Previous Page Next Page 
రక్తచందనం పేజి 10


    వీరు అనవసరంగా ఎవర్నీ, దేన్నీ అనుమానించడని వారికి తెలుసు. అందుకే వాళ్ళు ఆశ్చర్యపోయారు అతను తీస్తున్న ఆరాకి.
    "ప్రైవేట్ వాహనాలేమన్నా కౌదల్లీలో కనిపించాయా....?"
    "తెలీదు....ఆవైపు అలోచించలేదు యజమానరే...."
    "ట్రావెలర్స్ బంగ్లా పరిస్థితేమిటి? బంగ్లాకి చేరువగా వెళ్ళి పరిశీలించారా....?"
    "పరిశీలించారట. ట్రావెలర్స్ బంగ్లాముందు ఒక్క వాహనం లేదట. బంగ్లా మొత్తంమీద రెండు లైట్స్ వెలుగుతున్నాయట. ఎక్కువమంది ఉన్నట్లుగా ఆనవాళ్ళు లేవట. ఎలాంటి మాటలు కూడా వినిపించటం లేదట...."
    "నివురుగప్పిన నిప్పు ఆచూకీ, ఆనవాళ్ళకు, శబ్దాలకు దూరంగా ఉంటుంది. వాళ్ళ పద్ధతిలోనే మనమూ ప్రయత్నించాలి. ట్రావెలర్స్ బంగ్లాని శోధించటం మానేసి ముందు మార్కెట్ కి వెళ్ళి మటన్. చికెన్ షాప్స్ లో, లిక్కర్ షాప్స్ లో ఎంక్వైరీ చేయండి. ఇండియన్ పోలీసుల్లో ఎనభైశాతం తిండిబోతులు. నాన్ వెజిటేరియన్ లేంది వాళ్ళు అన్నం ముట్టరు. అంతకుముందు ఫ్రీగాగానీ, తక్కువ రేటుకి వచ్చే మందుగానీ పుచ్చుకుంటారు. వెంటనే బయలుదేరు" అని అంతకుముందు వచ్చిన వ్యక్తికి ఆజ్ఞలు ఇచ్చాడు.
    అతను క్షణాల్లో చీకట్లో అదృశ్యమైపోయాడు. "ముత్తప్ప....ఆవేశాన్ని తగ్గించుకొని బుర్రకాయకు పదునుపెట్టు, ట్రావెలర్స్ బంగ్లా వెనక్కి వెళ్ళు. చుట్టుపక్కలకి వెళ్ళకు" వీరూ కంఠం ఆగిపోయింది.
    భైరవీ కొద్దిక్షణాలాగి లోపలకు వెళ్ళిపోయింది. ముత్తప్పకు ట్రావెలర్స్ బంగ్లా వెనక్కి ఎందుకు వెళ్ళాలో అర్థంకాలేదు. వెనక్కి వెళ్ళమన్నారేకాని చుట్టుపక్కలకు వెళ్ళవద్దన్నారు.... ఏమిటీ దానర్థం....? ఆలోచిస్తూ కౌదల్లీ కేసి వేగంగా బయలుదేరాడు.
    మిగిలినవాళ్ళు కొందరు గుహకి కాపలాగా పహరా కాస్తుంటే_మరికొందరు వంట ఏర్పాట్లలో పడిపోయారు.
    నిశీధి నిశ్శబ్దంలో అడవి కలిసిపోయింది.
    దూరంగా పాలార్ నది దూకుళ్ళు....
    సుదూరంలో పులిగాండ్రింపు....తిరిగి నిశ్శబ్దం....కాలం క్రమంగా కరిగిపోతోంది.
    పొయ్యి భగభగమని మండుతోంది....అన్నం ఉడుకుతోంది.... శ్మశానంలో శవం తగలడుతుంటే నిర్వికారంతో చూస్తూ, నిర్వేదంతో మునిగి ఉండే కాటికాపరిలా ఉన్నారు వాళ్ళు.


