Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 12


    తన గదిలోకి తెల్లగా మెరిసే దేవత వచ్చి సువాక్కులు పలుకుతున్నట్లు తోచింది మృత్యుంజయరావుకు. ఈవిడకింత అనుభవమెలా వచ్చిందా అని నివ్వెరపోయాడు.
    "ఇహ ఈ శ్రోతలలో ఒకళ్ళయినా నిర్మలచిత్తంతో వింటారంటావా? ఉహుఁ. కాలక్షేపానికి వచ్చేవాళ్ళూ, యింట్లోపని తప్పించుకుందామని వచ్చేవాళ్ళూ, గొప్పకోసం వచ్చేవాళ్ళూ. రకరకాలు. వింటూన్నంతసేపూ బుర్రలూపుతారు. తరించినట్లు ముఖభంగిమలు మారుస్తూ వుంటారు. చివరికి బయటికి వచ్చి ఎవరి ప్రపంచంలో వాళ్ళు పడతారు. వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ డబ్బుగొడవలు, వాళ్ల స్వార్థాలు, వాళ్ళ పెనుగులాటలు, వాళ్ళ తాపత్రయాలు మహాప్రభో! ఇహ వాళ్ళు విన్నదేమిటి? నేర్చుకున్నదేమిటి?"
    అట్లా అని కళ్ళుమూసుకుంది జగతి. "అయినా యితను మంచివాడిలా కనిపిస్తున్నాడు" తనలో తను అనుకుంటున్నట్లుగా ఆమె పెదవులు కదిలాయి. తర్వాత యింకేమీ మాట్లాడకుండా మెదలకుండా పడుకుంది.
    కాసేపటికి ఆమె నిద్రబోతున్నదని గ్రహించి లేచి నిలబడ్డాడు మృత్యుంజయరావు. ఆమె మంచందగ్గరకు నడిచి వొంగి ఆమెముఖంలోకి పరీక్షగా చూశాడు. నాగమల్లిపూవులా ఎంత ప్రశాంతంగా వున్నది ఆమె ముఖం! ఇంత గతచరిత్ర పెట్టుకుని ఎంత ప్రశాంతంగా ఎట్లా నిద్రిస్తోందా అని అతనికి ఆశ్చర్యం కలిగింది. తనెప్పుడూ అంత నిశ్చలంగా వుండలేడు. నిరంతరం చలిస్తూ, యాతనగా. గందరగోళంగా వుంటుంది తన మనసు. రాత్రి కమ్మగా ఎప్పుడూ నిద్రపోలేదు. కళ్ళు మూసుకుంటే కలలు, మెలకువగా వుంటే భయాలు, భ్రాంతులు.
    ఒక నిట్టూర్పు విడిచి కదిలి, తలుపు గడియవేసి, పెద్దలైటు ఆఫ్ చేసి, చాప పరుచుకుని మేను వాల్చాడు. రెండు నిముషాలు గడిచి వుంటాయి. తలుపు గడియవేశానా అని అనుమానం వచ్చింది అతనికి. లేచివెళ్ళి తలుపును చేత్తో తడిమి చూసి, సంతృప్తిపడి మళ్ళీ వచ్చి పడుకున్నాడు. 'తనకిదో జబ్బు' అని తననితాను తిట్టుకుంటున్నాడు. రాత్రుళ్ళు మెలకువ వచ్చినప్పుడల్లా గడియ వేసుందోలేదో అన్న అనుమానంతో లేచి ఓసారి సవరించి వస్తాడు. దుప్పటిలోంచి మొహం ఇవతలకు పెట్టి కిటికీగుండా బయటకి చూస్తూ, ఒకక్షణం కళ్ళుమూసుకుని, మరోక్షణం కళ్ళు తెరుస్తూంటాడు. అతనికి ఆశా, ప్రలోభం. ఎవరూ లేకుండా చూసి "నేను అందగాడ్నే' అని ఆత్మవంచన చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఒకో సమయంలో తనో  చక్రవర్తినని అనిపిస్తుంది. తను గొప్పవాడు. తనలో అద్భుతశక్తులున్నాయి. తను యీలవేస్తే ఆడవాళ్ళు వెంటబడతారు. ఒక్కతన్ను తంతే రౌడీలు క్రిందపడతారు. లేకపోతే తను పెద్ద టెన్నిస్ ఛాంపియన్. అన్ సీడెడ్ ప్లేయర్ గా వెళ్ళి వింబుల్డన్ పోటీలలో హేమాహేమీలని