Previous Page Next Page 
అగ్ని కెరటాలు పేజి 9


    జయలక్ష్మికి గుండె ఆగినంత పనయింది.

    అచ్యుతం శంకరి కలిసి లేచిపోయారన్న నిర్దారణకు వచ్చాక ఆవిడ పెద్దపెట్టున శోకాలు మొదలుపెట్టింది. "అనుకున్నంతపనీ చేసిందికద దేవుడోయ్! ఈ ఇంటిపరువు వీధిన పడేసిపోయిందికద దేవుడోయ్!"

    ఆ అరుపులకు, రాగాలకు ఆచారి కంగారుగా లోపలికి వచ్చాడు "ఏమైంది?"

    "ఆరోజే చెప్పాను! విన్నారా? చెల్లెలు అలాంటిది కాదు అన్నారు! ఆ అచ్యుతంగాడు నోట్లో వేలుపెడితే కొరకలేడన్నారు. ఇప్పుడేమయిందో చూడండి. ఆ విధవ ముండను లేవదీసుకు పోయే గ్రంధసాంగుడయ్యాడు!"

    "గొంతు చించుకు అరుస్తావెందుకు? ఇరుగు పొరుగుకు నువ్వే డప్పుకొట్టి వినిపించేటట్టున్నావు. "మా శంకరి లేచిపోయింది. వినండహొ" అని" చిరాకుగా అన్నాడు  ఆచారి. చెల్లెలు చేసిన పనికి అతడికి తల కొట్డేసినట్టుగా వుంది. కాని అప్పుడే ఊరంతా చాటింపు చేసుకోవడం ఎందుకు?

    "నేనేం డప్పు వాయించి చెప్పనుగాని ఈ సంగతి ఎన్నాళ్లు మూసి పెడతారో మూసిపెట్టండి" ఆవిడ విసురుగా పెరట్లోకి వెళ్లిపోయింది.



                     *    *    *    *   


   
    భాగ్యనగరం బస్ స్టాండ్ లో అచ్యుతంతో దిగాక గాని శంకరి ఆవేశం చల్లారి ఆలోచన ప్రారంభం కాలేదు. కష్టమో, అవమానమో - తనకు ఓ రక్షణ వుండేది. ఇంట్లో నిరపాయంగా వుండేది. ఇప్పుడేముంది?ఇరవయ్యోళ్ళ వితంతువు ఇంటిమీద అలిగి ఇలా పారిపోయి వచ్చిందని  ఎవరి కయినా  తెలిస్తే ఏమయినా వుందా? ఈనగరాలగురించి తను పుస్తకాలలో చదివింది. ఇక్కడున్న మోసాలు, దౌర్జన్యాలు ఎక్కడా వుండవు. ముఖ్యంగా తన పరిస్థితి బయట పడి ఎవడూ తనవెంట పడకుండా చూచుకోవాలి! తను బిక్క మొగంవేసి దిక్కుతోచనట్టుగా, ఈ ఊరికి క్రొత్త అన్నట్టుగా కూడా వుండకూడదు, అంతా తెలిసినట్టుగానే వుండాలి!

    అచ్యుతానికి సిటీ క్రొత్తే! అడవినుంచి తప్పిపోయి పొరపాటున జనంమధ్యటకు వచ్చిన కుందేలుపిల్లలా బెదురుచూపులు చూస్తున్నాడు. ప్రవాహంలా సాగేజనం, ప్రళయం విరుచుకుపడు  తున్నట్టుగా అటు ఇటు పరిగెత్తే వాహనాలు - అతడికి బుర్ర తిరిగిపోతున్నట్టుగా వుంది.

    చుట్టుముట్టిన ఆటోవాళ్లు, రిక్షా వాళ్లని తప్పించుకుని బయటికి వచ్చింది శంకరి అచ్యుతం చెయ్యిపట్టుకొని.
 
    ఒక రిక్షావాడు మాత్రం వెన్నంటివచ్చి "రిక్షాకావాల్నా అమ్మా?" అని ఇంకా అడుగుతూనే వున్నాడు. ఏభైఏళ్లదాకా వుంటుందతడి వయసు. బక్కచిక్కినట్టుగా  వున్న అతడి ముఖంలో బ్రతుకు పోరాటంతప్ప మోసం, దుర్మార్గం కనిపించలేదు శంకరికి. వీడివలన తనకు అపాయం వుండదన్న నిర్ణయానికి వచ్చాక "ఏదయినా తక్కువ అద్దెకు దొరికే లాడ్జింగ్ కు తీసికెళ్లు!" అంది శంకరి.

    ఒకరోజు గడిచింది.

    ప్రయాణపు అలసట తీరాక కొంచెం స్థిమితం చిక్కి శంకరి అడిగింది అచ్యుతాన్ని -

    "ఇహ భవిష్యత్ కార్యక్రమం ఏమిటి అచ్యుతా?"

     "మీరే చెప్పాలి!"

    "ఊళ్లో మనగురించి ఏము కొంటుంటారో తెలుసా?"

    "ఏమనుకొంటుటారు?"

    "లేచిపోయామని!"

    "ఛీ!" అచ్యుతం ముఖం జేవురించినట్టుగా అయింది. "మనమధ్యన అలాంటిదేం లేదుకదా?"

    ఎంత అమాయకుడు! ఎంత అమాయకుడయినా తనకున్నతోడు ఇతడే! ఇతడిని అడ్డుగా పెట్టుకొనే ఈ జనం దాడినుండి తప్పించుకోవాలి! ఇతడినిమాత్రం తను వదులుకోకూడదు!

    "మన మధ్య ఏం లేదు! అయితే ఊరికి  వెళ్లిపోతావా అచ్యుతా?"

    మిమ్మల్ని వంటరిగా వదిలిపెట్టేసి ఎలా వెళ్లను?"

    "మన మధ్య ఏం లేదుకదా? వెళ్లిపోతే ఏం?"

    "జనం అనుకొనేది మనమధ్య ఏం లేదుగాని మీరంటే.... మీరంటే నాకు చెప్పలేని గౌరవం! మీకోసం నేనేమైనా చేస్తానండీ!"

    "ఏమయినా చేస్తావు కదూ?"

    "చేస్తానండీ!"

    "ముందు ఆ 'అండి' వదిలెయ్యి! మనం జనం అనుకొన్నదే నిజం చేసేద్దాం! ఈ క్షణంనుండి మనం భార్యాభర్తలంగా జీవిద్దాం!"

    "ఛ! వేళాకోళానికికూడా మీరిలా మాట్లాడితే ఒప్పుకోను!" అచ్యుతం ముఖం మొదటికంటే ఎక్కువగా ఎర్రబడిపోయింది.

 Previous Page Next Page