ఇక తను ఓ మెట్టు దిగిరాకపోతే చాలా గొడవ అవుతుందనిపించి తిలక్ ని బ్యారెక్కుకు మార్చాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి తన గుండెలమీద ఎక్కి కసిగా తొక్కుతున్నట్టే వుంది. ఇదంతా పత్రికలకు ఎక్కడం ఇష్టం లేక క్రిందకు దిగి వచ్చాడు. తోటలోని ఖైదీల దగ్గర కెళ్ళి వాళ్ళ డిమాండ్ ను ఒప్పుకుంటున్నట్టు ప్రకటించాడు.
బుద్ధుడు, ఉత్తరుడు ఠక్కున పైకిలేచి "తిలక్ కీ జై" అని అరిచారు. అంతవరకు మాటలు మరిచిపోయినట్టున్న ఖైదీలు గొంతులు పగిలిపోయేలా అరుస్తూ వాళ్ళతో శృతి కలిపారు.
ఇద్దరు వార్డర్లు వెళ్ళి ఎల్ సెల్ తలుపు తెరిచారు.
"రండి తిలక్ గారూ! అక్కడ మీకోసం మీ మిత్రులంతా వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని బ్యారెక్కుకు మార్చారు" అన్నాడు ఓ వార్డర్ వ్యంగ్యంగా.
కుష్ఠు రోగులంతా తిలక్ చుట్టూ చేరారు. "వెళ్ళిపోతున్నారా సార్. మీరున్న ఈ రెండురోజులూ మేము కుష్ఠురోగులమన్న సంగతి మరిచిపోయాం. ఇంతవరకు మమ్మల్ని అసహ్యించుకోకుండా మనుషుల్లా చూసింది మీరే సార్"
వాళ్ళ ముఖాలు అరవాకోరవగా వుండటం వలన ఏ భావమూ రిఫ్లక్ట్ కాలేదు. పగిలిపోయిన అద్దం ముక్కల్లో అతికష్టం మీద ప్రతిబింబాన్ని వెదుకున్నట్టు ఆ భావాల్ని మనం పట్టుకోగలగాలి.
తను వెళ్ళిపోతున్నందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు గ్రహించాడు తిలక్. ఎంతో ఆప్యాయతతో వాళ్ళ భుజాల్ని తట్టి బయటికి నడిచాడు.
ఎలాంటి పరిస్థితుల్లో అతన్ని బ్యారెక్కుకు వచ్చింది చెప్పారు వార్డర్లు. తిలక్ కళ్ళు చెమర్చాయి.
శోక సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తికి దూరంగా ఆత్మీయత తెరచాప కట్టుకుని, అనురాగపు పడవలో వస్తున్న నేస్తాల్లా కనిపించారు బుద్ధుడు, ఉత్తరుడు.
పరుగున వెళ్ళి వారిద్దర్నీ కౌగిలించుకున్నాడు. మిగిలిన వాళ్ళకు కళ్ళతోనే కృతజ్ఞతలు తెలిపాడు.
సరిగ్గా అప్పుడే చిత్ర తన ఇంటి డాబామీద నిలబడి బైనాకులర్స్ లోంచి తిలక్ ని చూసింది మొదటిసారి. రాయుడు చెప్పిన దానికన్న మరింత జాగ్రత్తగా వుండాలని ఆమెకు ఎందుకనో అనిపించింది.
అతన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆమె ఆ క్షణం నుంచి ఆలోచించటం ప్రారంభించింది.
* * * *
తిలక్ చెట్లకు పాదులు చేస్తున్నాడు. అప్పుడు ఉదయం పది గంటలయింది. ఖైదీలలో చాలామంది తోటలలో పని చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు క్రాప్ట్ రూమ్ లో వివిధ చేతివృత్తుల్లో నిమగ్నులయి వున్నారు.
తిలక్ జైల్ లోని ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు. పారిపోవడానికి ఏయే మార్గాలున్నాయో అన్నిటినీ అతను అన్వేషిస్తున్నాడు.
జైలు చుట్టూ పద్ధెనిమిది అడుగులు ఎత్తులో వున్న గోడ చూడటానికి భయం గొలుపుతోంది. దానిమీదనున్న మూడు కరెంట్ తీగలు యమపాశాల్లా వున్నాయి.
జైల్ నించి పారిపోవాలంటే ఆ గోడను దూకగలగాలి. అంత ఎత్తున్న గోడను ఎక్కడం కష్టసాధ్యం. ఒకవేళ ఎక్కినా, తీగలను ముట్టుకోకుండా అటువేపుకు దూకడం ఇంపాజిబుల్. మరి ఈ సమస్యను ఎలా అధిగమించి ఎలా అటువేపుకి చేరాలో అతను ఆలోచిస్తున్నాడు.
ప్రహారీగోడ వరకు రావాలంటే ముందు బ్యారెక్కు నుంచి బయటపడాలి. పగలే బ్యారెక్కునుంచి ఒదులుతారు. ఈ సమయంలో ఎవరికంటా పడకుండా గోడ దాటడం వీలుకాదు. కేవలం రాత్రి సమయంలో మాత్రమే గోడ దూకడం వీలవుతుంది.
