మనిషి ఓ మహోన్నతస్థితికి ఎదిగిపోయినప్పుడు అతనిమీద ఈ నెగెటివ్ థాట్ అంతగా వుండదు ఎప్పుడో తప్ప. అతనా నెగెటివ్ థాట్ ను ఎప్పుడో దాటేసి వుంటాడు. ఉదాహరణకు ఓ గొప్ప కళాకారుడు, మహానటుడు, మహోన్నత శిఖరాలను అధిరోహించిన క్రీడాకారుడు, చాలా పెద్ద వ్యాపారస్థుడు- అలా ఎన్నో రంగాల్లో కాని ఈ ఆలోచన కూడా నిజం కాదేమోననిపిస్తుంది. వారిమీద అనుకూల భావంతో వున్నట్టు కనబడుతూనే అంతర్లీనంగా కొంత వ్యతిరేకాభిప్రాయాలు దాక్కుని వుంటాయి. ఎప్పుడో అవకాశమొచ్చినప్పుడు, ఉన్నట్లుండి విరుచుకుపడతాయి. అంటే అప్పటిదాకా అణగిపడి వుంటాయన్నమాట.
మా స్నేహితుడు ఒకాయన వున్నాడు. ఇంజనీర్ మనిషి మంచివాడే కాని అతనితో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా వుంటుంది. చిన్నది కానీ పెద్దది కానీ ఏ విషయంమీదనైనా సరే కొన్ని వ్యతిరేకాభిప్రాయాలు కలిగివుంటాడు. జీవితంలో తానొక్కడే ఎంతో శ్రమపడి పైకి వచ్చాడు. మిగతా వాళ్ళంతా పెద్దల వూతంతోనో, గాలివాటంగానో పైకి వచ్చారు. తాను జీవితాన్ని కాచివడబోశాడు. అలా.... ఓ గూడు నిర్మించుకుని వుంటాడు.
మనం చెప్పే ఏ విషయంతోనూ ఏకీభవించడు. ఏ టాపిక్ అయినా ఎత్తండి, ఒకటి రెండు నిముషాలన్నా సాగకముందే ఖండించటం మొదలుపెడతాడు. అతనికి ఎవరిమీదా సదభిప్రాయం వుండదు తాను నమ్మిన ఒకరిద్దరు దేవుళ్ళమీద తప్ప. ఆ దేవుళ్ళలో ఇతరులు గుర్తించని గొప్పతనం, ప్రత్యేకతలు తానుమాత్రమే గుర్తించినట్టు మాట్లాడుతూ వుంటాడు. అతనికెవరూ నచ్చరు. ఇతరులకు కలిగిన మానసిక గాయాల గురించి మాట్లాడవలసిన సందర్భమొచ్చినా, అలా గాయపడటం అర్ధం లేదని వితండవాదం చేస్తూంటాడు. తనకు తగిలిన గాయాలగురించి మాత్రం విశిష్టంగా వర్ణించుకుంటూ వుంటాడు.
ఒక్కోసారి అతన్ని చూస్తే భయమేస్తుంది. అతనితో స్నేహం మానేద్దామా అనిపిస్తూ వుంటుంది.
ఇది ఒక స్థాయి...
ఒక్కొక్కరిలో ఒక్కొక్క పరిధిలో ఈ నెగెటివ్ నెస్ వుంటూ వుంటుంది.
ఎవరూ ఎవర్నీ హర్షించలేరు.
సందర్భం వున్నా లేకపోయినా ఎదుటివారి గురించి అవహేళనతో కూడిన వ్యాఖ్యానాలు.
ఆ వ్యాఖ్యానాలు మామూలుగా వుండవు. అసహ్య భాషతో, వికృతభావనతో నిండి వుంటాయి. సమాజంలో అతని ప్రతిష్టనూ, వ్యక్తిత్వాన్నీ కించపరిచేస్థాయిలో వుంటాయి.
అతనిలో ఏ మంచీ లేనట్లూ, అతను ఒట్టి దుర్మార్గుడు అయినట్లూ.... విపరీతంగా వుంటాయి.
వాళ్ళు చేసేవి ప్రభుత్వోద్యోగాలు లేకపోతే బ్యాంకులలాంటి ప్రజాసేవకోసం ఉద్దేశించిన సంస్థలు, వారు కూర్చునే సీట్లు కస్టమర్స్ కి సాయం చేయటంకోసం నిర్దేశించినవి. వాళ్ళకోసం వచ్చేవారికి 'హెల్పింగ్ హాండ్' అందివ్వటానికి వారు సిద్దంగా వుండాలి.
కాని తాము 'కస్టమర్స్'కు సాయం చెయ్యటంకోసం నియమితులమయ్యామన్న ప్రాథమిక సూత్రం వారి ప్రవర్తనలో ఏ కోశానా కనపడదు.
"అబ్బో! చాలా కష్టమండీ ఒకరకంగా చెప్పాలంటే ఇంపాజిబుల్" అని వేరే పేపర్ చూసుకునేందుకన్నట్లు అసహనంగా ముఖంపెట్టి చూపులు మార్చేస్తారు.
