కెవ్వుమన్న కేకతో దూరంగా పరుగెత్తింది సబిత...రెప్పపాటులో రస్సెల్ వైపర్ (రక్తపింజర) ఆమె పాదంపై కాటేసేదేకాని ఏ సిక్త్ సెన్సో ఆమెను హెచ్చరించడంతో నేలవేపుకి చూసి అక్కడ ఓ పాము కదలికని గమనించడంతో వెంటనే ఫోం బెడ్ పైకి దుమికింది. ఇప్పుడు ద్వారానికి బెడ్ కి మధ్య నిటారుగా నిలబడిన పాము రోషంగా బుసకొడుతూంది.
ఆ బుసకి మరింత ప్రకంపించిన సబిత మరోసారి ఆక్రందన చేయడంతో లల్లీ టి.వి. దగ్గర నుంచి కదిలి "మమ్మీ" అంటూ పిలిచింది గట్టిగా...
మరుక్షణమైతే పాప ద్వారం తోసుకుని లోపలికి వస్తుంది. అది గ్రహించిన సబిత "లల్లీ... తలుపు తెరవకు" కేకపెట్టింది వణికిపోతూనే.
"ఎందుకు మమ్మీ?" ఇప్పుడు పాపగొంతు కంపించింది.
సబిత కళ్ళనుంచి నీళ్ళు స్రవిస్తున్నాయి. "పా...పాముందమ్మా. ద్వారం దగ్గరే" ఆమె వాక్యం పూర్తికానేలేదు "ఎక్కడ అంటూ భయ విహ్వలంగా పాప ద్వారం తెరిచింది అప్పటికే.
ఈ చప్పుడికి వైపర్ తల వెనక్కి తిప్పింది.
మరుక్షణం ముందు యీ శత్రువుని కడతేర్చాలి అన్నట్టుగా వేగంగా పాపవేపు జరజరా ప్రాకింది.
లిప్తపాటు స్థాణువులా వుండిపోయిన పాప ఎంత వేగంగా వెనక్కి తప్పుకుందీ అంటే వైపర్ గురితప్పి నేలపై కాటేసింది...
"మమ్మీ" లల్లీ గోడవారన నక్కి కళ్ళు మూసుకుంది. వెనుకగా ద్వారాన్ని చేరిన సబిత గొంతు పెగలనట్టు రొప్పుతూ మెరుపులా పాము పక్కనుంచే పరుగెత్తి పాపని చేరుకుంది.
ఇద్దరి ఆక్రందనలతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోతూంది.
రక్తపింజర నెమ్మదిగా ముందుకు కదిలింది.
సబితకి అర్ధమైపోయింది అదే తమలో ఒకరికి చివరి క్షణమని!
ద్వారం దాటి బయటికి వెళ్దామనుకుంటే ఇప్పుడు పాము అటుగా ప్రాకి కోరలు చాస్తూ తమవేపే దూసుకొస్తుంది...
లల్లీని అమాంతం పై కెత్తుకుంది సబిత. ఒకవేళ చావే తప్పని సరైతే దానికి ముందు తను బలి కావాలి... పాములు పాపల్నే కాటేస్తాయటగా అని ఇందాక లల్లీ అన్న వాక్యాన్ని అబద్ధం చేస్తూనైనా తను రాలిపోవాలి...ఆమె కళ్ళు నీటికుండలయ్యాయి. నీటిపొరలలోనుంచి కనిపించడంలేదు పాము ఎంత సమీపానికి వచ్చిందీ...
ఒక్క అరక్షణం చాలు దాని కోరలు సబిత పాదంలో చిక్కుకోడానికి...అమ్మ మెడని చుట్టేసిన లల్లీ వేసిన కేకకి నిశిరాత్రి గజగజా వణికింది.
వెనువెంటనే రివాల్వర్ పేలిన చప్పుడు...ఒకటి కాదు, రెండు సార్లు.
వైపర్ తల చిట్లి నడుం చీలిపోయి కలిగా మెలితిరిగిపోతూంది.
ద్వారం దగ్గర్నుంచి రెండు అంగల్లో భార్యని సమీపించిన ప్రసన్న ఇద్దర్నీ ఒడిసిపట్టుకున్నాడు. అప్పటికే సబిత అతడి చేతుల్లో స్పృహ తప్పిపోయింది.
