జస్పాల్ నరరూప రాక్షసుడు- నేరాలు చేయటం అతని వృత్తయితే చేసి ఆనందించటం అతని ప్రవృత్తి.
కరవమంటే కప్పకు కోపం....
విడవమంటే పాముకు కోపం....
జస్పాల్ ని కొట్టటం- కొట్టకపోవటం- రెండూ తన పాలిట ప్రమాదాలే.
తనామాత్రమైనా ఆ జైల్లో ప్రశాంతంగా ఉన్నాడంటే ( రామదాసు హనకు పరిచయమైన రోజుల్నించి) అందుకు కారణం రామదాసే.
కేవలం తను రామదాసు మనిషిననే భ్రమే తన నుంచి చాలామందిని దూరంగా వుంచింది. ఇప్పుడిక రామదాసు చెప్పినట్లు చేస్తే- తను రామదాసు మనిషిననే విషయం జైలంతా పాకిపోతుంది. అప్పుడిక తన జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసించరు. చివరకు జైలు స్టాఫ్ కూడా. అది ఒకరకంగా తనకు మంచిదే.
తనకు చావు ఎలాగూ తప్పదు.
తన మరణశాసనం ఎప్పుడో న్యాయస్థానంలో లిఖించబడింది. చావు తప్పదు అనుకున్నప్పుడు, ఆ చావుకి ముందుండే రోజుల్ని అయినా ప్రశాంతంగా గడపటమే వివేకవంతుడి లక్షణం. దైవం తన కోసం తను, తన భక్తుడి దగ్గర కల్పించుకున్న ప్రార్ధనాకాలం అది.
మనిషికి అల్టిమేట్ ఫియర్ - మృత్యువు.
దానికన్నా మిగతావన్నీ చిన్నవే. జైల్లో తనేం చేసినా, తననేం తన తోటి ఖైదీలు, తన ఉరికన్నా, ముందే చంపరుగా....అదంత తేలికేం కాదు.
నేరస్థుడు బయటచేసే నేరాలు చట్టం దృష్టికి రావచ్చు- రాకపోవచ్చు. కానీ జైల్లో ఏ చిన్న నేరం జరిగినా జైలు స్టాఫ్ దృష్టికి వస్తుంది. శిక్ష పొడిగించబడుతుంది. అది అందరికీ తెలిసే వుంటుంది.
సో....తను ధైర్యం చేయవచ్చు. చేసి జస్పాల్ దవడని పగలగొట్టాలి. అన్యాయంగా తన నోటిముందు అన్నాన్ని లాక్కుంటాడా?
క్షణాల్లో ఇవన్నీ ఆలోచించి తనను తానే ధైర్యపర్చుకున్న వివేక్, రాబోతున్న జస్పాల్ కోసం ప్రాణాలుగ్గబట్టుకుని ఎదురు చూస్తున్నాడు.
అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడ్ని ఎందుకు చంపాడు? ఎదురుగా చంపలేకనేనా? రాముడు చెట్టుచాటునుండి వాలినెందుకు వధించాడు? ఎదురుగా వుండి వధించలేకేనా?
కారణం లేకుండా ఏ కార్యమూ జరగదు. భీష్ముడి చావు ఆయన చేతిలోనే వుందితప్ప- ఆయనతో పోరాడేవారి చేతుల్లో లేదు. కౌరవులు పక్షాన వున్నా, భీష్ముడు మహాపురుషుడు. సకల విద్యాపారంగతుడు. న్యాయకోవిదుడు. గొప్ప రాజనీతిజ్ఞుడు. అయినాసరే ధర్మసంస్థాపన కోసం భీష్ముడ్ని ఏదో విధంగా వధింపక తప్పదు. ఇనుముతో సహవాసం చేస్తే నిప్పుకి సుత్తిదెబ్బలు తప్పవు.
ధర్మసంస్థాపన కోసం అర్జునుడు అధర్మ యుద్ధం చేశాడు.
అహంభావి - అధర్మ పాలకుడు అయిన వాలిని శ్రీరాముడు కూడా అధర్మంగానే వధించాడు. ధర్మాన్ని పునరుద్ధరించటం కోసం వాలి కొడుకైన అంగదుడ్నే యువరాజుని చేసి సుగ్రీవుడ్ని ట్రస్టీగా పెట్టాడు.
అంటే లక్ష్యం కోసం, ఆ లక్ష్యంలో న్యాయం, ధర్మం ఇమిడి వున్నప్పుడు తప్పు చేయటమే ఒప్పవుతుంది" చెప్పటం కొద్దిక్షణాలు ఆపాడు రామదాసు.
ఓ మాజీ గూండా నోటినుంచి రామాయణ....భారతాలు....?! వివేక్ విభ్రాంతికి గురయ్యాడు. అయినా క్షణాల్లో తేరుకున్నాడు.
