Previous Page Next Page 
లేడీ కమెండో పేజి 12

క్రిమినాలజీకి చెందిన విషయం ఏదయినా అడుగు_ తడుముకోకుండా ఠక్కున చెప్పేసాను. ఈ ప్రేమలు దోమలు మన ఒంటికి సరిపడని విషయాలు_ నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు. అదేదో నువ్వే చెప్పవచ్చుగా... సస్పెన్స్ తో చంపడం దేనికి?"
"నీకు సంభందించిన అతి ముఖ్యమైన విషయమే. గుర్తుంచుకొన లేనివాడివి రేపు నన్ను కూడా మరచిపోయి డ్యూటీ అంటూ దొంగల వెంటబడి తరుముతూ ఉండిపోతావా ఏంటి?"
"ఛ..ఛ... అల ఎందుకు చేస్తాను ధీరజా..."
"అల్ రైట్_ ఆ పజిల్ ఏదో నేనే చెబుతాను కానీ ... మరి నాకు ఏం బహుమతి ఇస్తావు?"
"నువ్వు ఇందాక ఏదో ఇస్తానన్నావుగా_ అదేదో చెప్పు- నేనూ తిరిగి అదే ఇస్తాను"
"నిజంగా..." సంతోషంగా అందామె.
"నిజంగానే ఇస్తాను అంటున్నానుగా"
"మళ్ళీ అడుగుతున్నాను_ మాట తప్పవుగా"
"మాట తప్పే ప్రశ్నే లేదు... నువ్వు నాకు ఎంత విలువైనది యివ్వలనుకున్నావో, అదేదో చెప్పు.... నేనూ నీకు అదే ఇస్తాను సరేనా?"
"అయితే చెప్పేస్తున్నాను...."
"అబ్బ చెప్పమంటుంటే మళ్ళీ నీ నస మొదలెట్టావు"
"నీకు నేను ఊపిరి సలవకుండా వంద ముద్దులు ఇద్దామని అనుకున్నాను" అంది ధీరజ చిలిపిగా.
ఆ మాట వినడంతో ఆమె అన్నిసార్లు రెట్టించిన మాటలలోని గూడార్ధం అప్పుడు తెలిసి వచ్చింది.
"ఏమిటి.... అబ్బాయిగారికి మాటలు రావడంలేదు. కమాన్ నేను రడీ_ ఏదీ ముద్దులు ఇవ్వడం మొదలు పెట్టు" తన ముఖాన్ని అతని దగ్గరగా తీసుకు వెళుతూ అందమే.
"ఇది అన్యాయం ధీరజా_ నేను ఎటూ ఇవ్వలేనని కావాలనే ఇలా అడుగుతున్నావు కదూ"
"నీ మీద ఒట్టు... నీకు నిజంగానే వంద ముద్దులు యివ్వాలనే వచ్చాను. ఎందుకంటే ఇవ్వాళ అలంటి విశేషమే వుంది. నేను ఇచ్చేది నువ్వూ ఇస్తాను అన్నావు కదా.... మరి మాట చెల్లించుకోవాలి"
"ఏంటి చెల్లించుకునేది.... నా తలకాయ.... అసలు ముద్దుపెట్టమంటేనే మూడు అడుగుల దూరం జరిగేవాడిని వందముద్దులు ఎలా పెడతాను."
"ఏం ఫరవాలేదు. ఇక్కడ ఎవరూ లేరు. మనమిద్దరమే ఉన్నాం. మరొకరు చూసే అవకాశం లేదు. కావాలంటే కళ్ళు మూసుకుంటాను. ఎలా పెట్టాలో తెలియకపోతే ముందు నేను పెట్టి చూపించేదా?" అతని పైకి వరిగిపోతూ అన్నది ధీరజ.
"వద్దు బాబోయ్.... నువ్వు నా మీద పడిపోతే నిన్ను ఆపాలంటే దేవతులు దిగి రావలసిందే"
"అంతేనంటావా?"
"అవును...ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు"
ఆ మాట వినడంతో అమాంతం ధీరజను పట్టి కుదిపేశాడు.
"ఓహ్... అసలు నాకు గుర్తేలేదు.... రియల్లీ అఫ్రిషియేట్ మైడియర్ లవ్...." అంటూ ఆమెను కౌగలించుకుని గిరగిరా తిప్పాడు.
ఊహించని అతని చర్యకు ఉక్కిరిబిక్కిరి అయిందామె.
అలాంటి అవకాశం మరొకసారి వస్తుందో రాదో అన్నట్టు అతని కౌగిలిలో ఒదిగిపోయి ఆనందానుభూతిని పొందింది.
