Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 11


                    పాడవోయీ భారతీయుడా...            
    మా కాలనీ వాళ్ళది చాలా విచిత్రమైన సైకాలజీ!
    ఎప్పుడు పిచ్చి పడుతుందో ఎవ్వరం చెప్పలేము. ఎందుకంటే నేనూ అందులో ఉన్న వాడినేగా!
    ఉదాహరణకి పాకిస్తాన్ తో యుద్ధం వచ్చేట్లు కనిపించిందనుకోండి. వెంటనే టీవీ మనల్ని చిత్రవధ చేయటం ప్రారంభిస్తుంది చాలా సిస్టమేటిక్ గా!
    ముందు దేశభక్తి గీతాలు మొదలవుతాయ్. అవి అయిపోగానే అడ్డమయినాడూ స్క్రీన్ మీద కొచ్చి స్వాతంత్రోద్యమం గురించి నోటికొచ్చింది చెప్పటం మొదలెడతాడు..
    అది అయిపోగానే చిత్రహార్ వస్తుంది. అందులో అన్నీ దేశభక్తి చిన్న చిత్రాల పాటలే వస్తాయి.
    అదీ సహించి ఇంకా మిగిలామనుకోండి.
    దేశం కోసం అవసరం లేకపోయినా ఇంటినీ ఇల్లాలినీ అన్నీ త్యాగం చేసి వెళ్ళిపోతాడు హీరో.

    ప్రోగ్రామ్ కీ పోగ్రామ్ కీ మధ్యలో ఓ బండగొంతు నినాదాలు చదవటం ప్రారంభిస్తుంది.
    "దేశమంటే మట్టికాదోయ్- దేశమంటే మనుషులోయ్"
    "నీకోసం దేశం- దేశం కోసం నువ్వు"
    "మనిషికన్న ఊరు గొప్ప- ఊరుకన్న దేశం గొప్ప"
    "జై జవాన్ - జై కిసాన్"
    "రక్తదానం - అన్ని దానాల్లోకి గొప్పది"
    "సైనికుల కోసం రక్తం ఇవ్వు"
    "నీకోసం దేశం ఏమి చేసిందన్నది కాదు! దేశం కోసం నువ్వేం చేశావ్ అన్నదే ముఖ్యం"
    ఎందుకో ఆ స్లోగన్ రంగారెడ్డికి అమితమయిన కోపం కలిగిస్తుంది.
    "ఏమిటా పిచ్చివాగుడు? దేశం కోసం మనం ఏం చేస్తాం? మనం ఎలక్షన్స్ లో ఏదొక పార్టీని ఎన్నుకుంటోంది ఎందుకు? దేశంకోసం పాటుబడమనేగా? మళ్ళీ వాళ్ళు టీవీలో దేశం కోసం నువ్వేం చేశావ్ అని మన్నడుగుతారేమిటి?" అంటాడతను.
    అది నిజమే అనిపించింది నాక్కూడా.
    "ఒకవేళ వాళ్ళేమీ చేయలేక మనని సహాయం చేయమంటున్నారేమో-"
    "అంత చేతకాని వెధవల్ని ఎలక్షన్లో ఎవడు నుంచోమన్నాడు. ముందే ఆ విషయం ఏడుస్తే ఇంకో పార్టీని గెలిపించే వాళ్ళంకదా"
    ఇలా సాగిపోతుంది.
    ఒకవేళ సైక్లోన్ వచ్చిందనుకోండి. వెంటనే టీవీ ఆన్ చేస్తే చాలు ఏడుపు ముఖంతో ఓ ఎనౌన్సర్ కూర్చుని ఉంటాడు.
    అతనినేమయినా పలుకరిస్తే చాలు భోరుమంటాడేమో అని మనకు భయం వేస్తుంది.
    "తోటివారికి సాయం చేయటం మానవ ధర్మం" అంటాడతను.
    "సైక్లోన్ బాధితులకు విరివిగా విరాళాలివ్వండి" అంటాడు ఇంకోడు.
    "ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలివ్వండి- లేదా ప్రధానమంత్రి నిధికి విరాళాలివ్వండి!" అంటూ ఇంకొకడు దీనంగా చూస్తాడు.
    వెంటనే కాలనీ వాళ్ళందరం తెగ జాలిపడి వాళ్ళకు తలో కొంచెము విరాళాలిస్తాం!

