ప్రణయ వీచికలు
-వాసిరెడ్డి సీతాదేవి
అది 1883.
సమయం రాత్రి 2 గంటలు.
సూయజ్ కెనాల్ లో బయలుదేరిన ఓడ ఎర్ర సముద్రంలో ప్రవేశించింది.
వాతావరణం స్తంభించినట్టుగా వుంది. ఉక్కపోస్తున్నది. ప్రయాణీకులు కొందరు తమ తమ క్యాబిన్స్ వదిలి పై డెక్ మీద నిద్రపోతున్నారు.
ఓడలోని ఇంజన్ దగ్గర పనిచేసే సిబ్బంది మాత్రం మెలకువగా వున్నారు. ప్రయాణీకులందరూ గాఢనిద్రలో వున్నారు.
ముసుగులో వున్న ఒక ఆకారం ముందుకు అతి జాగ్రత్తగా నిద్రపోతున్న వాళ్ళను తప్పుకుంటూ కదిలింది. శబ్దంకాకుండా పిల్లిలా వచ్చి ఓడ రైలింగ్ ను పట్టుకొని వెనకభాగంలో నిల్చుంది.
ఓడ సముద్ర కెరటాలను చీల్చుకుంటూ ముందుకు పోతున్నది. అలా చీలిన వెనకభాగం వైపు మళ్ళీ కలుసుకుంటున్న కెరటాల మీద లేస్తున్న నురగలు, నక్షత్ర కాంతిలో వింత అందాలను వెదజల్లుతున్నాయి.
ఓడ జండా కర్రను కట్టివున్న బ్రటిష్ పతాకం గాలిలేనందువల్ల వాలిపోయివుంది.
ముసుగులోని ఆకారం చువ్వల్ని పట్టుకొని నిటారుగా నిల్చుని వున్నది.
ఉన్నట్టుండి ఏదో నిర్ణయానికి వచ్చినట్టు చువ్వల మీదుగా ముందుకు వంగింది. దాదాపు సముద్రంలోకి దూకడానికి సిద్ధంగా వున్నట్టు ఒక కాలు రెండో చువ్వమీద పెట్టింది.
ముందుకు పడబోతున్న ఆ ముసుగు ఆకారాన్ని అకస్మాత్తుగా రెండు చేతులు బలంగా పట్టుకొని వెనక్కు లాగాయి. ఆ చేతుల్ని తప్పించుకొని కొంచెం దూరం జరిగింది ఆ ఆకారం. లాని ఆ ఆకారం మీది ముసుగు మాత్రం అతని చేతుల్లో వుండిపోయింది.
కళ్ళప్పగించి ఓ క్షణం ఆమెను చూశాడు అతను. మరో నిముషం తనచేతిలోని బురఖాను చూశాడు.
"ఏమిటీ పని?" అన్నాడు ఆ యువతిని మందలిస్తున్నట్టుగా.
ఆమె అతనికేసి బెదురుచూపులు చూసింది. బేల చూపులు చూసింది.
అతను ఆమె భయాన్ని గమనించాడు. భయంతో వణుకుతున్న ఆమె అందమైన పెదవులను చూశాడు. కొద్ది క్షణాలు చూస్తూనే వున్నాడు.
తలపాగాతో సాధారణమైన దుస్తుల్లో వున్న అతను భారతీయుడుగా కన్పించాడు ఆమెకు.
"చాలా అందంగా వుంది" ఆమెను చూస్తూ అనుకున్నాడు అతను.
"జీవితం విలువైనది. నువ్వు చాలా తెలివితక్కువ పని చెయ్యబోయావు" అన్నాడు అతను.
"కాని నా జీవితం మాత్రం విలువైనది కాదు. అయినా ఇవన్నీ నీకనవసరం. నువ్వెవరు నన్ను ఆపడానికి" అంది ఆ యువతి.
