Previous Page Next Page 
అష్టావక్ర పేజి 11


    అంతలో గుట్ట క్రిందుగా రోడ్డుమీద డాక్టర్ రంగప్రసాద్ వస్తూ కనిపించాడు. అతడా ఊరు వచ్చినప్పటి నుంచీ రంగప్రసాద్ తెలుసు. ఆ ఊరిలో చదువుకున్నవాళ్ళు తక్కువ.

    తను కూడా మెట్లు దిగి క్రిందికి వెళ్ళాడు.

    ఇద్దరూ కలిసి నడవసాగారు. ఎవరూ మాట్లాడుకోలేదు.

    "ఈ రోజు అదోలా వున్నారేం" సిద్ధార్థ అడిగాడు. రంగప్రసాద్ తలతిప్పి "ఏం లేదే" అన్నాడు.

    "నిన్నా మొన్నా కనపడలేదు".

    "టౌన్ కి వెళ్ళాను".

    సిద్ధార్థ మాట్లాడలేదు.

    "మొన్న రాత్రి ఒక మర్డర్ జరిగింది".

    "అవును. నిన్న ఊరంతా పోలీసులేగా...."

    రంగప్రసాద్ దాని గురించి అంత పట్టించుకోకుండా "ఈ రోజు ప్రొద్దున్న పోస్ట్ మార్టమ్ జరిగింది. అక్కణ్ణుంచే వస్తున్నాను. అసలా దృశ్యం చూస్తేనే మనసంతా వికలమైపోయింది" అన్నాడు.

    "ఏం జరిగింది రంగప్రసాద్?"

    "ఆవిడ నిండు గర్భిణీ. అందులో చెప్పుకోవలసింది ఏమీ లేదు. డాక్టర్ గా అలాటివి చాలా చూసేను. కానీ ఆమె గర్భంలో శిశువు- మైగాడ్- హారిబుల్ గా వుంది" వర్ణించటానికి ఇష్టం లేనట్టు అక్కడితో ఆపు చేశాడు.

    "అందులో కూడా చెప్పుకోవలసిందేమీ లేదే! నేను జెనెటిక్స్ గురించి ఎక్కువ చదువుకోలేదు. కానీ డౌన్స్ సిండ్రోమ్, క్రోమోజోమ్స్ లో వుండే వైపరీత్యాలూ, ఇవన్నీ మామూలే కదా-"

    "వైపరీత్యం" అంటూ నవ్వటానికి ప్రయత్నించాడు రంగప్రసాద్. కానీ నవ్వు రాలేదు.

    "మేమూ అలాగే అనుకుని సంతృప్తిపడటానికి ప్రయత్నించాం సిద్ధార్థా! కానీ అదంత తోసి పడెయ్యవలసిన విషయం కాదు-" అన్నాడు.

    "ఏం జరిగింది ప్రసాద్"

    "మనిషి చనిపోయిన కొంచెం సేపటికి రిగర్ మార్టిస్ ప్రారంభం అవుతుంది. శరీరం చల్లబడుతుంది. గోళ్ళు నల్లబడతాయి. అసలీ మార్పుల వల్లనే మనిషి చనిపోయి ఎంతసేపయిందో తెలుసుకోగలుగుతారు డాక్టర్లూ, పోలీసులూ-"

    "మొన్నరాత్రి చనిపోయిన మనిషి శరీరాన్ని ఈ రోజు ప్రొద్దున్నే పోస్ట్ మార్టమ్ చేశాం. ఈ ముప్పై ఆరు గంటల్లో శవం మామూలుగా కాలంతో పాటే మార్పులు చెందాలి. చెందింది కూడా! కానీ లోపలున్న శిశువు శరీరం మాత్రం అప్పుడే మరణించినట్టు కాస్త వెచ్చగా వుంది!"

    సిద్ధార్థ అదిరిపడి డాక్టర్ వైపు నమ్మలేనట్టు చూశాడు. రంగప్రసాద్ చూపు ఎక్కడో వుంది. తనలో తనే అనుకున్నట్టు అన్నాడు- "శిశువు మరణించి గంట- రెండు గంటలకన్నా ఆ లెక్కన ఎక్కువ అవకూడదు!.... అంటే తల్లి మరణించిన ముప్పై గంటలకు పైగా గర్భంలో శిశువు బ్రతికే వుందా? ఎలాగైనా సరే ఈ భూమ్మీదకు రావాలనీ- ఈ భూమి తాలూకు గాలి పీల్చాలని ఆ కడుపు లోపలనే ఇన్ని గంటలపాటు విశ్వప్రయత్నం చేస్తూ వుందా?"