"మీరన్నది నిజమే....ఆ పవిత్ర గ్రంథాలు మనకు తలమానికాలే. అదీ కాదనను. కానీ ఇక్కడి సందర్భం వేరు. మీరు పరోక్షంగా నన్ను పగ, ప్రతీకారాలవైపు మరలిస్తున్నారు. నా వ్యక్తిగతమైన పగ, ప్రతీకారాలు తీర్చుకోవడంలో ధర్మం, న్యాయం ఎలా వుంటాయి....? వ్యక్తిగత స్వార్ధమేకదా?" వివేక్ ఓరగా దూరం నుంచి వస్తున్న జస్పాల్ నే చూస్తూ అడిగాడు.
రామదాసు నవ్వాడు.
"ఫర్వాలేదు....మెదడు మొద్దుబారలేదు. నీ సందేహం తీర్చవలసిందే. స్వార్ధంతో కూడుకున్నదైనా స్వధర్మమే పరధర్మం కంటే గొప్పదని గీతలో చెప్పలేదా! అహం, పగ, ప్రతీకారాలు, స్వార్ధం చెడ్డవన్న గీతే తిరిగి స్వధర్మం గురించి చెప్పింది.... అంటే ఏమిటర్ధం....? సందర్భాన్ని బట్టి, పరిస్థితుల్నిబట్టి ధర్మశాస్త్రాన్ని అన్వయించుకోమనేగా....? వార్ ఫర్ పీస్....శాంతి కోసం యుద్ధం, ధర్మం కోసం రక్తపాతం సమర్ధించదగ్గవే.
నువ్వు తప్పు చేయలేదు. అది నీకు తెలుసు. నిన్ను అంచనా వేసుకున్న నాకూ అది తెలిసిపోయింది.
నిర్దోషివైన నీకు ఉరి పడింది. నీకు నీ కుటుంబానికి అన్యాయం చేసిన దోషులు తప్పించుకు తిరుగుతున్నారు చట్టాన్ని మభ్యపెట్టి.
వందమంది నేరస్థులు తప్పించుకున్నా, ఒక నిర్దోషికి శిక్షపడకూడదని భారతీయ శిక్షాస్మృతి చెప్పటం లేదా...?
కొందరి మూలంగా నీకు, నీ కుటుంబానికి జరిగిన అన్యాయం నీకు వ్యక్తిగతమైనదే. ఆ కొందర్ని తెలిసి కూడా శిక్షించకుండా వదిలేస్తే వాళ్ళు మరికొందరికి, సమాజానికి కీడు చేస్తారు.
సమస్య అప్పుడు వ్యక్తిగతం నుంచి సమిష్టిగతానికి రూపాంతరం చెందుతుంది. అప్పుడు వారిని వధించడం ధర్మమే కదా? న్యాయాన్ని నిలబెట్టడమేగదా?
నీకు అన్యాయం చేసినవాళ్ళు దుర్మార్గులు అని నీకు తెలిసి కూడా వదిలేయడం నీవు తెలిసిచేసే పెద్ద తప్పవుతుంది...." స్థిరంగా, గంభీరంగా అంటున్న రామదాసువైపు కన్నార్పకుండా, విస్తుపోయి చూశాడు వివేక్.
"ఇవన్నీ చెబుతున్నందుకుగాను నేను శ్రీకృష్ణ భగవానుడినో, సుగ్రీవుడినో కాను. ఆ పవిత్ర గ్రంధాలు గురించి చెప్పడానికి ఒక మాజీ గూండాగా నాకున్న అర్హతేమిటో అని కూడా నీకు అనిపించవచ్చు.
నేను గూండానా? సత్పురుషుడినా అన్న మీమాంస చట్టానికీ, సమాజానికే తప్ప ఆ మహాగ్రంథాలకు వుండదు. హిందువునై పుట్టినందుకు రామాయణ, భారత, భాగవత గ్రంథాల్ని స్మరించుకునే హక్కు వుందని భావిస్తున్నాడు.
దేవుడి గుడిలోకి పరమనిష్ఠాగరిష్టుడైన భక్తుడు వెళతాడు. పరమ దుర్మార్గులైన, స్వార్ధపరులైన రాజకీయ నాయకులు, లంచగొండులైన ప్రతుత్వోద్యోగులూ వెళతారు. దేవుడి కాదనటం లేదుగా....ఇక వాటి ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, స్ఫూర్తికోసం, నిన్ను నీవు ఆయత్తం చేసుకొనేందుకు.
మనిషికెప్పుడూ సందేహాలే....
తను చేయాలనుకున్నదానిమీద తనకే నమ్మకం. గౌరవం తక్కువ వుంటాయి. అపనమ్మకం ఎక్కువ పాళ్ళలో వుంటుంది.
అయినా చేయాలనే వుంటుంది.
