అవును నాలుగు రోజుల క్రితం రజనీతో నూతి దగ్గర చప్టామీద కూర్చున్న సంఘటన గుర్తొచ్చింది. దాని పరిణామమే ఇది!
ఆ అమ్మాయి సన్నగా వణికిపోయింది.
ఎలా? ఇప్పుడెలా?
తన తల్లిదండ్రులకి ఈ విషయం ఎలా చెప్పాలి.
ఆ అమ్మాయికి దుఃఖం ఎక్కువయింది. దుఃఖంతోపాటు నొప్పి కూడా ఎక్కువవసాగింది.
ఇప్పుడేం చేయాలి తను? రజనీ తనను పెళ్ళి చేసుకోకపోతే? నీకూ, నాకు ఏ సంబంధమూ లేదంటే? ఏదో సినిమాలో లాగా తను అడవుల్లో వెళుతూ కొండమీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలా? అప్పుడు ఎవరన్నా వచ్చి తనను రక్షిస్తారా? తన కొడుకు పెరిగి పెద్దవాడై "అమ్మా! నిన్ను మోసం చేసిన నాన్నను తీసికొచ్చి నీ కాళ్ళదగ్గర పడేస్తానమ్మా?" అంటాడా?..... ఇలాంటి రకరకాల ఆలోచనలతో వరూధిని ఏడవసాగింది. ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. ఆ తరువాత ఉదయంవరకూ మెలకువ రాలేదు.
ప్రొద్దున్నే నాయనమ్మ మాటలకి ఆ అమ్మాయికి మెలకువొచ్చింది. ఎండ బాగా పడుతోంది.
అనసూయమ్మ కోడలిని గట్టిగా పిలుస్తోంది. నాయనమ్మ అంత గట్టిగా ఎందుకు అరుస్తుందో వరూధినికి అర్థంకాలేదు. లేచి కూర్చోబోతూ తన స్థితి చూసుకుని ఆ అమ్మాయి మరింత కంగారుపడింది. ఈ లోపులో వరూధిని తల్లి చూసుకుని ఆ అమ్మాయి మరింత కంగారుపడింది. ఈ లోపులో వరూధిని తల్లి రుక్మిణి లోపలికొచ్చింది. అనసూయమ్మ కోడలితో. "అమ్మాయి పెద్దమనిషైంది. మీ ఆయన పెరట్లో వున్నట్లున్నాడు. వెళ్ళి చెప్పు" అని బిగ్గరగా అనటం వరూధిని చెవిన పడింది.
3
అంత రక్తాన్ని చూసి ధాత్రి బెదిరిపోయింది.
"అరే, ఏమిటా రక్తం! ఏం జరిగింది?" తల్లి కంగారుగా పరుగెత్తుకుంటూ వచ్చి అడిగింది. ధాత్రి ఒక కాలు పైకెత్తి పట్టుకుని కుంటుకుంటూ నడుస్తూంది ఆమె నడచినంత మేర నేలంతా రక్తమయం అవుతూంది.
"గాజుపెంకు గుచ్చుకుందమ్మా?" పళ్ళు బిగించి ఏడుపు ఆపుకుంటూ అంది ధాత్రి.
"గాజుపెంకా? ఎలా గుచ్చుకుంది ఏం పిల్లవో-నన్నొక్క నిమిషం సుఖంగా కూర్చోనివ్వవ్. కాళ్ళకి చెప్పుల్లేకుండా బయటకెందుకు వెళ్ళావ్" అంటూ కోపంగా ధాత్రిని సోఫాలో కూర్చోబెట్టి, గాయాన్ని దూదితో తుడుస్తూ "ఇంక రేపటినుంచీ ప్రాక్టీస్ ఎలా చేస్తావ్?" అని అడిగింది.
ధాత్రి తల్లివైపు కన్నార్పకుండా చూసింది. 'అమ్మకు నేనంటే కోపమా? ప్రేమా? మరింకేదైనానా?' అనుకుంది మనసులో.
ఆ ఇంకా ఏదైనా' అనే చివర అనుమానాన్ని విశ్లేషించుకునే శక్తి ధాత్రికి లేదు. ధాత్రికి దెబ్బ తగిలినందుకు శ్రీలక్ష్మి విలవిల లాదిపోయిన మాట నిజమే కానీ అది టెన్నీస్ లో , నాట్యంలో పాల్గొనలేకపోతుందే అన్న బాధతో.
