Previous Page Next Page 
నిశీథి నియంత పేజి 11


    వివేక్ ఎత్తు, లావు, మెలిదిరిగిన కండల్ని, నిబ్బరాన్ని ధైర్యాన్ని చూసి బుద్ధి తెచ్చుకొని సారీ చెప్పి వెళ్ళు, లేదంటే రాత్రికో, రేపో, జైలు సిబ్బంది చూడకుండా నీ ప్రాణాల్ని తోడేస్తాడు.

    అసలు వివేక్ పాతిక దాకా మర్డర్స్ చేసి, చట్టం దృష్టికి రాకుండా తప్పుకున్నాడు. ఈ మధ్య చేసిన వాటికే పొరపాటున దొరికిపోయాడు. గతంలో అతను చేసిన పాతిక మర్డర్స్ ని ప్రాసిక్యూషన్ బిమాండ్ డౌట్ నిరూపించలేకపోయింది. అతను అమాయకుడు, అసమర్ధుడు కాదు. అలా నటిస్తున్నాడంతే - నరరూప రాక్షసుడు వివేక్....ఇక ఆపైన నీ యిష్టం....అన్నాడు రామదాసు కావాలని కల్పించి చెబుతూ.

    అప్పటికింకా వివేక్ కళ్ళు తెరవలేదు.

    నరరూప రాక్షసుడైన జస్పాల్ సైతం డీప్ షాక్ లోకి లోనయ్యాడు.

    రామదాసు మాటలు అతడ్ని అలర్ట్ చేశాయి. "త్వరగా చెప్పు.... చెప్పి పారిపో.... లేదంటే" రామదాసు మాటలింకా పూర్తి కాలేదు.

    "సారీ" అని చెప్పి జస్పాల్ పరుగులాంటి నడకతో ఆ ప్రాంతం నుంచి అదృశ్యమైపోయాడు.

    అతనెళ్ళిన కొద్దిక్షణాలకు కళ్ళిప్పాడు అతను. ఎదురుగా రామదాసు తప్ప మరెవరూ లేరు.

    అదే ఆశ్చర్యాన్ని కళ్ళ ద్వారా వ్యక్తపర్చాడు అతను.

    "నీ దెబ్బకు జస్పాల్ ఖంగుతిని, షాక్ తిని, భయంతో సారీ చెప్పి పారిపోయాడు. నేనతనికి నీ గురించి ఏం చెప్పానో విన్నావో?" అన్నాడు రామదాసు.

    లేదన్నట్లు తలని అడ్డంగా తిప్పాడు అతను. తిరిగి చెప్పాడు రామదాసు.

    ఈసారి షాక్ కి గురి కావడం వివేక్ వంతయింది.

    "భయం అన్నది మానసికమైనది. శారీరక బలాన్ని మనసే శాసించేది. ఆ శాసించే మనస్సునే దెబ్బతీస్తే? అదే నేనిప్పుడు చేసింది. ఒక వ్యక్తిలో భయాన్ని పెంచి, పెద్దదాన్ని చేస్తే శారీరకంగా, తనని తాను పరీక్షించుకోకుండానే, సగానికి పైగా తన ప్రత్యర్ధి చేతిలో కృంగిపోతాడు.... ప్రపంచాన్ని శాసించే రాజులు, ఏలిన చక్రవర్తులు శారీరకంగా బలాడ్యులు కావటం మూలంగానే చక్రాన్ని తిప్పలేదు. ఇకిప్పుడు ఈ జైల్లో నీ జోలికి ఎవరూ రారు. చివరకు సెంట్రీలు కూడా....ఎందుకో బాగా ఆలోచించి, వంటబట్టించుకో....జీర్ణించుకో వస్తాను" అంటూనే రామదాసు కుంటుకుంటూ బేరక్స్ వైపు సాగిపోయాడు.

    వెళుతున్న రామదాసు కేసి అలా....అంతలేసి కళ్ళతో చూస్తుండిపోయాడు వివేక్.


                                                             *    *    *    *


    ఆ సాయంత్రానికే ఆ వార్తకి కాళ్ళొచ్చాయ్. ఆ జైల్లో వున్న ఖైదీలందరికే కాదు, సెంట్రీలకు కూడా వివేక్ ఎటాక్ సంగతి తెలిసిపోయి ఆశ్చర్యపోయారు. ఆ నిజాన్ని జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురయ్యారు.

