పావనీ! ఎప్పుడూ కుశల ప్రశ్నలతో మొదలుపెట్టి, క్షేమంగా ఉన్నావని ముగింపుతో నాలుగు వాక్యాలు రాస్తున్నానని కోపంగా రాశావు. నాలాంటి వాళ్ళకోసం ప్రభుత్వం కార్డు ధర పదిహేను పైసలు మించి పెంచడం లేదు. అయినా ఆ పదిహేను పైసల కోసం పదిసార్లు అడుక్కోవలసిన స్థితిలో వున్న నేను ఎక్కువ ఉత్తరాలు ఎలా రాయగలను?
'నెల జీతం అవసరం లేకుండా వేళకు అన్నీ అమర్చిపెట్టే భార్య, నెత్తిన డబ్బు మూట పెట్టుకుని మరీ వస్తుందని కొందరు మగవాళ్ళు పెళ్ళి చేసుకుంటారు' అని చదివే వుంటావు నువ్వు. అన్నీ సమయానికి అమర్చి పెట్టే దాసీ దానిగా పనికి వస్తుందని కొందరు మగవాళ్ళు చెల్లెళ్ళ పెళ్ళి కూడా చేయరు. ఇదెక్కడా చదివి వుండవు. మా అన్నయ్య ఈ రెండూ చేశాడు. కట్నం తెచ్చిన భార్యని సంతోషపెట్టడం కోసం ఆదివారంనాడు వంటింట్లోకి వస్తే చాలు 'ఎందుకే ఒక్క సెలవు రోజునా అంత కష్టపడతావు. వచ్చి యిలా కూర్చో' అని సానుభూతి చూపిస్తాడు. పిల్లల్ని నా దగ్గర వదిలేసి భార్యను సినిమాలకు, షికార్లకు తిప్పుతాడు. రోజుకి పద్దెనిమిది గంటలూ, వారంలో ఏడు రోజులూ కష్టపడే నాకు విశ్రాంతి అవసరం లేదు. ఆమె రోజుకి ఏడు గంటలూ, వారానికి ఆరు రోజులు కష్టపడితే పదిహేను వందల జీతం వస్తుంది. కానీ నాకు పదిహేను పైసలు కార్డు కోసం ఇవ్వడానికి వాళ్ళు పదిసార్లు ఆలోచించాలి.
నీకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. మీ నాన్నంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. అయినా తల్లిదండ్రులు శాశ్వతం కాదు. నీలాంటి బంగారు బొమ్మని ఎవరయినా కళ్ళకద్దుకుని చేసుకుంటారు. వెళ్ళి సుఖపడు, అతడిని సుఖపెట్టు. అనుభవంతో చెపుతున్నాను. ఆడదానికి భర్త ఇల్లంత క్షేమకరమైంది మరొకటి లేదు. అతడు అందగాడు, డబ్బున్నవాడు కాకపోయినా సరే భార్యగా హక్కు సంపాదించుకున్నావంటే అంతే చాలు. జీవితం సెటిలై పోయినట్లే. నువ్వు చదువుకుని ఉద్యోగం చేసేదానివైతే ఇంకా సంతోషించేదాన్ని. కానీ ఇప్పుడు యీ రకంగా సంతోషిస్తాను. త్వరలో శుభలేఖ పంపుతావని ఆశిస్తూ -సుందరి.
ఉత్తరం చదవడం పూర్తిచేసి దిగులుగా కూర్చుంది పావని. జీవితంలో సెటిలయ్యాక భర్తకి చెప్పి పిన్నికి సహాయం చేయాలి అనుకుంది. పిన్ని పరిస్థితేమో రోజురోజుకీ దిగజారిపోతూంది. ఆమె ఆ ఆలోచనలో వుండగా విశ్వపతి సీరియస్ గా లోపలకు వచ్చాడు. ఎప్పటిలా మంచినీళ్ళు ఇవ్వమని అడగలేదు. చిరునవ్వయినా లేదు. సరాసరి అరుంధతి దగ్గరకు వెళ్ళాడు. పావని అనుమానంగా తలుపు దగ్గర నిలబడింది.
"కట్నం పాతికవేలు. ఆడపడుచులు నలుగురికీ పదివేలు లాంఛనాలు. అబ్బాయి మరో వూళ్ళో ఉంటాడు కాబట్టి ఇంటికి కావలసిన ఫర్నిచర్ వగైరా అన్నీ కొనిపెడితే చాలట. అన్నీ కలిపి డెబ్బైవేలు ఖర్చు లెక్కవేశాడు సుబ్బారావు. ఏం చెయ్యను?"