అప్పుడే మన పవిత్ర గ్రంథాల్లోని దృష్టాంతాలు అతనిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రోదిచేస్తాయి.
వాళ్ళే చేయగా లేనిది - మనం చేస్తే తప్పా అన్న ఒక వాదన మన ప్రయత్నానికి వత్తాసుగా తెచ్చుకుంటాం..... రెడీ అయిపో....జస్పాల్ దగ్గరికి వచ్చేస్తున్నాడు. శత్రువుది భయంకరమైన రూపమయినప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ యుద్ధం చేయలేనప్పుడు కళ్ళు మూసుకొని, అంధకారాన్ని ఆశ్రయించి, అంధుడై మొండిగా దెబ్బ తీయటమే చేయగలిగింది. కమాన్! మూవ్....విత్ కరేజ్ అండ్ డిటర్మినేషన్."
వివేక్ లోని రక్తాన్ని హై వోల్టేజ్ లో మరిగించేస్తున్నాడు రామదాసు.
"న్యాయంగా నీ వాటాకి వచ్చిన ఆహారాన్ని లాగేసి, పరాన్నజీవైన దుర్మార్గుడు తన అతి ఆకలిని, ఆబని తీర్చుకునేందుకు అన్యాయాన్ని యిస్తే నీకు మిగిలింది దాడే....కమాన్....బీట్ హిమ్...."
ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్లున్న అతని చెవుల్లో రామదాసు ఇస్తున్న ఉత్తేజం 'ఎకో'లో వినిపిస్తోంది.
అంతే! ఆ మరుక్షణం శరీరాన్ని బిగించి ఉక్కు ముక్కలా తయారుచేసుకొని, ఆఖరిసారిగా, ఓరగా తనకి చాలా దగ్గరగా వచ్చిన జస్పాల్ ని చూశాడు వివేక్. తమ ఇద్దరికీ మధ్యనున్న దూరాన్నీ, అతని దవడ ఏ కోణంలో వున్నదీ గుర్తించాడు క్షణాల్లో.
కళ్ళు మూసుకున్నాడు. దగ్గరకొచ్చిన జస్పాల్ ఏమిటన్నట్లుగా పొగరుగా తల ఎగరవేశాడు.
కొద్దిక్షణాల నిశ్శబ్దం అక్కడ....
గాలి స్తంభించిపోయింది....
ఉత్కంఠ ఊపిరి పోసుకుంది.
జస్పాల్ తననెందుకు రామదాసు పిలిపించాడో తెలీక నోరు తెరిచి అడగబోతున్నంతలో జరిగిందది.
'రాముడు చెట్టుని అడ్డం పెట్టుకుంటే, అర్జునుడు శిఖండిని అడ్డం పెట్టుకుంటే, నువ్వు నీ కళ్ళకు నీ కనురెప్పల్ని అడ్డం పెట్టుకో....' రామదాసు మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తుండగా, ఒంట్లోని శక్తినంతటిని కూడదీసుకొని, ఊపిరిని గుండెల నిండుగా పీల్చుకొని, దమ్ముపట్టి, చేతిని ఉక్కు ముక్కలా చేసి, అంచనాని గుర్తుకు తెచ్చుకుంటూ ఒక్కటేశాడు వివేక్.
అంతే! నిశ్శబ్దంగా వున్న ఆ ప్రాంతం ఒక్కసారి వులిక్కిపడినట్లయింది.
అసలేం జరిగిందో తెలిసేలోగానే, కళ్ళు బైర్లు కమ్ముతుండగా నేలమీదకి జారిపోయాడు జస్పాల్.
ముందు జరిగిందేమిటో అక్కడున్న ఎవరికీ అర్ధం కాలేదు.
కొద్దిక్షణాలు గడిచాయి....
నిర్ఘాంతపోయిన జస్పాల్ తేరుకున్నాడు. దిగ్భ్రాంతిగా వివేక్, రామదాసుకేసి చూశాడు.
రామదాసు పెదవులపై చిరునవ్వు....
కళ్ళలో ఆనందం....తృప్తి....
జస్పాల్ ని పిలుచుకొచ్చిన ఖైదీ ఉలికిపాటుకి గురయ్యాడు. తను చూసినది నిజమేనా అని.
"వివేక్ ని తక్కువ అంచనా వేశావ్. ఇతను బహు బలశాలి.... ఐదారు మర్డర్స్ ఒకేసారి చేసి జైలుకొచ్చాడు. నువ్వు అన్నం లాక్కున్నప్పుడు కావాలనే ఆగాడు. నీలో మార్పుకోసం ఒకింత టైమ్ ఇచ్చాడు. నువ్వు తన దగ్గర లాకున్న అన్నాన్ని తెచ్చివ్వలేదు. క్షమాపణలూ అడగలేదు. అందుకే యిలా చేశాడు.