Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 11


    "మస్తీ దిగలేదు. మాదర్ చత్ కు మారో హజావ్ కో" అని జవాన్లకు ఆజ్ఞాపించి చెమట తుడుచుకున్నాడు అమీను.

 

    నలుగురు జవాన్లు చింతబరికెల్తో బాదుతుంటే మొత్తుకున్నాడు, అరచాడు, కేకలు పెట్టాడు. విన్ననాథుడు లేడు. బాధ భరించరానిదయింది. "రాసిస్తా దొరా రాసిస్తా" అని కేకలు పెట్టాడు.

 

    "దారికొచ్చిండులె...కొడుకు దించుండి." ఆజ్ఞాపించాడు అమీను.

 

    జవాన్లు రావఁడిని దించారు. అమీను ఆజ్ఞ మేరకు సాహుకారు ఇంటికి తీసుకెళ్ళారు. సాహుకారు విక్రయపత్రం మీద రావఁడి అంగుష్టం వేయించుకున్నాడు. సాహుకారు ఇచ్చిన ఈనాములతో జవాన్లు, వళ్ళు మంటలతో రావఁడు ఇళ్ళకు చేరుకున్నారు.

 

    గడ్డం గీకడానికి వచ్చాడు రావఁడు. గీకుతూ జరిగిన కథంతా వినిపించాడు రఘుకు. వంటిమీద ఇంకా వున్న దద్దులు చూసి "ఎర్కలె కడుగుత బాంచను. ఏమనుకోకండి కట్టుకపోయే టంతుండె కోమటోడికి కాల్మొక్త. ఏం చేసుకుంటడుండి గరీబోళ్ళ భూములు గుంజుకొని. గా అమీను సాబేమో వానికే పలికె. వీళ్ళ అమ్మల అక్కల... కడుపు మండుతాంది. గులాపోణ్ణి" అని కంట తడి పెట్టాడు. నేల చెక్క తల్లి సమానం వాళ్ళకు. తల్లి పోయినట్లు విలపించాడు.

 

    రఘు ఆలోచనలో పడ్డాడు. ఎంత దౌర్జన్యం? ఎంత హింస? అధికారము గలవాళ్ళు అమాయకులను ఆటబొమ్మలుగా చేసుకున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు వాటితో ఆడుకుంటారు. అవసరం లేనప్పుడు నలక్కొట్టి అవతల పారేస్తారు. అసలు ఇక్కడ ఒక శాసనమంటూ ఉందా? దండనమే శాసనమా? ఇక్కడి ప్రజ ఎంత అమాయకులు! ఇన్ని దెబ్బలు తిన్నాడు. ఉన్న నేలచెక్క పోగొట్టుకున్నాడు రావఁడు. కాని వారిని పల్లెత్తి మాట అనడు. మళ్ళీ చాకిరి చేయడానికి వస్తూనే వున్నాడు. రావఁడు తనను ఒక ప్రశ్న అడిగాడు. దానికి ఏమని సమాధానం చెప్పాలి? అతనికి ఎలా సహాయం చేయాలి.

 

    "అంగుష్టం ఎందుకు పెట్టినవ్?" ఏమీ తోచక అడిగిన ప్రశ్న అది.

 

    "అయ్యొ నీ బాంచను. ఎల్లడుగుత వేముండి. పెట్టకుంటె ఊళ్ళ బతుకుతాముండి. దొరలు బతకమంటె బతకాలె. చావమంటె చావలె. ఒకపా లైమైందనుకున్నారు. చాకలోడు జర ఆలస్యం గొచ్చిండు తాసిల్దారింటికి. "ఏందిర మస్తి ఎక్కిందా" అన్నడట తాసిల్దారు దొర. ఏమో జవాబు చెప్పిండట బాంచను. ఇక అడుగుతారు కొట్టి చంపిండు కాదుండి గులాపోణ్ణి. చంపి బాయిబొంది లేసిండు. ఏందో మా నసీబిట్లున్నది. కాల్మొక్త. మల్ల ఎవరితోనన్న చెప్పేరు బాంచను. కడుపు మండి ఎల్లకక్కిన."

