వెంటనే శృతి దగ్గరికి బయలుదేరబోతూ కొద్దిగా ఆగి చూసాడు.
సబిత ఇంకా స్పృహలోకి రాలేదు...లల్లీ నిద్రలోనే కలవరిస్తూంది.
మనసేదో కీడు శంకిస్తుంటే ముందు శృతి ఇంటికి డయల్ చేశాడు.
రెండు నిముషాలపాటు రింగవుతూనే వుంది. కాని జవాబులేదు.
టెన్షన్ స్వేదంలా అతడి ఫాలభాగంపై పరుచుకుంటూంది. ప్రమాదం జరిగే వుంటుందన్న నిర్ధారణకు అతడు వస్తుండగా అటువేపునించి వినిపించింది "హల్లో."
ముందు తత్తరపడ్డాడు...సందేహంలేదు...ఆమె గొంతే.
సుదీర్ఘమైన నిస్త్రాణనుంచి తేరుకుంటున్నట్టు ఉద్విగ్నంగా అడిగాడు. "అయామ్ ప్రసన్న హియర్...ఆర్యూ ఓ.కే?"
"ఏమైంది?" ఆశ్చర్యంగా వినిపించిందామె గొంతు.
చెప్పాడు ఆందోళనగా.
"అలాంటిదేమీ లేదే!"
ఈసారి ఆశ్చర్యపోవడం ప్రసన్న వంతైంది.
శృతి ఇంకా నిశ్చేష్టతనుంచి తేరుకోనేలేదు. ప్రత్యర్ధులు ఎంతటి ఉదాతకులో అప్పటికే జరిగిన చాలా సంఘటనలు నిరూపించాయి. అందుకే అది అబద్ధమని సరిపెట్టుకోలేక పోయింది. చీకటిలో ఎపార్ట్ మెంటు కారు పార్కింగ్ వేపు వెళ్ళడానికి జంకుగావున్నా టార్చిలైటు కారు కీస్ తోబాటు బయలుదేరబోయింది.
అదిగో అప్పుడు ఎదురయ్యాడు జయేంద్ర అడగకుండా ప్రత్యక్షమైన అతిధిలా...ముందు కంగారుపడింది "కారులో..."
ఆమె వాక్యం ఇంకా పూర్తికానేలేదు. "ఇందాక తీసేసానులెండి" అన్నాడు జయేంద్ర టక్కున.
అతడేం చెబుతున్నదీ ముందామెకు అర్ధంకాలేదు.
చూడండి శృతీ. మీరు కారు దగ్గర నిలబడి నాకు లెక్చరిచ్చారే. అప్పుడు చూసాను వెనుకసీటులో కదులుతున్న క్రైట్ ని. నిజానికి అది నేస్తాలలోని సర్పమే... చేయి చాచగానే బుద్ధిగా వచ్చేసింది. చూస్తే కంగారు పడతారేమో అని చాలా రహస్యంగా బయటికి తీసి విడిచిపెట్టి ఇలా వచ్చాను..." అతడి నేత్రాలిప్పుడు ఒక మేలుచేసిన సంతృప్తిని సైతం వ్యక్తం చేయడంలేదు... చాలా మామూలుగా మనసు తెరిచిన స్పటికపు కిటికీలా అనిపిస్తున్నాడు.
ఇక్కడ శృతిపై మానసికంగా అణువంత గెలుపైనా అతడు సాధించివుంటే అది యాదృచ్చికంగా కాదు.
నిప్పుల ద్రవాన్ని తాగి బ్రతికే అర్ధంకాని ఓ మనిషిలా కనిపిస్తూ రోషాన్ని సైతం హేమంత తుషారంలా చిందించిన అతడు ఇప్పుడు సరిగ్గా ఓ అరక్షణం క్రితమే చీకటి మబ్బులమాటునుంచి వెలికివచ్చిన చంద్రుడిలా అనిపిస్తున్నాడు.
తనను నిరసిస్తున్నట్లు కనిపిస్తూ కూడా ఎందుకిలా కాపాడాడు.
కోకిల గానానికి సైతం స్పందించని పగలని అగ్నిపర్వతంలా అనిపించాడే... ...ఎందుకు తనమీద యీ మాత్రమైనా అభిమానాన్ని వర్షించగలిగాడు!
జయేంద్ర ఆ రాత్రివేళ ఎందుకొచ్చాడో తెలీదు. ఒకవేళ తను మరో ఆపదలో చిక్కుకున్నానేమో అన్న భావంతోనే పరామర్శించాలని వచ్చివుంటే ఆ విషయం సైతం సూటిగా చెప్పని అతడి నిశ్శబ్ధ వ్యక్తిత్వానికి తనూ గుంభనంగానే పుత్తడి అక్షరాల పారాణితో అభివాదాన్ని తెలియచేస్తూ వుండిపోయింది.