    "ఇంకా నయం....మొన్నీ మధ్య నేను మెత్తగా కనిపిస్తున్నాడు కదాని మొత్తబోయాను. అవే చేసుంటే ఇరవై ఆరో మర్డర్ జరిగిపోయేది" అని కొందరు-

    "రామదాసు అండ చూసుకొనే ఆ వీరంగం" అని మరికొందరు-

    "ఎంతకాలంగానో మర్డర్స్ చేస్తున్నా ఇంతకాలందాకా చట్టానికి దొరకలేదంటే ఎంత తెలివైనవాడో....ఇప్పుడు మాత్రం ఎలా దొరికాడో- అయినా ఉరి వాడ్నేం చేయలేదు" అని ఎందరో.

    "ఒక్క దెబ్బకే జస్పాల్ నేలకొరిగాడంటే అతను పూర్తిగా రెచ్చిపోతే? ఏమో అతను ఉరికంబం ఎక్కుతాడంటే నాకేమాత్రం నమ్మకం కలగటం లేదు" అని చాలామంది వ్యాఖ్యానించారు.

    తెలిసో తెలియకో ఆ వ్యాఖ్యానాలు క్షణాల్లో రామదాసుని చేరిపోయాయి. ఆపైన అవి వివేక్ ని చేరి అతన్ని అంతులేని ఆశ్చర్యానికి గురిచేశాయి.

    చిత్రమేమిటంటే ఆ సంఘటన రామదాసు యుక్తివల్ల జైల్ సూపరింటెండెంట్ వీరనారాయణకిగానీ, సబ్ జైలర్ నాయుడికిగానీ చేరలేదు.

    క్రమంగా జైల్లో సంధ్య చీకట్లు ముసురుకోసాగాయి. జైలు గంట ఆరుసార్లు మోగి నిశ్శబ్దంలోకి జారుకుంది. పటిష్టమైన పహరా మొదలు అయింది.

    బూట్ల నాడాల శబ్దం వరండాల గచ్చుమీంచి ఖైదీల చెవులకు సోకుతోంది.


                         *    *    *    *


    రాత్రి పది గంటలవుతోంది.

    జైలు నిశి నిశ్శబ్దంలో మునిగివుంది. జైలు సెర్చ్ లైట్స్ కాంతిలో పట్టపగల్లా వున్నా పరిసరాలపై చీకటి దుప్పటి పర్చుకొని వుంది.

    పన్నెండవ బ్లాక్ లోని సెల్ నెంబరు 118, సెల్ నెంబరు 127 ఆ ప్రాంతంలో పర్చుకున్న శ్మశాన నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి. మెల్లగా సంభాషణ నడుస్తోందక్కడ. ఆ జైల్లో ఏ కూప్ కి ప్రాణప్రతిష్ట జరగడం లేదనే నిబ్బరంతో జైలు సూపరింటెండెంట్ వీరనారాయణ జైలు క్వార్టర్స్ లో తన పదేళ్ళ కూతురికి ఏదో ట్రెజరీ హంటింగ్ స్టోరీని ఆసక్తిగా చెబుతున్నాడు. ఆయన భార్య తులసికది అసహనంగా వున్నా, కూతురు ముందు ఏమనలేక ఉక్రోషంగా చూస్తూండిపోయింది.

    వీరనారాయణ ఐ.పి.ఎస్. ఆఫీసర్.

    డి.ఐ.జి. కేడర్....వృత్తికోసం ప్రాణాలనయినా పణంగా పెట్టే వీరనారాయణకి తన భార్యన్నా, బిడ్డన్నా ప్రాణం. అతను ఇంట్లో ఉన్నా అతని దృష్టంతా జైలు మీదే వుంటుంది. ఆయన దేన్నీ, ఎవర్నీ అంత తేలిగ్గా నమ్మడు.

    అలాంటి సిన్సియర్, స్ట్రిక్ట్ ఆఫీసర్ ని సయితం తన నటనతో బుట్టలో వేసుకున్నాడు సబ్ జైలర్ నాయుడు. ప్రస్తుతం ఆ నాయుడి సహకారంతోటే సెల్ నెంబరు 118- సెల్ నెంబరు 127 మాట్లాడుకుంటున్నాయి.

    "జస్పాల్ అనవసరంగా నీ ప్లేటుని లాక్కోలేదు. దానికో కారణం ఉంది తెలుసా?" రామదాసు వూచల దగ్గర కూర్చుని వివేక్ కేసే చూస్తూ అన్నాడు.

    "రౌడీకి కారణమేంటి? రౌడీ చేష్టలకి కారణాలు వుండాల్సిన అవసరం లేదేమో?"

    "నిజమే-కానీ జస్పాల్ కో కారణం వుంది"

    "ఏమిటది?"

    "నీకు ఆహారం అందకుండా చేయమని, నీ కడుపు మాడ్చమని ఒకరు చెప్పారు. అందుకుగాను నాయుడికి లంచం కూడా ఇచ్చారు."

    వివేక్ క్షణకాలం ఆశ్చర్యపోయాడు.