                          *    *    *    *


    పగలంతా మాటువేసినా వీరు అనుచరుల జాడలేకపోవటంతో ఎస్.ఐ.దినేష్ ఆలోచనల్లో పడ్డాడు.
    మేనీటర్ ని మట్టుబెట్టాలనుకొనే వేటగాడికి సహనం, ఓర్పు ఉండాలి. ఉన్నచోటు నుంచి గంటలతరబడి కదలకుండా ఉండాలి. సరీగ్గా అలాగే వీరూ అనుచరుల విషయంలో కూడా ఓర్పు వహించాలనే అభిప్రాయం ఎస్.ఐ.దినేష్ లో బలంగా నాటుకోబట్టే మలై మహదేశ్వరా హిల్స్ లో క్రితంరోజు అర్థరాత్రి నుంచి ఆ రాత్రి ఎనిమిదిగంటలవరకూ ఓపిగ్గా ఉన్నాడు.
    వర్తకుడి ఇంటిలో ఉంచిన తమ పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎలాంటి వైర్ లెస్ మెసేజ్ రాలేదు. అంటే....వీరూ అనుచరులు మకాం మార్చివేసి మరో దిక్కుకి వెళ్ళిపోయి ఉండాలి. లేదంటే వెచ్చాలకు రాకుండా ఇంతసేపు వుండలేరు.
    ఒక నిర్ణయానికొస్తూనే దినేష్ తనవాళ్ళతో కలసి కౌదల్లీకి బయలుదేరాడు.


                                              *    *    *    *


    వీరూ పంపిన వేగు కౌదల్లీ చేరుకొని మటన్ మార్కెట్ కి వెళ్ళి పాతిక కేజీలు మటన్, పాతిక కేజీలు చికెన్ కావాలని అడగబోతుండగానే ఆ షాప్ యజమాని సరుకు లేదన్నట్లుగా పెదవి విరిచాడు. వరుసగా ఐదారు షాపుల్లో ప్రయత్నించినా అదే సమాధానం రావటంతో వేగులోని అనుమానం బలపడింది.    
    సాధారణంగా రాత్రి తొమ్మిదిన్నర పదివరకు ఉండే చికెన్ షాప్స్, మటన్ షాప్స్ రాత్రి ఏడు గంటలకే సరుకు అమ్మేసి షాప్స్ కట్టేస్తున్నారంటే ఏమిటర్థం? ఆలోచిస్తూనే లిక్కర్ షాప్ కి వెళ్ళాడు. ఆ షాప్ లో పనిచేసే కుర్రవాడ్ని మాటల్లో పెట్టాడు వేగు.
    "ఏమిటి షాప్ లో సరుకు తక్కువ కనిపిస్తోంది? ఏదైనా పార్టీ జరుగుతోందా ఊర్లో....?"
    "అదేంలేదు. ఎవరో వచ్చి ఎక్కువ సరుకులు పట్టుకెళ్ళిపోయారు"
    "మీ వ్యాపారమే బావుంది. పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు లేని రోజుల్లో కూడా వ్యాపారం జోరుగా ఉంది...." వేగు అన్నాడు కేజువల్ రిమార్క్ గా.
    "వ్యాపారమా, పాడా? ట్రావెలర్స్ బంగ్లాలోని వాచ్ మెన్ వచ్చి సరుకు తీసుకెళ్ళాడు. బంగ్లాలో ఏదో పార్టీ అనుకుంటాను. ఎవరో టూరిస్ట్స్ వచ్చుంటారు. ఎప్పుడోగాని ఇలాంటి సేల్స్ జరగదు...." షాప్ కుర్రాడి మాటలు పూర్తవుతూనే వేగు ఉలిక్కిపడ్డాడు.


