జీవితం ! గెలుపు నీదే !!
శారదా అశోకవర్ధన్
ఎర్రటి ప్లిమత్ కారుని ఒక పక్కగా పార్కుచేసి, లాక్ చేశాడు అజయ్.
'నమస్తే సాబ్' కారు తాళాలు కోటు జేబులో వేసుకుంటూ ముందుకు సాగాడు.
"గుడ్ మార్నింగ్ డాక్టర్."
మార్నింగ్!
ఎదురుబడ్డ నర్సులను, డాక్టర్లను విష్ చేస్తూ లోపలికి వెళుతున్నాడు డాక్టర్ అజయ్.
"ఎంత అదృష్టవంతుడే! అందం, చదువూ, సంపదా అన్నీ ఉన్నాయి" అంది హేమ.
"ఏమిటేమిటీ? ఎవరినీ, ఎప్పుడూ, ఎందుకూ పొగడని నువ్వు పొగుడుతున్నావా? కొంపదీసి లవ్ లో పడలేదు కదా?" నవ్వుతూ అంది మాలతి.
"ఆ ఛాన్సేదో నువ్వే చూసుకో" నవ్వుతూనే సమాధానం చెప్పింది హేమ.
"అవున్లే, తమరు వేణూగారిని...." ఇంకేదో అనబోతుంటే హేమ అందుకుని "ఆపవే బాబూ! కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన...
ఈలోగా అక్కడికి డాక్టర్ కుమార్ రావడంతో వాళ్ళ సంభాషణకి బ్రేక్ పడింది.
"పిక్నిక్ సంగతి ఏం చేశారు? హేమనీ, మాలతినీ అడిగాడు కుమార్.
"ఫైనలైజ్ చెయ్యందే? అదుగో అజయ్ వస్తున్నాడుగా అడుగుదాం."
"ఏమిటి పొద్దున్నే మీటింగ్ పెట్టారా?" అన్నాడు అజయ్ వాళ్ళని చూసి.
"అదే! పిక్నిక్ సంగతి ఏం చేశారోనని?"
"తర్వాత మాట్లాడదాం. డ్యూటీ టైమయింది. ఇప్పుడు ఒక 'అపెండి సైటిస్' ఆపరేషన్ వుంది. వస్తా" చకచకా వెళ్ళిపోయాడు అజయ్.
"ఎంత చిలిపిగా ఉంటాడో, డ్యూటీ విషయంలో అంత జాగ్రత్తగా ఉంటాడు వండర్ ఫుల్ గై" అంది హేమ.
"కరెక్ట్" అన్నాడు కుమార్ తనూ వార్డుకి బయలుదేరుతూ. హేమా, మాలతీ కూడా వాళ్ళ వాళ్ళ వార్డులకి వెళ్ళిపోయారు.
మధ్యాహ్నానికల్లా అందరూ పనులు పూర్తిచేసుకుని కాన్ఫరెన్సుహాల్లోకొచ్చారు.
"ఆపరేషన్ ఎలా జరిగింది అజయ్?" అడిగారు అందరూ.
"సక్సెస్ ఫుల్. సరే పిక్నిక్ సంగతేమిటాలోచించారు.
"నాగార్జునసాగర్ వెళదాం. కానీ చిన్న చిక్కొచ్చిపడిందే. సంగీతా వాళ్ళ గ్రూప్ రామన్నారట. వాళ్ళు రాకపోతే మేమూ రామంటున్నారు మిగతా లేడీస్" అన్నాడు వేణు.
"ఏం! సంగీతా వాళ్ళు ఎందుకు రారట?"
"సంగీతకి ఆదివారం డ్యూటీ వుందట. ఆమె రాకపోతే విద్యా, తులసీ ఎవరూ రారట, అదీ సంగతి" వివరించాడు డాక్టర్ భరత్.
"అయితే ఏం చేద్దాం? అందరూ కలిసివెళితే బాగుంటుంది కానీ, వాళ్ళు రారని వీళ్ళు, వీళ్ళు రారని వాళ్ళు డ్రాప్ అయిపోతే ఏం బాగుంటుంది. కాన్సిల్ చేసేద్దాం" కాస్త కోపంగా అన్నాడు డాక్టర్ భూషణ్.
"కరెక్ట్" వంతపాడాడు డాక్టర్ అన్సారీ.
"ఇప్పుడే వస్తానుండండి."
"ఎక్కడికెళుతున్నావ్?" డాక్టర్ కుమార్ విసుగ్గా అడిగాడు వెళుతూన్న అజయ్ ను చూసి.
"సంగీతని ఒప్పించడానికి"
"ఇంపాజిబుల్" అన్నాడు డాక్టర్ మిశ్రా.
"బెట్" చెయ్యి చాపాడు అజయ్.
"ఎస్....."
"ఎంత?"
"వంద."
"ఓకే! ఇప్పుడే వస్తా?" వెళ్ళాడు అజయ్.
"ఈసారి డెఫినెట్" అన్నాడు మిశ్రా.
"ఏమిటి?" అడిగాడు కుమార్.
"అజయ్ కి అపజయం, మనకి విజయం."
"చూద్దాం..." నవ్వింది హేమ. అజయ్ అపజయం మీద నమ్మకం లేనట్టు.
అందరూ ఏవో కబుర్లలో మునిగిపోయారు. ఓ పదినిమిషాల తర్వాత అతను తిరిగొచ్చాడు సంగీతతో సహా. మిశ్రా గుడ్లు తేలేశాడు. ఏవీ వంద రూపాయలు? సంగీత, ఆమె స్నేహితురాళ్ళూ మనతో కూడా వస్తున్నారు" అన్నాడు.
వందరూపాయల నోటు అజయ్ చేతిలో పెడుతూ మేము ఎంత బతిమాలినా డ్యూటీ ఉంది రానన్నారే" అన్నాడు ఆశ్చర్యంగా మిశ్రా.
"అవును. నేను వెళ్ళి ఆమె డ్యూటీ మార్పిస్తానని చెప్పాను."
"నేనుగా అడగను. మీరు వెళ్ళి మార్పిస్తే సరే" అంది సంగీత. సరేనన్నా. పనయిపోయింది. ఓకే అన్నాడు నవ్వుతూ అజయ్ వందరూపాయలనోటు జేబులో పెట్టుకుంటూ.