ఆమె ఆలోచనలనుంచి ఇంకా తేరుకోనేలేదు.
నిన్నదాకా సాగించిన నిరంతర పయనానికి అలసినట్టుగానో లేక మయుడి సృష్టిలో రూపుదిద్దుకున్న శిల్పంలానో ఆమె అనుమతి సైతం కోరకుండా చనువుగా డ్రాయింగ్ హాలు దాటి పక్కగదిలోకి నడిచాడు.
అతడు ఇంకా అర్ధంకాని ఓ ఉద్గ్రంధంలా అనిపిస్తుంటే నిశ్శబ్దంగా అనుసరించింది.
ఆ గది సగభాగం రేక్స్ తోనూ మిగతా సగం బెడ్ రూంలాగా అలంకరించబడింది. బెడ్ కి ఓ మూల టీపాయ్ చుట్టూ కేన్ చైర్స్ కుడివేపు ఓ సోఫా ఆర్టిస్టిక్ గా అమర్చబడి వున్నాయి.
తను వయసులోవున్న ఓ అమ్మాయితో అర్ధరాత్రివేళ ఆమె బెడ్ రూంలో వున్నానన్న ఆలోచనసైతం లేనంత మామూలుగా సోఫాలో కూచుని "ఒంటరిగా వుంటున్నారా" అన్నాడు.
ఇలాంటి పరామర్శ సైతం అతడి నుంచి ఆమె వూహించనిదే.
ఇక్కడే తను ఓ వయసులో వున్న ఆడదాన్నని ఆమెకీ గుర్తువచ్చిందేమో తల పంకిస్తూ బిడియంగానే తల వంచుకుంది.
అప్పుడు చూసాడామెని పరిపూర్ణంగా...
ఆమె శరీరంపై వున్న ట్రాన్స్ పరెంట్ నైటీ ప్రాణం పోసుకున్న 'రెబెకా'ని స్పురింపచేస్తూంది. దాగని ఆమె అవయవ సౌష్టవం నాజుగ్గా పెరిగిన తాళవృక్షాన్ని అందని ఫలరాశిని అలవోకగా మోస్తున్న అనుభూతి కలిగిస్తుంటే "మీరు ఒంటరి వ్యక్తేనన్నమాట" అన్నాడతడు.
ఆ వాక్యం పరోక్షంగా అతడ్నీ అతడి మానసికస్థితినీ అస్పష్టంగానైనా ధ్వనింపచేస్తుంటే నెమ్మదిగా తలెత్తి లిప్తపాటు అతడివేపు చూసింది. అతడి గురించి తెలుసుకోవాలనిపించినా ఆ స్వల్ప పరిచయంలో అలాంటి సాహసం చేయలేకపోయింది.
"నాకూ మీలాంటి నేస్తాలు ఇక్కడ చాలా వున్నాయి"
ఇద్దరి చూపులూ క్షణం కలిసి విడిపోయాయి.
ఆమె గగుర్పాటుతో లేచి పక్కనున్న ద్వారాన్ని తెరిచింది. అలాంటి నిశిరాత్రివేళ అదిగాక నిన్న రాత్రే అదే ఇంట తనని స్పృశించి కంగారుపెట్టిన వ్యక్తికి కేవలం తన మనోభావాలు వ్యక్తంకాకూడదన్న భావంతోనే లేబ్ లోకి నడిచింది.
విశాలమైన గదిలో కేజెస్ నిండా వున్న సర్పాల్ని అతడు ఆసక్తిగా గమనిస్తుంటే అంది. "ఇదీ మీ ప్రపంచంలాంటిదే...కాకపోతే ఇక్కడవున్న సర్పాలకి ఓ ప్రయోజనం వుంది..." చెప్పింది క్లుప్తంగా.
అప్పటికి ఆమె మరింత అర్ధమౌతుంటే తన పెదవులూ మనోజ్ఞంగా మందహాసాన్ని బంధించగలవని నిరూపించుకుంటున్నట్టు మృదువుగా నవ్వాడు.
"గుడ్" ఫాలభాగంపై పారాడుతున్న కురుల్ని సుతారంగా చేత్తో పైకి నెడుతూ అంది "అర్ధమైందిప్పటికి."
"ఏమని?"
"మీకు నవ్వడం చేతనవునని."
ఏ కొండ కోనల్లోనో ఘనీభవించిన మరే జలధి అఖాతాల్లోనో నిక్షిప్తమైన ఆర్ధ్రత. తెరమాటునుంచి వెలుగురేఖల్లా ఉబికివచ్చిన అణువంత ఉద్విగ్నత జయేంద్ర నేత్రాలలో.