జాగ్రత్తగా గుర్తుచేసుకోండి. మీ జీవితంలో ఇలాంటి సన్నివేశాలు ఎన్ని ఎదుర్కొన్నారో, లోన్ కోసం బ్యాంక్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళినప్పుడు, పొరపాటువల్లో, అజాగ్రత్తవల్లో, నిజంగా తప్పుచేసి సస్పెన్షన్ కు గురై, కోర్టుచుట్టూ తిరిగి తిరిగి, మళ్ళీ ఉద్యోగంలో చేరటానికి కోర్టు తీర్పు ఇచ్చినా, ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకుని సంబంధిత అధికారుల దగ్గరకు వెళ్ళినప్పుడూ, రిటైరై పెన్షన్, పి.ఎఫ్. వగైరాలు పొందవలసి వచ్చినప్పుడూ, పిల్లల సీట్లకోసం పెద్దపెద్ద స్కూల్స్ కు వెళ్ళినప్పుడూ, ఇల్లు కట్టుకు నేందుకు ప్లాన్ మంజూరు చేయించుకోవటంకోసం అధికారులచుట్టూ తిరిగినప్పుడూ ఒక స్త్రీ గవర్నమెంట్ ఉద్యోగి అయిన తన భర్తగురించి, దాని తాలూకు పెన్షన్ వగైరాలు పొందవలసి వచ్చినప్పుడూ... ఇలా ఎన్నో...
నిస్సహాయస్థితిలో వున్న వ్యక్తి విలవిలలాడుతూ ప్రాధేయపడుతూంటే ఆ అధికారి చాలా దీర్ఘంగా ఆలోచించినట్లు భంగిమలు మార్చి "చూద్దాం, తర్వాత కలుసుకోండి" అంటాడు.
ఈ మాటలు అమృతంలా ధ్వనించి, వాళ్ళచుట్టూ రమ్మన్నప్పుడల్లా తిరుగుతుంటే "ఈవేళ లాభం లేదండీ, ఊహూ... తర్వాత..." ఇలా వాయిదాలూ వేస్తూ, శాడిజంలోని ఆనందాన్ననుభవిస్తూ...
బహుశా మీరూ ఆఫీసర్లయి వుంటే అలాంటి వికృత ప్రవర్తనను మీరూ ప్రదర్శించి వుంటారు. మీరేం తక్కువవారని నేననుకోవటంలేదు. చాలా సందర్భాలలో మీరూ ఇంతే కాఠిన్యంతో, వ్యతిరేకపుటాలోచనలతో ప్రవర్తించి వుంటారు. అయితే ఈ సత్యం మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీలో వున్న ద్వంద్వ ప్రవృత్తిని మీరు అంగీకరించలేరు కాబట్టి. మీరు చాలా మంచివారని మీరనుకుంటున్నారు కాబట్టి.
నెగెటివ్ థింకింగ్ కు ఓ ప్రత్యేకమైన కారణమక్కర్లేదు
అది ఓ వ్యసనం.
మా కాంపౌండర్ ఒకతను వున్నాడు. ఈ వ్యాసం అతను చదువుతాడో లేదో తెలీదు. చదివితే నా మీద ద్వేషం ఇంకా పెంచుకుంటాడని మాత్రం నాకు తెలుసు. పేషెంట్ల రద్దీ వున్న సమయంలో వరుసలో పిలవకాపోతే, ముందు వచ్చినవారు బాధపడతారు కాబట్టి, వరుస ప్రకారం పిలవమని ఎంత చెప్పినా వెనుక వచ్చినవారిని ముందూ, ముందు వచ్చినవారిని వెనకా పిలుస్తూ వుంటాడు. అలా పిలవటంలో పేషంట్స్ తో ఘర్షణ పడటంలో ఓ పైశాచికానందాన్ని అనుభవిస్తూ వుంటాడు. పక్కవారు బాధపడుతున్నప్పుడు మనిషి ఎందుకు ఆనందిస్తూ వుంటాడు?
చిత్రమేమిటంటే అలా ఆనందిస్తున్నందుకు తర్వాత పశ్చాత్తాపపడడు, సిగ్గుపడడు కూడా అదో జన్మహక్కయినట్టు భావిస్తూ ఉంటాడు.
ఈ నెగెటివ్ నెస్ మనిషిని జీవితంలో ఎంతో వెనక్కి నెట్టేస్తూ వుంటుంది. ఈ సత్యం తెలుసుకునే లోపల అతను చాలా జీవితహాన్ని కోల్పోతాడు. అయినా పొరపాటు ఎక్కడుందో తెలుసుకోలేక పోతూంటాడు.
మనం ఇతరుల గురించి మంచి భావనతో వుంటే ఆ భావన అవతలవ్యక్తికి మంచి చేయటమే కాక, తిరిగివచ్చి మనకి కూడా మంచి చేస్తూ ఉంటుంది. ఇతరుల గురించి చెడుభావనతో వుంటే... అది వారికి హాని చెయ్యదు సరికదా తిరిగివచ్చి మనకే కీడు కలగజేస్తూ వుంటుంది.
దీనికీ, భగవంతుడికి సంబంధంలేదు. ఇది సృష్టిలోని ఓ చిత్రమైన ఏర్పాటు.
అంటే సృష్టిలో..... పోనీ విశ్వవ్యాప్తంగా మనచుట్టూ ఆవరించివున్న వాతావరణంలో 'మంచిఆలోచన' అన్న విశ్వాసానికి బలీయమైన, పవిత్రమైన ఓ వైబ్రేషన్ నాడి వున్నదన్నమాట. అది ప్రకృతి ఇచ్చిన ప్రసాదం. ఈ మంచి ఆలోచనకో శక్తి వుంది. అది పవిత్రంగా పనిచేస్తూ వుంటుంది. అలాగే చెడు ఆలోచనకు కూడా ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా చివరికి తననే చేరి దహించేసే ఇంకోరకం శక్తివుంది.
పాజిటివ్ థింకింగ్, మంచి ఆలోచనా ఈ రెండూ కలిసివుండాలి. అంటే పాజిటివ్ థింకింగ్ లో చెడు మిశ్రితమై వుండకూడదు.
అంటే...
నేనివాళ ఈ వెధవపని చేస్తున్నాను. చేస్తున్నాను. ఇది నాకు కలిసివస్తుంది. తప్పక కలిసివస్తుంది.