Previous Page Next Page 
మహాప్రస్థానం పేజి 11


                                  ఐ

భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదికముందు అస్రనైవేద్యం!

లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్య డోల!
నా ఊళ కేదారగౌళ!

గిరులు, సాగరులు, కంకేళికామంజరులు,
ఝరులు నా సోదరులు!
నే నొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం.

                                                                          1-6-1934

                            *  *  *

 Previous Page Next Page