"ఉదయాన్నే నా ముఖమే నీకు చూపించాలని... ఈ రోజు అంతా నీతోనే గడపాలని... నీ కౌగిలిలో కరిగిపోవాలని వస్తే ఏమీ తెలియని మొద్దు అవతారంలా నువ్వూ...." వెక్కిరిస్తూ అందామె.
"నా గురించి ఆలోచించేదానివి నువ్వు ఉన్నావు కదా అనే ధైర్యంతోనే కొన్ని కొన్ని విషయాలు అసలు గుర్తుంచుకోను ధీరజా... చివరకి నా పుట్టినరోజు నాకు గుర్తుండవలసింది పోయి నువ్వు వచ్చి చెప్పేవరకూ ఆ ధ్యాసే లేదు చూశావా...?" కౌగిలిలోంచి దూరంగా జరుగుతూ అన్నాడు అతను.
"ఇప్పుడు ఏమైంది వీరూ.... బీ హాపీ.... ఈ రోజు అంతా చక్కగా ఎంజాయ్ చేద్దాం... గుడికి వెళదాం... తరువాత పిక్చర్... హోటల్ లో భోజనం... డ్యూటీ అనేమాట ఈరోజు నీ నోటివెంట వినబడకూడదు. అర్ధం అయిందా? ఇప్పుడు అయినా నేను కోరిన బహుమతిని ఇస్తావా?"
"ఓ ఎస్..." అంటూ చొరవగా ఆమెను దగ్గరకు తీసుకుని రెండు బుగ్గలపైనా చెరొక ముద్దు పెట్టాడు.
ఆ మాత్రం దానికే పులకించిపోయిందామె.
"ఒక్కొక్క ముద్దు యాభై ముద్దులతో సమానం. సో... నీకు ఇవ్వవలసిన వందముద్దులూ ఇచ్చినట్టే. నీ మాట ప్రకారమే ఈ రోజంతా డ్యూటీకి ఎగనామం పెట్టేస్తాను సరేనా?"
తన ప్రపోజల్ కు అతను అంత త్వరగా తల ఊపుతాడు అని వూహించలేదామె.
"స్నానంచేసి వస్తాను... ముందు దైవదర్శనం చేసుకుందాం" అంటూ టవల్ తేసుకుని బాత్ రూమ్ కు వెళ్ళాడు.
ఒక గంట తరువాత ఇద్దరూ బిర్లా మందిర్ లో ఉన్నారు.
ప్రశాంతమయిన చల్లటి వాతావరణంలో ఆ దైవ సన్నిధిలో చాలాసేపు గడిపారు. అతని భుజంమీద వాలిపోయి వుంది ధీరజ.
మనసులలో గూడు కట్టుకున్న ప్రేమానుభూతులను ఎల్లలులేని ప్రేమ సామ్రాజ్యంలో ఇరువురూ విహరించారు.
జనం పెరగడంతో పరిసరాలను గుర్తించారు.
తరువాత సినిమా థియేటర్ కు వెళ్ళారు.
పిక్చర్  చూసి అటునుంచి అటే హోటల్ కి వెళ్ళి భోజనం చేశారు. సాయత్రం పార్కుకు వెళ్ళి సంధ్యచీకట్లు ముసురుకుంటున్న సమయానికి ఇంటికి చేరుకున్నారు.
ఆ రోజు అంతా ధీరజ అతనని అంటి పెట్టుకునే ఉంది. మామూలుగనయితే ఆమెను దూరంగా వుండమనేవాడు. కానీ అప్పుడు మాత్రం కావాలనే ఆమెను వారించలేదు.
ఆమాత్రం దానికే ధీరజ మనసు విహంగంలా విహరిస్తుంది.
ఉన్నట్టుండి ఫోన్ మోగింది.
ధీరజ ఉలికిపడుతూ అతనివైపు చూసింది.
వీరేష్ రిసీవర్ తీశాడు.
అవతల వైపునుంచి వినవచ్చిన కంఠస్వరానికి అతని ప్రేమమైకం పూర్తిగా కరిగి స్టిఫ్ గా మారిపోయాడు.
అతనిలో మారుతున్న ఫీలింగ్స్ ను గమనించిన ధీరజలో ఆదుర్దా మొదలయింది.
"సారీ డార్లింగ్..." అంటూ ఏదో చెప్పబోయాడు వీరేష్.
"నాకు తెలుసు వీరూ.... నువ్వు చెప్పబోయేది ఏమిటో... ఈ రోజు అయినా పూర్తిగా నాతో ఉంటావని ఆశపడ్డాను. నా ఆశ నిరాశే అని తేలిపోయింది" కన్నీరు చిప్పిల్లుతుండగా బేలగా అన్నది ఆమె.

 Previous Page Next Page