"అంత డబ్బా? ఎక్కడనుంచి తెస్తారు?" అంది అరుంధతి. "ఇప్పటికే నా మందులకి పొలంమీద అప్పుచేశారు కూడా."
"అవును! ఉన్న నాలుగెకరాల్లో రెండు అమ్మినా అప్పు పోను పాతికవేలు మిగులుతుందేమో. ఆఫీసులో అప్పులుచేసి మరో ఇరవై తేగలను. అంతకంటే నావల్లకాదు అని చెప్పమన్నాను."
"అమ్మాయి బాగా నచ్చింది అబ్బాయికి, కాస్త తగ్గుతారేమో కనుక్కోండి."
"లాభం లేదు! అరవై, డెబ్బై క్యాష్ ఇస్తామని క్యూలో నిలబడ్డారు అక్కడ. వాళ్ళకు మనమ్మాయి అందంతో పనిలేదు."
"పోనీలెండి! అబబాయి ఎలాగూ అంత బాగోలేడు. మరో సంబంధం చూద్దాం. దేనికైనా సమయం రావాలి" అందామె.
"అదీ నిజమేలే" సంబంధం తప్పిపోయినందుకు పావనికి దిగులూ లేదు. సంతోషమూ లేదు. మళ్ళీ నిరీక్షణ.
* * *
అయిదో పెళ్ళిచూపులు....సంవత్సర కాలంలో నాలుగు పెళ్ళిచూపుల అనుభవంతో ఈసారి ఎలాంటి భయం, సంకోచం లేకుండా పోయాయి. వాళ్ళడిగిన ప్రశ్నలన్నింటికీ తల దించుకోకుండా సమాధానం చెప్పింది.
ఆ వచ్చినవాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. ఆస్థి ఎంత ఎక్కువగా వుంటే అంత కట్నం ఇవ్వాల్సి వస్తుందని విశ్వపతి వాళ్ళను ఆహ్వానించడానికి కూడా సందేహించాడు. కాని వాళ్ళకు కట్నం అవసరంలేదు. అమ్మాయి జాతకం సరిపోయింది అని తెలుసుకున్నాక అతడికి ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఆలస్యం అయినా మంచి సంబంధం దొరుకుతోందని మురిసిపోయాడు. పావనిని చూశాక వాళ్ళు వద్దనలేరని ఆయన నమ్మకం వచ్చినవాళ్ళు కూడా సంతృప్తిగానే కనిపిస్తున్నారు. అరుంధతి కూడా తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో వాళ్ళ దగ్గర కూర్చుంది.
పెళ్ళి చూపుల తతంగం ముగిసింది. పావని లోపలకు వెళ్ళిపోయింది.
"మీరేం అనుకోకపోతే అమ్మాయితో వంటరిగా మాట్లాడాలి" అంది పెళ్ళికొడుకు పెద్దక్క.
"ఫర్వాలేదు! లోపలకు వెళ్ళండి" అంది అరుంధతి.
గదిలోకి వస్తున్న ఇద్దరు ఆడవాళ్ళని చూసి నిలబడింది పావని.
"ఏమ్మా! మావాడు నచ్చాడా నీకు?" నవ్వుతూ దగ్గరికొచ్చిందావిడ.
పావని మరింత సిగ్గుపడింది. రాయబారం పంపాడా, నాతో విడిగా మాట్లాడాలనుకుంటున్నాడా' అనుకుంది మనసులో. ఇన్నాళ్ళకు కలలు ఫలించాయనిపిస్తోంది.
ఒకావిడ వెళ్ళి తలుపులు వేసేసి వచ్చింది. పావనికెందుకో భయం వేసింది. 'ఇదేమిటి మాట్లాడాలంటే తలుపులు వేయడం దేనికి?" అని మనసులోనే అనుకుంది.
"ఏం లేదమ్మా! ఇదివరకో అమ్మాయిని చూశాం చాలా తెల్లగా బావుంది. కాని తర్వాత తెలిసింది ఆ పిల్లకు ఏదో చర్మవ్యాధి ఉందట. అందుకే ఒకసారి బట్టలు విప్పమ్మా చూస్తాం."
ఆవిడ చాలా క్లాజువల్ గా, నెమ్మదిగా మాట్లాడింది అయినా ఆవిడ ఒక్కొక్కమాటా బాంబులా పేలింది. పావని వళ్ళు జలదరించింది. పెనం కాలుతున్న భావం.
"సిగ్గుపడకమ్మా ఆడవాళ్ళమేగా!"
