"ఊరి బయట ఇంత చక్కటి ప్రదేశం, ముఖ్యంగా ఈ గుట్టలమీద ఆలయం వున్నట్టు నాకు తెలియదు! ప్యాలెస్ లో వుండి వుండి ఊపిరాడనట్టుగా అయి ఇలా బయల్దేరడం ఎంత మంచిదైంది?"
"నడిచే వచ్చారా?"
"ఆ, నడిచే వచ్చాను. నిజం చెప్పాలంటే దొంగలా జారుకొని వచ్చాను కారు తీస్తే ధర్మలింగం గారికి తెలిసిపోతుంది. గోల పెట్టేస్తారు! ప్యాలెస్ విడిచి ఎక్కడికీ కదలొద్దంటారు! కదిలితే వెంట బాడీగార్డ్స్! పోలీసులచోత పడ్డట్టుగా వుంటుంది నాకు."
"ధర్మలింగంగారు మీ క్షేమం కోరే ఈ జాగ్రత్త తీసుకొంటున్నారు! మీరిలా చెప్పకుండా, చడీ చప్పుడు కాకుండా వచ్చేస్తే స్వేచ్చ పొందిన ఆనందం పొందుతారేమోగాని........ ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన చిక్కుల్లో పడతారు కదా? ముఖ్యంగా మీ మేనమామగార్లు మీమీదే ప్రాణాలు పెట్టుకువెళ్ళారు. మీరు ధర్మలింగంగారికి సహకరించితే బాగుంటుంది, చినబాబు?" సలహా ఇస్తున్నట్టుగా అన్నాడు శిఖామణి. ఇంటి పురోహితుడిగా ఆ ఇంటి విషయాలు తెలుసు శిఖామణికి.
"మంచిది, పంజరం ఒకటి తయారు చేయించమని చెబుతాను" కినుకగా అన్నాడు వికాస్.
చిన్నపిల్లాడి తరహాగా అతడు అన్నమాటకు ఫక్కుమన్నాడు శిఖామణి
వికాస్ పేరు మీద అర్చన చేసి హారతి తీసుకువచ్చాడు శిఖామణి.
హారతి కళ్ళకద్దుకొన్నాడు వికీ.
ఉదయం స్వామివారికి కొట్టిన కొబ్బరికాయలో ఒకచిప్పని కొద్దిగా పంచదార వుంచి ప్రసాదంగా వికీ చేతిలో వుంచాడు శిఖామణి.
కొబ్బరిచిప్ప తీసుకొని కోనేటిగట్టున కూర్చున్నాడు వికీ.
సూర్య భగవానుడు పశ్చిమకొండల వెనుక దిగిపోతూ అక్కడొక అద్భుత అసమానలోకాన్ని ఆవిష్కరించాడు. అది ఒక బంగారులోకమేమో, అక్కడికి వెడితే బంగారం ముద్దలు ముద్దలుగా తెచ్చుకోవచ్చునేమో అనిపిస్తూంది! రంగు రంగుల చీరల్ని సింగారించుకొంటున్నట్టుగా మబ్బులు.
శిఖామణి ప్రసాదంగా ఇచ్చిన కొబ్బరిచిప్పని రాతిమీద కొట్టి పచ్చికొబ్బరిని కొంచెం కొంచెంగా తింటూ కొండల్లో కనిపిస్తున్న దృశ్యాన్ని తన్మయంగా చూస్తున్నాడు వికాస్.
అతడు కూర్చొన్నచోట విశాలంగా పరుచుకొన్న చెట్టు వుంది. లేత గులాబీ రంగులో వింజామరల్లాంటి పువ్వుల్ని విరబూసిన చెట్టుకోమ్మల్లో కోతులు కూడా వున్నాయి. అవి తమ చిన్నిచిన్ని కళ్ళను చికిలించి వికీ కొబ్బరి తినడం ఆశగా చూస్తున్నాయి. అందులో ఒక కోతి సాహసించి అతడి భుజంమీదికి దూకింది. అతడి తన్మయానందా్ని అతి నిర్దాక్షిణ్యంగా చిందరవందర చేసేసింది ఒక్కసారిగా.
దాన్ని వదిలించుకోవడం ఎలాగో తెలియక అదిరిపాటుతో అరవడం మొదలుపెట్టాడు వికీ. భయంతో కూడిన అతడి అరుపులు చాలాదూరం వినిపించేలా వున్నాయి.
