నీ స్నేహితులు నీవెంట ఎలక్షన్లలో తిరిగిన నేరానికి వారం రోజులపాటు హాస్పిటల్ పాలు అయ్యారు అవునా?"
అతను ఎవరు అయినప్పటికీ తన గురించి పూర్తిగా తెలుసుకునే మాట్లాడుతున్నాడని ఊహించాడు.
"అవును."
"మరి నిన్ను ఏమీ చేయకుండా ఎందుకు వదిలేశాడో కనీసం ఊహించనయిన ఊహించావా?"
"అసలు నాకు ఆ అనుమానమే రాలేదు. అయినా, మీరు ఎవరో ఎందుకు ఇంత సమాచారం సేకరించారో యిప్పటికి అయినా చెప్పవచ్చు కదా"
క్షణకాలం మౌనం వహించడో ఏమో రిసీవర్ లో మాటలు వినిపించలేదు.
"ఐ యామ్ మిష్టర్ ఎక్స్ అనుకో.... ఇప్పుడు నీ తండ్రి ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాడు. నీ తండ్రి మీద పోటీగా నిలబడింది తన తండ్రే కాబట్టి ప్రచారానికి వెళ్ళినప్పుడు నీ తండ్రిపై హత్యా ప్రయత్నము చేయడానికి తన అనుచరులను నియమించాడు అభినయ్. తన మీద ఏమీ అనుమానం రాకుండా ఉండటానికి తను మరి ఒక ప్రాంతములో ఎలక్షన్ ప్రచారానికి వెళతాడు. జనం మధ్యలో తనువుంటే ఆ సాక్ష్యం వలన తెలువిగా తప్పించుకొనవచ్చునని అతని ఆలోచన"
ఇది అంతా నాకు ఎందుకు చెబుతున్నారు?"
"నీ శ్రేయేభాలాషిని కాబట్టి_ నేనూ అభినయ్ వలన ఘోరంగా దెబ్బతిన్న వ్యక్తిని కాబట్టి_ కనీసం నువ్వు అయినా అతనిపై పగ తీర్చుకుంటే నా పగ కూడా తీరినట్టే అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా నీకు ఫోన్ చేసి నాకు తెలిసిన నిజాన్ని నీ చెవిన వేస్తున్నాను"
రవితేజ పిడిగిళ్ళు బిగుసుకున్నాయి.
"నిన్ను చావుదెబ్బ తీయాలి అని ఎదురు చూస్తున్న వ్యక్తిని నువ్వే ముందు చావుదెబ్బ కొట్టావు అనుకో తిరిగి దాడిచేసే అవకాశం అతనికి ఉండదు. అదీగాక అంతమంది జనంలో ఉండగా నువ్వు అతనిపై హత్యాప్రయత్నం చేసినప్పుడు గుంపులో ఎవరు ఆ పని చేశారో గుర్తించడం కూడా కష్టమే.
నువ్వు తొందరపడక పోయినట్టయితే నీ తండ్రి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.
కానీ, "నువ్వే ముందు అభినయ్ ను చంపగలిగితే నీతండ్రి సురక్షితంగా వుంటాడు"
ఫోన్ పెట్టేసాడు అతను.
పూర్తిగా విన్న రవితేజలో ఇప్పుడు ఆవేశం తప్ప ఆలోచనలేదు!
ఐరన్ సేఫ్ లో తండ్రి దాచిన రివాల్వర్ ను తీసుకుని మోటార్ బైక్ మీద బయలుదేరాడు రవితేజ.
* * * *
మిత్రులు అభిమానుల మధ్యన ఉన్న అభినయ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.
తన తండ్రిని గెలిపించమని ముకుళిత హస్తాలతో ఓటర్లను అభ్యర్ధిస్తున్నాడు అతను.
పోలీసులు వలయాకారంలో అతనికి రక్షణగా నిలబడి వున్నారు.
తన మెడలో పడిన దండను తీసి అక్కడ వున్న ఒక వృద్దుడి మెడలో వేసి వంగి అతని కాళ్ళకు దండం పెట్టాడు. మరి ఒక చోట తన వంటిమీద వున్న చొక్కాను తీసి రిక్షా కార్మికుడికి తొడిగి కౌగలించుకున్నాడు.