    "ఎస్...." తిరిగి అన్నాడు రామదాసు.

    "ఎవరు? ఎవరికా అవసరం వుంది?"

    "మీ అమ్మకి"

    "వ్వాట్?" షాకింగ్ గా అన్నాడు వివేక్.

    "ఎస్....వివేక్ ని నా కొడుకని చెప్పుకోటానికే సిగ్గుగా వుంది. ఐదడుగుల పదంగుళాల ఎత్తున్నాడు. ఎత్తుకు తగ్గ లావు, బరువు ఉన్నాడు. మెలితిరిగిన పటిష్టమైన కండబలం కూడా వుంది. కానీ పిసరంత ధైర్యం, తెగువ, మొండితనం లేవు. జరిగినదాన్ని నిర్లిప్తంగా అంగీకరించటం తప్ప ఎదురుతిరిగి ప్రతీకారం తీర్చుకుందామన్న పట్టుదలలేని నిర్భాగ్యుడు. అసమర్దుడైన మంచివాడ్ని కనటంకన్నా సమర్ధుడైన దుర్మార్గుడ్ని కనుంటే నా కోరిక నెరవేరేది. యాభైవేలు చూపిస్తేనన్నా ఉత్సాహపడతాడనుకున్నాను. లాభంలేకపోయింది.

    ఏ విషయాన్నీ వెంటనే తేల్చుకోలేని వృద్ధులు-విషయాన్ని నాన్చి నాన్చి చావకుండా, బ్రతక్కుండా, నిర్ణయం తీసుకోకుండానే, ఏమీ సాధించకుండానే చస్తారు" అని ఒక్కక్షణం ఆగాడు రామదాసు.

    వివేక్ కి ఒక్కక్షణం ఏమీ అర్ధంకాలేదు.

    "మీ అమ్మే ఈ మాటలు అంది. మొన్న నిన్ను కలిసేందుకు మీ అమ్మ వచ్చింది. నిన్ను జైల్లోంచి తప్పించుకువచ్చి పగతీర్చుకోమంది. నువ్వు అది సాధ్యం కాదన్నావ్. దాంతో కోపగించుకున్న మీ అమ్మ సబ్ జైలర్ నాయుడ్ని కలిసింది. వెయ్యిరూపాయలిచ్చి నీ కడుపుమాడ్చి హింసించమంది.

    ఆ వయస్సులో సయితం మీ అమ్మకున్న పగ, ప్రతీకారం నీలో లేవే? పులి కడుపున పిల్లిలాంటి నువ్వెలా పుట్టావ్? వింతే" నిట్టూర్చుతూ అన్నాడు రామదాసు.

    ఆ జైల్లో రామదాసుకున్న నెట్ వర్క్ కి ఆశ్చర్యపోవాలో, తన తల్లి అంతలా పాషాణంగా మారినందుకు బాధపడాలో అర్ధంకాలేదు వివేక్ కి.

    రామదాసు ఏవో టాబ్ లెట్స్ తీసి, పక్కనే వున్న మంచినీళ్ళ కుండలోంచి సత్తుగ్లాసుతో నీళ్ళు తీసుకొని వేసుకున్నాడు.

    "నా చావుని పొడిగించుకుంటున్నాను....అంతే" అన్నాడు రామదాసు మూతి తుడుచుకుంటూ.

    (సాధారణంగా సెల్స్ లో మంచినీళ్ళ కుండనిగానీ, గ్లాసునిగానీ ఉంచరు. ఖైదీ పేషెంటయితే అతను దుర్భలుడుకాడని, ఆత్మహత్యాప్రయత్నం చేసుకోడనే నమ్మకం వుంటే ప్రొవైడ్ చేస్తారు)

    "బహుశా రేపో, ఎల్లుండో, మరికొద్దిరోజుల్లోనే నా శత్రువులు జైలు ప్రవేశం చేయబోతున్నారు" అన్నాడు నెమ్మదిగా రామదాసు.

    "ఎందుకు?" రామదాసుకి సంబంధించిన ప్రతి విషయమూ వివేక్ విభ్రాంతికి గురిచేస్తున్నాయి.

    "నన్ను చంపేందుకు" నిర్లిప్తంగా అన్నాడు రామదాసు.

    "మిమ్మల్ని చంపేందుకా? మీరిప్పుడు మాజీ అయిపోయారు గదా"

    "గతం కళ్ళు మూసుకుంటుందా- వెంటాడకుండా"
   
    "గతంలో ఏం చేశారు?"

    "బ్యాంక్ దొంగతనం"

    "దొంగతనమా? అదీ బ్యాంకుని"

    "ఎస్!"

    "ఎంత?"

    "యాభై లక్షలు"  

 Previous Page Next Page