శ్రీహర్షని చూసి కళ్ళెగరవేశాడు పరంజ్యోతి. "సార్ నేను బి.కాం. పాసయ్యాను. ఈ ఏరియాలో మీకు చాలా పలుకుబడి ఉందని విన్నాను. మీ ఇన్ ఫ్లుయెన్స్ తో ఉద్యోగమేమయినా ఇప్పిస్తారేమోననీ..." అన్నాడు.
"పలుకుబడి వున్నమాట నిజమేననుకో. కాని ఉద్యోగాలు ఎక్కడయినా ఖాళీ ఉండాలి కదా.ఎలాంటి ఉద్యోగం చేస్తావు?"
"ఏదయినా సరే."
"చుట్టుప్రక్కల ఊళ్ళలో రెండు మూడు రైస్ మిల్లులున్నాయి. తవుడు నుంచి నూనె తయారుచేసే ఫ్యాక్టరీ ఒకటుంది చూద్దాం. అయిదారు రోజులాగి కనిపించు" అన్నాడు పరంజ్యోతి. ఆయన కూచున్న ఉయ్యాలబల్ల ఊగుతోంది.
ఆ తర్వాత శ్రీహర్ష అతన్ని రెండు మూడు సార్లు కలిశాడు. ఇదిగో అదిగో అని కాలయాపన చేస్తున్నాడు గాని, పని జరిగేటట్లు కనిపించలేదు. తర్వాత వెళ్ళి చలమయ్యను కలిశాడు.
చలమయ్య భోళామనిషి. లోపల చిన్న చిన్న బలహీనతలు లేవనికాదు. కాని ఎదుటివాడు నీ అంతటివాడు లేడని పొడిగితే ఉబ్బితబ్బిబ్బై పోతాడు. ఇతరులకు హాని చేసే తత్వం కాదు.
అతనికి హోల్ సేల్ బట్టల దుకాణముంది. చుట్టు ప్రక్కల ఇరవై ముప్పై గ్రామాల్లోని చిన్న చిన్న వర్తకులు అతని కొట్లోనే సరుకు కొనుక్కుంటూ ఉంటారు. చలమయ్య కు వెయ్యి వ్యాపకాలు. దుకాణంలో పూర్తిగా కూచోవటానికి తీరిక లేదు. అందుకని సమర్ధుడైన అసిస్టెంటు కోసం కొన్నాళ్ళుగా వెదుకుతున్నాడు. శ్రీహర్ష రూపం, అతని వినయ విధేయతలు చలమయ్యకు నచ్చాయి.
"ఏ ఊరు కుర్రాడా నీది" అన్నాడు చుట్ట నోట్లో పెట్టుకొని రెండుసార్లు పీల్చాక.
శ్రీహర్ష చెప్పాడు. "అబ్బా! చాలా దూరమే. ఈ మాత్రం ఉద్యోగం అక్కడ దొరక్కనా యింతదూరం వొచ్చావు?"
"అదికాదండీ, ఈ ఊరు, ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చాయి."
"ఇక్కడి మనుషులు కూడా నచ్చాయి కదూ" అంటూ చలమయ్య నవ్వాడు. అందులో జోకేమిటో అర్థంకాక పోయినా శ్రీహర్ష కూడా మృదువుగా నవ్వి ఊరుకున్నాడు.
"ఉద్యోగం ఇస్తాననుకో. డబ్బుతో వ్యవహారం మరి జాగ్రత్తగా మసులుకోవాలి."
"అలాగేనండి."
"నేను పై నుండి అవసరమైన సలహా ఇస్తూ వుంటాను. కొట్టు వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోవాలి."
"అలాగేనండీ."
"మరి జీతమెంత కావాలంటా?"
"ఏమీ ఇష్టమండీ."
"మూడొందలిస్తాను. చాలా?"
"మీ ఇష్టమని చెప్పాను కదండీ."
"అన్నిటికీ నీ యిష్టం. నీ యిష్టం అంటే నీ కడుపు నిండద్దుటయ్యా. అయినా బి.కాం. చదివినవాడికి మూడొందలివ్వడం నాకే అవమానం. అయిదొందలిస్తాను. ఏమంటావు?"
"చాలా థాంక్సండీ"__
"రేపట్నుంచే డ్యూటీలో జాయినవు."
"అలాగేనండీ."
3
వర్ష స్కూలుకు బయలుదేరింది. చేతిలో రెండు మూడు పుస్తకాలున్నాయి. నీలంరంగు పరికిణీ మీద చిన్న చిన్న నీలం చుక్కలున్న వోణీ వేసుకుంది. ఈ ఊళ్ళో మంచి స్టాండర్డ్ ఉన్న స్కూలు లేదు. ఇక్కడి టీచర్లు సరిగ్గా పాఠాలు చెప్పరు. పైగా క్లాసులో అమ్మాయిలుంటే ఒళ్ళు బళ్ళు తెలియకుండా పిచ్చిపిచ్చి జోకులన్నీ వేస్తారు. అందుకని అక్కడికి రెండుమైళ్ళ దూరంలో ఉన్న రామాపురంలో ఉన్న స్కూల్లో చదువుకుంటోంది.
ఆ రోజు ఉదయం పేపర్లలో టెన్త్ క్లాస్ రిజల్సు వచ్చాయి. వాటితోబాటు స్టేట్ ఫస్ట్, ఇంకా మంచి మంచి ర్యాంక్ లొచ్చిన అమ్మాయిల వివరాలన్నీ పడ్డాయి. జ్యోతి, సుధ, మంగళ...
అవిచూసి ఆమె హృదయం ఉప్పొంగిపోయింది. తను కూడా అలా చదవాలి. స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. తాను ఇప్పటికే స్కూల్ ఫస్ట్. అందుకే అక్కడి టీచర్లందరూ తనని అభిమానంగా చూస్తారు.