ఇంకొకచోట అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వృద్ధురాలికి నమస్కరించి ఆమెను కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ కు పంపాడు.
పేదలపట్ల, అభాగ్యులపట్ల ఎంతదయో....కొడుకుకే ఇంతదయ వుంటే అతని తండ్రికి యింకెంత ఉందో! అలా అనిపించిన మరుక్షణంలోనే గొంతెత్తి....
'జయచంద్ర గారికే మన ఓటు' అరిచాడు ఆ వృద్దుడు.
రిక్షావాడు ఆ గొంతులో జత కలిపాడు.
కార్య కర్తలతో, జనంతో కలసి అభినయ్ ముందుకు కదిలాడు.
ఆ వీధిలోనే ఎత్తయిన బిల్డింగ్ పిట్టగోడ చాటున నిలబడి వున్న రవితేజ అసహనంగా ఎదురు చూస్తున్నాడు.
అతనని ఎవరూ గమనించలేదు.
అందరి దృష్టీ అభినయ్ పైనే వుంది.
రవితేజ చేతిలోని రివాల్వర్ ను అతని తలకు గురిపెట్టాడు.
అభినయ్ మరో రెండు గజాలు ముందుకు వచ్చాడు.
ట్రిగ్గర్ మీద రవితేజ వేలు బిగుసుకుంది.
అభినయ్ మరింత దగ్గరయ్యాడు.
రివాల్వర్ పేలింది....
'ఢాం' అనే శబ్దంతో పాటు చిన్న మెరుపు!
సరిగ్గా అప్పుడే ఎవరో పిలవడంతో అభినయ్ పక్కకు తిరిగాడు. సూటిగా వచ్చిన ఆ బుల్లెట్ అతని వెనకవైపున వున్న కానిస్టేబుల్ భుజంలో దిగబడింది.
చావుకేక పెట్టి కిందపడిపోయాడు అతను.
అభినయ్ గొంతు తడి ఆరిపోయింది.
అందరూ ఒకేసారి తలలు తిప్పి రివాల్వర్ పేలినవైపు చూశారు.
రవితేజకు ముచ్చెమట్లు పట్టాయి.
"అడుగో హంతకుడు... పట్టుకోండి" అరిచారు ఎవరో!
రెండవసారి రివాల్వర్ పేల్చబోయేసరికి పరిస్థితి మారిపోయింది. జనం దృష్టి తనపై పడడంతో రవితేజ ఖంగారుగా గోడదూకాడు. దూరంగా ఒక ఇంటి చాటున ఆపి వుంచిన బైక్ ను సమీపించి క్షణాల మీద ఆ ప్రాతం నుంచి అదృశ్యమైపోయాడు.
పట్టపగలు పది మందీ చూస్తూ వుండగా జయచంద్రగారి కొడుకుపై హత్యాప్రయత్నం!
చంపాలని ప్రయత్నించింది ఆనందరావు కొడుకు.
అంటే ఘోరానికి సూత్రదారి ఆనందరావు.
జరిగిన ఘోరం తెలిసిన ఎస్ ఐ శక్తి హుటాహుటిన ఆ ప్రదేశానికి వచ్చి, గాయపడిన కానిస్టేబుల్ ను హాస్పిటల్ కు పంపించాడు.
ఎక్కడ ఏ ప్రదేశం నుంచి హత్యా ప్రయత్నం చేసిందీ వివరాలు తెలుసుకుంటుండగా ఎస్ ఐ కనులు కాంతితో మెరిశాయి.
హాండ్ కర్చీఫ్ తో అక్కడ పడి వున్న రివాల్వర్ ను అతి భద్రంగా తీసుకున్నాడు.
పారిపోయే హడావిడిలో ఖంగారుతో దానిని జారవిడుచుకుని వుంటాడని అర్ధం అయింది అతనికి.
ఆ వార్త నగరం అంతా పాకిపోయింది.
రవితేజ కోసం పోలీసులు వేట ప్రారభించారు.
ఆ సంఘటన వలన ఓటర్లలో జయచంద్ర మీద అభిమానం పెరిగింది.