చితగ్గొటేసి వరల్డ్ ఛాంపియన్ అయి కూర్చుంటాడు. పెద్ద క్రికెట్ ప్లేయర్. బౌలరా? బేట్స్ మెనా? ఆల్ రౌండర్. రయ్యిరయ్యిమని బంతులు విసుర్తున్నాడు. ఏం పరుగు, ఏం వేగం? ఏం, వికెట్లు రాలిపోతున్నాయి. ఆస్ట్రేలియా- బెనాడ్, వెస్టండీస్- సోబర్సు, ఇంగ్లండ్ డెక్ స్టర్ హడలిపోతున్నారు. బ్యాట్సు వదిలి పరిగెడుతున్నారు. ఫాస్టుబౌలింగ్ ఒకటేకాదు వుండి ఉండి స్పిన్ కూడా త్రిప్పి వాళ్ళని ఏడిపించేస్తున్నాడు. మళ్ళీ బ్యాటింగ్ మొదలుపెట్టాడు. ఇహ చూసుకో నాయనా! బౌండరీలు, సిక్సర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చెమటలు కక్కేస్తున్నారు. ఎక్కడినుంచో సి.కె. నాయుడు సెభాష్, షెభాష్ అంటున్నాడు. దృశ్యం మారింది. తనోపెద్ద గాయకుడు. ఆ గానామృతానికి సెలయేళ్ళు వొరవడిగా ప్రవహిస్తున్నాయి. నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి. మేఘాలు గర్జించి వర్షాన్ని గుమ్మరిస్తున్నాయి. దృశ్యం మారింది. షెహనాయ్ వాయిస్తున్నాడు. కళపైన కళ విరజిమ్మేస్తున్నాడు. భిస్మిల్లాఖాన్ కీ, అతనికీ పోటీ ఓహ్! చిత్తయిపోయాడు భిస్మిల్లాఖాన్. తల వంచుకుని నిష్క్రమిస్తున్నాడు. మేజిక్కులు చేస్తున్నాడు. జనం ముగ్ధులై మూర్ఛపోతున్నారు. తనదగ్గర మంత్రం కర్రవుంది. దాన్ని మూడుసార్లు త్రిప్పేసరికి సర్వం... వనితలు, విత్తం, అధికారం, ఆడంబరం అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఎంత తిండిపుష్ఠి అని! అర్థశేరు కందిపచ్చడి శేరు బియ్యంతో వండిన అన్నంతో అవలీలగా భోంచేస్తున్నాడు. నాలుగుడజన్ల రసగుల్లాలు ఉఫ్ మని ఊదేశాడు. ఎంత కంట్రోల్ వుంది శరీరంమీద! రోజుకు రెండు గంటలు కంటే ఎక్కువ నిద్రపోడు. మిగతాటైమ్ అంతా తెగపనిచేస్తాడు. వివిధ కార్యకలాపాలు, ఎంత బిజీ. తను గజదొంగ. ఎడంచెత్తో యినప్పెట్టెలు తెరిచేస్తున్నాడు. నల్లప్యాంటూ, పొడవాటికోటూ, హ్యేటూ పెట్టుకుని ఒక భవంతిలో ఠీవిగా జొరబడి కోటీశ్వరుడి కుమార్తె కంఠంలోని వజ్రాలహారం దొంగిలిస్తుంటే, ఆ మదవతి తన విశాలనేత్రాలను సగం తెరచి తనని చూసింది. "దొంగ" అంటూ చెయ్యి పట్టుకుంది. అబ్బ, ఏదో విద్యుచ్చక్తి. ఎర్రబడిన ఆమె "మోము" క్రిందికి వాలిపోయింది. అంతే. మోహించింది తనని... తను హంతకుడు, భీకరస్వరూపుడు. కత్తితో ఖస్ ఖస్ మని పొడుస్తున్నాడు. రక్తంచూసి వికటాట్టహాసం చేస్తున్నాడు. పిస్తోళ్ళతో పేలుస్తున్నాడు... విమానంలోంచి పేరాచూట్ లో దూకుతున్నాడు. పెద్దపులితో వొట్టిచేతులతో హోరాహోరీగా యుద్ధం చేస్తున్నాడు. సుందరి కోరివస్తే తిరస్కరిస్తున్నాడు. ఫ్రెంచిభాషలో కూడా తను మాట్లాడేసరికి జనం దిగ్భ్రమ చెందుతున్నారు. స్మశానవాటికల్లో వొంటరిగా నిశాచరుడిలా సంచరిస్తున్నాడు...   
