భైరవి తెలివితేటలకు ఒక్కోసారి వీరూయే ఆశ్చర్యపోయిన సంఘటనలున్నాయి. ఎంతో వేగంతో పరిగెత్తే భైరవి తనని ఎవరన్నా అనుసరిస్తున్నారనేది కూడా గమనిస్తుంది. అనుమానం వస్తే తనను అనుసరించేవార్ని తప్పుదోవ పట్టించి గమ్యాన్ని చేరుకుంటుంది సురక్షితంగా.
వేలాయుధం మడచి వున్న కాగితాన్ని తెరిచాడు.
"పోలీసుల కదలిక_మహదేశ్వరా హిల్స్" అని రాసి వుంది ఆ కాగితంలో.
అదే విషయాన్ని అనుచరులకు చెప్పాడు వేలాయుధం.
"పోలీసుల కదలిక_అంటే మనం మకాం మార్చాలన్నమాట...." ఒక అనుచరుడు అన్నాడు.
"పోలీసుల కదలిక గురించి తెలియపరచి మనం జాగ్రత్తలో ఉండేందుకు పంపిన సమాచారమది. అంతేకాని మనల్ని మకాం మార్చమనికాదు. ప్రమాదం ఎదురయినా, ప్రాణహానే జరిగినా యజమానరే చెప్పిందే మనం చేయాలి. అందులో మనల్ని మకాం మార్చమని సూచనలేదు. కనుక తిరిగి మరో ఆజ్ఞ వచ్చేవరకు మనం ఇక్కడి నుంచి కదలకూడదు...." వేలాయుధం గంభీరంగా అన్నాడు.
క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి.
ఉండుండి చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి.
"మరయితే మన మనిషిని కౌదల్లి పంపి పచారి సామాన్లు తెప్పించుకోవటం మంచిది. మొన్న తెచ్చుకున్నవి అయిపోయాయి" అన్నాడు వంట వ్యవహారాలూ చూసే అనుచరుడు.
వేలాయుధం వారి మాటల్ని పట్టించుకోవటం లేదు.
ఆలోచిస్తున్నాడు....తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.
రెండు రోజుల క్రితం వరకు తాము, కరియా బృందం హౌగెనకల్ జలపాత ప్రాంతంలో మకాం చేయాలనే సూచనలు అందాయి. కౌదల్లి ప్రాంతానికి రావటమన్నది ఆఖరి నిముషంలో జరిగిన మార్పు. అయినా పోలీసులకెలా తెలిసింది....? ఖచ్చితంగా ఆ అవకాశంలేదు....మరి....?!
"మొన్ననే ఎక్కువ సరుకులు తెప్పించుకుని ఉంటే పోయేది. కరియా అదే చేస్తాడు...." అని ఒక అనుచరుడన్నాడు.
వేలాయుధం ఉలిక్కిపడ్డాడా మాటలకు.
విషయం క్రమంగా అతనికి అర్థం కాసాగింది.
* * * *
పాలార్ నది పరీవాహక ప్రాంతం....
కావేరీకి ఉపనది అయిన పాలార్, అడవులలో కురిసే వర్షాన్ని తనలో కలుపుకొని ఉపనదిగా ఉనికిని పొందింది.
ఇప్పుడా నది వొడ్డున చిన్నకొండలో వున్న గుహ అంతర్భాగంలో వేడిగా సంభాషణ నడుస్తోంది. అక్కడ దాదాపు పదిమందున్నారు.
"హొగెనెకల్ ఫాల్స్ ప్రాంతానికి వెళ్ళవలసిన పోలీసులు మలై మహదేశ్వరా హిల్స్ కి ఎందుకెళ్ళినట్లు....? అక్కడ మనవాళ్ళు మకాం చేసినట్లు అసలెలా తెలిసింది...." అని ఒకరంటే__
"కరియా బృందం మలై మహదేశ్వరా హిల్స్ అడవులలో, వేలాయుధం బృందం కౌదల్లీ అడవులలో మకాం చేసి వున్నాయి.
మనం ఆపరేషన్ ప్రారంభించవలసింది అక్కడినుంచే. ఇప్పుడెలా పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోతే తప్ప మనం మన ఆపరేషన్ శ్రీకారం చుట్టలేము. వాళ్ళన్నా వెళ్ళాలి లేదా మనమన్నా వార్ని తప్పుదోవ పట్టించాలి. ఎలా....?" అని మరొకరన్నారు.
అంతలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయాసాన్ని తగ్గించుకొనే ప్రయత్నంలో కొద్దిక్షణాలు ఉన్నచోటనే శిలాప్రతిమలా నిల్చుండిపోయాడు.
చీకటి గుహలోంచి భైరవీ నాలుక చాస్తూ బయటకువచ్చి అందరినీ ఒకసారి పరిశీలనగా చూసింది. "యజమానరే వస్తున్నారు" అన్నాడు. అందరూ అలర్టయిపోయారు. అడుగుల చప్పుడు వినిపిస్తూ క్రమంగా దగ్గరయింది.
"ఏం జరిగింది?" చీకట్లోంచి ఒక కంఠం గంభీరంగా వినిపించింది.
