5
ఏ హాస్పిటల్లో ముఫ్ఫై సంవత్సరాలు నర్సుగా పనిచేసిందో, ఆ హాస్పిటల్ బెడ్ మీద వుంది నర్సు ఆదిలక్ష్మి.
తన అంతిమ క్షణాలు దగ్గరకొచ్చాయని ఆమెకు తెలిసిపోయింది. "బాబూ!" అంది. కొడుకు భాస్కరమూర్తి దగ్గరకొచ్చాడు.
"నీకో విషయం చెప్పాలిరా ఇది నా మనసుని చాలాకాలంగా తొలిచేస్తుంది. చావబోయే ముందు నీకయినా చెపితేగాని మనశ్శాంతి వుండదు".
"ఏమిటమ్మా?"
ఆమె చెప్పటం ప్రారంభించింది. పదహారు సంవత్సరాల క్రితం తను ఏం చేసిందీ, ఇద్దరు పిల్లల జీవితాలు ఎలా మార్చిందీ వివరంగా చెప్పింది. తొడమీద వేసిన గుర్తు చెప్పింది.
"దేవుడు నా మీద కసి తీర్చుకున్నాడురా నేనే వెళ్ళి స్వయంగా అందర్నీ కలుపుదామనుకున్నాను కానీ నన్నే తీసుకెళ్ళిపోతున్నాడు. నువ్వు వెళ్ళి అసలు విషయం చెపితేగానీ, పైలోకాన వున్న నాకు ఆత్మశాంతి వుండదు."
"ఎవరమ్మా వాళ్ళు?" భాస్కరమూర్తి అడిగాడు.
"ఒకామె పేరు నిర్మల. వాళ్ళ అడ్రసు బంజారాహిల్స్ లో సరిగ్గానే వుంది. ఆ అమ్మాయి 'సాహితి'ని కూడా నేను చూశాను. రెండో తల్లి పేరు అరుంధతి. ఈవిడ అడ్రసే దొరకలేదురా. పాత ఇల్లు మారినట్టున్నారు. ఎప్పుడో పదహారు సంవత్సరాల క్రితం సంగతి కదా! వాళ్ళమ్మాయికి 'పావని' అని పేరు పెట్టినట్టు గుర్తు. కాస్త కనుక్కుని ఎవరి పిల్లల్ని వాళ్ళకి చేర్చరా! నేను చేసిన వెధవపనికి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడుతున్నాననీ- నన్ను క్షమించమనీ కోరు."
"అలాగేనమ్మా! నువ్విక మాట్లాడకు. ఏమీ ఆలోచించకు, విశ్రాంతి తీసుకో."
ఆదిలక్ష్మి కళ్ళు మూసుకుంది.
ఆ తర్వాత గంటకి ఆమె ప్రాణం పోయింది.
* * *
చెప్పిన సమయానికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు పెళ్ళివాళ్ళు. అప్పటికి పావని మేకప్ మూడోసారి చేసుకుంది.
బయట హాల్లో వచ్చిన నలుగుర్నీ మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు విశ్వపతి. చెల్లి కృష్ణజ అందరికీ మంచినీళ్ళందించింది. అరుంధతి వాళ్ళ దగ్గర కూర్చుని కుశల ప్రశ్నలు వేస్తోంది.
కొంత కంట్రోలు చేసుకున్నా పావనికి చిరుచెమటలు పడుతున్నాయి రుమాలుతో మొహం అద్దుకుంది.
"అక్కా!" లోపలికి వచ్చింది కృష్ణజ. "పెళ్ళికొడుకు ఏమంత బాగాలేడు. అసలు వాళ్ళెవరూ బాగాలేరు" అంది దిగులుగా.
స్వప్నలోకపు మొదటి మబ్బుతెర విడిపోతూ తొలి జీవితసత్యాన్ని బహిర్గతం చేసింది.
"పోనీలేవే. అందంగా లేకపోయినా మంచి గుణముంటే చాలు" అంది.
