రివర్స్ గేర్
---సూర్యదేవర రామ్ మోహన్ రావు
నేపధ్యం
మారుతున్న వర్తమాన ప్రపంచంలో ఆధునిక మహిళ పోరాటం చేస్తోంది. ఇండియా లాంటి దేశాల్లో ఆర్ధిక స్వావలంబన ప్రధాన ఆశయం కాగా, ప్రపంచ మహిళ తనని తాను తన వ్యక్తిగత రీత్యా నిరూపించుకోవడం కోసం పవర్ ఒక గోల్ గా నిర్ణయించుకుంది. ఇంటా, బయటా, పనిచేసే గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేటు సెక్టారుల్లో తన ఉనికికే ప్రాధాన్యత నివ్వటం ఈ శతాబ్దం సాధించిన విజయం.
ఈ విజయ పరంపరలో మహిళ, ఎవరెన్ని అనుకున్నా, పురుషుని ఆధిపత్యాన్ని అణచటానికే సెక్స్ ని బలమైన ఆయుధంగా ఉపయోగిస్తోందని సెక్సాలజిస్టులు చెప్తున్నారు.
ప్రఖ్యాత అమెరికన్ సెక్సాలజిస్టులు పాట్రిస్ .డి.హార్న్, జాక్ సి, మార్న్ లు ఇలా అంటున్నారు.
అనాదికాలం నుంచి స్త్రీ పురుషుల సంబంధాల ఆధిక్యతకు మూల కారణం సెక్స్. పురుషుడు తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం స్త్రీని తన సెక్స్ కి ఆయుధంగా వాడుకున్నాడు. చరిత్రలో మహారాజ్యావతరణాలు, రాజ్య వ్యవస్థ ఏర్పడడానికి మూలకేంద్రంగా ఉపయోగపడింది సెక్స్, పురుషులైన చక్రవర్తులు, మహారాణులు, ఆ ఆయుధంగా తమ గుప్పిట్లోకి తెచ్చుకోడానికి ప్రధానమైన ఆయుధంగా సెక్స్ నే ఉపయోగించుకున్నారు. పరిపాలకుల్ని తమ చర్యల ద్వారా తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాక, మహారాణులు తమ తెలివి తేటల్ని, శక్తియుక్తుల్ని వాటికి మేళవించి మహారాజ్యాలకు శాసనకర్తలయ్యారు.
అధికారం కోసం తప్ప మిగతా అవకాశాల కోసం సెక్స్ ని ఉపయోగించుకున్న మహిళామణులు చరిత్రలో స్వార్ధచరితులుగానూ, భోగలాల సులుగానూ, నేరస్థులుగానూ మిగిలిపోయారు.
ఒకప్పటి మహారాజ్యాలయిన రష్యా, ఇంగ్లాండ్, గ్రీక్ రాజ్యాల దగ్గర్నుంచి, మన భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం, ఆ తర్వాత వచ్చిన అనేక సామ్రాజ్యాల చరిత్రలో - అధికారాన్వి తమ చేతుల్లోకి, చేతల్లోకి తెచ్చుకోవడం కోసం సెక్స్ ని ఒక మంత్రందండంగా వాడిన మహిళా మణులెందరో వున్నారు.
పవర్ కోసం ప్రాకులాడే ప్రతి మహిళకూ సెక్స్ ఆకర్షణ, ఒక అన్వేషణ అంటారు వీరు.
అనాది సామాజిక జీవనం నుంచి ఇంట్లో దైనందిన కుటుంబ ఉనికి వరకూ స్త్రీని, స్త్రీగా నిలబెట్టేది సెక్స్ మాత్రమే అని ఆధునిక సెక్సాలజిస్టుల పరిశోధనలు రుజువు చేస్తున్నాయి.
దైనందిన జీవితంలో ఉన్నత వర్గాల మహిళలు, ఆర్ధికలాభాలు, నష్టాలు ఆకర్షణతోనే బేరీజు వేసుకుంటారని ఇటీవల పదిమంది ప్రముఖ మహిళా వాణిజ్యవేత్తల ఇంటర్వ్యూలు బహిర్గతం చేసాయి.
స్త్రీ తన లక్ష్యాన్ని సాధించింది అని మనం అనుకుంటే, 75 శాతం మంది స్తీలు పాజిటివ్ వేలో ఆకర్షణని ఉపయోగించి ఆ లక్ష్యాన్ని సాధిస్తే, 25 శాతం మంది స్త్రీలు నెగిటివ్ వే లో అందుకు ప్రయత్నిస్తున్నారని కొన్ని సర్వేలు తమ ఫలితాల్ని వ్యక్తం చేసాయి.
సెక్స్ కి మానవ సహజ పరిణామాలకు బలమైన సంబంధం ఉందని ఫ్రాయిడ్ ఏనాడో చెప్పాడు. ఫ్రాయిడ్ తర్వాత వచ్చిన పరిశోధకులు, ప్రపంచ వ్యాప్తంగా రాజ్యాధికారంలో, సామాజిక విషయాల్లో, ఉద్యోగ వ్యవహారాల్లోనూ, కుటుంబ ఆధిపత్యంలోనూ ఒక స్త్రీ ఆధిపత్యం సెక్స్ ద్వారానే నిరూపించబడుతుందని కొత్త సిద్దాంతాన్ని లేవదీసి, అందుకు చాలా ఉదాహరణలను, కేస్ స్టడీస్ లను పేర్కొన్నారు.
అందంగా కనిపించే ఒక యువతి ఒక పనిని సెక్స్ (అంటే ఇక్కడ అర్ధం స్త్రీత్వపు విలువ) ద్వారా, తన ఆశయానికి సత్ఫలితం ఇచ్చే అంశం వేపు మరల్చుకుంటుంది. అలాగే అందంగా కనిపించే ఒక పురుషుడు కూడా (ఇక్కడ అర్ధం పురుషత్వపు బలాఢ్యత) పురుషుడికి, స్త్రీకన్నా కొంత సమయం పడుతుందని మానసిక విశ్లేషకులు నిరూపించారు.
సెక్స్ అంటే కేవలం డిజైర్ మాత్రమే కాదు....జెండర్ పవర్. స్త్రీ అవసరమైనప్పుడు తన కోరికను జెండర్ పవర్ ద్వారా, లవ్ ద్వారా, ఎఫెక్షన్ ద్వారా, డిజైరా ద్వారా, సాక్రిఫైస్ ద్వారా డిక్టేటర్ షిప్ ద్వారా....ఒకప్పుడు సుతిమెత్తగా ప్రవర్తించి నెరవేర్చుకుంటుందని శాస్త్రవేత్తలంటున్నారు.
1970వ సంవత్సరం తర్వాత ప్రపంచ మహిళలకు సెక్స్ అంటే అర్ధం ఏమిటో తెల్సింది. గర్భస్రావాన్ని చట్టబద్దం చేసిన కొన్ని దేశాలు ఒప్పుకుంటున్న నిజం అదే.
కార్బోరేట్ సెక్టార్స్ లో సెక్స్, ఆకర్షణల ఆధారంగా తమ పదవులు, ఉద్యోగాల్లో ఎదుగుతున్నామని, ఆకర్షణను ఎదుగుదలకు వాడుకోవడము తప్పు కాదని వాదనే కార్పొరేట్ వర్గాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్తులు కొంతమంది అభిప్రాయం.