"నాకే జబ్బూ లేదండీ" అంది బెరుగ్గా, బయటకు వెళ్ళి తండ్రికి చెప్పడానికి వీలులేని పరిస్థితి.
"మరేం ఫర్వాలేదు, అన్నీ సెటిలైపోయినట్లే, మా తృప్తికోసం, మా నాన్నగారి అనుమానం తీర్చడానికి."
పావనికి ఏం చెయ్యాలో తోచడంలేదు. అమ్మకు చెప్పే లోపలికి వచ్చారు. తల్లీ చెల్లీ వుండగా చీరయినా మార్చుకునే అలవాటు లేదు. ఇప్పుడు ఇద్దరు పరాయివాళ్ళ దగ్గర.....వాళ్ళు శరీరాన్ని పరిశీలిస్తుంటే బొమ్మలా నిలబడటం.....ఛ....ఏమిటిది? అన్నీ కుదిరాక ఇప్పుడిది కాదంటే సంబంధం వదులుకుంటారేమో. అప్పుడు మళ్ళీ పశ్చాత్తాపపడాల్సి వస్తుందా?
పావని ఒక్కో వలువా విప్పి పక్కన పెట్టింది. ఆమె మరొక విధంగా ఫీలవకుండా ఉండాలని నవ్వుతూ కబుర్లు చెబుతున్నారు. అయిదు నిమిషాల్లో పూర్తయింది. తృప్తిగా తలాడించారు. పావని బట్టలు వేసుకుంటోంది. ఆమె కెందుకో ఆ క్షణం తనకీ వేశ్యకీ తేడా లేదనిపించింది.
"అన్ని విధాలుగా నచ్చావు. వంట అదీ చేస్తావుట. మరి అల్లికలు, కుట్లు ఏమీ నేర్చుకోలేదా?"
"అమ్మకి ఆరోగ్యం సరిగ్గా ఉండదుకదండి. వేరే వాటిని నేర్చుకునే టైం వుండదు. అన్ని పనులు నేనే చేసుకుంటాను."
"అవును ఏమిటి మీ అమ్మగారి జబ్బు?"
పావని సందేహించింది. అరుంధతి క్యాన్సర్ అని తెలిసి చాలా సంబంధాలు వెనక్కి వెళ్ళాయి. అందువల్ల ఎవరితోటీ ఆ విషయం అడిగితే తప్ప చెప్పడం లేదు.
కానీ జీవితాంతం వాళ్ళతో కలిసి వుండవలసినప్పుడు తను అబద్దం చెప్పడం ఎలా?
"క్యాన్సర్ అండీ! ఉన్నట్లుండి నెప్పివచ్చి బాధపడుతుంది. వంట చేయలేదు" అంది మెల్లిగా.
"అలాగా! ఈ విషయం మధ్యవర్తి చెప్పనేలేదే" ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. పావని భయంగా కిటికీ దగ్గర చేరింది.
వాళ్ళు తండ్రిని నిలదీసి అడుగుతున్నారు.
"అదేం లేదండీ! చిన్నవాడు పుట్టినప్పుడు చిన్న సర్జరీ జరిగింది. అది సరిగ్గా చెయ్యక లోపల ఇన్ ఫిక్షన్ అయిందట. అది క్యాన్సర్ లోకి దించింది. ఆ విషయం మాకు తెలిసేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు,"
భార్య జబ్బు గురించి ఎప్పుడూ, ఎవరికీ ఇలాంటి సంజాయిషీ ఇవ్వలేదు విశ్వపతి వింటున్న పావనికి దుఃఖం ముంచుకొస్తుంది.
"మళ్ళీ కబురు చేస్తాంలెండి" వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ సమాధానం అర్ధమైపోయింది.
అరుంధతి నిశ్చేష్టురాలైనట్లు కుర్చీలోనే కూర్చుంది. పావని పరుగెత్తుకెళ్ళి ఆమె వడిలో వాలిపోయింది. కరుడుకట్టిన దుఃఖం కరిగి కన్నీరై ప్రవహిస్తోంది.
"నాలాంటి అభాగ్యురాలి కడుపున జన్మించినందుకు నీకు శిక్షమ్మా ఇది. వీళ్ళ చదువులకీ, మీ పెళ్ళిళ్ళకు నా జబ్బు అడ్డువస్తుందని తెలిస్తే అప్పుడే ఆత్మహత్య చేసుకునే దాన్ని" ఆమె కంటి వెంట బొటాబొటా కన్నీరు కురుస్తోంది.