Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 11


    "అదేమన్నమాట, పెళ్ళి చేసుకోవాలంటే ప్రేమించాలేమిటి?"
    "అదీగాక..." అని యింకో భూమ్మీద వ్యక్తి సాగదీశాడు. 'మృత్యుంజయరావు లాంటి భర్తలుంటే అంతకంటే ఏంకావాలి? ఒకపెద్ద అడ్డు ఉక్కుతెర. విత్ ఎపోలజీస్ జయా! నీ దగ్గర చనువుకొద్దీ అంటున్నాను."
    ఎవరిచ్చారీ చనువు? అతనెప్పుడూ యివ్వలేదు. వాళ్లే బలవంతంగా పుచ్చుకున్నారు.
    ఇతరులిలా అంటూంటే శేఖరమైతే ఏంచేస్తాడు? మీదపడి తంతాడు. సంజీవరావో? జన్మలో ఆ వ్యక్తి ముఖం చూడడు.
    తురంగరావైతే? ఏంచేస్తాడో తెలీదు. మెల్లిగా ప్లేటు ఫిరాయిస్తాడేమో?
    అతనేమీ చెయ్యక ఒక చిరునవ్వు నవ్వి ఒక మూలకిపోయి కుర్చీలో కూర్చున్నాడు. వీటినన్నిటినీ వినిపించుకోనట్లూ, వినిపించుకున్నా లెక్క చేయనట్లూ, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లూ ముఖం పెట్టాడు.
    సోమయాజులు యిందాకటినుంచీ సావధానంగానే కూర్చున్నాడు. తను వినదల్చుకున్నదంతా వినటం పూర్తయాక "అబ్బాయిలూ!" అన్నాడు. "అబ్బాయిలూ! మనం కళాసేవ చేయటానికి ఉత్తమమైన ఆశయాలతో యీ సంస్థను ఏర్పరిచాం. మీ మీ అల్పపు ఉద్దేశాలతో మన పవిత్రపుటాలోచనలను కలుషితం చేయకండి."
    అందరూ వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు.
    ఇంతలో మాలతి వచ్చింది. అందరికీ ఎక్కడలేని మేనరిజమ్సూ వచ్చాయి.
    ఆరాత్రి చీకట్లో మాలతితో నడిచేటప్పుడు యీ సాయంత్రం ఆమెనిగురించి జరిగిన సంభాషణ చెబుదామా అనుకున్నాడు. ఊరికే అనుకున్నాడంతే. చెప్పలేదు.
    అతనింటికి తిరిగి వచ్చేసరికి దాదాపు పది అవుతోంది. గదిలోకి వెళ్ళేసరికి జగతి ప్రక్కమీదపడి పొర్లుతుంది. అతన్ని చూడగానే అసలే పెద్దవైన తనకళ్ళు మరింత పెద్దవిచేసి "ఇంతసేపూ ఎక్కడున్నావురా బాబూ! ఆకలేసి చస్తున్నా" అంది.
    అంతవరకూ బెడ్ లైటు వెలుగుతోంది. గోడనున్న స్విచ్ నొక్కి పెద్దలైటు వెలిగించాడు. ఎప్పుడు తురుముకుందో సిగలో మల్లెలు తురుముకుంది. వింత సువాసన గదినంతా ఆక్రమించివేసింది. ఆ స్థితిలో ఒకచెయ్యి చెంపక్రింద ఆనించి, ధవళిమ వెదజల్లుతూ పవళించివున్న అక్కగారు అపూర్వ దేవతలా గోచరించింది. ఆమె పాదాలమీద శిరస్సు ఆనించి 'నీకు స్వచ్చతే వుంటే...?' అని వాపోదామనుకున్నాడు. 'తనకి యింత అందం భగవంతుడు యిచ్చివుంటే...?' అతనికి ఏడుపు వచ్చింది.
    అసలు మనుషులు యింత అందంగా, ఆరోగ్యంగా, నునుపుగా ఎలా వుండగలుగుతారు? వాళ్ళ మనసుల్లో ఎలా వుంటుంది?
    "క్యారియర్ విప్పేసి నువ్వు భోజనం చేసెయ్యకపోయావా?" అన్నాడు.
    "ముందు నేను తినేస్తే అసలే క్యారియర్ భోజనం. అసహ్యంగా తయారవుతుంది నీకు. రారా భోంచేద్దాం" అని జగదేకసుందరి జగతి లేచి కూర్చుంది.