సో... పగలు బ్యారెక్కు నుంచి బయటపడి రాత్రయ్యేవరకు జైల్లోనే దాక్కుని ఇక అప్పుడు గోడను దాటాలి. మరి కరెంట్ తీగలను ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు అతనికి.
కరెంట్ తీగలను ముట్టుకుంటే షాక్ కొట్టడమే కాదు. వెంటనే సైరన్ మోగుతుంది. దాంతో వార్డర్లు, గార్డులు అలెర్ట్ అయిపోతారు. వెంటనే చెకింగ్ ప్రారంభమవుతుంది. జైలునంతా చుట్టుముట్టేస్తారు.
పారిపోవడానికి ముందు జైలుకి ఎటువేపు ఏం వున్నాయో తెలుసుకోవాలనుకున్నాడు.
చుట్టూ పరికించి చూసాను దూరంగా సత్యనారాయణ అనే ఖైదీ మొక్కల చుట్టూ ఎరువు పోస్తూ కనిపించాడు. ఆయన కొన్నిరోజులపాటు జైలర్ వామనరావు ఇంట్లో పనిచేశాడు. అందువలన జైలుకి చుట్టూ ఏం వున్నాయో తెలుసు.
తిలక్ అతని దగ్గరకి వెళ్ళాడు.
ఖైదీలకు కాపలాగా వున్న ఆరుగురు వార్డర్లు జామచెట్టు కింద కూర్చుని పులీమేక ఆడుతున్నారు. వాళ్ళ ముందున్న లాఠీలు నల్లగా ఎండిపోయిన మచ్చల పాముల్లా వున్నాయి.
జైలు లోపల వుండే వార్డర్లు దగ్గిర లాఠీలే వుంటాయి. తుపాకుల్లాంటి ఆయుధాలుండవు. ఏ ఖైదీ అయినా తుపాకీ లాక్కొనే ప్రమాదం వుంటుందని వార్డర్లకు ఆయుధాలివ్వరు. జైలు బయట కాపలా కాచే గార్డుల దగ్గర మాత్రం తుపాకులుంటాయి. ఎప్పుడయినా జైలు లోపల విషమ పరిస్థితులు ఏర్పడితే గార్డులను పిలుస్తారు. ఖైదీలు పారిపోతే పోలీసులు రంగంలోకి దిగుతారు.
"ఏం సత్యనారాయణ! ఎలా వుంది మీ బ్యారెక్కు?" అని అడిగాడు తిలక్ ఉపోద్ఘాతంగా.
"ఏం బాగులే తిలక్ బాబూ. జైల్లో వుండే వాడెవడూ బావుండడు" సత్యనారాయణ నీరసంగా చెప్పాడు.
"అవునూ, ఈ జైలుకి పడమర ఏం వున్నాయి?"
"పడమరా బాబూ! రైల్వే క్వార్టర్స్ వున్నాయి! జైలర్ ఇంటి దగ్గర్నుంచి చూస్తే మొత్తం క్వార్టర్స్ అంతా కనిపిస్తాయి. వాటి వీధులు మన ప్రహారీగోడ వరకూ వున్నాయి"
"దక్షిణం?"
"దక్షిణం అంటే న్యూ జైల్ కావాలా? అటు సైడ్ కొంతవరకు ఖాళీస్థలం బాబూ. రైల్వేక్వార్టర్స్ మురికి నీరంతా ఆ పక్క నిలిచిపోతుంది. దాదాపు పదెకరాల మైదానం. మున్సిపాలిటీదట ఆ స్థలం. దానిని జైల్ కి ఇవ్వమని అడిగారట. ఇంకా ఆ విషయం పెండింగ్ లోనే వుంది. మైదానం దాటాక కాలేజీ వుంది బాబూ!"
దక్షిణం పారిపోవడమే అనుకూలంగా వున్నట్లనిపించి "మురికి నీరంతా చేరటం వలన గుంతలు ఏర్పడ్డాయా" అని అడిగాడు తిలక్.
"అక్కడక్కడా చిన్న గుంటలు తయారయ్యాయి బాబూ. మైదానం అంతా నీటితో చిత్తడి చిత్తడిగా వుంటుంది"
"తూర్పున?"
"ఏదో అలగా జనం ఇళ్ళున్నాయి.రిక్షావాళ్ళు, కూలీలు కాపురాలు వుంటున్నారు. ఇక జైలు ముందుభాగంలో గంగమ్మ గుడికి వెళ్ళే రోడ్డుంది. ఈ వీధి ఎప్పుడూ జనంతో రద్దీగా వుంటుంది. దుకాణాలు బాగానే వున్నాయి" అని ఏదో స్ఫురణకొచ్చిన వాడిలా "ఈ వివరాలన్నీ ఎందుకు బాబూ? పారిపోవాలనా?"