సరిగ్గా ఆ సమయంలో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నది భ్రమరాంబిక. ఎవరో భయకంపిత స్వరంతో అరవడం విని బాణంలా పరుగెత్తుకు వచ్చింది.
మర్కటరాజం చేస్తున్న దౌర్జన్యం ఆమెకు వెంటనే అర్దమైపోయింది.
"ముందా చేతిలో కొబ్బరిచిప్పను విసిరేయండి" చెప్పిందే తడవుగా చేతిలో కొబ్బరిచిప్పను విసిరేశాడు.
అయినా వదల్లేదు మర్కటం. అతడిందాక తనని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నంలో తోకలాగడంవల్ల తిక్కరేగిపోయింది దానికి. కిచకిచమంటూ మెడమీదా, ముఖంమీద కోపంగా రక్కసాగింది.
దాని గోళ్ళుదిగిన చోటల్లా కడ్డీతో కాల్చివత్తినట్టుగా భగ్గుభగ్గుమంటుంటే అతడు వెర్రిగా చిందులు వేయసాగాడు "బాబోయ్! ఇదెక్కడో పిచ్చికోతిలా వుంది!"
భ్రమర చెంగున ఎగిరి క్రిందికి వాలినట్టుగా వున్న కొమ్మనొకటి విరిచి కోతిమీద దండ ప్రయోగం చేసింది.
కోతి భయపడి ఛెంగున చెట్టెక్కింది. కిచకిచమంటూ, వెక్కిరిస్తున్నట్టు, తిడుతున్నట్టుగా ముఖం పెట్టింది.
అతడి ముఖంమీద, మెడమీద ఏర్పడిన రక్తపుగీతలు చూసి తన నడుం దగ్గర దోపుకొన్న ఖర్చీఫ్ తీసి రక్తాన్ని తుడుస్తూ అడిగింది భ్రమర "మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టు లేదు. ఈ ఊరికి చుట్టపు చూపుగా వచ్చారా? ఇంతకీ మీ పేరేమిటి?"
అపరిచితుడని, నవయువకుడని ఏమాత్రం సంకోచంలేకుండా తన ముఖంమీదా, గొంతుమీదా కోతి చేసిన గాయాలను తుడుస్తూ అత్యంత సమీపంగా వున్న ఆమెను ఏదో సమ్మోహనాస్త్రానికి వశమైనట్టుగా కళ్ళప్పగించి చూస్తున్నాడు వికీ.
సూర్యభగవానుడి సువర్ణరేఖలు ఆమెను జలకాలాడిస్తూంటే , పశ్చిమాద్రిలో అతడు సృష్టించిన బంగారులోకం నుండి అప్పుడే దిగివచ్చిన దేవతాప్రతిమలా ఉంది. గంధపుచెక్కతో చేసినట్టుగా వున్న శరీరఛాయ., బ్రహ్మ కడుశ్రద్ధగా మలిచినట్టుగా వున్న అంగసౌష్టవం, కలువల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, చక్కటి నాసిక ఎర్రటి పెదవులు, వత్తయిన నల్లటి తలకట్టు.
పైపైకి విరిగి పడి ఉక్కిరిబిక్కిరి చేసే ఒక సౌందర్యలహరిలా వుంది ఆమె.
"నా ప్రశ్నకు జవాబు చెప్పలేదేమిటి?"
"వికీ........! నాపేరు వికీ.....! పూర్తిపేరు వికాస్ చంద్ర!" అతడు అస్పష్టంగా అన్నాడు.
ఆమె ముఖంలో చటుక్కున రంగు మారిపోయింది.
సంకోచంతో రెండడుగులు వెనక్కి వేసి తీక్షణంగా చూడసాగింది.
ఇప్పుడిప్పుడే పురుషుడుగా పరిపూర్ణం సంతరించుకోబోతున్న ఇరవయ్యేళ్ళ వయసు, గులాబీరంగు పెదవుల మీద సన్నని మీసకట్టు, చువ్వలా, లేలేతగా పెరిగిన తోటకూరకాడలా పొడుగ్గా ఉన్నాడు. తెల్లటి తెలుపు, తెల్లటి లాల్చీ పైజమా వేసుకొన్నాడు. భుజానికి ఒక బట్ట సంచీ వ్రేలాడుతూంది. ఎడంచేతికి గోల్డ్ చెయిన్ వాచీ. కుడిచేతికి కెంపుపొదిగిన ఉంగరం.