సావిత్రి మనసంతా వికలమయిపోయింది.
ఆమె ఎందుకేడుస్తుంది?
అమెది ఏం కథ?
ఈ జన ప్రవాహాలలో ఒక్కొక్కరిదీ ఒక్కో కధ! కొందరివి కామెడీలూ, కొందరివి ట్రాజెడీలూ...
అయినా అ తేడా చూసేవారికి కనిపించదు.
మనసుల్లోకి పరకాయ ప్రవేశం చేయగలిగితేనే_
బస్ లో ఎక్కింది సావిత్రి.
ఇంటికి చేరుకుని మంచంమీద వాలిపోయింది.
ఇంకొద్ది రోజులు...తమ్ముడికి ఉద్యోగం వస్తుంది. ఆ తరువాత వాడి దారిన వాడూ పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతాడు.
తల్లిదండ్రులు కూడా వాడితోనే__
తనొక్కర్తే ఒంటరిగా మిగిలిపోతుంది. ఊహు...! జీవితాంతం ఈ ఒంటరితనాన్ని తను భరించలేదు. తన పెళ్ళి విషయంలో తనే చొరవ తీసుకోవాలి. తన జీవితాన్ని తనే మలచుకోవాలి.
లైట్ స్విచ్ వేశారెవరో...గదంతా వెలుగుతో నిండిపోయింది. గడపలోనే నిలబడి వున్నాడు శ్రీరామ్.
చటుక్కున లేచి కూర్చుంది సావిత్రి.
"అయామ్ సారీ! తలుపులు తెరచే ఉన్నాయి. లైటు కనిపించలేదు. అందుకని మీరున్నారో లేదో చూద్దామని."
సావిత్రి చప్పున కన్నీరు తుడిచేసుకుంది.
"ఏదో ఆలోచిస్తూ పడుకుండిపోయాను..." అంది చిరునవ్వు తెచ్చుకుని.
"మీరు చదువుతానంటే నా దగ్గర చాలా మాగజైన్స్ వున్నాయ్...ఇస్తాను" అంటూ వెళ్ళి కొన్ని ఇంగ్లీషు మాగజైన్స్ తెచ్చి ఆమెకిచ్చాడు.
ఆ రోజు నుంచీ ఒంటరితనం మరింత విజృంభించింది.
ఆఫీస్ లో, ఇంట్లో, నిద్రపోతున్నా__
తను మదన్ విషయంలో నిజంగా తప్పుచేసిందా...! అతను పెళ్ళిచేసుకుందామని కాలేజీలో చదువుతూండగా అడిగినప్పుడు ఒప్పుకోకపోవడం తన తెలివితక్కువ తనమేనా? ఏమో! ఆ రోజుల్లో తెలుసు సినిమాలు చూసీ... తెలుగు నవలలు చదివీ... కుటుంబం కోసం తమ్ముడినీ, చెల్లెళ్ళనూ చదివించడం కోసం పెళ్ళిని త్యాగం చేయటం చాలా థ్రిల్లింగ్ గా కనిపించింది.
కానీ ఇప్పుడు తెలుస్తుంది తను పొరపాటు చేసింది. తనకుమాలిన ధర్మం అని వూరికే అనలేదు.
ఈ ఫాస్ట్ లైఫ్ లో ఏది మిస్ అయినా మళ్ళీ అందుకోవటం కష్టం.
హోటల్లోకి నడిచింది సావిత్రి.
కార్నర్ సీట్ మామూలుగానే ఖాళీగా వుంది తనకోసం... బేరర్ కాఫీ తెచ్చి ఆమె ముందుంచాడు.
రోడ్డుమీద యధాప్రకారం జనప్రవాహం సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది.
స్టీరియో ఫోనిక్ లో మహమ్మద్ రఫీ పాట గుండెల్ని పిండేసేలా నెమ్మదిగా, రహస్యంగా తనకోసమే పాడుతున్నట్లుంది.
"ఇన్ భరీ దునియామె కోయీభి హమారా సహువా! గైర్ తో గైర్ హై అప్ నోంక సహారా నహువా..."
అవును!
ఇంత పెద్ద ప్రపంచంలో 'నా' అనుకునేవారే లేరు. జనంలో నుంచి త్వరత్వరగా నడుస్తూ వస్తున్నాడో యువకుడు.
అతనిని చూస్తూనే గుర్తుపట్టిందామె.
శ్రీరామ్!
చాలా ఆకర్షణీయమయిన రూపం అతనిది! ఎప్పుడూ పెదాలమీద చిరునవ్వు! అతనింకా పెళ్ళెందుకు చేసుకోలేదో! ఉద్యోగం గానీ ఆస్థిగానీ ఉంటేచాలు ఠకీమని పెళ్ళయిపోతుంది మగాళ్ళకు. అందం, చదువూ, కారెక్టర్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇవేమీ ఎవరూ పట్టించుకోరు... కానీ ఆడపిల్లకు ఉద్యోగం కాక ఆస్థి కాక మిగతావన్నీ కూడా వుండాలి.
ఎంత కుళ్ళిపోయింది జీవితం?
"హలో..."
కిటికీవేపు నుంచి దృష్టి మళ్ళించిందామె.
శ్రీరామ్ నవ్వుతూ ఎదురుగ్గా నిలబడి వున్నాడు.
"మీరా కాదా అని పెద్ద సస్పెన్స్... ఆఫీస్ నుంచేనా?"
"అవును..." మందహాసం చేస్తూ అంది.
"నేనూ ఆఫీస్ నుంచే! ఇవాళ నా జీవితంలో శుభదినం! అందుకే స్వీటూ హాటూ తినేసి సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చేశాను."
"ఏమిటి విశేషం?" అడిగింది సావిత్రి.
"ఇలా రండి! ఆ కార్నర్ సీట్లో ఎందుకు? అక్కడ కూర్చుందాం!" అన్నాడతను. సావిత్రి మౌనంగా లేచి అతన్ననుసరించింది.
ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.
"ఇవాళ మీరు నా గెస్ట్! అంచేత నేనేం ఆర్డర్ చేసినా కాదనకండి!"
"నాకేం వద్దండీ?"
"కాదనడానికి వీల్లేదని ముందే చెప్పేశాను కదా!"
"ఇంతకూ ఆ శుభదినం గురించి చెప్పనేలేదు..."
"ఇవాళ మామయ్య కూతురుతో నాపెళ్ళి తప్పిపోయింది" ఆనందంగా చెప్పాడతను సావిత్రి ఆశ్చర్యంగా చూసిందతనివేపు.