ఇటున్నా - ఇంటున్నా " అంది అంటీ నవ్వుతూ "అవ్ - నీ పేరేంటి?" భవానీ నడిగింది.
"భవానీ ......ఆహాహ - రాకేష్ - రాజేష్ -"
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
"భవానీ రాకేషా?"
"కాదాంటీ - మా ఇష్ట దైవం భవానీ తల్చుకుని పేరు చెప్పానన్నట్లు - నా పేరు ఓన్లీ రాకేష్-"
"ఇగో చూడు ఓన్లీ రాకేష్-"
"అహహ - ఓన్లీ ఇంటి పేరు కాదంటీ - రాకేష్ - రాకేష్ "
"చూడు రాకేష్! ఇయాల్టీ కెళ్ళి ఈ ఇల్లు నీదనుకో! మిద్దె మీద నీకు సపరేట్ రూమున్నది. భోజనానికి వంటమనిషి భాజన్రావున్నాడు. ఒక ముచ్చట్లు పెట్టుకొనికి రోజూ ఉన్నది- రోజూ కెరుకే గదా?"
భవానీ ఇబ్బందిగా నవ్వాడు "యా! యా! రోజా! రోజా! - నాకు తెలుసు - మోస్ట్ ప్లెజెంట్ గాళ్-" అన్నాడు తెలివిగా - ఎక్కువ వివరాల్లో కెళ్ళ కుండా తప్పించుకుంటూ -
"ఎప్పుడూ చిన్నప్పుడు మీ ఇద్దరూ ఊటీ పబ్లిక్ స్కూల్లో జదివిన్రు! ఇప్పుడెం గుర్తుంటది?"
"ఆ! యాడ్ కొచ్చిందాంటీ! ఊటీ పబ్లిక్ స్కూల్ - ఎప్పుడూ నా జుట్టూ పీకుతుండేది-"
"ఆహ్హహ్హ- ఇప్పటికీ అంతే! సేమ్ టు సేమ్ - ఎప్పుడైనా సరే నకరాల్జేస్తే జుట్టు పడతది-"
"చాలామంది హాబీ- సూపర్ హాబీ! రాజకీయాలకు మంచిగా సూటవుతది-"
"యా! యా-"
"రోజూ ఇప్పుడింట్లో లేదా అంటీ?"
"ఈ టైం లో ఏడుంటది ? మాణింగ్ నైన్ కెళ్ళి నైట్ నైన్ వరకూ టీవీ చానెల్ లోనే ఉంటుంది."
"ఓ చానెల్లో జాబ్ చేస్తుందా?"
"జాబా! రోజాకేంఖర్మ జాబ్ చేయ్యనికి! మా టీవీ చానెల్లో నే క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తోంది.... " అన్నాడు జైరాజ్.
భవానీశంకర్ చప్పున అండర్ స్టాండ్ చేసుకున్నాడు.
"ఓ! అలాగా! వెరీ నైస్ - మన చానెల్! పేరు - జస్ట్ ఫర్ గాట్ - ఎంటన్నా అది-'
"బృందావనం-"
"అవును! బృందావనం! నెంబర్ వన్ తెలుగూ ఎంటర్ టెయిన్ మెంట్ చానెల్-"
'యా! అదే మన చానెల్ స్లోగన్ అనుకో! అంటే నువ్ మన చానెల్ ని మంచిగా ఫాలో అవుతున్నావన్నట్లు-"
"నేనే కాదంకుల్ - మెంటల్ గా పూర్తీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళెవరయినా సరే - బృందావనం చూడాల్సిందే-"
జైరాజ్ హాపీగా ఫీలయ్యాడు.