బెడ్ పై ఆమెను పడుకోబెట్టి మొహంపై నీళ్ళు చల్లాడు...ఇంకా నేలమీద పాములున్నాయేమో అన్న కంగారుతో తండ్రిని చుట్టేసి వెక్కిపడుతూంది లల్లీ "వెళ్ళిపోదాం డాడీ. పాములు మనల్ని చంపేస్తాయి డాడీ..." మొహాన్ని తండ్రి గుండెలకానించి వెక్కిపడుతూంది.
నెమ్మదిగా లల్లీని సబిత పక్కనే పడుకోబెట్టిన ప్రసన్న ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది.
షాక్ నుంచి ఇంకా తేరుకోలేనట్టు రెండు చేతుల్తో తల పట్టుకుని కూచున్నాడు...
తుఫాను తర్వాత ప్రశాంతత ఆ ఇంటిలో.
అలా ఎంతసేపు కూర్చున్నాడో గుర్తులేదు.
సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయింది...ఆ చప్పుడు ఓ మృత్యునాదంలా వినిపిస్తూంది ఆలోచనలనుంచే తేరుకున్నా వెంటనే ఫోన్ రిసీవర్ని అందుకోలేకపోయాడు...
ఒక్క అరంగుళం సైతం ముందుకు సాగని పరిశోధన మూలంగా తనపై తనకు కలిగిన జుగుస్సో లేక మరే దుర్వార్త వినాలోనన్న ఆందోళనతో చాలా సేపటిదాకా అలా చూస్తూనే వుండిపోయాడు.
ఆగి ఆగి ఫోన్ రింగవుతూనే వుంది.
వణుకుతున్న చేతుల్తో నెమ్మదిగా రిసీవర్ అందుకున్నాడు.
"బుస్...స్...స్...స్..."
పాములా బుసలా వినిపించింది ముందు...
"హు యీజ్ దట్" ప్రసన్న పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
"బుస్ స్ స్ స్..." మళ్ళీ అదే చప్పుడు.
"ఎవరది?"
"బ్లాక్ మాంబా" బొంగురుగా వినిపించింది...
ఉలికిపడిన ప్రసన్న అరక్షణంలో ఎలర్టయిపోయాడు.
నలభై ఎనిమిదిగంటలుగా జంటనగరాల్లో కిరాతమైన దారుణాలను చేయిస్తున్న వ్యక్తి ఇప్పుడు తనతో మాటాడుతున్నాడన్నా ఆలోచన అంత ధైర్యవంతుడ్నీ రెండు క్షణాలపాటు కంపించేట్టు చేసింది. "చెప్పు నేను ప్రసన్నని మాటాడుతున్నాను.
"తెలుసు. పాపం ఇంటికి ఇప్పుడే వచ్చినట్టున్నావుగా...పాపం నీ భార్యాబిడ్డలు బ్రతికిపోయినట్టున్నారు..."
"యూ సన్నాఫే బిచ్" కర్కశంగా పలికింది ప్రసన్న కంఠం "బ్రతకడం పాపమెలా అవుతుంది..."
"కాదా మరి...అవహేళనగా ఓ నవ్వు వినిపించింది...మళ్ళీ బుస్ మన్న చప్పుడు "ఇప్పుడు వినిపించిన బుస ఏమిటో తెలుసా...ఓ పాముదే...ఎప్పుడూ నా చేతుల్లోనే వుంటుంది. అవును...అప్పటికిగాని నాకు కునుకు పట్టదు... చిత్రంగా వుందికదూ."
"అసలు ఎవరు నువ్వు?"
"... ... ..."
"ఎందుకీ దారుణాలు చేయించావు?"
"చేయించానూ కాదు ఇంకా చేస్తాను... ఈ జంటనగరాలలో మనిషన్న వాడికెవడికీ నిద్రపట్టకుండా చేసి ఇంకా నరమేధాన్ని కొనసాగిస్తాను" ఇంకోసారి వికృతంగా బుస వినిపించింది. పాపం పార్శిల్స్ ఆపించారు...ఏమైంది ఇప్పుడు వాటితో పనిలేకుండా పాములు సరాసరి ఇళ్ళలో ప్రవేశిస్తున్నాయి."
