సంగీత్ ధియేటర్ దగ్గర కారు ఆపి కిందకు దిగాడు ఏ సి పి వీరేష్.
"హాయ్" అంటూ అతనిని సమీపించింది ధీరజ.
"ఈ మధ్య నీ అల్లరి శృతిమించి పోతుంది... ఏమిటంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావు... నీకు ఖాళీ దొరికినంత మాత్రాన నాకు వీలు పడుతుందో లేదో తెలుసుకోవద్దా ...నీ మానాన నువ్వు ఫోన్ చేసి ఫలానా ధియేటర్ దగ్గరకు నువ్వురా అని ఫోన్ పెట్టేశావు... ఈ పద్దతి మార్చుకోవా నువ్వు వచ్చీ రావడంతోటే రుసరుసలాడాడు వీరేష్
"అబ్బా వీరూ... జనం దృష్టిలో మనం పోట్లాడుకుంటున్నట్టు వుంటుంది...ప్లీజ్ వీరూ... కాస్తా సరదాగా వుండడం నేర్చుకో... ఎంత సేపూ ఇన్ వెస్టిగేషన్ లూ, కోర్టులే నాజీవితంలో థ్రిల్ వుండొద్దూ... అది లవ్, రొమాన్స్ లలోనే దొరికేది... నీకు ఎటూ సరదాగా వుండడం ఎలాగో తెలియదు. కనీసం నేను పిలిచినప్పుడు అయినా వస్తే ఒకపని అయిపోయినట్టుంది..." బుంగమూతి పెడుతూ అంది.
ప్రేమ నిండిన కోపంతో ఒక మొట్టికాయ వేశాడు.
"అమ్మయ్య... అబ్బాయిగారి కోపం పోయినట్టేనా?"
"పోక ఇంకా వుంటే దేవిగారికి తిక్కరేగి ఇక్కడే గానాబజానా పెట్టినా ఆశ్చర్యపోనవసరంలేదు... అందుకే నీకోసం అడ్జస్ట్ అయిపోవడం నేర్చుకుంటున్నాను" అన్నాడు చిరునవ్వుతో.
"అదీ... నిజమైన ప్రేమికునిలో వుండవలసిన మెదటి లక్షణం."
"ఆహా... అలాగా... మరి ప్రియురాలిలో వుండే ప్రాధమిక లక్షణం ఏమిటో"
"చెప్పనా..."
"చెప్పు"
"ఎప్పుడు ఎక్కడకు ఏ సమయంలో రమ్మన్నా ముందు వెనుకలు ఆలోచించకుండా వచ్చేయాలి. మరి నువ్వు అడిగిచూడు... నేను వస్తానో లేదో..."
"ఓరినాయనోయ్ ... ఏది మాట్లాడినా ఆ రూట్ లోకే వచ్చేస్తున్నావు... నువ్వు ఎందుకు రావు. ఊ అంటే చాలు ఉరికి వస్తావని నాకు తెలుసుకానీ ముందు టికెట్లు తీసుకో."
"ఎప్పుడో తీసుకున్నాను.... నువ్వు ఎటూ వస్తానని నాకు తెలుసుగా... పద__లోపలకు వెళదాం."
కారుని పార్కింగ్ ప్లేస్ లో వుంచి ఎంట్రన్స్ వైపు అడుగులు వేశాడు ఏ సి పి వీరేష్.
జురాసిక్ పార్క్ సినిమా నిలువెత్తు హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడో అంతరించిపోయిన రాక్షసి బల్లులను అత్యంత నైపుణ్యంగా తెరకు ఎక్కించిన దర్శకుని ప్రతిభకు ఆశ్చర్యపోతూ ధీరజతో కలిసి లోనికి నడిచాడు వీరేష్.
ట్రైలర్ అయిపోగానే పిక్చర్ బిగిన్ అయింది.
అయినా ధీరజ ఏదో ఒకటి మట్లాడుతూనే వుంది.
వున్నట్టుండి పక్కకు జరిగి వీరేష్ పెదవులపై ముద్దుపెట్టుకుంది.
"ఏయ్... ఏమిటి నువ్వు చేసినపని" చిరాగ్గా ప్రశ్నించాడు వీరేష్.
"ఏం చేశాను... ముద్దు పెట్టుకున్నాను... కాబోయే మొగుడిని ముద్దాడకూడదా?"
"దానికీ సమయం సందర్బం వుండొద్దూ."
"వుంది కాబట్టే ఇప్పుడు పెట్టుకున్నాను... లేదంటే పబ్లిక్ రోడ్ మీదనో.. ఆఫీసులోనో పెట్టుకోనిస్తావా ఏమిటి?"