 

    రఘు గుండె మండింది. రక్తం తుకతుక ఉడికింది. కళ్ళు ఎర్రవారేయి. వళ్ళంతా వడికింది, ఉద్రేకం వచ్చింది. కోపం పొంగింది. అలాంటప్పుడు ఆలోచన ఏమి వస్తది? అది మెదడు మొద్దుబారే దశ.

 

    రఘును చూచి రావఁడు వణికిపోయాడు. అదిరిపోయాడు. కాళ్ళ మీద పడ్డాడు. "ఇగ చెప్పను నీ కాల్మొక్త. మీ పాదాల కాడ పడుండె టోండ్లం బాంచను, తప్పైంది గులాపోణ్ణి కడుపు మండింది. ఎల్లకక్కిన. ఇగ ఎన్నడు చెప్పను దొర గులాపోణ్ణి రచ్చించండి కాపాడండి" అన్నాడు.

 

    రఘు ఆవేశం ఆశ్చర్యంగా మారింది. కనీసం ఒప్పుకోడానికి వీల్లేని దశ. అలాంటప్పుడు తనను నమ్మి చెప్పుకున్నాడు. తాను రావఁడిని ఓదార్చలేకపోయాడు. తనని చూచే అదిరిపడుతున్నాడు రావఁడు. ఏం చేయాలి? ఎలా ఓదార్చాలి?

 

    "కోపం నీమీద కాదు. రావఁడూ, కోపం తాసిల్దారుమీద, అమీను మీద, వెంకయ్యమీద, ఈ వ్యవస్థమీద"...

 

    తరువాత అన్నవి రావఁడికి వినిపించలేదు. అర్థం కాలేదు. ఆ రెండు వాక్యాలే అతనికి ఆశ్చర్యం కలిగించాయి. కాళ్ళు వదిలి రావఁడు రఘును నఖశిఖ పర్యంతం చూచాడు. ఆ చూపులో ఆదరం వుందో, అభిమానం వుందో, గౌరవం వుందో చెప్పడం కష్టం. తాసిల్దారు మీద, అమీను మీద కోపం తెచ్చుకునే వాడున్నాడా ఈ లోకంలో? అనుకున్నాడు రావఁడు. తన ముందు దేవుడు ప్రత్యక్షం అయినట్లనిపించిందతనికి. అతడు వరం కోరుకోమన్నా తాను కోరదలచలేదు. తనకు భూమి అవసరంలేదు. నేల అవసరంలేదు. అమీను మీద పగతీర్చుకోవలసిన పనిలేదు. తన గోడు వినే దేవత యితడు! తన బాధ విని కోపం తెచ్చుకున్న దొర యితడు! చాలు-చాలు-అంతే చాలు తనకు. అలా మనసులో అనుకున్నాడు. చేతులు జోడించాడు. పూడిన గొంతుతో "ధరమ దొరలు" అన్నాడు. అతని హృదయం పొంగింది. ఒక స్తోత్రం చదవాలనుకున్నాడు. కాని ఆ రెండు పదాలే అనగలిగాడు. అంతకంటే రా దతనికి. మిగతాది కళ్ళతో అప్పచెప్పాడు.

 

    రఘు ఉక్కిరి బిక్కిరి అయినాడు. ఆ ప్రేమను, ఆ ఆదరాన్ని, ఆ గౌరవాన్ని, ఆ భక్తిని భరించలేకపోయాడు.

 

    "రావఁడూ! మామయ్యతో చెప్పి పోయినంత భూమి ఇప్పిస్త చేసుకో" అన్నాడు.