                                           *    *    *    *


    సరీగ్గా ఇదే సమయంలో ముత్తప్ప ట్రావెలర్స్ బంగ్లావెనుక భాగానికి చేరుకున్నాడు. బంగ్లా వెనుక భాగమంతా పొదలతో నిండి నిశ్శబ్దంగా ఉంది. మెల్లగా, పాములా శబ్దం రాకుండా పొద వంగకుండా, కదలకుండా ముందుకి పాకటంలో ముత్తప్ప బహు నేర్పరి. బంగ్లా పైభాగంలో వెలుగుతున్న లైట్ కాంతి అస్పష్టంగా ఆ పొదలపై పడుతోంది.
    నెమ్మది....నెమ్మదిగా ప్రహరీగోడకు దగ్గరయ్యాడు.
    మరో అడుగు వేయబోతుండగా కాళ్ళకు ఏదో తగిలి ఆగిపోయాడు. ఒక్క క్షణం ఆగి ముందున్న పొదని పాయగా విడదీసి చూశాడు.
    తిని పడేసిన విస్తరాకు....
    ఇంకొంచెం ముందుకు కదిలాడు.
    మరికొన్ని విస్తరాకులు....ఇంకొంచెం దూరంలో గుట్టలాగా పడ్డ విస్తరాకులు....ముత్తప్పలో అనుమానం పొడచూపింది. చుట్టుపక్కల పరీక్షగా చూశాడు. లెక్కలేనన్ని విస్తరాకులు గుట్టలుగా పడి ఉన్నాయి.
    ముందుగా వంగి ఒక విస్తరాకుని చేతుల్లోకి తీసుకొని వాసన చూశాడు.
    అందులో వదిలేసిన ఆహార పదార్థాలు చద్దివాసన రావటంలేదు.
    అంతే....ముత్తప్ప నిటారుగా నిల్చుండిపోయాడు. కొన్నివందలమంది పోలీసులు బంగ్లాలో మకాంచేసి ఉన్నారనే విషయంలో అనుమానం లేదు.
    నిశ్శబ్దాన్ని ఆసరా చేసుకొని పంజా విసరటానికి సిద్ధంగా వున్న మేనీటర్ లా అనిపించింది ఆ బంగ్లా.
    యజమానరే....మేధావి....సందేహంలేదు....అనుకుంటూ వెనుదిరిగాడు.
    అతనికిప్పుడు మరో విషయం దృష్టికి వచ్చింది.
    అంతమంది పోలీసులు రావాలంటే దాదాపు ఐదారు వాహనాలన్నా కావాలి. అవెక్కడ దాచినట్లు....? వాటిని కనుగొని టైర్లు కోసిపడేస్తే....? కౌదల్లీలోనే మరికొద్దికాలం చిక్కుకుపోతారు. కానలా చేయటం వలన వాళ్ళు ఆ ప్రాంతంలోనే ఉండిపోతారు.
    ఆ ప్రాంతంలోనే ఆపరేషన్ ఆరంభించాలని యజమానరే నిర్ణయం....కనుక వాహనాలనేం చేయకూడదు.... అనే నిర్ణయానికొస్తూ ముత్తప్ప నడకలో వేగం పెంచాడు.


                         *    *    *    *


    ఎస్.ఐ.దినేష్ కౌదల్లీ ట్రావెలర్స్ బంగ్లాకి రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చేరుకున్నాడు.
    బంగ్లాలో వందలమంది పోలీసులున్నా కేవలం సైగలే చేసుకుంటున్నారు తప్ప మాట్లాడుకోవటం లేదు. వారి సిన్సియారిటీ, ముందుజాగ్రత్త దినేష్ కి బాగా నచ్చింది. ఆ పగలంతా ఏమీ తిని ఉండకపోవటంతో తనకు భోజనం పెట్టమని సైగ చేశాడు ఒక పోలీస్ కేసి చూస్తూ.
    అప్పటికే చాలామంది భోంచేశారు. మిగిలిన కొద్దిమంది దినేష్ తో కూర్చుని భోంచేశారు. అప్పుడు సమయం పదింబావు.
    వాళ్ళతోబాటు వచ్చిన సర్వెంట్ ఎంగిలి విస్తరాకుల్ని ఎత్తి బంగ్లా వెనక్కి తీసుకెళ్తుండగా దినేష్ కి అనుమానం వచ్చింది.

 Previous Page Next Page