ఆలింగనం
_ బలభద్రపాత్రుని రమణి
ఆముక్త... అంటే ముట్టుకోబడనిదట! అదే నా పేరు.
బాల్యం చాలా అందమైనది... కానీ అది సజావుగా సాగితేనే! లేకపోతే నెమరేసుకున్నకొద్దీ అది దాటిపోయినందుకు సంతోషంగా వుంటుంది. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసినవాళ్ళ మొహాలు ఎన్నెన్నో గుర్తుకొస్తుంటాయి!
ఎత్తు అరుగుల ఇల్లు. లోపల వెలుతురూ, గాలీ చొరబడలేని రెండు ఇరుకిరుకు గదులు ఉండేవి. వంటిల్లు పొగచూరిపోయి అందులో ఒక ఆకారం "ఖళ్...ఖళ్..."ని దగ్గడం వలన అది అమ్మ అని తెలిసేది! అమ్మ దగ్గు పగలు పొగవల్లా... రాత్రి చలివల్లా అనుకునేవాళ్లం.
అరుగు మాకు చాలా సౌకర్యంగా వుండేది. ప్రొద్దుటే తాతగారు అక్కడే జపం చేసుకునేవారు. నాన్న గెడ్డం చేసుకునేవాడు. అక్కలిద్దరూ ముగ్గు నేర్చుకోవడానికి, ముచ్చట్లు చెప్పుకోవడానికి పనికివచ్చేది. సాయంకాలం మాత్రం డేవిడ్ సార్ రావడంతో నాకు అరుగంటే ఏవగింపు కలిగేది.
అరుగుమీద పుస్తకాలసంచీ వేసుకుని సార్ ఎదురుగా కూర్చునేదాన్ని కానీ లోపల్నుండి అమ్మ "ముక్తా" అని పిలిచి ఏ ఉల్లిపాయలు తెమ్మంటుందేమోనని ఎదురుచూస్తుండేదాన్ని. డేవిడ్ సార్ చీకట్లో అసలు కనిపించేవాడుకాదు. నవ్వితే మాత్రం పళ్ళు తెల్లగా మెరుస్తూ కనిపించేవాడు. అతను మా స్కూల్లో పి.టి.సార్. నాన్న నాకు ప్రైవేటు చెప్పడానికి పదిరూపాయలు ఇచ్చి కుదిర్చాడు.
నాకు ప్రైవేటు చెప్పడంకన్నా అతను తొడపాశం పెట్టడం ఎక్కువగా వుండేది. ఎర్రగా కమిలిపోయిన తొడ చూసుకుంటూ ఏడుపు బిగబట్టుకునేదాన్ని.
పొడుగు పరికిణీలు వేసుకుంటానంటే అక్కలిద్దరూ - ఒప్పుకునేవాళ్ళు కాదు! పరికిణీ వేసుకుంటే చాలావరకూ ఆ బాధనుండి తప్పించుకునేదాన్ని.
అప్పుడు బుగ్గమీద గిల్లేవాడు. నా కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగితే తృప్తిపడేవాడు. అపుడు "శాడిస్ట్" అన్న పదం తెలీదుకానీ ఇప్పుడు తెలుస్తోంది.
నా బాధలు మొదటిగా గమనించినవాడు ఎదురింటి శివ. నాకన్నా నాలుగేళ్ళు పెద్దవాడు, రెండు క్లాసులు ఎక్కువ చదివేవాడు. అస్తమానం తమ డాబా ఇంటిముందున్న బాదం చెట్టు ఎక్కి కూర్చునేవాడు. నేను అటు చూస్తే "కాయ కావాలా?" అని సైగలు చేసేవాడు. తల ఊపగానే గుప్పెడు కాయలు విసిరేవాడు.
"బాదంకాయలు మళ్ళీ తిన్నావా? ఏదీ నోరు చూపించు!" అంటూ డేవిడ్ సార్ చెవి మెలి తిప్పేవాడు. అతనికి వంతగా అక్కలిద్దరూ కూడా బాదంకాయలు తిని దగ్గుతున్నాననీ, బట్టలకి కొర్రులు పట్టిస్తున్నాననీ అమ్మకి ఫిర్యాదులు చేసేవారు.