ఆమె కళ్ళముందు ఓ దృశ్యం కదలాడింది.
"నేను అందంగా లేను కానీ నీ కోసం ప్రాణమైనా ఇస్తాను. నిన్ను నా కంటి రెప్పల మాటున అపురూపంగా, పదిలంగా దాచుకుంటాను" అని ఆర్ద్రత నిండిన స్వరంతో వేడుకుంటున్నాడో యువకుడు.
బయట హాల్లో దృశ్యం మరోలా వుంది.
"కతికితే అతకదు" అన్న నానుడి ఎప్పుడూ వినలేదో లేక సంబంధం కుదురుతుందో లేదో తెలియదు కాబట్టి అవకాశం వదులుకోదల్చుకోలేదో గాని, పెట్టిన వస్తువులన్నీ తినేశారు వాళ్ళు. కాఫీలు కూడా అయ్యాక "ఇక అమ్మాయిని పిలవండి" అన్నాడు గృహ యజమాని దర్పంగా.
"భయపడకుండా సమాధానం చెప్పాలి పావనీ! తల వంచుకునే కూర్చోవాలి" వగైరా పరీక్షా పాఠాలు చివరిసారిగా బోధిస్తూ బయటకు తీసుకొచ్చింది సుబ్బారావు భార్య.
ఆ నాలుగడుగులు వేస్తున్నంత సేపూ పావని గుండెల్లో అలజడి అలనాడు అగ్నిప్రవేశం చేయబోయేముందు సీతాదేవి నిప్పుల్లోంచి నడుస్తున్నట్లే ఫీలయింది. ఆరు జతల కళ్ళు ఆమెను కిందనుంచి పైవరకు నిశితంగా పరిశీలించాయి. ఆడపిల్లగా పుట్టడం తను చేసిన పెద్ద నేరం అన్నట్లుగా, చేసిన పొరపాటుకి శిక్ష విధించమని వేడుకుంటున్నట్లుగా తల దించుకుని కూర్చుంది పావని.
"నీ పేరు?" అంది ఓ స్త్రీకి సంబంధించిన స్వరమేనా అన్నంత కర్కశంగా ఉందా స్వరం.
"పావని"
"ఏం చదువుకున్నావ్?"
"ఇంటర్ పాసయ్యానండి."
"ఎక్కడా ఆ మగపిల్లల కాలేజీలోనా?" ఇది పురుష స్వరం. పెళ్ళికొడుకు తండ్రి కాబోలు.
"కాదండీ ఆడపిల్లల కాలేజీలోనే."
"రక్షించావు" అదేదో పెద్ద జోకయినట్లు అందరూ పెద్దగా నవ్వారు.
"ఊఁ. వంటా వార్పూ వచ్చునా? కాస్త తలెత్తి సమాధానం చెప్పమ్మా!" పెళ్ళికొడుకు పెద్దక్క గారి ఆజ్ఞ.
పావని మెల్లగా తల పైకెత్తింది. "వచ్చునండీ అన్నీ చేస్తాను."
"అవునులే సుబ్బారావుగారు చెప్పారు. మీ అమ్మ రోగిష్టి కదా తప్పదుమరి."
పావని మనసు చివుక్కుమంది. పన్నెండేళ్ళుగా తల్లి మంచంలో ఉన్నమాట నిజమేగాని ఆమె రోగిష్టి అని ఎప్పుడూ ఎవరికీ తట్టలేదు. ఆమె క్రీగంట వాళ్ళవైపు చూసింది. అరడజను శాల్తీలున్నాయి. స్వరంలోనే కాదు. రూపంలోనూ ఎక్కడా సంస్కారం కనిపించడం లేదు.
"లేచి నిలబడమ్మా ఓసారి" అన్న మాటలకి పావని తండ్రి వైపు చూసింది. లేవమన్నట్లు కళ్ళతోనే సైగ చేశాడాయన.
ఆమె లేచింది నెమ్మదిగా.
"కొంచెం అలా నడిచి చూపించు." పావని తలమీద దేనితోనో కొట్టినట్టయింది.
