రజని పెద్దగా ఏడుస్తూంది. అప్పన్న ఓదారుస్తున్నాడు. జగన్నాధానికి అప్పన్న తను చూసింది చెప్పాడు. రవి భయం భయంగా నిల్చుని ఉన్నాడు.
జగన్నాధం పిచ్చి కోపంతో ఊగిపోయాడు. రవిని పిచ్చిగా ఆ చెంపా ఈ చెంపా వాయించసాగాడు. మూర్తి జగన్నాధాన్ని తోసేసి రవిని ఎత్తుకున్నాడు. రవి మూర్తి మెడ చుట్టూ చేతులు వేసి పెద్దగా ఏడవసాగాడు.
"ఊర్కో రవీ! ఏడవకు. నువ్వు చాలా ధైర్యస్తుడివి. గొప్పవాడివి. రాజకుమారుడిలా గొప్ప గొప్ప పనులు చేస్తావు" అంటూ ఓదార్చాడు మూర్తి.
జగన్నాధం మూర్తిని చూస్తూ నిల్చున్నాడు.
మూర్తి ఇంత స్థిమితంగా ఎలా ఉండగలుగుతున్నాడు. ఇంత మంచితనం ఎలా పెంపొందించుకున్నాడు? అతని బిడ్డకు ఎంత గండం గడిచింది? అప్పన్న సమయానికి చూశాడు కనక సరిపోయింది. లేకపోతే జగన్నాధం నిలువెల్లా వణికిపోయాడు.
రవి హంతకుడు అయ్యేవాడు. తన కొడుకు హంతకుడిగా, బాల అపరాధిగా, ఏ రిమాండ్ హోంలోనో...
"ఏమిటి జగన్నాధం అంతగా ఆలోచిస్తున్నావ్ ఇప్పుడేం జరగలేదుగా? జరగని వాటిని... జరిగితే ఎలా వుండేదో అని వూహించుకొని బాధపడటం మూర్ఖత్వం!" అన్నాడు మూర్తి. రవిని కిందకు దించాడు.
జగన్నాధం ఏదో అనబోయాడు గొంతు పెగలలేదు. ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్ధం కాలేదు. మూర్తి రెండు చేతులూ పట్టుకున్నాడు.
"నాన్నా! ఇంటికి వెళదాం" అన్నది రజని తండ్రి చెయ్యి పట్టుకుంటూ.
రవి చెయ్యి చాపాడు. రజని చెయ్యి చాపలేదు. కోపంగా చూసింది. రవి కొంచెం సిగ్గుపడి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.
"తప్పు తల్లీ! అలా చెయ్యకూడదు. రవి మంచివాడు. చెయ్యి పట్టుకో!" అన్నాడు మూర్తి.
రజని చెయ్యి చాపింది. రవి రజని చేతిని అందుకున్నాడు.
"గుడ్! అలా స్నేహంగా ఉండాలి" అన్నాడు మూర్తి.
జగన్నాధం మూర్తి ముఖంలోకి కృతజ్ఞతగా పూర్వకంగా చూశాడు.
8
గండిపేట వాతావరణం కాలేజీ యువతీ యువకులతో కళకళలాడుతోంది. పరువంలో ఉన్న యౌవనం పరుగులు తీస్తోంది. రకరకాల దుస్తుల్లో యువతీ యువకులు ఉల్లాసంగా ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఏవేవో జోక్సు వేసుకుంటూ పకపక నవ్వుతున్నారు.
ఆ పార్టీలో రజని ప్రత్యేక ఆకర్షణగా ఉంది. రజని చుట్టూ చాలామంది చేరుతున్నారు. అది గమనించిన ప్రకాశ్ ఆమెను నీడలా కనిపెట్టుకొని తిరుగుతున్నాడు. పాటలూ, డ్యాన్సులూ కిలకిల నవ్వులు...కోలాహలంగా ఉంది.
రవి మాత్రం దూరంగా ఒక చెట్టు క్రింద కూర్చుని మామ్ 'రెజర్స్ ఎడ్జ్' చదువుతున్నాడు.
రికార్డు పెట్టారు. ట్విస్టుడ్యాన్సు ప్రారంభం అయింది. రజని కళ్ళు దూరంగా కూర్చుని వున్న రవిమీద పడ్డాయి. గబగబ రవి దగ్గరకు వచ్చింది. ట్విస్టు డ్యాన్సుకు ఆహ్వానించింది. రవి అందుకు అంగీకరించలేదు.
"ఏమిటి రవీ! మరీ ముసలివాడిలా ప్రవర్తిస్తున్నావు?" అన్నది.
రవి మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వాడు.
"అసలు నువ్వు ఎందుకొచ్చినట్టు?" అన్నది రజని.
"నీ పోరు పడలేక" నిర్వికారంగా అన్నాడు.
"అయితే ఈ డ్యాన్సు కూడా నా కోసమే చెయ్యి"
"నన్ను విసిగించకు. ఇలాంటి డ్యాన్సులు చేయడం నాకిష్టం ఉండదు.
"నేను నేర్పిస్తానుగా రా! ప్లీజ్!"
"ప్లీజ్ నన్ను వదిలెయ్!"
"నువ్వు రాకపోతే నేనూ వెళ్ళను" అంటూ రవి వీపుకు తన వీపు ఆనించి కూర్చుంది రజని.
రవి చివ్వున లేచి నించున్నాడు.
"మరీ చిన్నపిల్లలా ఏమిటీ అల్లరి? నాకిష్టం లేదని చెబుతుంటే వినిపించుకోవేం?"
"నువ్వు రాకపోతే అల్లరే చేస్తాను. వస్తావా! రావా?" అంటూ రవి చేయి పట్టుకుంది.
"నేను రాను! మరీ విసిగిస్తే నేను వెళ్ళిపోతాను" అన్నాడు రవి చెయ్యి విడిపించుకుంటూ.
"రజనీ! డార్లింగ్ నువ్విక్కడున్నావా! నీకోసం ఎక్కడెక్కడో వెతికారు...ఓ! రవికోసం..." రజని కోపంగా చూడటంతో మాట పూర్తి చేయలేకపోయాడు రజనీని వెతుక్కుంటూ వచ్చిన ప్రకాశ్.
"ట్విస్టు డ్యాన్సు మొదలైంది. నువ్వొస్తావా?" విసుగ్గా అడిగాడు ప్రకాశ్ రజనీని.
రజని ప్రకాశ్ వెనకే వెళుతుంటే ఓ క్షణం చూసి, మళ్ళీ చెట్టుకింద కూర్చుని పుస్తకం తెరిచాడు రవి.
9
"నిన్ను చూస్తుంటే నాకెలా వుంటుందో చెప్పనా?" పార్కు బెంచి మీద కూర్చుని హిప్పీరావు హేమతో.
"ఎలా వుంటుందేం" కవ్విస్తూ అడిగింది హేమ.
'ఎలాగంటే... ఎట్లా చెప్పడం?" తల గోక్కున్నాడు హిప్పీరావు.
"అయ్యో! అంతమాత్రం కూడా నీకు చేతనయితే నాకు ఇంక కావాల్సిందేముంది?" అన్నది ప్రేమ.