Previous Page
Next Page
మహాప్రస్థానం పేజి 10
ఆశాదూతలు
స్వర్గాలు కరిగించి, స్వప్నాలు పగిలించి,
రగిలించి రక్తాలు, రాజ్యాలు కదిపి-
ఒకడు తూరుపు దిక్కునకు!
పాపాలు పండించి, భావాలు మండించి,
కొలిమి నిప్పులు రువ్వి, విలయలయ నవ్వి-
ఒకడు దక్షిణ దిక్కు!
ప్రాకారములు దాటి, ఆకాశములు తాకి,
లోకాలు ఘూకాల బాకాలతో నించి,
ఒకడుదీచికి!
సిందూర భస్మాలు, మందార హారాలు,
సాంద్రచందనచర్చ సవరించి ఒకడు
పడమటికి!
మానవకోటి సామ్రాజ్యదూతలు, కళా
యజ్ఞాశ్వముల్ గాలులై, తరగలై, తావులై,
పుప్పొళ్ళు, కుంకుమల్, పొగలై సాగిరి!
1-6-1934
* * *
Previous Page
Next Page