Previous Page Next Page 
రామాయణము పేజి 11

  
                                                 6. ధర్మ నిర్ణయము
    రాముడు  దశరథునకు నమస్కరించి తన మందిరమునకు తిరిగి పోయినాడు. అలంకారములను తీసివైచి తల్లి కౌసల్యాదేవి వీడ్కోలును పొందుటకు ఆమె  అంతఃపురమునకు వెళ్లినాడు. ఆమె  "నాయనా పట్టాభిషేక ముహూర్తము ఆసన్నమగుచున్నది కదా, నీవింకనూ సిద్దము కాలేదేమి?" అని అడిగినది. రాముడు కైకేయి అంతఃపురమున  జరిగినదంతయు వివరించినాడు. ఆమె గొడ్డలి పెట్టునకు కూలిపోయిన చెట్టువలె నేలకు ఒరిగిపోయినది. అతడామెను సేదదీర్చి "అమ్మా దైర్యమును కోల్పోకుము" అన్నాడు.
    కౌసల్య: నాయనా వేదములు తండ్రి యాజ్ఞనే కాదు, తల్లి మాటను కూడ వినవలెను అని చెప్పుచున్నవి కదా? నా మాట వినుము; నీవు అరణ్యమునకు పోవలదు.
    రాముడు: అమ్మా కడుపుతీపి వలన నీవు అట్లు అనుచుంటివి. పరస్పర విరుద్దములగు రెండు ధర్మములు తారసిల్లినపుడు ఆ రెంటియందేది ఉత్తమ ధర్మమో దానిని పాటించవలెను. అడితప్పరాదన్నది ఉత్తమ ధర్మము. నాయనగారి సత్యవ్రతమునకు  భంగము కలుగరాదు. నేను అరణ్యవాసమునకు పోకతప్పదు.
    కౌసల్య: అటెనచో నన్ను కూడా కాననమునకు తీసికొనిపొమ్ము. వత్సమును విడిచియుండలేని గోవువలె నీ వెంట వచ్చెదను.
    రాముడు: నీవునూ నావెంట వచ్చినచో మహారాజు శోకము రెట్టింపు అగును. పత్నికి పతియే సర్వస్వము కదా? ఈ వివత్సమయమున నీవాయనను విడిచియుండురాదు.
    కౌసల్య ఇంక ఏమియూ అనలేకపోయినది. సీతను సమధానపరుచుటకు రాముడు తన  నిలయమునకు తిరిగిపోవుచుండగా కైకేయి దురాగతమునకు అగ్రహాయత్త చిత్తుడై వడివడిగా వచ్చుచున్న లక్ష్మణుడు ఎదురైనాడు.
    రాముడు: తమ్ముడా శాంతించుము. పినతల్లి కైకేయి ఆదిలో నన్ను కౌసల్యాదేవియూ సుమిత్రా దేవియూ వలెనే ఎంతో గారాబముగ చూచుచుండెడిది. ఇప్పుడామె విధి ప్రేరితయై ఆ వరములను కోరినది. విధి బాలీయము.
    లక్ష్మణుడు: కాముకుడగు దశరథుడు కైకేయి దుర్మార్గమును అంగీకరించినాడు 'ఆడి తప్పరాదు' అన్నమిషతో   ఆయన ఇప్పుడు కాలదోషము పట్టిన  వరముల నొసంగినాడు. అధర్మపరములగు ఆ వరములను నీవు  పాటించవలదు.... నీవు  మనలో  అగ్రజుడవు. యువరాజు అగుటకు అర్హత నీకు  మాత్రమే ఉన్నది. నీకు అండగా నేను నిలిచెదను. వసిష్ఠ మహర్షి నిర్ణయించిన  ముహూర్తమున నీవు నేడు అభిషిక్తుడవు కావలెను. నా ప్రార్ధనను అంగీకరించుము.
    రాముడు: తమ్ముడా నీ అపూర్వానురాగము నన్ను ఆనందభరితుని చేసినది... పితృవాక్య పరిపాలనము పరమ ధర్మము. నేను  వనవాసమునకు పోక తప్పదు... జానకికి ఇంకనూ  చెప్పలేదు.