    మృత్యుంజయరావు కళ్ళు విప్పాడు. ఇవన్నీ కలలుకావు. జాగ్రదావస్థే. ఆలోచనల మేడలు ఎంత అందమైన కట్టడాలు! నిట్టూర్పు విడిచాడు.
    ఇంతలో అతనికి తలుపు గడియవేశానా అని అనుమానం వచ్చింది. వేశానా? గుర్తురావడంలేదు. లేచి, తలుపుదగ్గరకు వెళ్ళి, ఓసారి గడియను తడిమిచూసి "వేశాను" అని సంతృప్తిపడి మళ్ళీ చాపమీదకు వచ్చి పడుకున్నాడు.
                                                      6
    యిరుకుగదిలో రెండు భిన్నశక్తులయిన అక్కాతమ్ముళ్ళిద్దరూ మెల్లగా రోజులు గడపసాగారు. జగతి పుట్టడానికి ఆడపుట్టుక పుట్టిందిగానీ శుభ్రత పట్లా, యింటిని కుదురుగా అమర్చడంపట్లా ఆమెకేమాత్రం శ్రద్ధాశక్తులు లేవు. శరీరపోషణపట్ల కూడా ఏమీ ఆపేక్ష కనపర్చదు. బద్ధకం పుడితే ఒకటే బద్ధకం. ఒక్కొక్కప్పుడు ఉదయం ఎనిమిది తొమ్మిదిగంటలదాకా నిద్రపోతూ వుంటుంది. మృత్యుంజయరావు మామూలుగా ఆరుగంటలకల్లా నిద్రలేచి, కాఫీ కాచేసి, తనుత్రాగి, అక్కగారికి ఫ్లాస్క్ లోపోసి అట్టిపెడతాడు. ఎప్పుడో నిద్రలేచి, తాపీగా స్నానాదికారాలు ముగించి యిహ వంట మొదలుపెడుతుంది జగతి. ఆమె వంట నీళ్ళుగారుతూ వుంటుంది. బీరకాయలూ, వంకాయలూ, పొట్లకాయలూ సరిగ్గా ఉడక్కుండా పచ్చిపచ్చిగా కసకసలాడుతూ వుంటాయి. ఉప్పూ, కారం సమపాళ్ళలో ఏనాడూ పడవు. పధ్యపు భోజనంలా వుంటుంది. అయినా గప్ చుప్ గా తినటం తప్ప ఎలాంటి పట్టింపూ మృత్యుంజయరావు ప్రదర్శించలేదు. అతనికి రుచులనుగురించి ఎవరైనా గుర్తుచేస్తేనే గాని స్ఫురణకి రాదు. బంగాళదుంపల కూరనైనా, ఆనపకాయ కూరనైనా సమానంగా తినేస్తాడు. చప్పగా పెట్టినా తింటాడు. కారంగా పెట్టినా తింటాడు. "నీకు స్వీట్సు యిష్టమా? సేవరీస్ యిష్టమా?" అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలీక తడుముకుంటాడు. కాఫీ యిచ్చినా తాగేస్తాడు. టీ యిచ్చినా తాగేస్తాడు. హోటల్ కి టిఫిన్ తినటానికి పోయినప్పుడు వుంటుంది అతని అవస్థ. "ఏముంది?" అంటాడు ముందు సర్వరుతో యధాలాపంగా. అతను చదివిన లిస్టు విని యేంఆర్డర్ యివ్వాలో తెలీక సందిగ్ధంలో పడతాడు. ఇడ్లీ చెబుదామా? పెసరట్టు చెబుదామా? "పెసరట్టు" అంటాడు మరీ ఆలస్యంగా చెబుతే బాగుండదని. పెసరట్టు వస్తుంది. దాని పని మెల్లగా పట్టిస్తూండగా తనప్రక్కన