నేను బాదంకాయ తినకపోయినా నా పెదవులు ఎర్రగా వుండేవి. నేను వాళ్ళకంటే తెల్లగా ఉండేదాన్ని.
బడికెళ్ళేదారిలో శివ అడిగాడు "ఎందుకా మసి వెధవ దగ్గర అలా కూర్చుని దెబ్బలు తింటావు? ప్రైవేటు వద్దని మీ అమ్మదగ్గర గొడవ చెయ్యరాదూ!"
ఆ నిమిషంలో నాకు అతను దేవుడిలా కనిపించాడు. అతని మాటలకు చాలా ఏడుపొచ్చింది.
"నాన్న వినడు. నేను బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలిట!" అన్నాను.
"అయితే అతనంతట అతనే మానేసేటట్లు చెయ్యాలన్నమాట!" అన్నాడు శివ.
"అబ్బే! అసలు మానడు!" అన్నాను.
"ఏం?" అని అడిగాడు శివ.
కారణం ఇదంటూ చెప్పలేకపోయాను. నా బుగ్గ గిల్లేటప్పుడూ, తొడపాశం పెట్టేటప్పుడూ ఆ కళ్ళల్లో కనిపించే ఆనందం నేను చెప్పగలిగినా అర్థం చేసుకునే జ్ఞానం వీళ్ళకి ఉండదు అనుకున్నాను.
శివకి చాలామంది స్నేహితులు ఉన్నారు. అద్దెసైకిళ్ళు తీసుకుని సాయంత్రాలు షికార్లకి వెళ్ళడం, పరీక్షలప్పుడు డాబామీద లైటు పెట్టుకుని కంబైన్డ్ స్టడీస్ చెయ్యడం, అమ్ముకునేవాళ్లు ఎవరైనా వెళ్తుంటే పిలిచి బేరాలాడ్డం, ఏడిపించడం, గోళీలాడ్డం... నానా అల్లరీ చేసేవాడు.
వాళ్ళ అమ్మా, నాన్నా ఏమీ అనేవారు కాదు! వాళ్ళ బామ్మగారు అతనికి బోలెడు వత్తాసు! ఎవరైనా పోట్లాటకివస్తే ముందు కొంగుదోపి ఎదురు పోట్లాడేది.
వాళ్ళ అమ్మకి ఉద్యోగం. ఎప్పుడూ ఉరుకులూ పరుగులూమీద వుండేది. వాళ్ళ నాన్నకి ఎప్పుడూ క్యాంపులు. ఊళ్ళో వుంటే శివతో కలిసి గాలిపటం ఎగరవేస్తూనో, క్రికెట్ ఆడ్తూనో కనిపించేవాడు.
అప్పట్లోనే నా మనసులో బీజం పడింది. మగపిల్లాడిగా పుట్టడం అదృష్టం! మా ఇంట్లో ముగ్గురం ఆడపిల్లలమే కాబట్టి, అమ్మ అప్పుడప్పుడూ ముచ్చటగా "పెద్దమ్మలూ... ఒసే జేష్టా!" అంటూ సంబోధిస్తుండేది.
పెద్దక్క టెన్త్ తప్పి ఇంట్లో కూర్చుంది. వారపత్రికలూ, ముగ్గులూ అంటే వున్న మోజు చదువుమీద లేకపోవడంతో రెండు మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. చామనఛాయతో వున్నా పొడుగు జడతో, పెద్ద పైట తీసుకున్న ఓణితో హీరోయిన్ లా వుండేది. అది అరుగుమీద కూర్చుంటే ఇంటిముందు జనం తెగతిరిగేవారు! అమ్మకి తెలిస్తే ఒప్పుకునేది కాదు. లోపలికి పిలిచేసేది.
చిన్నక్క టెన్త్ పాసయి, కాలేజీలో చేరింది. సాయంత్రాలు టైప్ కి కూడా వెళ్ళేది. దానికి మొదటినుంచీ అలంకరణలమీద శ్రద్ధలేదు. పెద్ద పెద్ద రికార్డు బుక్స్ పెట్టుకుని బొమ్మలు వేసేది. అస్తమానం చదివి చదివి త్వరగానే కళ్ళజోడు వచ్చేసింది.