    రాముడువేగముగా పోయి తన మందిరమును చేరెను. బాష్పపూరిత నయనుడైన లక్ష్మణుడునూ అతని వెంట వెళ్లినాడు.
    సీత అలంకరణమింకనూ పూర్తి కాలేదు. ఆమె రాముడు చెప్పినదంతయూ విని తాను యువరాణి యగు అవకాశము చేజారిపోయినదని విచారించలేదు. ఆమెయూ తాను పెట్టుకొన్న నగలను తీసివేయుచుండగా
    రాముడు: నీవు ఆభరణములను తీసివేయుచుంటివేమి?
   సీత: నేనునూ మీతో వనవాసమునకు వచ్చుచునాను.
    రాముడు: కైకేయి నన్ను మాత్రమే అడవికి పొమ్మన్నది కానీ నిన్ను తన  వరములో చేర్చలేదు కదా?
    "సీత: ఆమె చేర్చనక్కరాలేదు. నేను మీ అర్ధంగిని,  పతి వెంట నుండుట పత్ని ధర్మము.
    రాముడు: నిజమే. కాని నేను పోవుచున్నది క్రూరమృగ సంకీర్ణమగు అరణ్యము.
    సీత: ఐనానూ అందు మునిపత్నులు మనగలుగుచున్నారు. మునుల తపోబలము పత్నులను  కాపాడగలిగినట్లు మీ అస్త్ర  సంపద నన్ను రక్షించును.
    రాముడు: వనవాసము కష్టభూయిష్ఠము జానకీ.
    సీత: కనుకనే  మీతో రాగోరుచున్నాను ప్రభూ. సుఖములలో పాలుపంచుకొన్న నేను కష్టములందునూ మీతో నుండవలెను. అరణ్యమున మీ ముందు నడచి కంటకములను తొలగించి మార్గమును సుగమము చేసెదను.
    రాముడు: నేను దూరమాలోచించి చెప్పుచున్నాను. అడవులలో ఇడుములు పడలేవు. భరతుడు నిన్ను గౌరవించును. అయోధ్య యందుండుట శ్రేయస్కరము.
    సీత: (అశ్రు పూరిత నయనయై) మీరు లేని  అయోధ్యా నగరమున నేనుండజాలను. నాకు మీతో అరణ్యవాసము  అమరావతీ నగరవాసము కన్నా మిన్న. 'వలదు' అనకుడు, తీసికొని పొండు.
    రాముడింక అభ్యంతరము చెప్పలేదు. "నీవు  సుకుమారివని రావలదంటిని కాని నీ నిశ్చయము నాకు  సంతోషమును కలిగించు చున్నది.  నీ సతీత్వము జనకమహారాజు ప్రతిష్ఠనూ మా వంశ గౌరవమునూ నిలబెట్టినది... ప్రయాణమునకు సిద్దమగుము" అన్నాడు. సీత ఆనందభరితయైనది.
    అంతవరకునూ మౌనముగా అచటనే  నిలిచి  సీతారాముల సంభాషణను విన్న లక్ష్మణునకు దుఃఖము పొంగివచ్చినది.
    లక్ష్మణుడు: వదెన ఇంతకుముందు వచించినట్లు మీరు లేని అయోధ్యలో నేనునూ  ఉండలేను. మీతో వచ్చుటకు నాకునూ అనుమతిని ఇమ్ము, అరణ్యవాసమున దాపురించు ప్రమాదములనూ అసౌకర్యములనూ తొలగించుటకు పాటుపడెదను.  వనమున వర్ణశాలలో నీవు  లేనప్పుడు వదెనకు రక్షణ అవసరము. అరణ్య వాసమున మిమ్ము సేవించు  భాగ్యమును నాకు ప్రాసాదించుము".
    రాముడు: (సంతోషముతో) తమ్ముడా నీవంటి అనుజుడుండట నా అదృష్టము. కాని నీవునూ మాతో అరణ్యమునకు  వచ్చినచో ఇచ్చట మన తల్లులు కాసల్యాదేవికినీ సుమిత్రాదేవికి నీ తోడ్పడు వారెవ్వరన్న సంకోచముతో నిన్ను రమ్మనుటకు వెనుదీయుచున్నాను.