కూర్చున్న మరోమనిషి, అల్లం జీలకర్ర పెసరట్టు ఆరగిస్తూ తన్మయం చెందటం గోచరిస్తుంది. అరెరే! ఎంత పొరపాటు చేశాను! తనూ అల్లం, జీలకర్ర పెసరట్టు చెప్పాల్సింది. ఇంతలో ఎదురుగుండా కూర్చున్న వేరొకడు పెసరట్టు ఉప్మాతో మేళవించి తింటూ, ఆ కాంబినేషన్ ను అనుభవిస్తూ మహదానందం చెందటం కళ్ళబడుతుంది. ఓయ్ బాబో! ఇదికూడా గొప్పగా వుందే! పోనీ సర్వరుని పిలిచి ఉప్మా పట్రమ్మంటే! అప్పటికే తన అట్టు సగం అయిపోయింది. తనని చూస్తే ఎదుటివాడికి ఉప్మా తినాలనిపించిందని, ఆ తింటున్నవాడు గ్రహించి నవ్వుకుంటే? కోరికేమో చెలరేగుతుంది. ఎలాగో నాలిక కట్టేసుకుంటాడు. ఆ పూట పూటంతా అతనికదే ఆరాటం. మర్నాడు వెళ్ళి అల్లం, జీలకర్రా పెసరట్లులో ఉప్మా నంచుకుని కసాబిసా నమిలేదాకా అతని ఆత్మకు శాంతి లభించదు.
    ఇహ మృత్యుంజయరావు సినిమాకి బయల్దేరినప్పుడు చూడాలి. కాకినాడలోని చిత్రమేమిటంటే, సినిమాహాళ్ళన్నీ ఒకే వీధిలో వుంటాయి. సినిమా చూడ్డానికి బయలుదేరినవాడికి ఏదో ఒక పిక్చర్ దొరక్కపోదు. తెలుగు సినిమాకు వెడదామా? హిందీసినిమాకా లేక ఇంగ్లీషు సినిమాకా? అన్న మీమాంసలో బడతాడు. ఇహ తర్జన భర్జన మొదలవుతుంది.
    ఇంగ్లీషా? హిందీయా? తెలుగా?
    చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పవయ్యా శేఖరం! పలకవయ్యా తురంగరావూ! ఓయి వైకుంఠం! నువ్వయితే ఏం చేస్తావేమిటి?
    ఇంగ్లీషు సినిమాకెళ్ళి కూర్చున్నాడు. రిజర్వుడ్ లో అయిదారుగురుకంటే ఎక్కువలేరు. డబ్బుదండగ చేసానేమో! కుర్చీకెళితే బాగుండేది. ఈ మూల కూర్చున్నాడేమిటి తను? వెనుక వరసలో మధ్యకుర్చీలో కూర్చుంటే బాగుండేదేమో! ఇప్పుడు లేచివెడితే! మిగతా ప్రేక్షకులు చూస్తారేమో! చూస్తే ఏం? తను లెక్కచెయ్యడు. అవును. "ఐ డోన్ట్ కేర్" "లేచి వెడతాను" "మరి వెళ్ళు. లేవవేం?" "వుండు, వెడతాను" "తొరగా వెళ్ళు" "ఉండు, వుండు" "అరే ఏమిటి? గుండె అలా కొట్టుకుంటోంది? చెమట ముమ్మరంగా పట్టేస్తోంది" "ఛీ చీ. అది యిందుకుకాదు. ఇంకెందుకు" "అహ! అలాగా! ఆ యింకెందుకు ఏమిటో?" "అదేమిటలా అనేస్తున్నావు. నన్ను నమ్మటల్లేదా? "అయితే వెళ్ళు చూద్దాం" "ఆఁ సినిమా మొదలెట్టేస్తున్నారు. ఎందుకని చూస్తున్నాగాని..."

 Previous Page Next Page