Previous Page Next Page 
జైలు పేజి 10


    తిలక్ శత్రువు అనుకోగానే ఆయన కళ్ళముందు తండ్రి ప్రత్యక్షమయ్యాడు. తనని ఇబ్బంది పెట్టడానికే తండ్రి తిలక్ రూపంలో వచ్చినట్టు భావించాడు.

 

    ఎలాగయినా తండ్రిని గెలవాలన్న పట్టుదల ఆయనలో.

 

    అందుకే మొదట దాదా గ్రూప్ వాళ్ళను బుజ్జగించాలనుకున్నాడు. తరువాత తిలక్ గ్రూప్ వాళ్ళని ఒంటరిచేసి అటో ఇటో తేల్చుకోవాలనుకున్నాడు.

 

    "పాత్రలను కళాయిలేయించి  ఎన్ని రోజులైంది" అని అడిగాడు.

 

    "చాలా రోజులే అయ్యింది సార్. చిలుంపట్టిన ఆ పాత్రల్లో వండడం వల్ల వంటకాలన్నీ ముక్క కంపు కొడుతున్నాయి. చాలామంది ఖైదీలు విరోచనాలతో బాధపడుతున్నారు. అందునా కొన్ని పాత్రలకు చిల్లులు పడ్డాయి.వాటికి చింతపండు అతికించి యెలానో లాక్కొస్తున్నాం సార్. కానీ వండేప్పుడు చింతపండు వేడికి కరిగిపోయి మంట లోపలికి పోయి కూరలన్నీ మాడువాసన వేస్తున్నాయి సార్."

 

    శ్రీపతికి ఆ మాటలు వింటుంటే పొయ్యి సెగ తగిలినట్లే వుంది. అందుకే ఆయన అరిచాడు "మరి ఇన్ని రోజులు ఇదంతా నాకెందుకు చెప్పలేదు. వెంటనే పాత్రలన్నిటికీ కళాయి పోయించండి. చిల్లులుపడ్డ పాత్రలకు అతుకులు వేయించండి"

 

    వామనరావు బిక్కచచ్చిపోయాడు.

 

    "అలానే సార్" అని అక్కడినుంచి కదలబోయాడు.

 

    "ఆగండి" శ్రీపతి గద్దించినట్టు అనడంతో అలానే నిలబడిపోయాడు.

 

    "కళాయి పోయిస్తున్నామని చెప్పి దాదా గ్రూప్ ఖైదీలను సమ్మె ముగించమని చెప్పండి. ఇక తిలక్ గ్రూప్ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరెళ్ళి హెడ్ వార్డర్ ఆర్ముగాన్ని, డిప్యూటి జైలర్ రంగారావునీ పంపండి" అన్నాడు.

 

    వామనరావు తల ఆడించి వెళ్ళిపోయాడు.

 

    ఆర్ముగం, రంగారావు మరో అయిదునిముషాలకు ఆ గదిలోకి వచ్చారు. సమ్మెను ఎలా బ్రేక్ చేయాలో చెప్పాడు శ్రీపతి.

 

    పెద్దదొర ఆర్డర్ కావడంతో తోటలో కూర్చుని సమ్మె చేస్తున్న ఖైదీల మీద తమ ప్రతాపం చూపించడానికి అక్కడినుంచి కదిలారు వాళ్ళిద్దరూ.

 

    బావి దగ్గర ముప్ఫైమంది ఖైదీలు బైఠాయించారు. వాళ్ళ ముందు కంచాలు బోర్లించి వున్నాయి. కడుపుల్ని బయటకు తీసి అందులోని పేగులన్నీ ఏరివేసి ఎండకు ఆరబెట్టినట్టు? అల్యూమినియం కంచాలు ఎండలో విచిత్రంగా మెరుస్తున్నాయి. వాళ్ళు ఎలాంటి స్లోగన్లు చేయకుండా మౌనం పాటిస్తున్నారు. ముందు కూర్చున్న బుద్ధుడు,ఉత్తరుడు చేతుల్లో మాత్రం ప్లేకార్డులున్నాయి. తిలక్ ని బ్యారెక్కుకు మార్చాలన్న డిమాండ్ ను వాటిమీద సుద్దముక్కతో రాసారు.

 

    మరో అరగంటకు వాళ్ళముందు రెండు పెద్ద పాత్రల్ని పెట్టించారు ఆర్ముగం, రంగారావు. ఆ పాత్రలో సలసల కాగుతున్న వేడినీళ్ళ పొగలు వారుతున్నాయి. తమ ముందు వేడినీళ్ళు ఎందుకు వుంచారో ఖైదీలకు అర్థమైంది. తమ నాయకుడ్ని ఎల్ సెల్ నుంచి తప్పించాలన్న దృఢమైన కోర్కె వాళ్ళకు ధైర్యాన్ని, అదో విధమైన తెగింపు ఇస్తోంది.

 

    "సమ్మె మానేస్తారా.....లేక వేడినీళ్ళను మీమీద గుమ్మరించమంటారా?" సీరియస్ గా ఒక్కో మాటను వత్తి పలికాడు రంగారావు.

 

    ఖైదీలలో చలనం లేదు.

 

    ఏదో దెయ్యం పూనినట్టు రంగారావు ఠక్కున వంగి మగ్ లోకి వేడినీళ్ళను ముంచుకున్నాడు.