గాయంనుంచి రక్తం కారటం ఆగకపోవటంతో ఆటో పిలిపించి డాక్టర్ దగారికి తీసికెళ్ళింది శ్రీలక్ష్మి. గాయం లోతుగా అవటంతో కుట్లు వేసి బాండేజి కట్టాడు. నొప్పి తగ్గటానికి టాబ్లెట్లు వ్రాసిచ్చి వారంరోజుల్లోనే వున్నాయి.
ధాత్రికెందుకో తృప్తిగా అనిపించింది.
శ్రీలక్ష్మి మనసు మాత్రం విలవిల లాడిపోతోంది. ఈ పదిరోజులు బాగా ప్రాక్టీస్ చేయించి కూతుర్ని ఛాంపియన్ షిప్ విన్నర్ ని చేయలని ఆమె ఎప్పటినుంచో కలలు కన్నది. కూతురి ఫోటో పేపర్లో పడినట్లు వూహించుకుని ఇంతకాలం సంబరపడిపోయింది.
ఆమె ఆశ వెనుక ఆమె గతం వుంది.
...............శ్రీలక్ష్మి చిన్నతనంలో కన్న కలలేవీ నిజం చేసుకోలేకపోయింది.
మనుషులు తాము పోగొట్టుకున్న బాల్యాన్ని తిరిగి తమ పిల్లల్లో చూసుకోవాలనుకుంటారనటానికి ఆమె ఒక ఉదాహరణ.
శ్రీలక్ష్మి పూర్వీకులు జమీందార్ల దగ్గర దివాన్లుగా పనిచేసి బాగా సంపాదించారు. తండ్రి హయాం వచ్చేసరికి ఆస్తిబాగా హరించుకుపోయినా ఆ రాజసం మాత్రం శ్రీ లక్ష్మిని వదల్లేదు. తన చిన్నతనంలో తండ్రిని వూళ్ళో అందరూ ఒక మహారాజులగా చూడటం ఆమెకి బాగా గుర్తు.
ఆమె హైస్కూలుకి వచ్చేసరికి తండ్రి పల్లెనుంచి సిటీకి మకాం మార్చాడు. ఉన్నట్టుండి 'గుర్తింపు' అనేది పోవటంతో శ్రీలక్ష్మి నీటినుండి బయటపడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంది.
ఒక మనిషి గుర్తింపు పోందాలీ అంటే ఒక కళ తప్పనిసరిగా వుండాలి. అంతకన్నా ముఖ్యంగా బలమైన వ్యక్తిత్వం వుండాలి. కొంత మంది వ్యక్తులు ఏమాత్రం వ్యక్తిత్వం లేకపోయినా అడ్డదారిలో గుర్తింపు పొందుతూ వుంటారు. కానీ అది చాలా పెళు సైన గుర్తింపు మాత్రమే.
చిన్నప్పుడు నేర్చుకున్న కొద్దిపాటి సంగీత జ్ఞానంతో శ్రీలక్ష్మి స్కూల్లో పాటలు పాడటానికి ప్రయత్నించింది. అక్కడ సంగీతం బాగా వచ్చిన పిల్లలు వుండటంతో ఆమె పాటలు హాస్యాస్పదంగా మారేవి. పల్లెటూళ్ళో చదివిన చదువులు కావటంతో స్కూల్లో పిల్లలతోపాటు సమానంగా చదవలేకపోయింది. దాంతో ఆమెకి బాగా ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ పెంపొందింది. వయసుతోపాటు అది పెరిగింది. వీటన్నింటినుంచి బయటపడి జీవితంలో ఒక గుర్తింపు పొందటం కోసం ఆమెకున్న ఏకైక ఆయుధం ఆమె కూతురు ధాత్రి మాత్రమే. ఆమె తన ఆశలను కూతురి మీదే నిలపసాగింది. ఈ విషయంలో ఆమె ఏమైనా ఆనందం అనుభవిస్తుందేమో తెలీదుకాని కూతురి పాలిట మాత్రం అది ఒక శాపంగా పరిణమించింది.