    "ఇంపాజిబుల్...."

    రంగప్రసాద్ నెమ్మదిగా చూపు అతడిమీద నిలిపాడు. "ఇంపాజిబుల్..... అవును. ఇంపాజిబులే. ఇప్పుడు ఏ విధంగానూ దాన్ని మేము నిరూపించలేం. మేముగానీ అదే పోస్ట్ మార్టమ్ కొన్ని గంటల ముందు చేసి వుంటే ఏమై వుండేదో.... బహుశా సైన్సు ప్రపంచపు దృష్టి అంతా కృష్ణాపురం మీద పడి వుండేదేమో..."

    సిద్ధార్థ నవ్వి "ఎక్కడో ఏదో పొరపాటు జరిగి వుంటుంది" అన్నాడు. రంగప్రసాద్ తన ఆలోచనలో తను వున్నాడు.

    అవును. ఎక్కడో పొరపాటు జరిగి వుంటుంది. లేకపోతే ఏ అయిదువేల కేసుల్లోనో ఒకసారి రావలసిన జెనెటిక్ డిసార్డర్ కృష్ణాపురం లాటి చిన్న ఊళ్ళో రెండు నెలల పరిధిలో రెండు రావటం ఏమిటి?


                         9


    కళ్యాణ మంటపం కళకళలాడుతూ వుంది.

    పట్టుచీర కట్టుకున్న కేదారగౌరి చీరకే నెమ్మదితనాన్ని ఆపాదించింది. చెంపల మీద జీరాడే లైటు వెలుతురు చెంప తాలూకు నిర్మలత్వాన్ని తనూ సంతరించుకుని తెల్లగా కలిసిపోయింది.

    ఆమె తల వంచుకుని కూర్చుని వుంది.

    చాలాకాలం తరువాత, ఆ రోజు ఆమె మనసులో విషాద వీచిక సన్నగా కదలాడుతూంది. తల్లి, అన్నయ్య లేకపోవటం.... ఒకరు లోకం నుంచీ, ఒకరు ఇంటినుంచీ వెళ్ళిపోయారు. కనీసం అన్నయ్య అయినా, ఎక్కడున్నా ఈ విషయం తెలిసి వస్తాడనుకుంది. చివరివరకూ ఆమె కళ్ళు వెతికినయ్.... రాలేదు నిభాయించుకుంది.

    పెళ్ళిపీటలు దగ్గిరకు తీసుకొస్తుంటే మాత్రం ఆమెకు దుఃఖం వచ్చింది. నడిచేటప్పుడు చేతిని మోకాలి దగ్గిర పెట్టుకుని ఆన్చుతూ నడవకపోతే సాధ్యంకాదు. పెళ్ళికూతుర్ని తీసుకొచ్చేటప్పుడు, దగ్గిరుండి నడిపించుకుంటూ రావటం ఆనవాయితీ. ఇద్దరు ముత్తయిదువులు చెరోభుజం పట్టుకుని తీసుకొచ్చారు. ఆమెకి కాలిమీద చెయ్యి వేసుకోవటానికి వీల్లేకపోయింది. అప్పుడు గుర్తొచ్చింది అమ్మ! అడుగుతీసి అడుగు వేస్తుంటే మోకాలి దగ్గిర కలుక్కుమని, అమ్మే వుంటే కూతురు సంగతి తెలుసు కాబట్టి దగ్గిరుండి తీసుకొచ్చేది కదా అన్న ఆలోచన వచ్చి "అమ్మా! అమ్మా" అని మనసులోనే బాధపడింది.

    వధూవరుల మధ్య తెర తీసినపుడు ఆమె కళ్ళెత్తి చూసింది. అదే సమయానికి సిద్ధార్థ కూడా చూశాడు.

