుపడ్డావ్?" అన్నాడు.
తులసి సమాధానం చెప్పలేకపోయింది. మన ఆత్మీయులు అక్క, చెల్లి, తమ్ముడు మొదలయినవాళ్ళు తప్పుచేస్తే ఆ తప్పు సహించగలమా? అలాగని ఆ తప్పు చేసినందుకు మనవాళ్ళను మనమే అసహ్యించుకోగలమా? ఆ వయసులో తులసికి ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు.
తులసి ఎన్నో రోజులుగా ఇంట్లో పెన్ కావాలని అడుగుతోంది. నాలుగయిదు రూపాయలకు కూడా పెన్ వస్తుంది. కానీ ఆ కుటుంబంలో నాలుగయిదు రూపాయలకు కూడా తడుముకోవలసిందే! రోజూ తులసి పెన్ కావాలని పేచీ పెట్టటం, "కొంటాలే, గొడవ చెయ్యకు" అని జానకి కసురుకోవటం, మామూలైపోయింది. ఆరోజు సూర్యం పెన్ కొని తులసికిచ్చాడు. తులసి మొదట సంభ్రమంగా అందుకుని, అంతలో "నువ్వు నాకివ్వటమేమిటి?" అంది. సూర్యం కనుబొమ్మలు ముడిచి "అంటే?" అన్నాడు. తులసి తడబడింది.
"పాపం! మేము నీకేమీ చెయ్యటంలేదు. నువ్వు మాత్రం" అని సర్దుకుంది.
సూర్యం నవ్వి, "నువ్వు ఆ పెన్ తీసుకొని సుఖంగా రాసుకోవటమే నాకు బోలెడు సాయం చెయ్యటం....." అన్నాడు.
నాలుగురోజులు పోయాక తులసి తనే సూర్యం దగ్గిరకొచ్చి "సూర్యం, నేను అడక్కుండానే పెన్ కొనిచ్చావు, నేను అడుగుతాను మరొకటి కొనిపెడతావా?" అంది.
"అడుగు. డబ్బుంటే కొంటాను."
"నాకు ఊలు కావాలి!"
"ఊలా? పావలా పెడితే వస్తుంది."
"ఛ! అలా జడకు కట్టుకోవటానికి కాదు. స్వెట్టర్ అల్లటానికి....."
"స్వెట్టర్ అల్లటానికా? చాలా డబ్బు కావాలి! ఎవరికి అల్లుతావు స్వెట్టర్?"
"నీకే!"
"నాకా! వద్దులే తులసీ! నాకిప్పుడు స్వెట్టర్ దేనికి?"
"చూశావా! నేనెంతో అభిమానంగా నీకు స్వెటర్ అల్లిపెడతానంటే వద్దంటున్నావు. పోనీలే!"
"సరేలే, కొనిపెడతాను."
తను ఎంతో జాగ్రత్తగా దాచుకున్న డబ్బు ఖర్చుపెట్టి ఊలు కొంటూంటే సూర్యానికి చాలా కష్టం తోచింది. అనవసరపు దండుగ అనిపించింది కానీ, తులసి మాట కాదనలేక కొని ఇచ్చాడు. రెండు నెలలు అతి శ్రద్ధగా అల్లి స్వెట్టర్ పూర్తిచేసింది తులసి. గొప్పగా దాన్ని సూర్యానికి చూపించింది. ఆ స్వెట్టర్ చూడగానే సూర్యానికి నవ్వూ, కోపమూ రెండూ వచ్చాయి. ఆ స్వెట్టర్ నిండా తప్పులే. అనేకచోట్ల ముళ్ళు పైకే కనిపిస్తున్నాయి. అస్తవ్యస్తంగా తయారయింది అది.
"ఛ! ఈ స్వెట్టర్ నన్ను తొడుక్కోమంటావా? ఎవరైనా ఇలాంటి స్వెట్టర్ తొడుక్కుని బయట తిరగ గలరా? అంత చేతకాని దానివి స్వెట్టర్ అల్లటానికి ఎందుకు తయారయ్యావ్? బోలెడు డబ్బు దండుగ పెట్టావు."
తులసికి గిర గిర కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సూర్యానికి స్వెట్టర్ అల్లి ఇవ్వటం కోసమే స్వెట్టర్ నేర్చుకుంది. ఎంతో శ్రద్ధగా రెండు నెలలలో అల్లింది. ఈ స్వెట్టర్ చూసి సూర్యం ఎంత ఆనందిస్తాడో, తన శ్రమను ఎంతగా మెచ్చుకుంటాడో అని ఎన్నో రకాలుగా ఊహించింది, చివరకు.....
రోషంగా సూర్యం చేతిలోంచి స్వెట్టర్ లాగేసుకుంది తులసి.....
"ఈ స్వెట్టర్ నువ్వు తొడుక్కోవద్దులే! నీ డబ్బు నీ ముఖాన్న పారేస్తాను_"
హోటల్లో అన్నంకూడా తినకుండా రొట్టిముక్కలు తిని చదువుకోసం డబ్బు దాచుకుంటోన్న సూర్యానికి డబ్బు విలువ బాగా తెలుసు. దానికితోడు తులసి పొగరుగా "నీ ముఖాన్న కొడతా" ననటం అతని మనసును మండించింది.
"ఆ! కొడతావు నా ముఖాన్న..... ఏదీ కొట్టు..... డబ్బు ముఖాన కొట్టటమంటే గోడకి పేడ పిడకలు కొట్టటం కాదు."