 

    అడక్కుండానే వరం యిచ్చాడు దేవత. అప్పుడు రావఁడిలో ఏమేమి భావాలు ఉత్పన్నం అయినాయో. అతడా ఎంత తబ్బిబ్బు అయినాడో రాయడం కష్టం. "అట్లనే దొర నీ బాంచను. ధరమ దొరలు. మీ అసుమంటోళ్ళు వుండబట్టే గరీబోళ్ళు ఇంకా బతుకుతాన్రు కాల్మొక్త." అని పొది పట్టుకొని బయటపడ్డాడు రావఁడు.

 

    మధ్యాహ్నం భోజనాల సమయంలో వీరయ్యగారికి రావఁడి కథంతా చెప్పాడు. వారికేమి ఆశ్చర్యం కలుగలేదు. అది నిత్యకృత్యమే అక్కడ. కాని రఘు రావఁడికి చేసిన వాగ్దానాన్ని గురించి విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది.

 

    "నాయ్నా రఘూ! నువ్వు మంచి మంచి మాటలు చెప్పుతున్నవు. మంచిపన్లే చెయ్యాల్నని చూస్తున్నవు. కాని నాకేదో భయం భయం గున్నది. ఈడ సర్కారు చేసేటోండ్లు సైతాన్లు! సైతాన్లు!! వాండ్లమీదికి కయ్యానికి దిగుతున్నవు. ఇది మంచిదికాదు నాయనా! దేవుడిచ్చిండు కట్కపోయేటంత. రెండు బీగాలిస్తే ఏంపోతదిగని. తాసిల్దారే మనుకుంటడో, అమీను సాబే మనుకుంటడోనని భయంగున్నది. వాళ్ళకాడనే బతకాలెగద ఎంతైన? సరే మాటిచ్చినవు గద. తప్పుతాది" అననైతే అన్నారు కాని వీరయ్యగారి గుండె వేగంగా కొట్టుకోసాగింది.

 

    గమనించాడు రఘు. మెల్లగా ప్రారంభించాడు.

 

    "మామయ్యా! భయం మనిషిని నీరసింపచేస్తది. మనం భయపడుతున్నం కాబట్టి వాళ్ళు పెత్తనం చేస్తున్నరు. తాసిల్దారంటే ఇన్ని వేలమంది భయపడుతున్నారు కనుకనే వాళ్ళు అందరినీ వడికిస్తున్నరు. నలుగురు పోలీసులతో అందరిని అణచి పెడ్తున్నరు. భయం బలహీనతకు గుర్తు. మనం భయాన్ని జయించాలె. అది మనం మొదలు చేయాల్సింది. మనం భయాన్ని వదులుకుంటే ఇన్ని వేలమంది భయం తాసిల్దారులో చేరుతుంది. అన్ని వేలమంది భయం ఒక్కడు భరించలేడు. ఆవురుమని చస్తాడు. మనకు వేరే ఆయుధం అక్కరలేదు. నిర్భయంగా ఉండటమే మన ఆయుధం."

 

    వీరయ్యగారికి రఘు ఉపన్యాసం అంతగా అర్థం కాలేదు. అసలు వారిలో భయం ఉంది! ఒకసారి గుడ్లగూబను గురించీ, చీకట్లను గురించీ ఇలాంటి ఉపన్యాసమే ఇచ్చాడు. ఆలోచిస్తే అది నిజమే ననిపించింది. భయం కూడా అలాంటిదేమో ననుకున్నాడు.

 

    పులుసు గిన్నె పట్టుకొని నుంచున్న జానకి 'పావెల్' ఉపన్యసిస్తున్నట్లనిపించింది. కాని ఈ భయం ఎలా పోతుంది? అందుకు మార్గం ఏమిటి? అని అడుగుదామనుకుంది.

 

    ఆ ప్రశ్న వీరయ్యగారే వేశారు. "అప్పుడేమో చీకటన్నవు. ఇప్పుడేమో భయం అంటున్నవు. మరి చీకటి పోవాల్నా? భయం పోవాల్నా?"