    అప్పుడర్ధమైంది ఆమెకి. తనకి సిద్ధార్థ ఎందుకు నచ్చాడో! మ్యాస్కులైనిటీ.... ఇది శరీరానికి సంబంధించినదీ కాదు. అతడు నిస్సందేహంగా అందగాడు కాడు కానీ అతడి కళ్ళల్లో స్త్రీకి కావాల్సిన ఓదార్పు వుంది. అదే నిజమైన మ్యాస్కులైనిటీ.... నడుస్తూ వుండగా దూరం నుంచి బాధ గమనించి, ఓదార్పు నిచ్చిన కళ్ళు.... అమ్మాయికి అంత కన్నా ఏం కావాలి?

    ఆమె కూడా కళ్ళతోనే నవ్వింది.

    "ఏమిటర్రా అప్పుడే నవ్వేసుకుంటున్నారు?"

    ఇద్దరూ ఉలిక్కిపడి అటు చూసేరు.... భవానీశంకరం! చప్పున పెళ్ళికూతురు సిగ్గు ముసుగును ఆసరా అడిగింది. పెళ్ళికొడుకు అక్షింతలు అందుకునే నెపంమీద వంగాడు. శ్రావ్యంగా సన్నాయి మ్రోగింది.

    ఈ లోపులో పురోహితుడు మంగళసూత్రాన్ని జనం మధ్యకి పంపాడు. ఒక్కొక్కరే దాన్ని తాకుతున్నారు. ఏదైనా కీడువుంటే పోతుందని నమ్మిక. అంతకుముందే కేదారగౌరి తండ్రిని అడిగింది- "ఇంతపెద్ద కమ్యూనిస్టు నంటావు- ఈ పెళ్ళీ అక్షింతలూ ఇవేమిటి నాన్నా" అని.

    "ఊరుకో అమ్మా! ప్రశ్న అడిగి నన్ను ఇరుకున బెట్టకు" ఇబ్బందిగా అన్నాడు. ఆమె నవ్వింది. "నీలాటి పెద్దవాళ్ళుండబట్టే కుర్రవాల్లకి కమ్యూనిజంలో నమ్మకం పోతూంది నాన్నా".

    "కమ్యూనిజమంటే దేముడున్నాడా లేడా అన్నదొక్కటే కాదమ్మా" అని తనను తాను సమర్ధించుకోబోయాడు. కానీ ఆమె దానికీ వప్పుకోలేదు.

    సూత్రధారణ ఇంకో పది నిముషాల్లో జరుగుతుందనగా రాకేష్ వచ్చి మండపం దగ్గిరగా మొదటి వరుసలో కూర్చున్నాడు. పురోహితుడు మంగళసూత్రాన్ని తీసుకుని ఒక్కొక్కరి దగ్గిరకీ రాసాగాడు. ఒక్కొక్కరే దాన్ని తాకసాగారు. అలా ముట్టుకుంటే దుష్టగ్రహం ఏదైనా వుంటే పోతుందని నమ్మకం. అది ఆచారం.

    పురోహితుడు ఇంకా కొంచెం దూరంలో వున్నాడనగానే రాకేష్ వాచీ సందులోంచి చిన్న గుండుసూది తీశాడు.కుడిచేతి చూపుడు వేలుకి దాన్ని గుచ్చుకున్నాడు. రక్తం జివ్వున పైకి జిమ్మింది. చుక్కలా తయారైంది. ఈ లోపులో పురోహితుడు దగ్గిరకు వచ్చాడు.

    రాకేష్ ప్రక్కన కూర్చున్నది ఫామిలీ ఫ్రెండే.... ముసలాయన. రాకేష్ దాన్ని ముట్టుకోబోతూంటే "పెళ్ళికాని వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు నాయనా" అని జోకు వేశాడు. రాకేష్ కూడా నవ్వుతూ దాన్ని అంటుకుని వదిలేశాడు. పురోహితుడు ముందుకు కదిలాడు.

    అతడి చేతి రక్తపు చుక్క సూత్రాలకి అంటుకున్నది.

    విషాచి రహస్య పత్రపు రెండో సూచన పూర్తి అయింది.

    అష్టావక్రుడి ఆగమనానికి మూడో అంకం సిద్ధం అయింది.

    అప్పటినుంచి సూత్రధారణ సమయం వరకూ రాకేష్ ముళ్ళమీద కూర్చున్నట్లే కూర్చున్నాడు. వరుడు మంగళసూత్రం కట్టగానే తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు. లేచి అక్షింతలు జల్లాడు.

