Previous Page Next Page 
కళ్ళు పేజి 11


    "నా దృష్టిలో పేషెంట్సు అందరూ ముఖ్యులే."

 

    "మీ దృష్టిలో కాదు. సమాజం దృష్టిలో."

 

    "సమాజం దృష్టి గురించి నాకు తెలీదు."

 

    "పోనీ అలా అనుకున్నా- మీలో ఎన్ని ఉన్నత ఆశయాలున్నా ఎవరో కొందరు వ్యక్తిగత ప్రాముఖ్యత గలవారికే మీ వ్యక్తిగత ట్రీట్ మెంట్ లభిస్తోంది. మిగతావారిని మీ అసిస్టెంట్సే చూస్తున్నారు కదా."

 

    "మా అసిస్టెంట్సులో కూడా చాలా సమర్ధమైన వారున్నారు."

 

    "అది నిజమే కావచ్చు. ఈ వి.ఐ.పి. పరిధిలోంచి మీరు తప్పించుకోలేకపోతున్నారు కదా."

 

    డాక్టరు కృష్ణచైతన్య ఏమీ జవాబివ్వలేదు.

 

    "మీ హాస్పటల్లో ఈసారి కార్నియల్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ జరిగినప్పుడు దాన్ని గురించి పూర్తి వివరాలు- అంటే ఐ బాల్ ఎక్కడ్నించి వచ్చిందీ, అందులోని కార్నియా ఎవరికి అమర్చబడుతున్నదీ మాకు తెలియజెయ్యడానికి అవకాశముందా?"

 

    "ఉంది. కాని ఎక్కడో ఏదో జరిగిందని ఆ వివరాలన్నీ మీకందిస్తూ వుండటం మాకు అదనపు శ్రమ అవుతుంది."

 

    "ఆల్ రైట్. నేనే తెలుసుకుంటానులెండి. మీకు శ్రమఇచ్చినందుకు మన్నించండి. దేశంలోని ప్రఖ్యాతులయిన నేత్రవైద్యులుగా మీరంటే నాకెంతో గౌరవముందన్న సంగతి మరిచిపోకండి" అంటూ రంజిత కుర్చీలోంచి లేచింది.

 

    డాక్టర్ కృష్ణచైతన్య ఒక నిముషంబాటు నిశ్చలనంగా కూర్చున్నాడు. తర్వాత ఏదో ఆలోచన వచ్చినట్లు ముందుకు జరిగి బజర్ నొక్కాడు.


                                    *  *  *


    రంజిత మారుతీకారులో స్టీరింగ్ ముందు కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేసింది.

 

    ఎంత హాయిగా ఉన్ది౧ ఇంజన్ ఆడుతోన్న చప్పుడే లేదు.

 

    ఇప్పుడు మందాకిని దగ్గరకు వెళ్ళాలి. ఆమె దగ్గర్నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గేదర్ చెయ్యాలి.

 

    కారు అయిదారు ఫర్లాంగుల దూరం పోయి వుంటుంది. రంజిత ఈ కేసు గురించి ఆలోచిస్తూ యాంత్రికంగా డ్రయివ్ చేస్తోంది. మందాకిని ఇంటికి పోవాలంటే ఇంకా...

 

    వెనకనుంచి ఆమె మెడమీద చల్లగా తగిలింది.

 

    రంజిత ఒక్కసారిగా బ్రేక్ వేసింది కావాలని. అంత సున్నితమైన కారూ పెద్ద జర్క్ తో ఆగిపోయింది. ఒక్క క్షణమయినా ఆలస్యం చేయకుండా కారు ఆగుతూ వుండగానే డోర్ తీసుకుని బయటకు దూకింది. అంతటితో ఆగకుండా వెనక్కి జరిగి బ్యాక్ డోర్ గభాల్న ఓపెన్ చేసింది.