ఆ షాక్ లోనే నాలుగడుగులు వేసింది.
"ఆ జడ సొంతమేనా సవరమా?"
"సొంతమేనండి. చాలా మంచి జుట్టు మా పావనిది" పక్క నుంచి అరుంధతి సమాధానం చెప్పింది.
"మాదీ ఒకప్పుడు మంచి జుట్టేలెండి. పెళ్ళయి పిల్లలు పుట్టాక వుంటుందేమిటీ?"
అవును అందం, రూపం, ఆరోగ్యం, వయసు, డబ్బు ఏదీ శాశ్వతం కాదు కానీ పెళ్ళి కావలసిన అమ్మాయికి మాత్రం వీటిలో ఏది లేకపోయినా కష్టమే.
అయితే ఆ పెళ్ళి చూపుల తతంగం చాలామంది అమ్మాయిలకు అస్వభావికంగా ఏమీ అనిపించదు. ఇది ఇలాగే వుంటుంది అన్నభావం మనసులో స్థిరపడిపోయి వుంటుంది.
పెళ్ళి కొడుకు అక్కలు, తమపెళ్ళి చూపుల అనుభవాలను గుర్తు తెచ్చుకుంటూ ప్రశ్నలు వేస్తున్నారు. పావని సమాధానాలు చెపుతోంది.
"అబ్బాయి ఏమీ అడగలేదు. అడగమనండి" అన్నాడు సుబ్బారావు మధ్యవర్తి హోదాలో.
"నేను అడగడానికేముంది? అన్నీ మావాళ్ళు వంతులు వేసుకుని మరీ అడిగేశారుగా" అన్నాడతను నవ్వుతూ.
"ఇక నువ్వు లోపలకు వెళ్ళమ్మా" అనుమతి లభించగానే గదిలోకి వెళ్ళిపోయింది పావని.
"నాలుగురోజుల్లో కబురు చేస్తాం" అని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు.
సుబ్బారావు వెళ్ళి టాక్సీ ఛార్జీ ఇచ్చి పంపించి వచ్చాడు.
"వాళ్ళకు అమ్మాయి బాగా నచ్చిందనుకుంటాను విశ్వపతీ! ఒప్పుకునేలాగే మాట్లాడారు" అన్నాడు మధ్యవర్తి తిరిగి రాగానే.
"కాని అబ్బాయి అసలు బాగాలేడు" అంది అరుంధతి దిగులుగా.
"అలా అనుకుంటే ఎలా వదినగారూ! అబ్బాయి నలుపైనా బుద్దిమంతుడు. ఒక్కచెడు అలవాటు కూడా లేదు. అందంగా ఉన్న అమ్మాయి కావాలనుకున్నాడట. అందువల్ల బహుశా కట్నం అదీ ఎక్కువ అడక్కుండా ఒప్పిస్తాడనుకుంటాను. సంవత్సరంగా చూస్తున్నాం. ఆ బడిపంతులు ఏమిస్తాడులే అన్నట్లే కనీసం ఒక్కళ్ళయినా పెళ్ళిచూపులకి రాలేదు. అలాంటప్పుడు ఆఫీసరు కాబోయే యీ అబ్బాయి నయంగదూ!" అన్నాడు సుబ్బారావు.
"మరీ ఆ ఆడపడుచులు ఏమిటండీ అసలు సంస్కారం లేదు" అంది సుబ్బారావు భార్య.
"అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో వుంటాడు. వీళ్ళంతా ఎప్పుడయినా నాలుగు రోజులుండటానికి వస్తారు తప్ప, శాశ్వతంగా వుండరు. అందరూ కలిగిన కుటుంబాల్లో వాళ్ళే. ఆ విషయం పెద్దగా పట్టించుకోనవసరం లేదు" అన్నాడు సుబ్బారావు. అప్పుడే ఆ సంబంధం కుదిరిపోయినట్లే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు.
6
పావనికి సుందరి రాయునది-