సడన్ గా లేచి అతన్ని అనుసరించాడు.
అప్పటికే ఆ సర్వెంట్ ఎంగిలి ఆకుల్ని ప్రహరీ గోడపై నుంచి అడవివైపుకి విసిరి వెనుదిరిగాడు....
దినేష్ వడివడిగా ప్రహరీ గోడవద్దకు వెళ్ళి ఒక చెక్క సాయంతో గోడపైకి పాకి ఆవలివైపుకి దృష్టిని సారించాడు.
వందలాది విస్తరాకులు గుట్టలుగా పడి ఉన్నాయి. తన సిబ్బంది తెలివితక్కువ తనానికి ఒక్కక్షణం తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఆ ఆకుల్ని వీరూ అనుచరులు చూస్తే విషయాన్ని పసిగట్టేస్తారు. ఎంతమంది పోలీసులు ఆ బంగ్లాలో మకాం చేసింది ఊహించగలరు. ఎంత జాగ్రత్త తీసుకున్నా, ఒక్కోసారి తన డిపార్టుమెంట్ వారివల్లే అది దెబ్బతినిపోతోంది.
గోడ దిగి నిస్పృహగా తల విదిలించాడు. వడివడిగా బంగ్లా ముందుకొచ్చి ప్రహరీగోడని చుట్టివేసి బంగ్లా వెనక్కి వెళ్ళి బ్యాటరీలైటు సహాయంతో పొదల్ని పరీక్షించాడు.
అక్కడక్కడా కొన్ని మొక్కలు వంగిపోయి కనిపించాయి. మరికొంచెం అడవివైపుకి వెళ్ళాడు. తన అనుమానం నిజమేననిపించింది. అక్కడ తడినేలపై ఏవో గుర్తులు....వంగి పరీక్షగా చూచాడు. అవి కాలి గుర్తులుకావు. ఏవైనా జంతువులు తినేసిన ఎముకల వాసనకు అటువైపొచ్చాయా....? అని ఆలోచిస్తుండగానే తట్టిందతనికి. అవి చేతివేళ్ళ గుర్తులని....వెంటనే తన ఎడం అరచేతిని నేలపై ఉంచి బలంగా నొక్కి తీశాడు. ఎస్....అవే గుర్తులు....అరచేతులు నేలపై ఆనించి పాములా మనిషి ముందుకు పాకితే పడే గుర్తులు....వీరూని, అతని అనుచరుల్ని తక్కువ అంచనా వేయటం పెద్ద పొరపాటే....
నిస్పృహగా తల విదిలించి బంగ్లాలోకి వచ్చాడు. అవి ఖచ్చితంగా వీరూ అనుచరుడి చేతి గుర్తులే.... ప్రయత్నం వృధా అయిపోయింది.
ప్రభుత్వం వేలకు వేలు ఖర్చుపెడుతున్నా, సౌకర్యాలు కల్పిస్తున్నా, పోలీసుల మందభాగ్యతవలన తమ ఉనికిని తామే నేరస్థులకు తెలియజెప్పుకొని నీరుగారి పోవలసివస్తోంది.... దినేష్ తీవ్రమైన అసంతృప్తి, అసహనానికి గురయ్యాడు.
అంతలో అతని దగ్గరున్న వైర్ లెస్ సెట్ గరగరమంది. దినేష్ క్షణాల్లో తేరుకొని రెస్పాండ్ చేశాడు. వీరూ వేస్తున్న కొత్త ఎత్తుకి ఫలితమే ఆ వైర్ లెస్ మెసేజ్ అన్న విషయం దినేష్ తన బుర్రకి పదునుపెడితే తప్ప తెలిసే అవకాశం లేదు.
"సిల్విక్కర్ పాలాయం ప్రాంతంలో కదలిక....ఓవర్...."
"ఆధారం? ఓవర్" ఎస్.ఐ.దినేష్ ప్రశ్నించాడు.
"సాంబారు పొడి, మసాలా దినుసులు, పాతిక కేజీలు ఒక షాపులో ఒక గంట క్రితమే అమ్ముడయ్యాయి. వీరూ, అతని అనుచరులు సాంబారుని బాగా ఇష్టపడతారు. పండుగలు, పబ్బాలు, ఉత్సవాలు ఏవీ ప్రాంతంలో జరగబోవటం లేదు_ఓవర్."
"వెరీ గుడ్....మీ కదలికల్ని మెరుగుపరచండి....మేం బయలుదేరి వస్తున్నాం....ఓవర్."
మరో పది నిమిషాలకు ట్రావెలర్స్ బంగ్లాలో ఉన్న పోలీసు సిబ్బంది రామాపురం మీదుగా సిల్విక్కర్ పాలాయంకేసి సాగిపోయింది.
* * * *
కరియా బృందానికి, వేలాయుధం బృందానికి ఆపరేషన్ ఆరంభించమనే వార్త వీరు నుంచి వచ్చి చేరింది.
ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన కంప్యూటర్స్ లా ఆ రెండు బృందాలు యాభై యేళ్ళ వయస్సుదాటిన చందనం వృక్షాలని మార్క్ చేసి కట్ చేయటం ప్రారంభించాయి.
* * * *
కేంద్ర పర్యావరణ శాఖనుంచి రెడ్ ఫైల్ వచ్చిన మరుసటిరోజు రాత్రి టి.వీ. లోకల్ న్యూస్ లో ఆ వార్తకి ప్రాముఖ్యం ఇవ్వటం జరిగింది.