 

    తన మామ తనను అర్థం చేసుకుంటున్నాడని గ్రహించాడు రఘు. ఉత్సాహం హెచ్చింది. ముందు ఇంట గెలవాలనుకున్నాడు. విడమర్చి చెప్పసాగాడు.

 

    "చీకట్లు, భయం ఈ రెండింటికి పరస్పర సంబంధం ఉన్నది. చీకటిని విడిచి భయంగాని భయాన్ని విడిచి చీకట్లుగాని ఉండలేవు. చీకటిని పారదోలితే భయం దానంతట అదే పోతుంది. చీకటిలో ఒక తాడును చూస్తము. దాన్ని పామనుకుంటము. భయం కలుగుతుంది. కెవ్వున అరుస్తము. లాంతరు తెచ్చి చూస్తే అది తాడని తేల్తది. అప్పుడు మన భయం దానంతట అదే పోతదా లేదా?"

 

    వీరయ్యగారు తదేకంగా వింటున్నారు జవాబేమీ చెప్పలేదు.  

 

    "చీకటిలో మనం ఉన్నాం కాబట్టి తాసిల్దారును పామనుకుంటున్నం. మనసు చీకట్లో ఉంచిండు కాబట్టి పామువలె పెత్తనం చేస్తున్నరు. అజ్ఞానం పోయిందనుకో. విజ్ఞానం అనే వెలుగు వస్తుంది. అప్పుడు తాసిల్దారు వట్టి తాడని తేలిపోతుంది. అప్పుడు భయం ఉండదు. భయం లేనప్పుడు తాసిల్దారు ఉండడు."

 

    అల్లుడు చెప్పిందాన్ని అర్థం చేసుకున్నారు వీరయ్యగారు. తన అల్లునితో ఇంత విజ్ఞానం ఉందని కనీసం వారు ఊహించలేదు. సాక్షాత్తుగా చూస్తూ మురిసిపోయారు. అయినా వారిని భయం వదల్లేదు. ఆ భయంతోనే లేచి చేయి కడుక్కున్నారు. తువ్వాలుతో చేతులు తుడుచుకుంటూ అడిగారు.

 

    "ఎవ్వరి భయం లేకుంటే సర్కారెట్ల నడుస్తది?"

 

    రఘు కూడా చేయి కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. జానకి వడ్డించుకుని కూర్చుంది. శ్రద్ధగా వింటూంది.

 

    "కాలం మారిపోయింది. జనాన్ని గడ గడ లాడించి పాలించిన రాజులు చక్రవర్తులు పోయిన్రు. ఫ్రాన్సులో ప్రజలు తిరుగుబాటు చేసిన్రు. విప్లవం తెచ్చిన్రు. రాజులను  కూలదోసిన్రు. ప్రజలే ఏలుకుంటున్రు. అమెరికాలో స్వాతంత్ర్య యుద్ధం జరిగింది. తెల్లదొరలను తెల్లవారే ఎదిరించిన్రు. ఓడించిన్రు. అక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది. ఆ రాజ్యం ప్రజలది. ప్రజల నుండి వచ్చింది. ప్రజలకొరకు పని చేస్తున్నది. రష్యాలో జార్ చక్రవర్తులు అతి క్రూరంగా ప్రజలను పీడించిన్రు. అక్కడ రైతులు కూలీలే తిరగబడ్డారు. చక్రవర్తులను కూలదోసిన్రు. పేదల రాజ్యం ఏర్పరచుకున్రు. ఇప్పుడు అక్కడ పేదలు ధనికులు లేరు. అంతా సమానమే. స్వంత ఆస్తిలేదు. ఆస్తి ప్రజలది. సంపద ప్రజలది. ప్రభుత్వం ప్రజలది. 

 Previous Page Next Page