శ్రీలక్ష్మి ఉదయం అయిదింటికి నిద్రలేస్తుంది. ఆరింటికల్లా కూతుర్ని తీసుకొని డాన్స్ క్లాస్ కి వెళుతుంది. క్లాస్ అయ్యేవరకు అక్కడే కూర్చుని ఎనిమిదింటికి ఇంటికొస్తుంది. కూతుర్ని స్కూల్ కి పంపాక ఇంటిపనులు చూసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ధాత్రి ఇంటికిరాగానే టెన్నిస్ కోచింగ్ కి తొమ్మిదింటినుంచి దగ్గర కూర్చొని చదివిస్తుంది. కూతుర్ని ఆ విధంగా రోజంతా మిషన్ లా మార్చి అన్ని విద్యల్లో నిష్ణాతురాలిని చేయాలని కంకణం కట్టుకుంది.
శ్రీలక్ష్మి ఇలా మారటానికి ఆమె భర్త విష్ణుకూడా కొంతకారణమే. హైస్కూలు చదువు పూర్తవగానే శ్రీలక్ష్మికి పెళ్ళి చేసేశారు. విష్ణు ఆమెకి వరసకి బావ అవుతాడు. ధాత్రి పట్టేవరకు, అంటే పెళ్ళయిన మూడేళ్ళవరకు సంసారంలో పడిపోయి ఆమె తన అస్థిత్వాన్నే కోల్పోయింది. సంతోషిస్తూ మాత్రం కాదు. భర్త ఆమె నెప్పుడూ మనిషిగా గుర్తించనేలేదు. సుఖాన్నిచ్చే యంత్రంగా మాత్రమే ఆమెని తయారు చేశాడు. ధాత్రి పుట్టిన తరువాత ఆమెకి ఒక్కసారిగా జీవితమంతా శూన్యం ఏర్పడింది. ధాత్రికి అయిదేళ్ళు వచ్చేవరకూ ఆమె ఆ శూన్యంలోనే బ్రతికింది. పాప పెంపకం, పోషణలో ఆమె ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకు గడిపేది. రాత్రి ఎప్పుడో భర్త వచ్చేవాడు. అలా యాంత్రికంగా గడిచిపోతున్న జీవితంలో ఆమె క్రమంగా తన పూర్వాశ్రమపు రోజుల్ని......తను కోల్పోయిన దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకో సాగింది. తన కలలు సఫలీకృతం చేసుకోటానికి ఆమెకి తన కూతురు ఒక ఆయుధంగా కనబడింది. దాంతో ముందే చెప్పినట్టు ఈ ప్రయోగం మొదలైంది.
ఇలాంటి తల్లులు మన సమాజంలో కొరత కాదు. ఒక పచ్చగా పెరిగేచెట్టు మరింత తొందరగా పెరగాలని విపరీతంగా ఎరువేసినట్టు, అంతులేనట్టుగా బాల్చీలకు బాల్చీలు నీళ్ళు పోసినట్టు ఆమె తన కూతుర్ని పెంచుతోంది.
........ధాత్రి పట్ల ఈ తల్లి వత్తిడి అతివృష్టి అయితే అదే కాలనీలో వున్న మరొక అమ్మాయి 'మహతి' పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అనావృష్టి.
* * *
"నాకు చచ్చిపోవాలనుంది నిఖితా" అంది మహతి ఏడుస్తూ ఒక రోజు.
"ఎందుకు?" అని అడిగింది నిఖిత. ఇద్దరూ కాలనీలో వున్న పార్కులో చెట్టుకింద కూర్చుని వున్నారు. వాళ్ళిద్దరూ క్లాస్ మేట్స్, మంచి స్నేహితులు కూడా.
"ఎందుకేమిటి? మా అమ్మా, నాన్నలకి నేనంటే ఇష్టంలేదు. ఈ రోజు తమ్ముడ్ని తీసుకొని పార్టీకి వెళ్ళిపోయారు. నన్నొక దాన్నే ఇంట్లో వదిలేశారు. నన్నెందుకు తీసుకెళ్ళలేదో తెలుసా. నాకు మంచి బట్టల్లేవని. వాళ్ళు కొనిపెడితేనేగా నాకు మంచి బట్టలుండేది. తమ్ముడికైతే ఎంతో ఖరీదైన బట్టలూ, బొమ్మలూ కొనిపెడతారు. నాకు కొనాలంటే వాళ్ళ దగ్గిర డబ్బుండదు."
"నువ్వు మీ అమ్మ, నాన్నలని ధైర్యంచేసి అడగొచ్చుగా" అంది.