    రెండునిముషాల్లో అతను బట్టలు మార్చుకోవడం, కాళ్ళు కడుక్కోవటం వగైరాలు పూర్తిచేసుకుని భోజనానికి సిద్ధమైనాడు.
    అన్నం కలుపుతూ జగతి "సరియైన తిండి తిని ఎన్నాళ్ళయింది రా? మన చేతికూడు హోటలు దానికేం తీసిపోదు. అమ్మపెట్టే ఆవకాయరుచి తలుచుకుంటే యిప్పటికీ నోటిలో జలం ఊరుతుందిరా. గుత్తావకాయ, ఎండావకాయ, బెల్లపు ఆవకాయ, వెల్లావకాయ, నీళ్ళావకాయ అబ్బ! ఎన్ని రకాలు పెట్టేదిరా! తర్వాత బోలెడుచోట్ల భోంచేశాను గాని ఆ మహత్తరమైన రుచిరాదు. అది అమృతం, అపూర్వం" తల్లినిగురించి జ్ఞాపకాలు మనసులో మెదలగానే ఆమెనేత్రాలు అచంచలమైన కరుణతోనూ, ఆర్థ్రతతోనూ నిండిపోయి ముగ్ధకాంతితో ప్రకాశించాయి.
    "అన్నట్లు ఆవకాయ అంటే నీకు చాలా యిష్టంకదూ!" అన్నాడు తమ్ముడు.
    జగతి తల విదిలించి "ఆవకాయ ఒకటేకాదు. చురుక్కుమనిపించేదేదైనా నాకు సరిపడుతుంది. ఇవాళ అమ్మ ఎందుకో పదేపదే గుర్తు వస్తుందోయి. కొందరి జీవితాలు ఎంత నిస్సారంగా గడుస్తాయో తలుచుకుంటే నాకు వళ్ళు గగుర్పొడుస్తుంది. సూర్యోదయం, పగలు, అస్తమయం, చీకటి యిలా ఎన్ని రోజులో నిర్జీవంగా గడిచిపోతాయి. మనం గడిపే ప్రతిరోజుతోనూ, పనికి మాలిన గంటల్ని లెక్కపెట్టుకుంటే కొన్నాళ్ళకి అవి ఎన్ని రోజులుగానూ, కొన్ని సంవత్సరాలకు అవి ఎన్ని సంవత్సరాలుగానూ తయారౌతాయో తలుచుకుంటే భయంవేస్తుంది. ఇలాంటి వ్యర్ధపుగంటల సముదాయమే అమ్మ" అంది విచారంగా.
    తమ్ముడికి ఏం జవాబు చెప్పాలో తోచక మంచినీళ్ళగ్లాసు అందుకున్నాడు.
    "అసలు ఆనందం, విషాదం, అనుభవం, చావు యివన్నీ ఏమిటో!" అంది అక్కగారు, రెండుక్షణాలు గడిచాక.
    అక్కాతమ్ముళ్ళు ఒకరి సరసన ఒకరు కూర్చుని అరిటాకులు పరుచుకుని భోజనం చేయటమైతే చూడటానికి సమయోచితంగాలేదు. బరువైన మాటలు.
    'ఎందుకని యీవిడ యిలాగా మాట్లాడుతోంది? స్వాములవారి మహత్యం కాదుగదా' అనుకున్నాడు.
    "చావంటే నీకు భయంవేస్తుందా?" అని అడిగింది మళ్ళీ అతని కళ్ళలోకి గ్రుచ్చి గ్రుచ్చి చూస్తూ.
    చావు! అతని శరీరం గగుర్పొడిచింది. ఇవ్వాళ్టివరకూ మనం మనమే. యీ భూమిని అంటిపెట్టుకుని భ్రాంతితో పెనవేసుకుని వుంటాం అంతే! ఏదో ఒక మాయాక్షణం మనల్ని అంతం చేస్తుంది. ఈ సంబంధాన్ని విడగొట్టి వేస్తుంది. మనకి మనం తెలియం.
    "చాలా భయం" అని గొణిగాడు.
    "నాకు భయంలేదు" అంది జగతి నిర్లక్ష్యంగా. "కానీ చచ్చిపోయాక నన్ను నాకు చూసుకోవాలని వుంటుంది. స్పిరిట్ ని అవాలని వుంటుంది."
    మృత్యుంజయరావు తల పక్కకి త్రిప్పి కిటికీలోంచి బయటికి చూశాడు. చీకట్లో గుబురుగావున్న చెట్లు పిశాచాల్లా వూగుతున్నాయి. ముచ్చెమటలు పోశాయి.
