"ఎంత ప్రమాదం తప్పింది... తండ్రి కోసం బలి అయ్యేవాడు"
ఆడవాళ్ళు సానుభూతిని ప్రకటించారు.
ఎన్నికలలో గెలవడంకోసం అమానుషంగా ప్రవర్తించిన ఆనందరావు మీద ప్రజలలో వ్యతిరేకత మొదలైంది.
వాస్తవానికి... రవితేజకు ఫోన్ చేసి రెచ్చగొట్టి ఈ కార్యక్రామాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన క్రిమినల్ లాయర్ సత్యమోహన్ మరి ఒక పథకానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.
"బావా... ఇక నీ గెలుపుని ఆపడం ఎవరివల్లా కాదు."
"అంతే నంటావా?"
"ఇంకా సందేహమా... ఈ పథకాన్ని కూడా 'తు.. చ' తప్పకుండా పూర్తిచేస్తే రవితేజను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు పంపవచ్చు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయించి ఎలక్షన్లు పూర్తి అయ్యేవరకూ అతను బయటకు రాకుండా చేస్తాను. కొడుకు జైలులో వుంటే ఆనందరావుకు సగం బలం పోయినట్టే" లాయర్ సత్యమోహన్ నవ్వుతూ అన్నాడు.
జయచంద్రకు తన గెలుపుపై అప్పుడు నమ్మకం కలిగింది.
అప్పుడే అక్కడకు వచ్చిన ఎస్ ఐ శక్తి... కర్చీఫ్ లో చుట్టివున్న రివాల్వర్ ను సత్యమోహన్ ముందు పెట్టాడు.
"ఏమిటది?"
"హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం... పారిపోయే ఖంగారులో జారిపడిపోయింది. ఎందుకు అయినా మంచిది మీకు ఉపయోగిస్తుంది అని భద్రంగా తెచ్చాను" వినయంగా చెప్పాడు ఎస్.ఐ.
"వెరీగుడ్... మంచిపని చేశావు!"
"కాకపోతే చిన్న డామేజీ జరిగిపోయింది సర్."
"ఏమిటి ఆ పొరపాటు?"
"బుల్లెట్ దెబ్బతిని కానిస్టేబుల్ గాయబడి హాస్పిటల్ లో చేరాడు."
"ఆల్ రైట్... ఈసారి రవితేజ శాశ్వితంగా జైలుపాలు అయ్యేవిధంగా పథకం ఆలోచించాను. ఎట్టి పరిస్థితులలోనూ పొరపాటు జరగనీయకూడదు. నీకు జరిగిన డామేజీను ఈ డబ్బుతో పూడ్చుకో" అని కొన్ని నోట్ల కట్టలను ఎస్.ఐ కు అందించాడు సత్యమోహన్.
ఎస్.ఐ శక్తి మహదానందంగా నోట్ల కట్టలను అందుకున్నాడు.
"రవితేజ ఎక్కడ వున్నాడో తెలుసుకుని ఊరుకో. నేను చెప్పేంతవరకూ అరెస్టు చేయవద్దు. అర్ధం అయిందా?"
అతని పథకం అంతు పట్టకపోయినా శ్రద్డగా తల వూపి వెళ్ళి పోయాడు ఎస్.ఐ.
సత్యమోహన్ ఫోన్ చేసి వెంటనే అభినయ్ ను పిలిపించాడు.
"మై బోయ్....ఇదే మన ఆఖరి ఎత్తు... సక్సెస్ చేయడం అనేది నీపై ఆధారపడి వుంది. యీ రివాల్వర్ నిన్ను చంపబోయిన రవితేజది. దీనిపై అతని వేలిముద్రలు వున్నాయి. ఇది దొరికిన తరువాత మన ప్లాన్ లో చిన్నమార్పు చేశాను. దీనినే మనం ఆయుధంగా ఉపయోగించి అతనని కటకటాల పాలు చేయాలి" అన్నాడు సత్యమోహన్.
అభినయ్ బుద్దిగా తలాడించాడు.
సత్యమోహన్ చెప్పడం ప్రారభించాడు.
* * * *
సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ డ్ చేసిన హాలు అది.
ఆ గదిలో ఇనుప బాక్సులు పేర్చి వున్నాయి. అన్నిటి నిండా వందరూపాయల కరెన్సీ నోట్లు కొత్తవి పెళపెళలాడుతూ వున్నాయి.