    రంగారెడ్డికి అది కూడా నచ్చదు.
    "ఈ గవర్నమెంట్ ఇంత సిగ్గుమాలిన గవర్నమెంటయిపోయిందేమిటి? వానొచ్చినా, వరదొచ్చినా, క్షామం వచ్చినా అడుక్కోవటానికి రడీ అయిపోతుంది. పైగా పాపం ఆ బాధితులను టీవీలో, సినిమా న్యూస్ రీల్ లో అడుక్కునేవాళ్ళలా చూపిస్తుంది. సెంటిమెంట్ వర్కవుట్ అయేట్లు చేసి ప్రజల్నుంచి డబ్బులు లాగాలని ప్లాన్! అంతేగానీ మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది "ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలొచ్చినప్పుడు నువ్ చేతులెత్తెయ్- మేము చూసుకుంటాం" అని కాదు గదా! ఆ బాధితులకు సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది! ప్రజలు అసౌకర్యాలు కోరటం వాళ్ళ పౌరహక్కు! అంతేగాని పాపం వాళ్ళు అడక్కుండానే అడుక్కునే వాళ్ళలాగా చేసి వాళ్ళకు దానం చేయండి అని వాళ్ళ పరువు తీసేయటం, పెద్ద నేరం!" అంటూంటాడు.
    సరే- ఆ గొడవలలా ఉండగా ఈ మధ్య ప్రధానమంత్రి దేశం కోసం అందరూ త్యాగాలు చెయ్యాలని పదే పదే స్టేట్ మెంట్స్ ఇవ్వటం మేమంతా చూస్తూనే ఉన్నాం! అది చూసి టీవీలో మళ్ళీ నినాదాలు ప్రారంభమయిపోయినయ్.
    "నీ త్యాగమే నీకు శ్రీరామరక్ష / అల్లారక్ష / జీసస్ రక్ష / బుద్ధునిరక్ష" (సెక్యులర్ స్లోగన్ కదా)
    "దేశం పిలుస్తోంది! కదలిరా!"
    "నీ కోసం దేశం కాదు!దేశం కోసం నువ్వు"
    "మనది భారతదేశం- మనమంతా భారతీయులం!"
    "పొదుపు మన కర్తవ్యం!"
    "ప్రతి నీటి చుక్కా ప్రగతికి సోపానం"
    "విద్యుత్ ని ఆదా చేయండి- దేశ సౌభాగ్యానికి తోడ్పడండి"
    "నేటి పొదుపే రేపటి మదుపు"
    "పెట్రోల్ ని ఆదా చేయండి! విదేశీ మారకాన్ని మిగల్చండి"
    "అవసరమయితే ప్రయాణం చేయండి"
    "చెట్లు పెంచండి! పర్యావరణాన్ని కాపాడండి"
    "చెట్లు నరకడాన్ని నిరసించండి"
    "దుబారా చేయకండి"
    అలాంటివన్నీ తెగ చూడటం, వినటం జరిగేసరికి మా కాలనీ వాళ్ళందరికీ మళ్ళీ దేశభక్తి పూనకం లాగ వచ్చేసింది.
    "ఇస్ దేశ్ కి ధరితీ, పూనకంలాగ వచ్చేసింది.
    మా కాలనీ ఆడాళ్ళంతా కలసి అప్పటికప్పుడే ఓ ఆదివారం మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటుచేసింది మా కాలనీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ కాబట్టి మేమంతా కూడా గత్యంతరం లేక హాజరయ్యాం.
    "దేశం పిలుస్తోంది రా! కదలిరా!" అని స్వయంగా ప్రధానమంత్రి వాణే టీవీలో మోగుతోంది కాబట్టి మనమంతా ఉడతాభక్తి సాయం చేయాల్సిందే" అంది పార్వతీదేవి వేదికమీదనుంచి.

 Previous Page Next Page