    లక్ష్మణుడు: అన్నా, నీకా సంశయము వలదు. కాసల్యదేవి  ఆశ్రితులకు వేయి గ్రామములను దానముగా ఇచ్చినది. కృతజ్ఞులైనవారు  కాసల్యాదేవికి ఎట్టి సాహాయ్యమునైన చేయగలరు. ఆమె వారి సాయముతో సుమిత్రదేవినీ కాపాడకలదు.
రాముడు: ఐనచో నీ మిత్రుల నుండి వీడ్కోలును పోందిరమ్ము... పూర్వము మనకు వరుణదేవుడు ప్రసాదించిన రెండు అభేద్య  కవచములునూ అక్షయతూణీరములతో సహా రెండు  ధనువులునూ బంగారపు పిడులున్న ఖడ్గద్వయమునూ నిత్యమూ పూజింపబడుటకు గురుదేవుడు వసిష్ఠ మహర్షి గృహమున ఉంచబడినవి. ఇప్పుడరణ్యమున మన కవసరము  కనుక నీవు తిరిగి  వచ్చునపుడా ఆయుధములను మహర్షి ఇంటి నుంచి తీసికొని రమ్ము.
    లక్ష్మణుడా ఆయుధములతో తిరిగివచ్చిన పిదపరాముడు "ఇచ్చట మనకున్న ధన  కనక వస్తువాహనములను సద్విప్రులకునూ ఆశ్రిత జనమునకునూ పేదలకునూ ఇచ్చి వేయుదము రండు. అరణ్యవాసమున వాటి అవసరము మనకుండదు" అన్నాడు.
    ఇచ్చివేయుట పూర్తియగుటతోనే వారు  మువ్వురునూ వీడ్కోలును పడయుటకు దశరథుని వద్దకు పోయినారు. రాముడు దశరథునకు నమస్కరించి  'తండ్రీ ఎంత చెప్పిననూ వినక సీతయూ సౌమిత్రయూ కూడా నా వెంట వనవాసమునకు వచ్చెదమని పట్టుబట్టినారు. వీరిని కూడ తీసికొని పోవుటకు అనుమతి  నియ్యగోరుచున్నాను!! అన్నాడు... కైకేయి రామునకు  మాత్రమే  కాక సీతకునూ  లక్ష్మణునకునూ కూడ  నార బట్టలను రప్పించి ఇచ్చినది. దశరథుడు ఏమియో చెప్పబోవుచుండగా ఆమె "ఆలస్యమగుచున్నది. మాటలతో కాలయపనము చేయక పంపివేయుడు" అన్నది. రాజు మండిపడుచూ "క్రూరురాలా. నీది హృదయమా శిలయా?" అని గర్జించినాడు. ఆమె ధుమధుమ లాడుచూ లోనికి పోయినది.
    రాముడు లేచి "మహారాజా మాకింక సెలవిండు; పోయెదము" అన్నాడు. సుమిత్రా నందనుడు మౌనముగా నిలిచి వందనమాచరించినాడు. సీతయూ మ్రొక్కుచుండగా ఆమె అలంకార రహితయై యుండుట గమనించి దశరథుడు 'సాధ్వీ, నగలేమైనవి?" అని ప్రశ్నించినాడు.
    సీత: అరణ్య వాసమున ఆభరణము లెందుకాని తీసివైచి నెచ్చెలులకునూ పరిచారికలకునూ పంచిఇచ్చితిని ప్రభూ.
    దశరథుడు: తోడవులను వర్ణించకుము....ఆగుము.
    అతడు ధనాధ్యక్షని రప్పించి ఇట్లు ఆదేశించెను. "ఒక వసుధేశ్వరుని పుత్రికయూ మరియొక భూమీశ్వారుని కోడలునూ ఐన ఈ సాధ్వికి తగిన నవర్నత ఖచిత సువర్ణాభరణములను రప్పించి యిమ్ము".
    భూషణములు వచ్చుటతోనే భూపుత్రి దశరథుని ఆదేశానుసారము వాటిని ధరించి మ్రొక్కినది.
     అనంతరమా మువ్వురునూ అట నుండి వెడలినారు.

 Previous Page Next Page