"జీవితం అన్నది అనుభవాల సంపుటి కావచ్చునేమోకాని పరిచయమైనా వ్యక్తులందరిలాగా ప్రతి అనుభవమూ గుర్తుండదు శృతీ. ఎక్కడో ఏ ఒక్క వ్యక్తో చిత్రంగా తారసపడుతోంది. గుండెలోతుల్ని స్పృశించి మధనంతో మరో కొత్త లోకాన్ని దర్శింపచేస్తుంది."
ఆమె నేత్రాలు విస్పారితాలయ్యాయి.
"ఈ జనారణ్యంలో ఇమడలేని నేను నిన్నటిదాకా పలాయనవాదినే. మనుషుల భేషజాలతో స్వాతిశయాలతో దెబ్బతిని అగమ్యంగా తిరుగుతున్న వాడ్ని. జీవితాన్ని చూడలేకపోవటం కన్నా ఏదో ఓ కోణంలో చూస్తూ అందులోని అందాన్ని ఆస్వాదించడమే గొప్పన్న సత్యాన్ని మీ స్పూరితోనే గ్రహించాను. సర్పజ్ఞానం తప్ప ప్రపంచజ్ఞానం అంతగా లేనివాడ్ని. చెప్పండి. మిమ్మల్ని కాదంటూనే మీ లోకంలోకి నేను వచ్చాను. మీరన్నట్టు బ్రతకాలీ అంటే ఇప్పుడు నేనేం చేయాలి?
ఆమె జవాబు చెప్పలేదు...
ఇంకా విస్మయంలోనే వుండిపోయింది. నిజానికి అతడిలో ఆమె చూసింది ఎలాంటి ఆడదానినైనా వివశురాల్ని చేసే ఆకర్షణని కాదు.
అసాధారణమైన సాహసం. అదే...సరిగ్గా అరుదైన ఆ సాహస ప్రవృత్తినే ప్రపంచానికి అన్వయించేట్టు ఉపయోగించుకో మన్నది.
సాలోచనగా కేజెస్ మధ్య నడుస్తూ అంది. "జీవితం ఓ అపురూపమైన కళ అన్న సత్యం జీవితాన్ని ప్రేమించిన వాళ్ళకే తెలిసే సత్యం జయేంద్రా. ఎలాగోలా బ్రతికేసేవాళ్ళు వున్నారు. ఇలా బ్రతకాలీ అని జీవితాన్ని నిర్దేశించుకున్న వాళ్లూ వున్నారు. ఉదాహరణకి ఈ ప్రయోగశాలనే తీసుకోండి. ఒకవేళ బ్రతుకుతెరువే లక్ష్యం అనుకుంటే ఇక్కడ ఇన్ని ప్రయోగాల్ని సర్పాలతో నిర్వహించాల్సిన అగత్యం లేదు" ఓ క్షణం ఆగింది చుట్టూ చూస్తూ. "ఈ దేశంలో ఎందరి ప్రాణాలకో హాని తలపెడుతున్న యీ సర్పాలకు నీతి సూత్రాలు వల్లిస్తే అవి తమ నిజాన్ని మార్చుకోలేవు. అవి కాటేస్తూనే వుంటాయి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది వీటి నుంచి మనిషిని ఎలా కాపాడాలా అన్న విషయాన్ని. ఇంతకు మించిన మన చుట్టూ వున్న మనుషుల్లో అసాధారణమైన మూఢత్వం పాలద్రోలాలి. మీకు తెలీదు జయేంద్రా... పాములూ మంత్రాలూ అంటూ అమాయకులైన ఎందరు పల్లె ప్రజలు మూఢవిశ్వాసాలమధ్య ప్రాణాలు వదులుతున్నదీ ఆలోచిస్తే మీకూ ఓ మార్గం తోస్తుంది. కారణం సర్పాల గురించి మీకూ చాలినంత అవగాహన వుంది కాబట్టి......ఆ విషయంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి..."
ఓ కేజ్ దగ్గర ఆగిన జయేంద్ర గరిటలా వున్న తోకతో నల్లని పొలుసుతోవున్న నాలుగడుగులు పాముని చూస్తుంటే నెమ్మదిగా చెప్పింది.
"బహుశా ఇది ఇంతదాకా మీకు పరిచయంలేని సర్పమనుకుంటాను. ఇది మనదేశంలో నేలపై సంచరించే పాము కాదు. ఎన్ హైడ్రేనా అనబడే సముద్రసర్పం... పిల్లల్ని పెడుతుంది. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే కాటు వేసిన వెంటనే నాడీవ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణాలు తీస్తుంది. ఒక్కమాటలో, మన ఏంటీ వీనమ్ సీరమ్ దీని కాటుకి పనిచేయదు..." చెబుతూ ముందు నడుస్తున్న శృతి ఏదో చప్పుడు కావడంతో గిరిక్కున వెనక్కి తిరిగింది.