    "నీకు దెయ్యాలంటే నమ్మకం వుందా?" అన్నాడు కంపితస్వరంతో.
    జగతి అతని కళ్ళలోకి విచిత్రంగా చూసింది. ఒక వికటశక్తిలా, చచ్చిన జంతువులా చూసింది. ఉన్నట్లుండి "నమ్మకమేమిటి? నేనే దెయ్యాన్నయితేనూ?" అని పకపకమని నవ్వసాగింది.
    ఆ చూపు, ఆ నవ్వు అతనికి చాలా విపరీతంగా తోచాయి. అదిరిపడి కొంచెం అవతలికి జరిగి కూర్చున్నాడు.
    ఆమె మధ్య మధ్య నవ్వుతూనే అంటోంది. "నేను జగతిని కాను. దాని ఛాయను. అసలు జగతి కొన్నాళ్ళక్రితం చచ్చిపోయింది. దాన్ని శరీరాన్ని ప్రజలు బూడిద చేశారు. అప్పట్నుంచీ పిశాచాన్నైన నేను యిలా అక్కడక్కడా తిరుగుతున్నాను."
    పిచ్చిదానిలా, ఓ గణాచారిలా నవ్వుతోంది. ఇప్పుడామె కళ్ళు అందమంతా నశించి భయంకరంగా కనిపిస్తున్నాయి.
    అతనికి గుండె ఆడలేదు. జాలి తలిచినట్లు ఆమెనవ్వు అంతర్థానమైంది. అతనివంక సానుభూతిగా చూసింది. "అలా దెయ్యంపట్టినట్లు చూస్తావేమిటిరా? హడలిపోయావేమిటి? వొట్టినే వేళాకోళానికన్నాను" అంటూ అతన్ని ఊరడించటానికన్నట్లు ఎడంచేత్తో భుజంమీద తట్టింది.
    అయినా మృత్యుంజయరావుకు భయంపోలేదు. "నిజంగా దెయ్యానివి కాదా?" అనీ అడుగుదామనుకున్నాడు. అడగలేదు.
    "నేను చావలేదు, అప్పుడే చావను" అంది జగతి ఏదో ఆలోచిస్తూ.
    తర్వాత అన్నం తింటున్నంతసేపూ యిద్దరూ మౌనంగానే గడిపారు. ఆమె ఎందుకలా మాట్లాడిందో అతనికి అర్ధంకాలేదు. అది ఆమెలోని ప్రత్యేకతేమో అనుకున్నాడు.
    చెయ్యి తుడుచుకుని పక్కమీద పడుకుంటూ అడిగింది జగతి "అన్నట్లు యింతసేపూ ఎక్కడ తిరుగుతున్నావు యింటికి రాకుండా?" ఇప్పుడామె మామూలు మనిషి అన్నట్లుగా గోచరించింది.
    కారణం చెప్పకుండా వుందామనుకున్నాడతను. కాని వుండలేకపోయాడు. "మాకో సమితివుంది యీ వూళ్ళో. దాని తరపున నాటకమొకటి ప్రాక్టీసు చేస్తున్నాం."
    ఆమెకళ్ళు పెద్దవిచేసి అతనివంక చూసింది "నువ్వు నటిస్తున్నావా? నువ్వు?"
    రక్తం తనపని ప్రారంభించింది. వస్తోంది... వస్తోంది అసలు విషయం.
    జగతిరూపం గదినంతా ఆక్రమించి 'నువ్వు నటిస్తున్నావా? నువ్వు!' అని వెటకారం చేస్తున్నట్లు తోచింది. అబ్బ! ఈ 'నువ్వు' శబ్దం ఎంత భయంకరంగా వుంది.
    'కంగారుపడకు' అని మనసులో అనుకున్నాడు. "నేను నటించడంలేదు. ప్రాంప్టింగ్ కి పెట్టుకున్నారు నన్ను."
    "అలా చెప్పు" అంది జగతి సమాధానపడినట్లు. 'సే సో' అన్నంత ఖచ్చితంగా.
    అతనికి నిద్ర రావటంలేదు. అందుకని కుర్చీలో చతికిలబడి తన బ్లాంక్ కార్యక్రమానికి ఉపక్రమించాడు.
    కొన్నినిముషాలు గడిచాక జగతి "ఇప్పుడు చెబుతాను విను యీ స్వాములారీ విషయం" అని ఉపక్రమించింది. ఆమె అటునుంచి యిటు తిరగటంలో నలిగిన మల్లెపూలు రెండు సిగనుండి క్రిందికి రాలాయి.