"ష్....అరవకు.... ప్రక్కవాళ్ళకు డిస్ట్రబెన్స్ వుంటుంది. ముందు పిక్చర్ చూడు."
వీరేష్ చేతిని అందుకుని తన ఒడిలో వుంచుకుని అరచేతిలో అరచేయి వేసి నలుపుతూ సినిమా చూడసాగింది. ఆమెకు తన పట్ల ఎంత అనురాగం వుందో తెలుసు కాబట్టి వారించలేక పోయాడు. దాదాపుగా అతని భుజంపైకి ఒరిగిపోయి సినిమా చూస్తుందామె.
"కాస్త దూరంగా వుండు ధీరజా... ఎవరయినా చూస్తే బాగోదు"
"వాళ్ళ ముఖం....ఎవరేమనుకుంటే నాకే....నాకు కాబోయే భర్త నా ఇష్టం... కాదు అనడానికి వాళ్ళు ఎవరు?" ధీరజ కోపంగా అరిచింది.
"ఓకే.. ఓకే__ నీ యిష్టమే కానీ__నీకు పుణ్యం వుంటుంది. కాస్సేపు కేకలు వేయకుండా సినిమా చూడు."
అప్పటికీ సినిమాలో సీరియస్ సీన్ రావడంతో చేసే అల్లరి మానివేసి సీరియస్ గా సినిమా చూడడంలో లీనమైపోయింది.
ఇంటర్ వెల్ లో తిరిగి మాటలు మొదలు అయ్యాయి.
ఆమె వాక్ప్రవాహానికి ఎలాగో తట్టుకో గలుగుతున్నాడు. ఆమె ప్రవర్తన, మాటలను బట్టి వాళ్ళిద్దరూ ప్రేమికులు అన్న విషయం ప్రక్కవాళ్ళకు కూడా అర్ధమై ముసిముసి నవ్వులతో దొంగ చూపులు చూడసాగారు.
అది గమనించడంతో చీమలు జెర్రులు పాకుతున్నట్టుగా వుంది వీరేష్ కు.
తిరిగి సినిమా ప్రారంభం అయింది.
ఈసారి మాత్రం ఎలాంటి అల్లరీ చేయకుండా బుద్దిగా కూర్చుంది ధీరజ.
పిక్చర్ ఇంటరెస్టింగ్ గా వుండడంతో వీరేష్ ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.
'ది ఎండ్' అని పడేవరకూ ఒక గొప్ప సినిమాని చూస్తున్న అనుభూతి నుంచి తేరుకోలేకపోయిందామె.
సినిమాని గూర్చి ఏదో అనబోతూ పక్క సీట్ వైపు చూసి అవాక్కయిపోయింది.
పక్కనే ఉండవలసిన వీరేష్ లేడు.
ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు.
తన అల్లరి భరించలేక మధ్యలోనే వదిలి వెళ్ళిపోయాడని అర్ధంకావడంతో ఆమె ముక్కుపుటాలు అదిరాయి. తన గొడవ పడలేక కనీసం చెప్పాపెట్టకుండా పారిపోయిన పెద్ద మనిషిని వెంటనే ఒక దుమ్ము దులిపి వెయ్యాలనే కోపంతో ఆడతాచు బుసలు కొడుతున్నట్టు విసవిసా బయటకు నడిచింది ధీరజ.
* * * *
టెలిఫోన్ రింగ్ అవుతుంది.
రవితేజ వెంటనే రిసీవర్ అందుకున్నాడు.
"హల్లో... ఎవరు మాట్లాడుతుంది"
"రవితేజను..."
"ఓ.... నువ్వా.... భేష్... వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుందే!"
"ఎవరు మీరు... మీకు ఎవరు కావాలి?"
"నువ్వే బిడ్డా... నీకోసమే ఫోన్ చేశాను"
"ఎవరు మీరు... నాతో మీకు ఏంపని?"
"ఉంది కాబట్టే చేసాను బిడ్డా..."
"అసలు ఎవరు మీరు?"
"నేను ఎవరు అనేది తర్వాత తీరికగా అలోచించుకోవచ్చు. కాలేజీ ఎలక్షన్లలో నువ్వు అభినయ్ ను ఓడించినందుకు అతను నీ పై కక్ష కట్టిన విషయం నీకు తెలుసా?" అన్నాడు ఆ అపరిచిత వ్యక్తి.
క్షణం రవితేజ భృకటి ముడిపడింది.
"తెలుసు."