"మిస్టర్ బ్లాక్ మాంబా. నాకు తెలుసు దేనికైనా తెగించిన మూర్ఖుడు చట్టంకన్నా బలవంతుడని...కాని ఒక్క జవాబు చెప్పు. ఇదంతా ఏం ఆశించి చేస్తున్నట్టు?"
"మీ డిపార్ట్ మెంటుమీద కసి...ఈ ప్రభుత్వం మీద పగ."
"అప్పుడు మామీద కక్ష తీర్చుకో. అమాయకులైన ప్రజల్నెందుకు బలికోరుతున్నావు?"
"ప్రజలే ప్రభుత్వం కాబట్టి...ప్రజల్ని హింసిస్తే తప్ప ప్రభుత్వాన్ని హింసించినట్టుకాదు కాబట్టి" రాక్షసత్వానికి పరాకాష్టలా నవ్వుతున్నాడు.
"వెల్" ఆవేశంతో రొప్పుతున్నాడు. "ఇప్పుడు తీర్చుకున్న పగ చాలనుకుంటే వెంటనే నీ నరమేధాన్ని ఆపి ఏం కావాలో చెప్పు..."
"గుడ్...సూటిగా నెగోషియేషన్స్ ప్రారంభిస్తున్నావా?"
"తప్పదుగా... పైగా నేనూ ఒక పోలీసు అధికారినే?"
"అవును...స్పెషల్ స్క్పేడ్ ని ఇన్ చార్జికి కూడా" అపహాస్యం చేస్తూ నవ్వు తెరలుగా వినిపించింది... "ఐ థింక్... నేను అడిగే కోరిక నెరవేర్చడానికి నీ స్థాయి సరిపోదనుకుంటాను..."
"ఫర్వాలేదు...నేను మధ్యవర్తిత్వం వహిస్తాను..."
"దట్స్ గుడ్...ఓ పని చెయ్...రేపు మధ్యానం సరిగ్గా పన్నెండుగంటలకి డి.జి.పి. ఆఫీస్ లో మీ బాస్ లందరితో వెయిట్ చెయ్...ఏం కావాలో చెబుతాను."
"ఇప్పుడు చెప్పొచ్చుగా?"
"నోనోనో...నేను ప్లాన్ చేసుకున్న అనర్ధాలింకా కొన్ని మిగిలాయి...అవి పూర్తికావాలి...సో...రేపు మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలకి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈలోగా..." ఓ క్షణం నిశ్శబ్దం. "నీ అధికారులతో సిద్ధంగా వుండు...అన్నట్టు మరో విషయం...ఈ పాటికే కట్లపాము ఆ పిల్లకాకి సంగతి తేల్చివుంటుంది. కనుక్కో."
ప్రసన్నకి అర్ధం కాలేదు అతడెవరి గురించి మాటాడుతున్నదీ.
"అదే ప్రసన్నా...డాక్టర్ శృతి...పాపం చాలా అభ్యుదయ భావాలుగల ఆడపిల్లకదూ...ఇందాక నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కారులో రహస్యంగా ఓ పామునుంచాం. ఈపాటికి ఆమె కథ ముగిసిపోయి వుంటుంది." ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు.
ప్రసన్న స్థాణువులా నిలబడిపోయాడు...
ఇంతసేపూ తానో నరరూపరాక్షసుడితో మాట్లాడానన్న విభ్రమం కన్నా ఇప్పుడు తెలిసిన విషయమే అతడ్నెక్కువ కదిలించింది.
తనకేమీ కాని మనుషులకోసం రవ్వంత స్పందించిందామె. ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతున్న కొందరికయినా తన ఉనికి ఉపయోగపడాలని ఇప్పుడే పూసిన కుసుమంలా సౌరభాన్ని అందించాలని ఉద్వేగపడింది.
ఇంకా ఇరవై నాలుగు గంటలన్నా కాలేదే...అప్పుడే సర్దుమణిగిన నడిరాత్రివేళ నిశ్శబ్దంగా...ఆ తర్వాత ఇక ఆలోచించలేకపోయాడు.