 

    అప్పటికే ఆలస్యమైపోయింది. అవతలి డోర్ ఓపెన్ చేసుకుని ఒక వ్యక్తి ఆమెకంటే వేగంగా క్రిందకు దిగిపోయాడు. రంజిత కారు చుట్టూ తిరిగి అవతలివైపుకు వెళ్ళింది.

 

    మూడడుగుల మరుగుజ్జు. అతని పరుగులో అంత వేగమెలావుందో తెలీదు. చాలాదూరం వెళ్ళిపోయి, ఓ క్లాత్ షాపు వెనగ్గా దూరి అదృశ్యమైపోయాడు.

 

    ఎవరతను అనుకుంటూ తిరిగి కారెక్కి స్టార్టు చేసింది.


                                   *  *  *


    "నా పేరు రంజిత" అని తనెవరో కూడా పరిచయం చేసుకుని మందాకిని కెదురుగా కూర్చుంది.

 

    మందాకిని సోఫాలో కూర్చుని వుంది. ముఖానికి బ్లాక్ గాగుల్స్ వున్నాయి. చాలా డార్క్ గా వుండటంవల్ల వెనకవున్న కళ్ళు గురించిన వైనమేదీ తెలియటం లేదు.

 

    "మీరు చాలా బాధలో వున్నారని తెలుసు. అయినా నా ఉద్యోగ ధర్మంగా కొన్ని ప్రశ్నలడగటానికి వచ్చాను" అంది రంజిత.

 

    "అడగండి" అంది మందాకిని. ఆమె గొంతు చాలా నిర్లిప్తంగా ఉంది.

 

    "దయవుంచి, ఏమీ దాచకుండా ఆ రోజేమి జరిగిందో చెప్పండి?"

 

    మందాకినికిప్పుడు దాచవలసిన అవసరంలేదు. భయపడే అవసరమంతకన్నా లేదు. అశ్వనీకుమార్ కూ, తనకూ వున్న సంబంధం, అతన్ని అవకాశమున్నప్పుడల్లా అతనింటికే వెళ్ళి కలుసుకుంటూ వుండటం, ఆ రాత్రికూడా అలాగే జరగటం, వర్షంలో అక్కడ్నుంచి బయల్దేరాక-

 

    కళ్ళు పెరికివెయ్యబడే వరకూ వివరంగా చెప్పింది.

 

    "అతన్ని మీరు బాగా చూశారు కదూ?"

 

    "చూశాను."

 

    "ఎలా ఉంటాడో వివరాలు చెప్పగలరా?"

 

    "ఇంచుమించు ఆరడుగుల పొడవుంటాడు. చాలా దృఢంగా, బలంగా వుంటాడు."

 

    "వయస్సు..."

 

    "ఇంచుమించు ఇరవై ఏడు, ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి. చాలా క్రూరంగా ఉంటాడు."

 

    "అంటే చాలా భయంకరంగా వుంటాడా?"

 

    "నా ఉద్దేశం భయంకరమైన రూపమని కాదు. ఒక రకంగా అందగాడే అని చెప్పవచ్చు. కాని అతని మొహంలో, ఆ కళ్ళలో క్రూరత్వముంది."

 

    "తన జీవితాన్ని అంధకారబంధురం చేసిన వ్యక్తిని గురించి 'అందగాడు' అని చెప్పటం ఆమెకు చాలా బాధాకరంగా వుంది. అసహ్యంగా కూడా వుంది. కాని వివరణకోసం చెప్పాల్సి వచ్చింది.

 

    "అతని గొంతు మీకు గుర్తువుందా?"

 

    "ఉందనుకుంటాను."

 

    "బాగా ఆలోచించి చెప్పండి. అతని గొంతు తిరిగి ఎప్పుడయినా వింటే గుర్తుపట్టగలరా?"

 

    సరిగ్గా చెప్పలేకుండా వున్నాను. అప్పుడు నేను షాక్ లో వున్నాను. బహుశా గుర్తుపట్టగలనేమో!"

 

    "అతను తీసుకెళ్ళిన ఇంటిని చూశారు కదూ?"

 

    "చూశాను."

 Previous Page Next Page