ఉరుము ఉరిమినట్లుగా, పిడుగు మీదపడినట్లుగా, భూమి కంపించినట్లుగా వున్న ఆ కంఠం ఆ గుహలో పర్చుకున్న మెత్తటి నిశ్శబ్దాన్ని బద్దలుచేసింది. ఆ కంఠం తాలూకూ గంభీరతకు అక్కడున్న అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుండిపోయారు.
నలభైవేల ఎకరాల కీకారణ్యాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకొని రెండు రాష్ట్రాల పోలీసు శాఖల్ని, అటవీశాఖ సిబ్బందిని నిద్రలేమికి గురిచేస్తున్న వీరూ తాలూకు కంఠం అది.
"మనవాళ్ళు మలై మహదేశ్వరా హిల్స్ లోని ఒక వర్తకుడి నుంచి వెచ్చారు తెచ్చుకున్నారు. పోలీసులు ఆ గ్రామంలో ఎందుకు రహస్యంగా మకాం చేశారో తెలీలేదు. మీనుంచి వర్తమానం రాని కారణంగా అక్కడే కరియా బృందం మరికొన్నిగంటలు ఉండవలసి వస్తుందని భావించి తిరిగి సరుకులకోసం ఆ వర్తకుడ్ని కలిసేందుకు బయలుదేరి వెళ్ళి గ్రామ సరిహద్దుల్లోనే ఆగిపోయారు. కారణం ఆ వ్యాపారస్తుడి ఇంటి పెరటి గోడకు ఎర్రరంగు గుడ్డవేలాడుతోంది. ఆ ప్రమాద సంకేతాన్ని చూసి మనవాళ్ళు వెనకనుంచి వెనక్కే తిరిగివచ్చారు...." పరిగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి అన్నాడు.
వీరు ఆలోచిస్తున్నాడు.
అతని ఆజ్ఞలకోసం మిగతావాళ్ళు ఎదురుచూస్తున్నారు.
కొందరు దేవదారు దివిటీలను వెలిగించి గుహకి ముందు భాగంలో ఉన్న చెట్ల మొదళ్ళకు కట్టివేశారు. విజబిలిటీ బెటర్....అడవంతా నిశ్శబ్దంగా వుంది.
"మనకొచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం పోలీసులు హొగెనకల్ ఫాల్స్ ప్రాంతానికి వెళ్ళాలి. కొళ్ళెగాల్ నుంచి కౌదల్లీకి_అక్కడినుంచి హొగెనకల్ ఫాల్స్ కి (నార్త్ ఈస్ట్ డైరెక్షన్) వెళ్ళకుండా కౌదల్లీలో వారికేదో అనుమానం వచ్చిఉండాలి...." అంటూ వీరు మాటలు చీకటిలోంచి వినిపించాయి.
"ఎవరో ఇన్ ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. ఆజ్ఞ ఇవ్వండి. వాళ్ళెవరయిందీ తెలుసుకొని అక్కడే పాతిపెట్టి వస్తాను...." ఒక అనుచరుడు పట్టరాని ఆగ్రహావేశాలతో అన్నాడు.
చీకట్లో చిన్నగా నవ్వు వినిపించింది.
"ఆ తొందరపాటే తగదు. మనకై మనం ఎవరిజోలికి వెళ్ళకూడదు. తప్పు మనవాళ్ళే చేశారనిపిస్తోంది" చీకట్లోంచి గంభీరంగా వినిపించింది.
వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
"కరియాతిండిబోతూ. ఆబగా ఎక్కువ సరుకులు తెప్పిస్తాడు. అన్ని సరుకులు మలై మహదేశ్వరా హిల్స్ లో దొరకవు. అందుకే ఆ వర్తకుడ్ని కలిసి ఎక్కువ డబ్బిచ్చి ఉంటారు. అతను కౌదల్లీ నుంచి ఎక్కువ సరుకులు తెచ్చి ఉంటాడు. సరీగ్గా ఆ సమయానికి అది పోలీసుల దృష్టిలో పడి ఉంటుంది. అనుమానం మీద హిల్స్ కి వెళ్ళి వర్తకుడ్ని ఆరాతీసి ఉంటారు. విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకే అక్కడే రహస్యంగా మకాంచేసి ఉంటారు...." అని తిరిగి వినిపించింది.
"మరయితే ఏం చేద్దాం యజమానరే....?"
"కౌదల్లీలో పోలీసుల కదలికలో మార్పు గోచరించిందా? అలాంటి వార్తలేమన్నా వచ్చాయా?"
"రాలేదు యజమానరే!"
"వేరే ప్రాంతంనుంచి పోలీసులు వచ్చారా?"
"రాలేదు"
"ఎలా చెప్పగలుగుతున్నావ్....?"
"కొద్దిసేపటిక్రితం మనకొచ్చిన వర్తమానం దాన్నే ధృవీకరిస్తోంది కనుక"
"కౌదల్లీ మొత్తం పరిశీలించే ఈ విషయం చెప్పటం జరిగిందా....?"
"అవును యాజమానరే....హోటళ్ళు, ట్రావెలర్స్ బంగ్లా చెక్ చేశాకే మనకా వర్తమానం అందించటం జరిగింది...."
"వాహనాలేమన్నా....?"
"ఒక్క పోలీస్ వాహనం టౌన్ లో కనిపించలేదు"
"పోలీసులు ప్రైవేట్ వాహనాల్లో రాకూడదని రూలేమన్నా ఉందా....?"
కొద్దిక్షనాలు నిశ్శబ్దం....