Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 11


    "ఉంచుకోవడమా?" అని ఆలోచించాడు విశ్వనాథరావు.

 

    అదేరోజుల్లో లలితమ్మకు జబ్బుచేసి మూడునెలలపాటు మంచంమీదనే వుండాల్సి వచ్చింది.

 

    అతను కనకవల్లిని దగ్గరకు చేరదీశాడు.

 

    ఈ విషయం రామనాథంగారికి తెలిసి మండిపడి "ఇహనుంచీ నీ మొహం నాకు చూపించకు" అని కేకలేశాడు.

 

    "అలాగే" అని విశ్వనాథరావు అన్నగారి దగ్గర్నుంచి శాశ్వతంగా విడిపోయాడు. వదినా-మరదళ్ల ఏడుపుల మధ్య.

 

    ఆ రాత్రి వేగంగా పోతూన్న బండిలో కనకవల్లి వొళ్ళో పడుకుని సగం మైకంలో "వల్లీ! నీకోసం ప్రపంచాన్ని వొదులుకునేటంతటి త్యాగబుద్ధి నాకు లేదు. అయినా అన్నని వదులుకున్నాను. పాపం కదూ!" అన్నాడు.

 

    "పోనీ నన్ను వదిలెయ్యండి" అన్నది కనకవల్లి.

 

    "వొదిలెయ్యొచ్చు. కాని నీ అందమన్నా, శరీరమన్నా నాకు తగని వ్యామోహం. అందుకని..."

 

    "వల్లీ! నీ భర్తతో ఎన్నేళ్ళు కాపురం చేశావ్?" అనడిగాడు కాసేపాగి.

 

    "రెండేళ్ళు."

 

    "అతనితో జీవితం ఇంతకన్నా బాగుండేదా?"

 

    ఆమె నిట్టూర్చి "ఎంతయినా మొగుడాయె" అంది.

 

    ఈ సత్యం అతడ్ని కదిలించింది.


                                         *  *  *


    తమ్ముడు మాంచి ఉద్యోగస్తుడైనాడు. పెళ్లి చేసుకున్నాడు. అతనెక్కడో వుంటాడు. తానెక్కడో వుంటాడు. ఎన్ని నెలలకో ఓసారిగాని కలుసుకోవటం పడదు.

 

    డబ్బు రెండుచేతులతో సంపాదిస్తున్నాడు. భార్యకు చీరెలూ, నగలు... జీవితం అట్టహాసంగా వుంది.

 

    లలితమ్మ భరించింది అతడిని. అలవాటుపడిపోయింది. అతడి తిట్లకూ, తన్నులకూ, ఇతరులతోటి ప్రణయకలాపాలకూ, మంచితనానికీ, నిర్దయకూ అన్నిటికీ అలవాటుపడిపోయింది.

 

    ఎత్తుపల్లాలతో, వెలుగునీడలతో, సుఖదుఃఖాలతో, శాంతి అశాంతులతో జీవితం ముందుకు పరుగెడుతోంది.


                                           4


    పది గంటలయింది. విశ్వనాథరావుగారు స్నానం అదీ ముగించి బజారులో పని వున్నదంటూ బయటకు వెళ్ళారు. లలితమ్మగారు వంట ఇంట్లో పనిచేస్తోంది.

 

    వంట వగయిరా, భోజనాలు అన్నీ క్రింది ఇంట్లోనే జరుగుతాయి. ఎవరయినా వస్తే కూర్చోటానికి డ్రాయింగ్ రూంకూడా క్రిందనే వుంది. మేడమీద యింట్లోని వారందరికీ విడివిడిగా ఎవరి గదులు వారికున్నాయి. స్నానానికీ, భోజనానికి, ఇలాంటి అవసరాలకు తప్ప మిగతావేళలంతా మేడమీదనే గడుపుతారు. విశ్వనాథంరావుగారయితే ఎంతో అవసరం వుంటేనే గాని క్రిందకు దిగరు.

 

    పెద్దకూతురు సుభద్ర, చిన్నకూతురు ఆశా మధ్య హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. సుభద్రకి ఇరవైమూడు ఏళ్ళుంటాయి. ఆమెది చామన ఛాయ. ఆమెకిప్పుడు నెలలు నిండాయి. జీవిత సారమంతా అనుభవించేసినట్లు ఆమె ముఖంలో విరక్తి, నిస్పృహ గోచరిస్తాయి.