భారతదేశ అటవీశాఖ ప్రకృతి వనరుల వారసత్వ సంపదగా పరిగణించబడుతున్న, అతి విలువైన చందన వృక్ష సంపద హరించి పోవటం పట్ల కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనతకు, నిర్లక్ష్య వైఖరికి కేంద్రమంత్రి తన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన కోట్లాది ధనం స్మగ్లర్స్ పరం కావటం క్షమించరాని నేరంగా కేంద్రమంత్రి భావిస్తున్నారు. దీనిపట్ల ప్రతిస్పందించిన రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగాలు ఫారెస్ట్ స్మగ్లర్స్ ఆట కట్టించేందుకు సరికొత్త పథకాల రూపకల్పనకు సమాయత్తమవుతున్నారు....
ఆ రాత్రి టి.వీ.లో ఈ వార్తకి ముప్ఫై క్షణాల్ని కేటాయించటం, వార్తల చివరలలో తిరిగి సంక్షిప్తంగా చెప్పటం జరిగింది.
వార్తల్లో వీరూ పేరుని ప్రస్తావించటం జరగకపోయినా, లక్షలాది మంది వీరూ పేరుని గుర్తు తెచ్చుకొని, మూడు రాష్ట్రాల పోలీసు శాఖలకు అటవీశాఖ సిబ్బంది శక్తిసామర్థ్యాలకు ప్రశ్నకావటం అత్యద్భుతమైన విషయంగా భావించారు.
కొంతమంది ఉన్నతాధికారులు, రాజకీయ వర్గాలు ఆ విషయానికంత ప్రాముఖ్యత ఇవ్వటంపట్ల ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటం జరిగింది.
ఎందుకలా జరిగిందన్నది ఒకే ఒక వ్యక్తికి తప్ప మరెవరికి తెలీదు?!
* * * *
ఆ రాత్రి తొమ్మిది గంటలకు ముఖ్యమంత్రి నివాస భవనం ముందు హోం మినిస్టర్ రాఘవేంద్ర, డి.జి.పి.దేవదాసు, చీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ చంద్రశేఖర్ కార్లు వచ్చి ఆగాయి. అప్పటికే చీఫ్ సెక్రెటరీ, ఫారెస్ట్ మినిస్టర్ ముఖ్యమంత్రితో సమావేశమై ఉన్నారు.
"రండి....రండి....రాఘవేంద్రగారు, మీ పుణ్యమా అని సెంటర్ తో నేను అక్షింతలు వేయించుకుంటున్నాను. ఆఫ్ట్రాల్ ఒకే ఒక ఫారెస్టు స్మగ్లర్ ని పట్టుకోవటానికి మనకు శక్తి చాలటంలేదు. అంతేకదా....?" ముఖ్యమంత్రి ముఖం చిటపటలాడిపోతోంది.
రాఘవేంద్ర వెంటనే సమాధానం ఇవ్వలేకపోయాడు.
"మన నిర్వాకం టి.వీ. వార్తల్లో కూడా వచ్చింది. మన ప్రజల ముందు మనల్ని వెర్రిబాగులవాళ్ళని చేసే ప్రయత్నం బాగా జరిగింది.... ఇప్పుడిక మనం అది చేస్తాం_ఇది చేస్తాం_పట్టుకొని తీరతాం అనే ప్రగల్బాలు పలకాలి. అంతేగా? ఎవడండి వాడు....?" అందరి ముఖాల్లోకి చూస్తూ ప్రశ్నించాడు ముఖ్యమంత్రి.
కొద్ది క్షణాలు నిశ్శబ్దం అలుముకుంటూ గదిలో.
"సమర్దుడైనవాడ్ని ఫారెస్టు విభాగం ఎస్.పి.గా వేస్తున్నాం. సార్....త్వరలోనే అతడ్ని పట్టుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం...." డి.జి.పి.దేవదాసు తన తప్పును ఒప్పుకుంటున్న ధోరణిలో అన్నాడు.
"అవును సార్....ఈ రెండు మూడు రోజులుగా ఈ విషయాన్నే సీరియస్ గా తీసుకొని చర్చిస్తున్నాం...." అన్నాడు హోం మినిష్టర్ రాఘవేంద్ర.
"అదే విషయాన్ని సెంట్రల్ మినిష్టర్ కి తెలియజేయండి" అంటూ సి.ఎం. లేచి లోపలకు వెళ్ళిపోయాడు విసురుగా.
అక్కడున్న అందరూ ఒక్కసారి గుండెలనిండా ఊపిరి తీసుకొని లేచారు.
* * * *
మరుసటిరోజు ఉదయం పేపర్స్ లో ఆ వార్త ప్రముఖంగా వచ్చింది. బెంగుళూరు నగర ప్రజలు పేపర్స్ కోసం పరుగులుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధతని పోలీసు శాఖ, అటవీ శాఖ అసమర్ధతని, నిజాయితీని పేపర్స్ నిర్ద్వండంగా ఎండగట్టాయి.
ప్రజల అసంతృప్తి, అసహనం, ఆగ్రహం, వారి ఆలోచనా సరళినే మార్చివేస్తున్నాయి.
నేటి సినిమాల్లో లంచగొండి పోలీసుల్ని, ఎం.ఎల్.ఏ.ల్ని, ప్రభుత్వోద్యోగుల్ని, రౌడీ, గూండా, క్రిమినల్ అయిన యువకుడు హీరో రూపంలో వచ్చి తన్నుతుంటే ప్రేక్షకులు ఈలలు వేస్తారు, రెచ్చిపోతారు. ఆ సీన్స్ లో లీనమయిపోతారు. చివరకు తమని తాము ఆ పాత్రలో ఐడెంటిఫై చేసుకుంటారు.