    జల్లి వెనుదిరిగాడు.

    డబ్బున్న పెద్దవాళ్ళ పెళ్ళిలో సూత్రధారణ అయిపోయాక ఎవరూ వుండరు. హడావుడిగా వెళ్ళిపోతారు. ద్వారం దగ్గిర నిలబడి సాగనంపే బాధ్యత తనదే....

    అందువల్ల తను చేయవలసిన పనులు పూర్తయినట్టు అతడు ద్వారం దగ్గిరకి నడవబోయాడు. అక్షింతలు వేసినవాళ్ళు కొంతమంది నిలబడివున్నారు, కొంతమంది కూర్చుంటున్నారు.

    నడవబోయినవాడు ఏదో పరిచయమైన గాలి, తెలిసిన స్పర్శ కలిగినట్టు హఠాత్తుగా ఆగిపోయి ఆహూతుల వంక చూశాడు. కుర్చీ వరసల మధ్య జనం...

    అతడు అప్రయత్నంగా వణికాడు.

    తన వెనుక కుర్చీల్లో సగం మందికిపైగా ఉస్సోక్ సభ్యులు!

    పెళ్ళికొచ్చిన వారిలో కలిసిపోయి, జరిగే తంతుని నిశ్శబ్దంగా మౌనంగా గమనిస్తున్నారు!

    ఎక్కడెక్కడినుంచో వచ్చి అక్కడ చేరుకుని తమ రాబోయే నాయకుడి కోసం పెదవులు కదల్చకుండా ప్రార్ధన చేస్తున్నారు.

    అది పెళ్ళిపందిరిలా లేదు. ఉస్సోక్ కార్యవర్గపు సభ్యుల సమావేశంలా వుంది.

    ప్రార్ధన ముగిసినట్టు వాళ్ళు కదిలారు! హాలు నెమ్మదిగా ఖాళీ అవుతూంది. జనం ఒకరొకరూ వెళ్ళిపోతున్నారు. భవానీశంకరం గేటు దగ్గిర నిలబడి కరచాలనం చేస్తున్నాడు.

    పురోహితుడు వధూవరుల్ని బయటకు తీసుకొచ్చి అరుంధతీ నక్షత్రం చూపిస్తున్నాడు.

    వాళ్ళవైపు చూసిన రాకేష్ ఉలిక్కిపడ్డాడు.

    ఎడమవైపు గౌరీ వుంది. మధ్యలో సిద్దార్ధ వున్నాడు. కాస్త ముందుగా పురోహితుడు నడుస్తున్నాడు.

    ఆ పురోహితుడు రాకేష్ కి స్పష్టంగా కనబడుతున్నాడు.

    రాకేష్ ని చూసీ, గమనించనట్టు, ముందుకు నడిచాడు.

    ఉస్సోక్ అధిష్టాన వర్గంలో నాలుగోవాడైన రెడ్ స్కెలిటన్ అతడు!


                   *    *    *    *


    అంతలో వధూవరులు తిరిగి వచ్చారు. పెద్దలకి వంగి నమస్కారం చేస్తున్నారు. భవానీశంకరం గౌరిని దగ్గరికి తీసుకుని కళ్ళు తుడుచుకుంటున్నాడు.

    తరువాత దంపతులు రాకేష్ దగ్గిరకి వచ్చారు.

    కేదారగౌరి వంగి అతడి కాళ్ళకి నమస్కరించబోయింది.

    "నాకింకా పెళ్ళికాలేదు" అన్నాడు రాకేష్.

    సిద్ధార్థ నవ్వేడు.

    గౌరి కూడా నవ్వింది. కొత్త పెళ్ళికూతురి నవ్వుకి కొత్తగా వచ్చిన ఆభరణాలు కొత్త అందాల్ని ఇస్తున్నాయి. రాకేష్ చేయి చాచి "కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు సిద్దార్థతో.

    "అదేమిటి" అని అడిగాడు సిద్ధార్థ చేయి చాస్తూ.

    అతడి చూపు తన వేలిమీద వుండటం చూసి రాకేష్ రక్తపు మరక వున్న వేలు చూసుకుని "బ్లేడు, ప్రొద్దున తెగింది" అన్నాడు తేలిగ్గా.

 Previous Page Next Page