    "స్వామి దృఢకాయుడు. ఆజానుబాహుడు. పాపం యవ్వనంలోనే వున్నాడు. పచ్చని పసిమి, స్ఫురద్రూపి. నాకెందుకో మంచివాడిలాగే కనబడ్డాడు. అనర్గళంగా మాట్లాడాడు. మధ్య మధ్య ఎన్నికథలు చెప్పాడని?" అని అతని రూపాన్నీ, మాటలనీ తలుచుకుంటున్నట్లుగా కళ్ళు మూసుకుంది.
    "అతని పేరు విద్యాధరస్వామి" అంది కలలోంచి అంటూన్నట్లుగా. కొంతసేపటికి కళ్ళు తెరిచివుంది. "నాకసలు యీ స్వాములంటే నమ్మకంలేదు. వాళ్ళు చెప్పేది ఒక్కటీ సూటిగా వుండదు. గంటలసేపు మాట్లాడతారు. వింటున్న వాళ్ళంతా తన్మయులైనట్లూ బుర్రలు ఆడిస్తారు. ఏదో 'ఓం' అంటారు. ఆ ఓంకారం యింగ్లీషులోకూడా వున్నదనీ, అన్ని భాషల్లో వున్నదనీ వాదిస్తారు. లేనిదాన్ని గురించి వున్నట్లూ, ఉన్నదాన్ని గురించి లేనట్లూ చెబుతారు. ప్రతిదానికీ ఓ శ్లోకాన్ని ఉదహరిస్తారు. ఏదో తాడంటారు. ఆ తాడే పామంటారు. అంతసేపూ ఉపన్యాససారాన్ని గ్రోలి 'ఆహా, ఓహో' అంటూ యివతలికి వచ్చిన శ్రోతలు "ఏం చెప్పాడయ్యా మీ స్వామి?" అంటే 'భగవద్గీత' అంటారు గొప్పగా... అంతకుమించి ఒక్క అక్షరం చెప్పలేరు. వాళ్ళజ్ఞానం ఒక్క అంగుళం పెరగటం గానీ, మూర్ఖత్వం ఒక్క అంగుళం తరగటం గానీ జరగదు."
    బరువుగా ఊపిరి తీసుకుని చెప్పసాగింది జగతి.
    "ఈ ప్రజల్లో కూడా మూర్ఖత్వం చాలా పేరుకునివుంది. నిజమైన భక్తిగానీ, నిశ్చలమైన మనస్సుగానీ ఒక్కరికీ వుండదు. మహా అజ్ఞానంలో ఓలలాడుతున్నారు. ఏదో స్వామి అంటూ ఎవరినో సింహాసనం ఎక్కిస్తారు. వాడికాళ్ళు కడుగుతారు. ఆ నీళ్ళు నెత్తిమీద జల్లుకుంటారు. నోట్లో పోసుకుంటారు. వాడికాళ్ళు పిసుకుతారు. వాడు స్నానం చేస్తూంటే వొళ్ళు తోముతారు. ప్రసాదం ప్రసాదమంటూ వాడి ఎంగిలి భుజిస్తారు. ఒక స్వయం పాకాలేమిటి, బహుమానమేమిటి, బంగారమేమిటి సర్వం కట్టబెడతారు. అతని మహత్యాన్ని గురించి చిలవలు పలవలుగా చెప్పుకుంటారు. అలా కొన్నాళ్ళు జరుగుతుంది. ఇహ వాళ్ళ నోటికి హద్దు పద్దూ వుండదు. 'నేనప్పుడే అనుకున్నాను వాడిటువంటి దగుల్భాజీ' అని ఒకడంటాడు. 'నా విధవ అప్పగారు ఆ దొంగసన్యాసికి యిల్లు రాసియిచ్చింది. వెధవ, కోర్టులో దావా పడేసి ఊడబెరుక్కుంటా' అని యింకోడంటాడు. "మనమిచ్చిన బట్టలూ అవీ చాటుగా అమ్ముకుంటూంటే నాకంటపడిందయ్యా. బయట పెడదామనుకున్నా, కాని నమ్మకపోగా అందరూ కలిసి చితకబొడుస్తారని గప్ చుప్ గా వూరుకున్నా" అని ఓ ప్రబుద్ధుడు బయటపెడతాడు. ఈసారి ఆ స్వాములారు వూళ్ళోకి అడుగుపెడితే కాళ్ళు విరగ్గొడతామని భుజాలు చరుచుకుంటారు."

 Previous Page Next Page