 

    "లేడీ డాక్టరు ఏమన్నదక్కా?" అనడిగింది ఆశ.

 

    "ఇవాళో రేపో" అంది సుభద్ర. మాటల్లో ఉత్సాహం, అనుభూతి ఏమీలేవు.

 

    "హాస్పిటల్ లో చేరాల్సింది అక్కయ్యా" అన్నది ఆశ కొంచెం ఆలోచించి.

 

    "ఏం? నా ప్రాణానికి భయమా?"

 

    "అది కాదక్కయ్యా. మనం జాగ్రత్తగా వుండడం మంచిది కదూ?"

 

    సుభద్ర విరక్తిగా "ఆ! మనం జాగ్రత్త పడితే అన్నీ సమకూడతాయా ఏమిటి లెద్దూ! ఏదెలా జరగాలని వుందో అలాగే జరుగుతుంది" అన్నది.

 

    లలితమ్మగారు లోపల వంటచేస్తూ ఆలోచిస్తోంది. సాధారణంగా ఇంట్లోని వంట ఎప్పుడూ ఆమే చేస్తూంటుంది. ఆ మధ్య వంట్లో బాగోలేక వంటవాడ్ని పెట్టుకున్నారు, వాడి కథ అలా అయింది.

 

    లలితమ్మగారు ఆలోచిస్తోంది. తమ కుటుంబపరిస్థితి ఇంతమారినా తన పుట్టింటిస్థితి మాత్రం ఆనాటికీ ఈనాటికీ ఒకలాగే వుంది. తన అన్నదమ్ములలో ఒక్కడూ ప్రయోజకుడు కాలేదు. వాళ్ళ భార్యా బిడ్డలు ఎప్పుడూ అర్థాకలితోనే గడుపుతుంటారు. చీటికి మాటికి ఏ అన్నయ్యో తమ్ముడో తనదగ్గరకు పరుగెత్తుకు వస్తారు సాయం చెయ్యమంటూ. తమకు ఎంత అయినవాళ్ళు గాకపోయినా తను విడిగా ఏమి సాయం చెయ్యగలుగుతుంది? తనవాళ్ళు వచ్చి తమ ఇంట్లో ఎంతకాలం తిన్నా ఆయనకు అభ్యంతరంలేదు. కాని ధన సహాయం చెయ్యమంటేమాత్రం ఆయనకు ఇష్టంవుండదు. తను అడిగితే ఆయనకు కోపంకూడా వస్తుంది. భర్తకు తెలియకుండా తాను ఎంతని ఎత్తిపోయగలదు? అప్పటికీ తన శాయశక్తులా తను దాచుకున్నదీ, రామాన్ని అడిగీ వాళ్ళకు ఇస్తూనే వుంటుంది. అయినా వాళ్ళకు తృప్తిలేదు. తను కలిమి గలిగి వుండికూడా సాయపడటం లేదని దెప్పిపోస్తూ వుంటారు.

 

    స్త్రీ జీవితం చిత్రమైనది. పెళ్ళయ్యాక మొదట కొన్ని సంవత్సరాలుమాత్రం పుట్టిల్లూ, అక్కడకు పోవటం రావటం జరుగుతూంటుంది. క్రమేపీ ఆమె తన పెనిమిటికీ, పిల్లలకూ అంకితమైపోయి పుట్టింటిని ఓ స్మృతిగా తీసుకొంటుంది. నలభయి పైబడిన ప్రతి ఆడదానికి పుట్టిల్లు అప్పుడప్పుడూ జ్ఞాపకంవచ్చే దూరపు చిహ్నం మాత్రమే.

 

    ఇంట్లోంచి బయటకు కాలుపెట్టని ఆడదాని జీవితంలో కూడా ఎన్ని పరిణామాలో!

 

    ఆమెకు హఠాత్తుగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

 

    ఇంతలో అక్కడికి తల్లికేమయినా సాయం చేద్దామని ఆశ వచ్చింది. అలికిడి విని లలితమ్మగారు పమిటచెంగుతో చప్పున కళ్ళు తుడుచుకుంది.

 

    "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అనడిగింది ఆశ ఆశ్చర్యంగా.

 

    ఆమె ముఖం ప్రక్కకి త్రిప్పుకుని "ఏడవటం కాదమ్మా కంట్లోకి పొగ పోయింది" అన్నది.

 Previous Page Next Page