"నువ్వు ఆ పని చెయ్యడానికి వీల్లేదు" ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు.
"ప్లీజ్! నన్ను వదిలెయ్" ఆమె అర్థింపుగా అన్నది.
"నిన్ను వదలను. ఎందుకంటావా? వదిలేస్తే నువ్వు సముద్రంలోకి దూకేస్తావ్.
ఆ తర్వాత నేను నీ వెనుక దూకి, నిన్ను రక్షించి, హీరో కావాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు.
"నువ్వు నన్ను రక్షించాలనే కోరిక నాకూ లేదు"
"నీకు లేకపోవచ్చును. కాని నేను ఆ పనిచెయ్యక తప్పదు. నువ్వు సముద్రంలోకి దూకితే నావలో పెద్ద అలజడి రేగుతుంది. అలా జరగడం నాకిష్టం లేదు."
ఆమె గిర్రున తల తిప్పుకున్నది. ఉసిగా ముందుకు నడిచింది. రైలింగ్ ను పట్టుకొని "ఇది నా జీవితం నా ఇష్టం" అన్నది తనకు చెప్పుకొంటున్నట్టుగా.
"జీవితం అమూల్యమైనది. దాన్ని ఇలా చిన్నచిన్న విషయాలకు అంతమొందించుకోవడం అవివేకం" అన్నాడు అతను ఆమె వెనగ్గా నిల్చుని.
"హు....చిన్న విషయమా" అంటూ ఒక్కసారిగా బావురుమన్నది ఆ యువతి.
కాళ్ళల్లో శక్తి లేనిదానిలా తూలిపోతున్న ఆమెను అతను పట్టుకున్నాడు. రెండు చేతులతో ఎత్తుకొని నిద్రపోతున్న వాళ్ళను దాటుకుంటూ వెళ్ళసాగాడు. మొదట ఆమె అతని పట్టు నుంచి వదిలించుకొనే ప్రయత్నంలో పెనుగులాడింది. చివరకు జారిపోయినట్లు తోటకూర కాడలా అతని చేతుల వెంబడి పోయింది.
సన్నగా, తేలిగ్గా వున్న ఆమెను అతడు కారిడార్ నుంచి గదిలోకి అవలీలగా మోసుకెళ్ళాడు. అతి సున్నితంగా ఆమెను కుర్చీలో కూర్చోబెట్టాడు. స్విచ్ ఆన్ చేశాడు.
లైటు వెలిగింది. ఆమెను పరిశీలనగా చూశాడు. తను ఊహించినదానికన్నా అందంగా ఉన్నదనుకున్నాడు. ఆమె ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.
"ఇంత చిన్న వయసులోనే ఈమె ఇలాంటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో?"
ఎందుకో అంత విరక్తి జీవితం మీద?
"నా విషయంలో నువ్వు అనవసరంగా కల్పించుకొన్నావ్!" ఆమె అతన్ని చూస్తూ విసుగ్గా అన్నది. అంతకంటే కటువుగా అనలేకపోయింది.
"ఇంత దారుణమైన నిర్ణయానికి ఎందుకొచ్చావ్?"
ఆమె ఓ క్షణం అతని ముఖంలోకి చూస్తూ మౌనంగా వుండిపోయింది.
"నాకు చచ్చిపోవాలని ఉంది!" ఆమె కంఠం దుఃఖంలో వుండిపోయింది.
"ఇంత నాటకీయంగానా? ఎందుకో తెల్సుకోవచ్చునా?" ఉడికిస్తూ అడిగాడు.
"ఇంతకంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు కనక" అని చెంపల మీదుగా కారుతున్న కన్నీరు తుడుచుకున్నది.
నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను.
"అంతకంటే సులువైన మరో మార్గం నాకు కన్పించడం లేదు" అంది మళ్ళీ.
"చావడమే సమస్యలకు పరిష్కారం కాదు. మరో మార్గం తప్పక వుంటుంది.