"ఏమడగను? ఏం అడిగినా లేదు.......... లేదు.........." అని సమాధానం వస్తుంది. అంతా నా కట్నం కోసం దాచి వుంచుతారు. అమ్మ సంవత్సరానికొక నగ చేయిస్తుంది. వాటిని బ్యాంకు లాకర్లో పెడతారు. కట్టుకోవటానికి మంచి బట్టలుగానీ, చదువుకోవటానికి పుస్తకాలుగానీ ఇవ్వరు. వాళ్ళు ఏ పని చేసినా అది నా పెళ్ళిని దృష్టిలో పెట్టుకునే. ఎలాగోలా నాకు పెళ్ళి చేయటమే వాళ్ళ జీవితాశయం అన్నట్టు మాట్లాడతారు" అంది మహతి.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వుండగా ధాత్రి, "ఏమిటి మహతి? అలా వున్నావు?" అంటూ అక్కడికొచ్చింది. అప్పటివరకూ వున్న తనదుఃఖం సంగతి మరచిపోయి "ఒహొ ధాత్రిదేవి గారొచ్చారా? ఏమిటివాళ ఇంత సుదినం! మీరు మీ యొక్క టైట్ ప్రోగ్రాం వదిలేసి ఇలా పార్క్ దగ్గర కొచ్చారు" అంది వెటకారంగా మహతి.
నిఖిత కల్పించుకొని "నువ్వూరుకో మహతీ" అని ధాత్రివైపు తిరిగి "నీ కాలుకి ఆ కట్టేమిటి?" అని అడిగింది.
"గాజు పెంకు గుచ్చుకుంది".
మహతి నువ్విలా మాట్లాడితే నేను సమ్మె చేస్తాను. నీతో ఒక వారం రోజులుదాకా మాట్లాడను. అంతే" అని బెదిరించింది నిఖిత.
మహతి సారీ చెబుతున్నట్లు "అబ్బ అంత కోపం దేనికి? ధాత్రి మనతో ఎప్పుడూ కలవదు కదా? అన్నట్టు మన కాలనీలో యిద్దరు జీనియస్ లున్నారు తెలుసా? ఒకడు ఆ పుస్తకాల పురుగు అవినాష్. రెండు ఈ ఆల్ రౌండర్" అని ధాత్రివైపు తిరిగి "పాపం నువ్వేదో టెన్నిస్ ఛాంపియన్ వి, డాన్సర్ వి అవుతావని మీ మమ్మీ అందరితో చెప్పుకుంది కదా, ఇప్పుడెలా ఆడతావు" అని అడిగింది.
"ఆ పోటీలో నేను గెలవను. నాకా విషయం బాగా తెలుసు. నా మీద మా అమ్మ బాగా ఆశలు పెట్టుకుంది. నే నోడిపోతే ఆవిడ భరించలేదు. అందుకే నేను కావాలని గాజు పెంకుమీద కాలుపెట్టి తెగ్గోసుకున్నాను". చాలా మామూలుగా అంది.
వింటున్న ఇద్దరూ ఉల్లిక్కిపడ్డారు. ధాత్రి ఏం చెపుతుందో అర్థమై నిఖిత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. జాలిగా ధాత్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది. అనునయంగా చేతిని నిమురుతూ, "అంత ధైర్యం ఎలా చేయగలిగావు ధాత్రి? నొప్పిగా లేదూ" అని అడిగింది, ఆ మాత్రం ఆప్యాయతకే ధాత్రి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. "ముందు నొప్పెటింది. మీకు గుర్తుందా ఆ రోజు మీరు నన్ను బాగా ఏడిపించారు. మీతో గంటసేపయినా గడపననీ, ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు టెన్సీసని, డాన్సని తిరుగుతూ వుంటానని గేలిచేశారు. ఆ మాటలే గుర్తు తెచ్చుకున్నాను. ఏం చేశానో తెలుసా? కళ్ళు గట్టిగా మూసుకున్నాను. 'మా స్నేహితురాళ్ళతో స్నేహం నిలబెట్టు దేవుడా' అని ప్రార్థంచాను. పెంకుతో కాలు తెగ్గోసుకున్నాను. బాగా లోతుగా దిగిపోయిందిలే ఇరవై రోజులుదాకా ఇక డాన్స్. సంగీతం, టెన్సిస్ ఏమీ లేవు" అంది విషాదంగా నవ్వుతూ.