"యా! రోజా కోషిష్ గూడా అదే రాకేష్! డే అండ్ నైట్ కష్టపడుతున్నది గానీ వ్యూయర్ షిప్ పికప్ గావటం లే - యూనో - రోజా అమెరికాలో మాస్ కమ్యునికేషన్స్ చేసింది -"
"వావ్ ! సేమ్ టు సేమ్ - నేనూ అదే చేశా-"
"కానీ నువ్ చేసింది ఇండియాలో కదా-"
"యా ! అక్కడ తేడా వస్తుంది-"
"బాగా తేడా వస్తుంది భయ్ ! కాస్తా, కూస్తా గాదు-"
"ఇక్కడి డిగ్రీ నాలిగ్గీసుకోని క్కూడా పనికి రాదు -" అంది అంటీ -
"అవునాంటీ - అమెరికాది అందుకు బాగా పనికొస్తుంది -"
"యా - అక్కడికీ చాలా ఇంటిలిజెంట్ గాళ్ గనుక మొత్తం న్యూ అయిడియాస్ తో - సూపర్ ప్రోగ్రామ్స్ క్రియేట్ జేస్తున్నది -"
"ఈ క్రియేటివ్ హెడ్ లంతా అంతే అంటీ! దుమ్ము లేపుతుంటారు -"
"దుమ్మూ?" అనుమానంగా అడిగాడు జైరాజ్.
"అదే అంకుల్! దుమ్మంటే రియల్ గా రోడ్ మీదుండే దుమ్ము కాదు - చానెల్ దుమ్మన్నమాట!"
"ఓకె మై బాయ్- నువ్వింక మిద్దె మీదకు పోయి నీ రూమ్ లో రిలాక్సవ్వు- డిన్నర్ టైం కి కలుద్దాం - ఒకే-?"
"మోర్ దెన్ ఓకే అంకుల్ - " తన కోసం ఎదుర్చుస్తున్న నౌఖర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ మీద కెళ్ళాడు భవానీ -
***
అది బృందావనం టీవీ ఛానెల్ భవనం!
రోజా ఎండీ రూమ్ లో కూర్చుని జనరల్ మేనేజర్ కే.కే. బాకా తీసుకొచ్చిన ఛానెల్ రేటింగ్ చార్ట్ చూస్తోంది . మిగతా ప్రొగ్రాం ఎగ్జిక్యూటివ్స్ అంతా సెమీ సర్కిల్ గా కూర్చుని ఉన్నారు.
ఒక్కొక్క అయిటమే చూస్తుంటే రోజా మొఖంలో కలర్స్ మారిపోతున్నాయ్.
భక్తీ కార్యక్రమాలు అంతవరకూ ఉన్న మూడో స్థానం నుంచి ఒక్కసారి అయిదో స్థానం లోకి జారిపోయింది.
"ఓగాడ్ " అంది రోజా షాకయిపోతూ.
ఆ డైలాగుతో అందరిలోనూ ఉత్కంట పెరిగిపోయింది.
ఏం దారుణం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు.
"వైకుంఠం కార్యక్రమం ఒక్కసారిగా అయిదో ప్లేస్ కి పడిపోయింది " అంది రోజా వినోదిని వేపు చూస్తూ.
వినోదిని మొఖం పాలిపోయింది.
"అంటే నా ఉద్యోగం ఊడిపోయే రోజు దగ్గర పడిపోయిందన్నమాట" అనుకుందామే.
"అయిదో ప్లేస్ అంటే తెలుసుగా? అందరి మొఖాల వేపు చూస్తూ అడిగింది.
"తెలుసు మేడమ్ ఉన్నవే ఆరు ఎంటర్ టెయిన్ మెంట్ చానెల్స్! వాటిల్లో - అయిదో' ప్లేసంటే - లాస్ట్ బట్ వన్" అన్నాడు జే.కే! జే.కే. ఓవరాల్ ఇన్ చార్జ్.
"ఇక సీరియల్స్ పొజిషన్" అంటూ మళ్ళీ చార్ట్ చూసింది రోజా. ఆమెకు కళ్ళు భైర్లు కమ్మినట్లనిపించినయ్.
నాలుగోస్థానం నుంచీ ఆరోస్థానానికి పడిపోయింది.
కోపం అణచుకోలేక ఆ చార్ట్ ని కేకే బాకా మీదకు విసిరేసింది.
కేకే బాకా గాల్లో ఎగుర్తూ వచ్చిన చార్ట్ ని అతి లాఘవంగా పట్టుకున్నాడు.
"సీరియల్స్ పొజిషనేంటో నువ్వే చెప్పు వాళ్ళకు-"
కేకే బాకా వాళ్ళందరి వేపూ పాలిపోయిన మొఖంతో చూశాడు.
"మన చానెల్ లాస్ట్ పొజిషన్ కి పడిపోయింది " అన్నాడు విషాదంగా.
అందరిలోనూ కలకలం చెలరేగింది.