13. | "మహా పతివ్రత | ను లోకమాతను
ఎంత హీనముగ - తలపోసినాను |
రావణాసురుడు - ఇంతటనైన
రాముని సీతను - రాముని కొసగిన
శాంతి భద్రతలు - నిలుచును గాని
| లేకున్న లంకకు - చేటు కాల" మని |
సీతను గానక - యోచన జేయుచు
మారుతి వెదకెను - కడు చింతించుచు ||శ్రీ||
__: 9 వ స. సంపూర్ణము :__
10 వ. సర్గ
లంకేశ్వరుని దివ్య శయనము :__
1. స్పటిక మణులతో - నిర్మితమైనది
రత్న కాంతులతో - వెలుగొందునది |
సుగంధములతో - నిండియున్నది
దంతపు పనులతో - అమరియున్నది |
ఉన్నతమై వి | శాలమైనది
స్వర్గతుల్యమై - అలరారునది |
లంకేశ్వరుని - దివ్య శయనమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
2. మావి కాజిన - నంవృతమైనది
అతి మృదువై మ | నోహరమైనది |
అశోక కుసుమ - మాలలల్లినది
చంద్రుని బోలిన - చత్రమున్నది |
స్వర్ణమయమై - రంజిల్లునది
సూర్యకాంతులతో - భాసిల్లునది |
లంకేశ్వరుని - దివ్య శయనమది
మారుతి గాంచెను - అచ్చెరువొంది .... ||శ్రీ||
3. ఐరావతము - దంతపు మొనలతో
పోరున బొడిచిన - గంటులతో |
వజ్రాయుధపు - ప్రఘాతములతో
చక్రాయుధపు - ప్రహరణములతో |
జయం పరంపరల - గురుతులతో
కీర్తి చిహ్నముల - కాంతులతో |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||
4. మినప రాశివలె - నల్లనివాడు
తీక్షణ దృక్కుల - లోహితాక్షుడు |
రక్త చందన - చర్చితగాత్రుడు
సంధ్యారుణ ఘన - తేజోవంతుడు |
సతులగూడి మధు - గ్రోలినవాడు
రతికేళి సలిపి - సోలినవాడు |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||
5. సులక్షనమౌ - సుందరాంగుడు
మణిమయ భూషిత - కామరూపుడు |
భుజబల తేజుడు - మహావీరుడు
దశకంఠుడు వి | శాల వక్షుడు |
పద్మముఖులచే - పరివేష్టితుడు
పద్మాకరమున - కరి సదృశుడు |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||
6. శ్రేష్టమైన పీ | తాంబర ధారుడు
షడ్రసోపేత | మృష్టాన్న ప్రియుడు |
మధువాసనల - బుసగోట్టువాడు
కోడెత్రాచువలె - శయనించువాడు |
మణిమయ కుండల - మండిత వదనుడు
జరిగిన స్వర్ణ కి | రీట శోభితుడు |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||
7. ఉత్తమాంగనల - ఆలింగనముల
పరిమళితములత | ని సర్వాంగములు |
అయిదు తలలు గల - పెనుబాములు
తీరుగ బలిసిన - అతని బాహువులు |
చంద్రకాంతి లో - మెరసే మేఘము
చంద్రముఖులతో - అతని దేహము |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||
8. వీణావేణు మృ | దంగ వాద్యముల
ఆటల పాటల - అలసిన యువతులు
వీణను చేరి ని | దురించు గాయని
చుంబనలిడు తన - ప్రియుడే యనుకొని |
మరియొక జవ్వని - పిల్లనగ్రోవిని
మత్తుగ ముద్దిడు - మగడే యనుకొని |
లంకేశుడు శయ | నించె కాంతలతో
సీతకై వెదకె - మారుతి ఆశతో ... ||శ్రీ||