తెల్లటి కళ్ళజోడు పెట్టుకున్న సూట్ వాలా ప్రతి బాక్స్ లో నుంచి ఒక నోట్లకట్ట బయటకు తీసి దానిలోని నోట్లను పరిశీలించి తిరిగి యుధా ప్రకారం పెడుతున్నాడు.
మెత్తటి పరుపుపై కూర్చుని విలాసంగా విస్కీ తాగుతూ అతని చర్యలను గమనిస్తున్నాడు నల్లగా వత్తుగా గడ్డం వున్న వ్యక్తి.
దాదాపు పావు గంట పాటు చెక్ చేసిన తరువాత సంతృప్తికరంగా వచ్చి గడ్డం వ్యక్తి పక్కనే కూర్చున్నాడు అతను.
చిరునవ్వుతో అతనికి ఇంకొక విస్కీగ్లాసుని అందించాడు.
"ఏమైంది... ఏది అయినా అనుమానం వచ్చిందా?"
"ఇట్స్ ఓకే... ఏది నకిలీయో... ఏది ఒరిజనల్ నోటో తెలియనంత సహజంగా వున్నాయి మన నోట్లు.... ఇట్స్ ఫెంటాస్టిక్ జాబ్" అంటూ సూట్ వాలా మెచ్చుకున్నాడు.
"ఇన్ స్పెక్టర్ చతుర్వేదిని చంపిన వాళ్ళ కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టిన నేపధ్యంలో ఆ బాధ్యతను ఏ. సి. పి. వీరేష్ కు అప్పజెప్పారు. అతను డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ గా అటు డిపార్ట్ మెంట్ లోనూ ఇటు ప్రజలలోనూ పేరు ఉంది."
"అతను అంత డేంజర్ మనీషా?"
"చతుర్వేదిని ఎక్కడ చంపారో తెలుసుకొనగలిగిన మేధావికి ఆ హత్య చేసింది ఎవరో తెలుసుకొనడం ఏమంత కష్టం కాదు. అందుకే నా ఖంగారు."
సూట్ వాలా ఒక నిమిషం అలోచిచాడు.
"ఆల్ రైట్... చిన్న పామును అయినా పెద్ద కర్రతోనే కొట్టాలి అన్న సామెత గుర్తుంది. అలానే వీరేష్ కు కూడా షాక్ ట్రీట్ మెంట్ ఇద్దాం."
"అది ఎప్పుడు అనే నేను ప్రశ్నించేది... మనం ఇలానే మవునంగా చూస్తూ ఊరుకుంటే మన పునాదులను పెకలించాక కానీ మనజోలికి రాడు. అప్పుడు అతనని మనం ఏమీ చేయలేము" అన్నాడు గడ్డం వ్యక్తి కంగారుగా.
"భయపడకు... వీరేష్ కు ఈ రాత్రే ఆఖరి రాత్రి అవుతుంది. రేపు సూర్యోదయాన్ని అతడు చూడలేడు. అలాంటి ఏర్పాట్లు చేసే వచ్చాను. నువ్వేం వర్రీ అవబోకు... నువ్వు ఇలాటి ప్రపోజల్ తెస్తావనే ముందుగానే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నాను. దట్సాల్" అన్నాడు అతను ఎంతో నింపాదిగా.
"నువ్వు ఆ హామీ ఇచ్చావంటే చాలు_ నా పని నేను ధైర్యంగా చేయగలను. బొంబాయి నుంచి పార్టీ ఒకటి వచ్చింది. అతనికి పదిలక్షలు కావాలంట... ఐదు లక్షలు హార్డ్ కాష్ తో అశోకాహోహొటల్లో దిగాడు. వచ్చిన వెంటనే నన్ను కాంటాక్ట్ చేస్తే కావాలనే ఒక రోజు ఆగమని అన్నాను. ఈలోపు అతని బయోడేటా కనుక్కొని, ఏమాత్రం అనుమానం కలిగినా అతని శవం హుస్సేన్ సాగర్ లో తేలేలా చేయమని మనవాళ్ళకు చెప్పాను" అన్నాడు గడ్డం వ్యక్తి.
"ఓ.కే... నీ జాగ్రత్తలో నువ్వు వుండడం ఎట్టి పరిస్థితిలోనూ మరచిపోవద్దు. ఏ మాత్రం అవసరం అయినా నన్ను కాంటాక్ట్ చేయి. పరిస్థితి చేయిదాటిపోకమునుపే ఎప్పుడూ అడ్వాన్స్ స్టెప్ తీసుకోవాలి" అన్నాడు సూట్ వాలా.
ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్యా ఎలాటి మాటలు సాగలేదు. విస్కీ సీసాని పూర్తి చేయడంలో మునిగిపోయారు.
దొంగనోట్ల వ్యాపారికి అ ఇద్దరే అధిపతులు.....
ఒకరు ప్రముఖ రాజకీయవేత్త జయచంద్ర అయితే రెండవ వ్యక్తి క్రిమినల్ లాయర్ సత్యమోహన్!
ఒకరిపై ఒకరికి కొండంత నమ్మకం_ ఒకరు చెప్పిన మాటను రెండవ వ్యక్తి వింటాడు.
అందుకే ఎలాంటి అవరోధాలు లేకుండా సజావుగా సాగిపోతుంది వారి చీకటి వ్యాపారం!
* * * *
ఉదయాన్నే కాలింగ్ బెల్ మోగడంతో ఏసిపి వీరేష్ విసుక్కుంటూ నిద్రలేచాడు.
తలుపు తెరచీ తెరవడంతో ఎదురుగా కనిపించిన ఆకారాన్ని చూడగానే కాస్తో కూస్తో వున్నా మత్తు కాస్తా వదలిపోయింది అతనికి.
"హాయ్ హాండ్ సమ్ ..." దాదాపు మీద పడేట్టుగా గదిలోకి దూసుకొచ్చింది ధీరజ.
"ఏం మహాతల్లీ.... ఇంత వుదయాన్నే లేవడం లేవడం నీ ముఖాన్నే చూశాను. ఇవాళ నా తలరాత ఎలా వుందో" నోట్లోనే గొణిగాడు వీరేష్.
"రాత గీత తరువాత... ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పు... ఆ రోజు సినిమా హాలులో నన్ను ఒంటరిగా వదిలి ఎందుకు పారిపోయావు?"
ఏం చెప్పి తప్పించుకోవాలో వెంటనే సరి అయినా కారణం తోచలేదు.
"కమాన్... చెప్పు"
"ఏం చేయమంటావు డియర్.... చెద పురుగులా మాటలతో నా బుర్రను తినివేస్తుంటే అంతకు మించి మరొక మార్గం కనిపించలేదు."
"ఏయ్... నీ కళ్ళకు నేను చెదపురుగులా కనిపిస్తున్నానా?"
"సారీ... అమ్మయిగారికి కోపం వచ్చినట్టుందే... ఆ విషయం అడగడానికే ఇంత ఉదయాన్నే వచ్చానని నేను అనుకోను. ఏమిటి ఈ రోజు విశేషం?" అనుమానంగా ప్రశ్నించాడు వీరేష్.
"అంత తెలివయినవాడివి అయితే ఎందుకు వచ్చానో కూడా ఊహించు.... కరెక్ట్ గా చెప్పగలిగితే మంచి బహుమతి ఇస్తాను" అన్నది ధీరజ కొంటెగా.
సీరియస్ గా ఆలోచించినా ఎందుకొచ్చి వుంటుందో అతని ఊహకి తట్టలేదు.
"ఈలోపు ఆలోచిస్తూ వుండు- కాఫీ కలుపుకువస్తాను. వేడివేడిగా గొంతులోకి దిగుతూ వుంటే అప్పుడయినా బుర్ర పనిచేస్తుందేమో.... అంటూ కిచెన్ లోకి దూరిందామె.
ప్చ్... లాభం లేకపోయింది.
కాఫే కప్పులతో వచ్చిన ధీరజకు అతని ముఖం చూసేసరికి జాలి వేసింది.
"ముందు కాఫీ తాగు_ తర్వాత తీరికగా అలోచించవచ్చు."
తను ఒకటి తీసుకుని రెండవది అతనికి ఇచ్చింది. కాఫీ కప్పును అయితే ఖాళీ చేసాడు కానీ సరదాగా గడపడానికి వచ్చావు. అవునా?"
"అంతకుమించి మంచి ఆలోచనలు నీకు రావా... పెద్ద హీరో ఫోజు పెట్టాడు చూడు_ ఏ మాత్రం చిన్న అవకాశం దొరికిన తుర్రుపిట్టలా నీ ముందు వాలిపోయేదాన్ని_ ఆ మాత్రం నన్ను అర్ధం చేసుకోలేవా ఏమిటి_ కనీసం నేను ఇచ్చే బహుమతి కోసమైనా కాస్త బుర్రకు పదును పెట్టవచ్చుగా" అంది సీరియస్ గా.