 

    "చల్లండి" అని పక్కనున్న వార్డర్లతో అని తన చేతినున్న మగ్ లోని నీళ్ళను బలంకొద్దీ విసిరాడు. అంతే.... మిగిలిన వాళ్ళూ ఆయన్ను అనుసరించారు.

 

    నీళ్ళుపడిన చోట చర్మం మండిపోతోంది. మంట శరీరాన్ని అగ్గుల కత్తితో కోస్తున్నట్టుంది. అయినా ఏ ఖైదీ కూడా బాధతో మూలగడం లేదు. పైపెచ్చు వాళ్ళ ముఖాల్లో గంభీరత.

 

    నీళ్ళు అయిపోతున్న కొద్దీ రంగారావు నైతికంగా జావ కారిపోయాడు. ఖైదీల విల్ పవర్ ముందు తాను ఎందుకూ కొరగాకున్న గిల్టీ ఫీలింగ్ బయల్దేరింది. ఇక తట్టుకోలేక శ్రీపతి గదికి పరుగెత్తాడు.

 

    "మీరు చెప్పినట్టు వేడినీళ్ళు కుమ్మరించినా వాళ్ళలో చలనం లేదు సార్"

 

    శ్రీపతి కళ్ళముందు తండ్రి అరవిందరావు చిద్విలాసంగా నవ్వుతున్నట్టే వుంది. తను ఓడిపోయానన్న బాధ గుండెల్లో కలుక్కుమంటోంది.

 

    అంతలో ఏకాంబరం అక్కడికి ప్రవేశించాడు. ఎదుటివాళ్ళు ఏ మూడ్ లో వున్నారో గుర్తించి మసులుకునే అలవాటులేని అతను సెల్యూట్ కొట్టి చెప్పుకుపోతున్నాడు.  

 

    "చూశారా సార్ ఈ ఘోరం? కళాయి పోయిన పాత్రల్లో వండుతున్నారని సమ్మె చేశారు కొందరు. తిలక్ బామ్మర్దిగాడ్ని బ్యారెక్కుకు మార్చాలని మరికొందరు మౌన నిరాహారదీక్ష చేస్తున్నారు. వీళ్ళంతా ఖైదీల్లా లేరుసార్, మినిష్టర్ బామర్ది వుంచుకున్న దాన్ని తమ్ముళ్ళులా ఫోజులు కొడుతున్నారు. కళాయి పోయిస్తున్నామని చెప్పి దాదా మనుషుల్ని ఎలానో బుజ్జగించి టిఫినులు తినిపించాం సార్. కానీ ఆ తిలక్ బామర్ది మనుషులే....."

 

    "స్టాపిట్" గొంతులోని నరాలు పగిలిపోతాయేమోనన్నంత బిగ్గరగా అరిచాడు శ్రీపతి.

 

    ఏకాంబరం మనసులోనే మెల్లగా అనుకున్నాడు "ఈ సూపరింటెండెంట్ బామ్మర్దికి ఏమైంది? కుక్కలాగా మీద పడుతున్నాడు."

 

    "ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్" ఈసారి తనను తాను కంట్రోల్ చేసుకున్న విసుగు మాత్రం శ్రీపతి కంఠం నుంచి పోలేదు.

 

    ఒక్కొక్కరే అక్కడినుంచి బయటపడ్డారు.

 

    వాళ్ళందరూ వెళ్ళిపోయాక శ్రీపతి గదిలోకి ఇద్దరు ఖైదీలు వచ్చారు. వాళ్ళిద్దరూ కన్విక్టు ఆఫీసర్లు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల్ని ఆఫీసుల్లోనూ, సిబ్బంది ఇళ్ళలోనూ అటెండర్లు గా నియమించుకుంటారు. ఇప్పుడొచ్చిన వాళ్ళు ఆయన గదిలో పనిచేస్తుంటారు.

 

    "నమస్తే సార్" అని ఇద్దరూ గదిలోని వస్తువులను సర్దడం మొదలుపెట్టారు.

 

    తిలక్ ను బ్యారెక్కుకు మార్చకపోవడం వలన, ఖైదీల మీద వేడినీళ్ళు పోయించడం వల్ల వాళ్ళిద్దరూ తనకేసి కోపంగా చూస్తున్నట్టే వుంది. ఆయనకు. తను ఏమరపాటుగా వుంటే బాల్ పాయింట్ పెన్ తో తనను హత్యచేసి పారిపోతారన్న సందేహం కూడా కలిగింది. అందుకే ఆయన వాళ్ళు ఎటు కదిలితే అటు కదులుతున్నాడు.

 

    సరిగ్గా అప్పుడే మోగింది ఫోన్.

 

    రిసీవర్ అందుకుని "హలో" అన్నాడు.

 

    అవతలి నుంచి ఓ పత్రికా విలేఖరి మాట్లాడుతున్నాడు "మీ జైల్లో ఖైదీలు స్ట్రయిక్ చేస్తున్నారట..."

 

    అతని మాటలకు అడ్డు తగిలాడు శ్రీపతి. నో...నో.... అదంతా అబద్ధం మీరు కావాలనుకుంటే ఇప్పుడే వచ్చి వెరిఫై చేసుకోండి" అని మరో వివరణకు చోటివ్వకుండా ఫోన్ పెట్టేశాడు.  

 Previous Page Next Page